అంధురాలినైనా ఆనందంగా ఉన్నాను, ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాను
పోలీటీమీ వెనెట్స్యోనోస్ చెప్పినది
మా అన్నయ్యా, మా తమ్ముడూ, మా అక్కా, మా చిన్నాన్న గారి అమ్మాయీ, నేనూ కలిసి ఆడుకుంటుండగా ఒక చిన్న వస్తువు కిటికీలో నుండి వచ్చి పడింది. అది చేతిబాంబు. అది పేలగానే నా ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు, నేను గ్రుడ్డిదానిగా మిగిలాను.
అది 1942 జూలై 16. అప్పుడు నాకు ఐదేళ్లు మాత్రమే. కొన్ని రోజుల వరకు నేను కోమాలోకి వెళ్తూ, తిరిగి కోమాలో నుండి బయటకు వస్తూ ఉన్నాను. కోమాలో నుండి పూర్తిగా బయటకు వచ్చాక నా తోబుట్టువుల కోసం వెదికాను. కొంత కాలం తర్వాత వాళ్లు చనిపోయారని తెలుసుకొని, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండుననిపించింది.
నేను జన్మించినప్పుడు, ఏథెన్స్ నౌకాశ్రయమైన పెరీవస్కు దగ్గరలో ఉన్న సలామిస్ అనే గ్రీస్‌కు చెందిన ద్వీపంలో మా కుటుంబం నివసించేది. మేము పేదవారమైనప్పటికీ, ప్రశాంతమైన జీవితాన్ని గడిపాము. అయితే, 1939లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంతో అదంతా సర్వనాశనమైపోయింది. మా నాన్నగారు మధ్యధరాసముద్రంలో నావికుడు. అక్షరాజ్యాలకూ, మిత్రరాజ్యాలకూ మధ్య జరిగిన యుద్ధంలో ఇరుపక్షాల మధ్య ప్రయోగించబడిన జలాంతర్గాములనూ, ఫ్రైగేట్లనూ, టార్పిడోలనూ, బాంబులనూ ఒక నావికుడిగా ఆయన తరుచూ తప్పించుకోవలసివచ్చేది. అప్పుడు గ్రీసు దేశం ఫాసిజమ్ అధికారం క్రిందా, నాజిజమ్ల అధికారం క్రిందా ఉండేది.
దేవుడ్ని ద్వేషించడం నేర్పించారు
యుద్ధకాలంలో ఘోరమైన పరిస్థితుల మూలంగా మా అమ్మ తన నాల్గవ బిడ్డను పోగొట్టుకుంది. ఆమె కృంగి కృశించిపోయింది, తర్వాత క్షయవ్యాధి వచ్చింది. తన ఆరవ బిడ్డను ప్రసవించిన తర్వాత, చివరికి ఆగస్టు, 1945లో ఆమె చనిపోయింది. మతనిష్టగల ఇరుగు పొరుగువారు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడని అనడం మొదలుపెట్టారు. దేవుడు మా సహోదర సహోదరీలను చిన్నారి దూతలుగా ఉండడానికి పరలోకానికి తీసుకు వెళ్లాడని చెప్పి, గ్రీకు ఆర్థోడాక్స్ ప్రీస్టులు కొందరు మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించి, పరిస్థితుల్ని మరింత దిగజార్చారు.
మా నాన్నగారు కోపంతో మండి పడ్డారు. తన దగ్గర కోట్లాదిమంది దూతలు ఉండగా దేవుడు ఈ నిరుపేద కుటుంబం నుండి నలుగురు చిన్న పిల్లలను ఎందుకు అమాంతంగా లాక్కుంటాడు? ఈ ఆర్థోడాక్స్ చర్చ్ నమ్మకాలు ఆయనలో దేవుని మీద, మతం మీద వ్యతిరేక భావాలను పుట్టించాయి. అటు తర్వాత ఆయన మత సంబంధాల్ని త్రెంచుకోవాలని అనుకున్నాడు. ఆయన మా బాధలకూ, కష్టాలకూ దేవుడే బాధ్యుడని నొక్కిచెబుతూ, దేవుణ్ని ద్వేషించడాన్నీ, ఈసడించడాన్నీ నాకు నేర్పించారు.
బోనులోని మృగం వలె
1945లో అమ్మ మరణించిన కొద్ది కాలానికి నాన్నకు కూడా క్షయవ్యాధి సోకడంవల్ల ఆయన శానిటోరియానికి పరిమితమైపోయారు. పసిపాపగా ఉన్న మా చెల్లిని ప్రభుత్వ నర్సరీలో చేర్పించడం జరిగింది. మా నాన్నగారు కోలుకొని శానిటోరియం నుండి వచ్చిన తర్వాత మా చెల్లిని తీసుకురావడానికి నర్సరీకి వెళ్ళారు. వాళ్ళు మా చెల్లి చనిపోయిందని చెప్పారు. నన్ను అంధుల పాఠశాలలో చేర్పించారు, ఎనిమిదేళ్లపాటు నేను అక్కడే గడిపాను. మొదట్లో అత్యధిక దుఃఖానికి లోనయ్యాను. ముఖ్యంగా సందర్శనా దినాల్లో నా తోటివారిని వారి కుటుంబ సభ్యులు చూడడానికి వచ్చినప్పుడు నేను బాగా నిరాశకు గురయ్యేదాన్ని. అంధులైన నా తోటి పిల్లల్లో ఎక్కువమందిని వారి కుటుంబ సభ్యులు చూడడానికి వచ్చేవారు. నాకైతే ఎవ్వరూ లేరు.
నేను బోనులోని మృగంలా ప్రవర్తించేదాన్ని. స్కూలుకు నేనొక ప్రమాదకారినని నన్ను పిలిచేవారు. కాబట్టి, నన్ను కొట్టి, శిక్షగా ‘చెడ్డ పిల్లల్ని బంధించి కూర్చోబెట్టే కుర్చీలో’ కూర్చోపెట్టడం జరిగేది. నేను చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాను. అయితే, కొంతకాలానికి నేను ఇతరులపై ఆధారపడకుండా నా పనులు నేనే చేసుకోవడం నేర్చుకోవాలన్న విషయం స్పష్టమయ్యింది. అంధులైన నా తోటి పిల్లలకు బట్టలు వేయడం, వారి మంచాలను సర్దడం ద్వారా వారికి సహాయం చేయడంలో నేను సంతృప్తిని కనుగొన్నాను.
మా తల్లిదండ్రులు చేసిన కొన్ని ఘోరమైన పాపాలనుబట్టి మమ్మల్ని దేవుడు అంధుల్ని చేశాడని ప్రీస్టులు చెప్పేవారు. దేవుని నీచంగా దృష్టించి, మరింత ఎక్కువగా ద్వేషించడానికి నన్ను నడిపించిందదే. నన్ను భయకంపితురాల్ని చేసిన, ఆగ్రహపడేలా చేసిన మత సిద్ధాంతం, చనిపోయిన వారి ఆత్మలు బ్రతికి ఉన్నవారిని వేధిస్తారన్నదే. చనిపోయిన మా తోబుట్టువులన్నా, మా అమ్మన్నా ప్రేమ ఉన్నప్పటికీ, నేను వారి “ఆత్మలకు” భయపడేదాన్ని.
నా తండ్రి ద్వారా సహాయాన్ని పొందడం
ఈలోగా మా నాన్నగారు యెహోవాసాక్షులను కలిశారు. బాధలకూ, మరణానికీ మూలం సాతానే కానీ, యెహోవా కాదని బైబిల్లో నుండి తెలుసుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. (కీర్తన 100:3; యాకోబు 1:13, 17; ప్రకటన 12:9, 12) జ్ఞానోదయం కలిగిన మా నాన్నగారు వెంటనే యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు, 1947లో బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటికి కొన్ని నెలల ముందు ఆయన మరలా వివాహం చేసుకున్నారు, ఇప్పుడు వారికొక బాబు కూడా. కొంతకాలానికి, ఆయన రెండవ భార్య కూడా ఆయనతో కలిసి యెహోవాను ఆరాధించడం ప్రారంభించింది.
నాకు 16 యేళ్ళు ఉన్నప్పుడు, నేను అంధుల పాఠశాలను విడిచి పెట్టాను. ఒక ప్రేమపూర్వక క్రైస్తవ కుటుంబానికి తిరిగి రావడం ఎంత ఓదార్పుకరమైన విషయమో గదా! కుటుంబ బైబిలు పఠనం అని పిలువబడే దానికి హాజరు కమ్మని వారు నన్ను ఆహ్వానించారు. నిజానికి, దానిపై నిజంగా ఎటువంటి అవధానాన్నీ నిలపకపోయినప్పటికీ, వారిపైగల గౌరవాన్నిబట్టి, మర్యాద కోసం హాజరయ్యేదాన్ని. దేవునికీ, మతానికీ వ్యతిరేకంగా నాలో ఉన్న బలమైన భావాలు, నన్నింకా కృంగదీస్తూనే ఉన్నాయి.
మా కుటుంబం ప్రేమే దేవుని మార్గం (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని పఠనం చేసేది. మొదట్లో నేను అంతగా ఆసక్తిని కనబరచలేదు, కానీ తర్వాత మా నాన్నగారు మృతులస్థితిని గూర్చి చర్చించడాన్ని విన్నాను. ఆ చర్చ నా అవధానాన్ని బాగా ఆకర్షించింది. “చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని ప్రసంగి 9:5, 10 వచనాలను బైబిల్లో నుండి తీసి చదవడం జరిగింది.
నా భయం కారణరహితమైనదని నేను గ్రహించడం ప్రారంభించాను. మరణించిన మా అమ్మా, మా తోబుట్టువులూ నాకు హానిచేయలేరు. ఆ చర్చ అటుతర్వాత పునరుత్థానం వైపుకు మళ్లింది. నా ఇంద్రియాలన్నీ ఆ చర్చ వైపు ఆకర్షించబడ్డాయి. క్రీస్తు పరిపాలనలో మృతులు సజీవులవుతారన్న బైబిలు వాగ్దానాన్ని విన్నప్పుడు నా ఆనందం పెల్లుబికింది ! (యోహాను 5:28, 29; ప్రకటన 20:12, 13) పఠనం ఇప్పుడు నాకు ఎంతో ఆసక్తికరంగా మారింది. నేను కుటుంబ చర్చ జరిగే రోజు కోసం ఆసక్తితో ఎదురుచూసేదాన్ని. అంధురాలినైనప్పటికీ, బాగా సిద్ధపడేదాన్ని.
ఆధ్యాత్మిక కనుదృష్టిని పొందడం
లేఖనాధార జ్ఞానాన్ని పొందడంలో అభివృద్ధి చెందుతూ ఉండగా దేవుని గూర్చిన, ఆయన వ్యవహారాలను గూర్చిన తప్పుడు అభిప్రాయాలు అదృశ్యమైపోయాయి. నన్నుగానీ, మరెవర్నైనాగానీ అంధుల్ని చేసేది దేవుడుకాదని గ్రహించాను. అయితే సమస్త దుష్టత్వానికి మూలం, దేవుని శత్రువైన అపవాదియగు సాతానేనని తెలుసుకున్నాను. మూర్ఖత్వంతో దేవుడ్ని నిందించినందుకు నేనెంతగా విచారించానో! ఎంతో జిజ్ఞాసతో, ఖచ్చితమైన బైబిలు జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. మేము రాజ్యమందిరానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నా, క్రైస్తవ కూటాలన్నింటికీ హాజరై, అందులో భాగం వహించేదాన్ని. నేను ప్రకటనాపనిలో కూడా చురుగ్గా పాల్గొనేదాన్ని ఆటంకపర్చడానికి నా అంధత్వాన్ని నేను అనుమతించలేదు.
నన్ను అంధురాలిగా చేసిన ఆ దుర్ఘటన జరిగిన 16 సంవత్సరాల తర్వాత, అంటే 1958 జూలై 27న బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేనెంత సంతోషించానో! నేను పూర్తి నిరీక్షణతోను, అత్యంత ఆశతోను నా జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించాను. ఇప్పుడు నా జీవితానికి ఒక సంకల్పం ఉంది,—అది నా ప్రేమగల పరలోకపు తండ్రిని సేవించడం. ఆయనను గూర్చిన జ్ఞానం నన్ను అబద్ధబోధల నుండి స్వతంత్రురాలిని చేసింది, నా అంధత్వం, దాని వల్ల వచ్చే సమస్యలను నిశ్చలంగానూ, నిరీక్షణతోనూ ఎదుర్కోవడానికి ఆ జ్ఞానం నాకు ధైర్యాన్నిచ్చింది. మహిమాన్విత సువార్తను ఇతరులకు ప్రకటించడంలో నెలకు 75 లేదా అంతకంటే ఎక్కువ గంటలను క్రమంగా వెచ్చించేదాన్ని.
వివాహం విచ్ఛిన్నం కావడం
జీవితంలో నాకున్న లక్ష్యాలవంటి లక్ష్యాల్నే కల్గివున్న వ్యక్తిని 1966లో వివాహం చేసుకున్నాను. ప్రకటనా పనిలో మా కార్యక్రమాన్ని పెంపొందించుకునే దిశగా మేమిరువురం పనిచేస్తుండగా మేం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తామనిపించింది. ప్రాణాలను కాపాడే ఈ పనిలో కొన్ని నెలల్లో అనేక గంటలను వెచ్చించేవాళ్ళం. మేము మధ్య గ్రీసులోని లివాడియాకు దగ్గరలోని ఒక మారుమూల ప్రాంతానికి తరలి వెళ్ళాము. మేము అక్కడ ఉన్న సంవత్సరాల్లో, అంటే 1970 నుండి 1972 వరకు గ్రీసు మిలటరీ నిరంకుశాధికారం ఉన్నప్పటికీ అనేకమంది బైబిలు సత్యాన్ని నేర్చుకొని, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులయ్యేలా సహాయం చేయగలిగాము. ఆ ప్రాంతంలోని యెహోవాసాక్షుల చిన్న సంఘానికి సహాయం చేయగలిగినందుకు మేము సంతోషించాము.
క్రమేణా, నా భర్త బైబిలు పఠనాన్నీ, క్రైస్తవ కూటాలకు హాజరు కావడాన్నీ నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు, చివరకు ఆయన బైబిలు బోధలను పూర్తిగా విడిచిపెట్టేశాడు. అది, మా వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి కారణమైంది. మా వైవాహిక జీవితం 1977లో విడాకులతో ముగిసింది. నేను పూర్తిగా కృంగిపోయాను.
ఒక సంతోషభరితమైన, ఫలభరితమైన జీవితం
జీవితంలో బాగా కృంగిపోయిన ఈ సమయంలో, యెహోవా, ఆయన సంస్థా తిరిగి నాకు సహాయాన్నందించాయి. నేను కనుక నా ఆనందాన్ని దోచేలా నా మాజీభర్తను అనుమతిస్తుంటే, నేను ఆయనకు పూర్తిగా బానిసనయ్యేదానిననీ, అప్పుడు నా సంతోషానికి కీలకం ఆయన చేతిలో ఉండేదనీ ప్రేమగల ఒక క్రైస్తవ సహోదరుడు వివరించాడు. ఈ సమయంలో క్రైస్తవ సంఘంలోని ఒక వృద్ధ సహోదరి తన ప్రకటనాపనిని అభివృద్ధి చేసుకోవడానికై తనకు సహాయం చేయమని కోరింది. అతిత్వరలోనే గొప్ప సంతోషాన్ని తీసుకువచ్చిన పనిలో అంటే, పరిచర్యలో పూర్తిగా మునిగిపోయాను!
తర్వాత మరొక క్రైస్తవ సహోదరుడు ఈ సలహాను అందించాడు: “నీ సహాయం బాగా ఎక్కడ అవసరమో, అక్కడ నీ సహాయాన్ని అందించు. నీవు యెహోవా దేవునిచే ఉపయోగించబడే దీపస్తంభానివి.” ఎంతటి పులకరింపజేసే తలంపు! ఒక అంధురాలు ‘యెహోవా దేవునిచే ఉపయోగించబడే దీపపు స్తంభం’! (ఫిలిప్పీయులు 2:15) నేనిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏథెన్స్ను వదిలి తక్కువ బైబిలు బోధకులున్న ప్రాంతమైన దక్షిణ ఎవ్వోయాలోని గ్రామమైన అమరింథాస్లో నివసించడానికి వెళ్ళాను. స్నేహితుల సహాయంతో నేను ఒక ఇల్లు కట్టుకోగలిగాను, తగినంతగా నా అవసరతలను తీర్చుకోగలిగాను.
ఇప్పటికి 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం ప్రకటనా కార్యక్రమంలోని ఏదో ఒక విధానంలో అనేక నెలలు కేటాయించగలిగాను. యెహోవా ఇచ్చిన బలంతో, ప్రజలను వారి ఇండ్ల దగ్గర కలవడం, ఆసక్తి గలవారితో బైబిలు పఠనాలను నిర్వహించడం, ప్రజలతో వీధులలో మాట్లాడడం వంటివాటితో సహా పరిచర్యకు సంబంధించిన అన్ని రంగాల్లో భాగంవహించగలిగాను. ప్రస్తుతం, మన సృష్టికర్తపై ఆసక్తి గల నలుగురు వ్యక్తులకు బైబిలు పఠనాలను నిర్వహించే గొప్ప ఆధిక్యతను కల్గి ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం బహు కొద్దిమంది సహోదరులు ఉన్న ఈ ప్రాంతంలో మూడు సంఘాలు ఏర్పడడాన్ని చూడడం ఎంతటి ఆనందకరమైన విషయం!
నేను వారంలో రెండు సార్లు చొప్పున క్రైస్తవ కూటాలకు హాజరు కావడానికి 30 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాను, వాటిలో ఒక్క కూటాన్ని కూడా తప్పిపోకూడదని నిశ్చయించుకున్నాను. ప్రసంగీకుని చూడలేని కారణంగా కూటం జరుగుతున్నప్పుడు—నేను అవధానమివ్వలేక పోతున్నానని గ్రహించినట్లయితే—నా ప్రత్యేక బ్రెయిలీ నోట్ పుస్తకంలో, చెప్పబడుతున్న విషయాలను వ్రాసుకుంటాను. అలా మరింత శ్రద్ధనిలిపేలా నా చెవులను, మనస్సును కేంద్రీకరిస్తాను. అంతేగాక, సంఘ కూటాల్లో ఒకటి మా యింట్లోనే జరుగుతుంది. సంఘ పుస్తక పఠనమని పిలువబడే దానికి హాజరు కావడానికి దగ్గరలోని గ్రామం నుండి వ్యక్తులు వచ్చేవారు. నన్ను చూడ్డానికి ఇతరులు మా ఇంటికి రావాలని ఎదురు చూడడానికి బదులు, నేనే చొరవ తీసుకొని వాళ్లను చూడ్డానికి వెళ్లేదాన్ని. అది పరస్పరం ప్రోత్సహించుకోవడానికి కారణమైంది.—రోమీయులు 1:12.
టీనేజ్‌లో మా నాన్నగారితోపాటు ఉన్నప్పుడు, అంధురాలితో వ్యవహరించినట్టు ఆయన నాతో ఎప్పుడూ వ్యవహరించలేదు. నా పనుల్ని నేను చేసుకునేలా నాకు నేర్పించడానికి ఆయన సహనంతోనూ, పట్టుదలతోనూ ఎంతో సమయాన్ని వెచ్చించేవారు. ఆ ఆచరణాత్మక శిక్షణ నేను నా తోటమీద, నా కొద్దిపాటి పశువుల మందమీద చక్కని శ్రద్ధను చూపడానికి సహాయపడింది. ఇంట్లో కష్టపడి పనిచేస్తాను, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచి, ఆహారాన్ని తయారు చేయడంలో కష్టపడి పనిచేస్తాను. జీవితంలో మనం కల్గి ఉన్న చాలా చిన్న విషయాలను బట్టి కూడా సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనగలమన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. మిగిలిన నా నాలుగు ఇంద్రియాలు అయిన వినికిడి, వాసన, రుచి, స్పర్శలతో నేను చాలా పనులు చేసుకునేదాన్ని, ఇది నాకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఇది చుట్టు ప్రక్కలవారికి గొప్ప సాక్ష్యాన్నిచ్చింది.
నా దేవుని ద్వారా బలపరచబడడం
పరిమితులున్నప్పటికీ, నేను ఆశాపూరితంగా, స్వయం పోషణను కల్గి ఉండడంలో నేనెలా వ్యవహరించగలుగుతున్నానని అనేకులు ఆశ్చర్యపోయేవారు. అన్నిటికీమించి, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవు[డైన]” యెహోవాకే ఘనత చెందాలి. (2 కొరింథీయులు 1:3) నేను చూపును కోల్పోయిన తర్వాత, తరుచుగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేదాన్ని. యెహోవా, బైబిలు సత్యం లేకపోయినట్లయితే, నేను ఈనాటి వరకు ప్రాణాలతో ఇంకా ఉంటానన్నది నమ్మలేను. కనుచూపును మాత్రమేగాక మన సృష్టికర్త మనకు ఎన్నో బహుమానాలు ఇచ్చాడనీ, మనం వాటిని ఉపయోగించినట్లైతే మనం సంతోషాన్ని పొందగలమనీ నేను గ్రహించాను. సాక్షులు మా గ్రామంలో ప్రకటిస్తున్నప్పుడు నా గురించి ఒక స్త్రీ వారికిలా చెప్పింది: “అన్నింటినీ చేసుకునేలా ఆమెకు సహాయపడుతున్నది ఆమె ఆరాధిస్తున్న దేవుడే!”
నేను పడ్డ కష్టాలు నన్ను దేవునికి మరింత సన్నిహితురాలిని చేశాయి. అలా సన్నిహితం కావడం నన్ను విశ్వాసంలో బలపరుస్తూ ఉంది. “శరీరంలో ఒక ముల్లు” అని తాను పిలిచిన దాని మూలంగా అంటే బహుశా కంటిచూపు క్షీణించడం మూలంగా అపొస్తలుడైన పౌలు కూడా బాధను అనుభవించాడని నాకు గుర్తుచేయబడింది. (2 కొరింథీయులు 12:7; గలతీయులు 4:13) ఆయన సువార్తను ప్రకటించడంలో “ఆతురత గలవాడై” ఉండడాన్ని అది ఆపు చేయలేదు. ఆయనవలె నేనూ ఇలా చెప్పగలను: “విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.”—అపొస్తలుల కార్యములు 18:5; 2 కొరింథీయులు 12:9, 10.
అన్నిటికీ మించి, పునరుత్థానమందు మా ప్రియమైన అమ్మనూ, తోబుట్టువులనూ నా సొంత కళ్లతో నేను చూస్తాననే బైబిలు ఆధారిత నిరీక్షణ, ఖచ్చితంగా నాపై అనుకూలమైన, ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపింది. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడు[ననీ],” “నీతిమంతులకును, అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నద[నీ]” బైబిలు వాగ్దానం చేస్తోంది. (యెషయా 35:5; అపొస్తలుల కార్యములు 24:14) అలాంటి ఉత్తరాపేక్షలు, ఆశావాదాన్నీ, దేవుని రాజ్యం క్రింద మహిమాన్విత భవిష్యత్తుపట్ల తీవ్రమైన ఆసక్తినీ నాలో నింపాయి!
[15వ పేజీలోని చిత్రం]
నాతో బైబిలు పఠించిన మా నాన్నగారు
[15వ పేజీలోని చిత్రం]
మా వంటగదిలో
[15వ పేజీలోని చిత్రం]
స్నేహితురాలితో పరిచర్యలో