మన వస్త్రధారణా విధానం—అది ప్రాముఖ్యమైన విషయమేనా?
“ఏం వేసుకోవాలో అర్థం కావడంలేదు!” సహాయం కోసమైన ఈ అభ్యర్థన చిరపరిచితమైనదిగా అనిపిస్తుందా? నేటి ఫ్యాషన్ హౌస్‌లు మీకు సహాయం చేసేందుకు—లేదా మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తికమకపెట్టేందుకు—ఎల్లప్పుడూ అధునాతన ఫ్యాషన్లను మీ ముందు ఉంచుతూనే ఉన్నాయి.
ఏం వేసుకోవాలనేది నిర్ణయించుకోవడాన్ని మరింత కష్టతరం చేసేందుకు, ఈ రోజుల్లో మీరు ఖరీదైన బట్టలు వేసుకోవడం కంటే మామూలు బట్టలు వేసుకోవాలని ప్రోత్సహించబడవచ్చు. 1990లకు చెందిన ఈ తిరోగమన ప్రవృత్తి గురించి ఒక ఫ్యాషన్ సంపాదకీయం ఇలా చెప్తుంది: “కొంచెం పాతగిలినట్లు, పాడైపోయినట్లు, చిరిగిపోయినట్లు, సాధారణంగా రంగు వెలిసిపోయినట్లు ఉన్న బట్టలు వేసుకోవడం అంగీకారయుక్తమే కాదు, అది కోరదగినది కూడా అని తెలుసుకోవడం ఉపశమనాన్నివ్వగలదు.”
వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాల్లో, ప్రభావవంతమైన వ్యాపార ప్రకటనలు, టీవీ ఆదర్శమూర్తులు, తోటివారు, పదోన్నతి, గుర్తింపు పొందాలనే ఆకాంక్ష వస్త్రాల ఎంపికపై, ప్రాముఖ్యంగా యౌవనస్థుల విషయంలో, గొప్ప ప్రభావాన్ని చూపించాయి. అధునాతనంగా కనిపించడానికి కొంతమంది దొంగతనం కూడా చేస్తారు.
1990లకు చెందిన అనేక జనాదరణ పొందిన స్టైళ్లు, 1960లకు చెందిన పాశ్చాత్య సమాజంలోని హిప్పీ ఉద్యమంలాగే గత సంవత్సరాల సాంప్రదాయికంకాని సంస్కృతుల్లో నుండే ఉద్భవించాయి. పెరిగిన గెడ్డం, చింపిరిగా ఉన్న జులపాల జుట్టు, నలిగిపోయి మురికిగా ఉండే వస్త్రాలు సాంప్రదాయబద్ధమైన విలువల నిరాకరణను తెలియజేశాయి. కాని తిరుగుబాటు వస్త్రాలు కూడా ఒక క్రొత్త కోరికను అంటే ఇతరులలా కనిపించాలనే కోరికను, స్నేహితుల నుండి వచ్చే ఒక క్రొత్త ఒత్తిడిని పురికొల్పాయి.
వస్త్రధారణ అనేది గుర్తింపును సూచించే విస్తృతమైన, మరింత విశేషమైన ఉపకరణంగా తయారైంది. వస్త్రాలు, ప్రాముఖ్యంగా టీ-షర్ట్లు, జనాదరణ పొందిన క్రీడలను, క్రీడాకారులను, హాస్యాన్ని, అసంతృప్తిని, క్రోధాన్ని, నైతికతను—లేదా అనైతికతను—వాణిజ్య ఉత్పాదనలను నిశ్శబ్దంగా ప్రకటించే ప్రకటనా బోర్డులుగా తయారయ్యాయి. అవి దిగ్భ్రమ కలిగించగలవు. ఇటీవలి న్యూస్‌వీక్ వార్తాశీర్షికను గమనించండి: “యౌవనస్థుల ఫ్యాషన్ సందేశంగా క్రూరత్వం.” ఆ శీర్షిక 21 ఏళ్ల యువకుడు తన టీ-షర్ట్ గురించి ఇలా మాట్లాడినట్లు తెలియజేసింది: “నేను ఎలాంటి మనఃస్థితిలో ఉన్నానో అది ప్రజలకు తెలియజేస్తుంది గనుక నేను దాన్ని వేసుకుంటాను. నాకు ఎవ్వరి సలహాలూ అక్కర లేదు, నన్ను ఎవరూ పట్టించుకోకూడదు.”
టీ-షర్ట్ల ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ వ్రాయబడి ఉండే ప్రకటనలు, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ, ఫలానా గుంపుకు చెందిన వారన్నట్లు కనిపించాలనే కోరిక లేదా అంతటా వ్యాపించివున్న తిరుగుబాటు ధోరణి, నేను ముందు అనే దృక్పథం, అశ్లీలత, లేక దౌర్జన్యం వంటివాటికి అనుగుణంగా ఉండాలనే కోరిక స్పష్టమౌతుంది. ఒక డిజైనర్ తన కొనుగోలుదారులు కోరిన విధంగా బట్టలకు రంధ్రాలు వేస్తాడు. “హాండ్గన్ రంధ్రాలు, రైఫిల్ రంధ్రాలు, లేక మెషీన్‌గన్ రంధ్రాలు. ఇలా ఏవి కావాలంటే అవి వాళ్లు ఎంపిక చేసుకోవచ్చు. కేవలం అదొక ఫ్యాషన్ సందేశం అంతే” అని ఆయన చెప్తున్నాడు.
ఫ్యాషన్ ఏం వ్యక్తం చేస్తుంది?
“సాధారణంగా వస్త్రాలు, సమాజంలో మీరు ఫలానా వర్గానికి చెందిన వారని మిమ్మల్ని గుర్తిస్తాయి” అని ఆస్ట్రేలియాలోని సిడ్నీలోవున్న పవర్ హౌస్ మ్యూజియమ్‌లో ఫ్యాషన్ క్యురేటర్‌గా పనిచేస్తున్న జేన్ డె టెలీగ చెప్తుంది. “మీరు ఏ వర్గానికి చెందాలని ఇష్టపడితే దానికి తగిన విధంగా వస్త్రాలు ధరిస్తారు” అని ఆమె జత చేస్తుంది. ప్రజలను వర్గీకరించడానికి మతం, సంపద, ఉద్యోగం, జాతి, విద్య, ఇంటి చిరునామా ఎంత ప్రాముఖ్యమో వస్త్రాలు కూడా అంతే ప్రాముఖ్యమని సిడ్నీ విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞానశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డా. డయాన కెన్నీ పేర్కొన్నది. జెట్ పత్రిక ప్రకారం, అమెరికాలో దాదాపు అందరూ శ్వేతజాతీయులే ఉన్న ఒక పాఠశాలలో “శ్వేతజాతి అమ్మాయిలు నల్లజాతి వారిలా జడలు వేసుకోవడం, వదులుగా ఉండే వస్త్రాలు ధరించడం, ఇతర ‘హిప్-హాప్’ ఫ్యాషన్లు అనుసరించడం వంటివి చేస్తున్నందుకు” జాతి ఉద్రిక్తత తలెత్తింది.
సంగీత ప్రపంచంలోని కొన్ని గుంపుల్లో కూడా ఈ వర్గవ్యవస్థ ఉంటుంది: “అనేక సందర్భాల్లో, వస్త్రాలు సంగీతాభిరుచులకు సరిపోయే విధంగా ఉంటాయి: రెగీ ఇష్టపడేవాళ్లు కాంతివంతమైన రంగులను జమైకా క్యాప్‌లను ధరిస్తారు, గ్రంజ్ రాక్‌ను ఇష్టపడేవారు ఊలు టోపీలను, గీతల షర్ట్‌లను ధరిస్తారు” అని మాక్లీన్స్ పత్రిక చెప్తుంది. ఏ రకమైనప్పటికీ, నిర్లక్ష్యమైన విధంగా బట్టలు వేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్లు క్రమరహితంగా వస్త్రాలు ధరించడానికి, నిరుద్యోగిలా కనిపించడానికి, గ్రంజ్ అనిపించుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు కావచ్చు.
వస్త్రధారణా పద్ధతులకు ఏమౌతోంది?
“ప్రతిదీ మీ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది,” అని పత్రికావిలేఖరి అయిన వుడీ హోక్స్వెండర్ అంటున్నాడు. “ఒకప్పుడు కచ్చితమైన నియమాలచే నియత్రించబడిన పురుషుల దుస్తులు ఎంతో ఇష్టానుసారమైనవిగా తయారౌతున్నాయి . . . అంతా ఏదో హడావుడిగా అనాలోచితంగా మీద పడేసుకున్నట్లుగా కనిపించాలి.” అయితే ఈ ధోరణి కొన్నిసార్లు పట్టింపు లేని దృక్పథాన్ని చూపించవచ్చు. లేదా అది ఆత్మగౌరవం లేకపోవడాన్ని లేక ఇతరుల పట్ల గౌరవం లేకపోవడాన్ని చూపించవచ్చు.
ఉపాధ్యాయులను గురించి విద్యార్థుల అభిప్రాయం అనే విషయానికి సంబంధించిన ఒక శీర్షికలో, పెర్సెప్చ్యువల్ అండ్ మోటార్ స్కిల్స్ అనే పత్రిక, “జీన్స్ వేసుకునే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ఉల్లాసాన్ని తీసుకువస్తున్నట్లు అనిపించినప్పటికీ, ఆయన అభిప్రాయాలకు అసలు గౌరవం ఇవ్వబడదు, అతడు సాధారణంగా ఏమీ తెలియని ఉపాధ్యాయునిగానే పరిగణించబడతాడు” అని వివరిస్తుంది. “జీన్స్ వేసుకుని వచ్చే ఉపాధ్యాయురాలు ఉల్లాసకరమైనదిగా, సమీపించదగినదిగా దృష్టించబడుతుంది. ఆమె ప్రత్యేకంగా ఎక్కువ జ్ఞానవంతురాలిగా పరిగణించబడదు, ఆమెకు పరిమితమైన గౌరవమే లభిస్తుంది. ఉపాధ్యాయురాలిలా కనిపించదు, సాధారణంగా ఆమె ఎక్కువమంది అభిమానాన్ని చూరగొంటుందని” అదే పత్రిక వ్యాఖ్యానించింది.
ఈ మధ్యలో, వ్యాపార ప్రపంచంలో మరో ఫ్యాషన్ సందేశం ఉంది: పేరు ప్రతిష్ఠల కోసమైన వస్త్రధారణ. ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువమంది స్త్రీలు ఉద్యోగపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తున్నారు. “నేను దాడి చేయడానికి వస్త్రాలు ధరిస్తాను” అని ఒక ముద్రణా సంస్థలో కార్యనిర్వాహకురాలిగా పనిచేస్తున్న మరీ చెప్తుంది. “నేను ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నాను. నేను అద్భుతంగా కనిపిస్తానని అనిపించుకోవాలని ఉంది” అని కూడా ఆమె చెప్తుంది. తన దృష్టి అంతా తన మీదే ఉందని ఆమె యథార్థంగా వెల్లడిస్తోంది.
జనాదరణ పొందిన ఫ్యాషన్లు చర్చీల్లోకి కూడా దూసుకువస్తున్నాయి. ఫ్యాషన్ పట్ల ఎంతో మోజువున్న కొంతమంది తమ అధునాతన వస్త్రాలను ప్రదర్శించుకోవడానికి తమ చర్చీని కూడా ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ, నేడు మతనాయకులు పొడవైన దుస్తులు ధరించి పుల్పీట్ మీదకు ఎక్కి, తరచూ జీన్స్, ట్రాక్షూ లేక వేలంవెర్రి దుస్తులు ధరించిన సంఘస్థులు చర్చీలో కూర్చుని ఉండడాన్ని చూస్తారు.
తమ గురించి, తమ గుర్తింపు గురించి ఎందుకింత పిచ్చి?
వేలంవెర్రి వస్త్రధారణ—ప్రాముఖ్యంగా యౌవనస్థుల విషయంలో—స్వార్థపరత్వానికి ఒక నిదర్శనంగా ఉంది, ఇతరుల అవధానాన్ని పొందాలనే ఆకాంక్షను అది చూపిస్తుందని మనస్తత్త్వశాస్త్రవేత్తలు అంటారు. “తనను తాను ఇతరుల అవధానాన్ని పొందే వస్తువుగా దృష్టించుకునే తీవ్రమైన దృక్పథం” అని వాళ్లు దాన్ని వర్ణిస్తారు. ఫలితంగా అతడు లేక ఆమె, “నా మీద నాకు పిచ్చి ఉన్నట్లుగానే, మీరు నేనంటే పిచ్చి కలిగివున్నారని నేను అనుకుంటున్నాను” అని చెప్తున్నట్లే.—అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆర్తోసైక్యాట్రీ.
మానవుల ప్రాముఖ్యతను నొక్కిచెప్తూ, దేవుడు అనవసరం అన్నట్లు భావించే తత్త్వాలు, మీరే అంటే మనిషే ఈ విశ్వంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అనే ఆలోచనను (తరచూ వాణిజ్య ప్రపంచం దీన్ని ప్రోత్సహిస్తుంది) పెంపొందింపజేశారు. అయితే సమస్యేమిటంటే, ఇప్పుడు ఈ ‘అత్యంత ప్రాముఖ్యమైన’ వ్యక్తులు దాదాపు ఆరు వందల కోట్లమంది ఉన్నారు. క్రైస్తవమత సామ్రాజ్య మతాలకు చెందిన కోట్లాదిమంది కూడా “ఇప్పుడే, ఇక్కడే మంచి జీవితాన్ని” గడపడానికి కృషి చేస్తూ, ఈ వస్తుదాయక దృక్పథం తాకిడికి నుగ్గునుగ్గైపోయారు. (పోల్చండి 2 తిమోతి 3:1-5.) దీనికి తోడు, కుటుంబ వ్యవస్థ మరియు నిజమైన ప్రేమ హరించుకుపోతున్నందున చాలామంది, ప్రాముఖ్యంగా యౌవనస్థులు, గుర్తింపు కోసం భద్రత కోసం తహతహలాడిపోతున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు.
అయితే, తమ వస్త్రధారణ గురించి, దేవుని ఎదుట తమ స్థానం గురించి శ్రద్ధగలవాళ్లు, సహజంగానే ఇలా అడుగుతారు: మారుతున్న వస్త్రధారణా విధానాలకు నేను ఎంతమేరకు అనుగుణ్యంగా ఉండాలి? నా వస్త్రధారణ సరైన విధంగా ఉందో లేదో నాకెలా తెలుస్తుంది? అది నా గురించి తికమక పెట్టే సూచనలను లేక తప్పుడు సందేశాలను ఇస్తుందా?
నేను సరైన విధంగా వస్త్రాలు ధరించానా?
మనం ఏమి ధరిస్తామనేది ప్రాముఖ్యంగా వ్యక్తిగతమైన ఎంపికనే. మన వ్యక్తిగత అభిరుచులు విభిన్నంగా ఉంటాయి, అలాగే మన ఆర్థిక పరిస్థితులు కూడా. ఆచారాలు ఒక్కో ప్రాంతాన్ని బట్టీ, ఒక్కో దేశాన్ని బట్టీ, ఒక్కో వాతావరణ ప్రదేశాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అయితే మీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకోండి: “ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” (ప్రసంగి 3:1) వేరే మాటల్లో చెప్పాలంటే, సందర్భాన్ని బట్టి వస్త్రాలు ధరించండి. రెండవదిగా, “దేవుని యెదుట నిరాడంబరంగా నడవండి.”—మీకా 6:8 NW.
అంటే దానర్థం చాదస్తంగా వస్త్రాలు ధరించాలని కాదు గాని, “స్వస్థబుద్ధి”ని ప్రతిఫలింపజేసే “తగుమాత్రపు వస్త్రముల”ను ధరించాలని అర్థం. (1 తిమోతి 2:9, 10) సాధారణంగా, దీని భావం కేవలం కొంత మితాన్ని పాటించడమనే, వర్కింగ్ ఉమెన్ అనే పత్రిక ఈ లక్షణాన్ని మంచి అభిరుచితోనూ, ఠీవితోనూ ముడిపెడుతోంది. అయితే ఒక మంచి నియమమేమిటంటే, ఎన్నడూ మీ కంటే ముందు మీ వస్త్రాలు ఇతరుల అవధానాన్ని పొందేందుకు, ఇతరులను తబ్బిబ్బు చేసేందుకు అనుమతించకండి. వర్కింగ్ ఉమెన్ ఇలా చెప్తుంది: “ప్రజలు మీ వస్త్రాలను మించి వ్యక్తిగా మీకున్న యోగ్యతలను చూసేలా . . . వస్త్రాలు ధరించండి.”
“ఒక వ్యక్తి గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలోనూ మౌన సంభాషణలోనూ వస్త్రాలు ఏ పాత్రను వహిస్తాయనేదాన్ని పరిశీలించే సాహిత్య సముదాయం, ఇతరుల గురించి తొలి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించే కిటుకుల్లో వస్త్రధారణ ప్రాముఖ్యమైనదని సూచిస్తుంది” అని పెర్సెప్చ్యువల్ అండ్ మోటార్ స్కిల్స్ అనే పత్రిక చెప్తుంది. దీని అనుసారంగా, తన వస్త్రధారణా విధానంతో ఇతరులను ఆకర్షించడంలో తనకున్న శక్తిని బట్టి మునుపు అతిశయించిన, 40వ పడిలోవున్న ఒక స్త్రీ ఇలా చెప్తుంది: “అది నాకు ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టింది, ఎందుకంటే అది నా వ్యక్తిగత జీవితానికి వృత్తిపరమైన జీవితానికి మధ్యనున్న రేఖను చెరిపివేసింది. నాతో వ్యాపార సంబంధ లావాదేవీలుగల పురుషులు నన్ను ఎప్పుడూ భోజనానికి బయటికి తీసుకువెళతామని అడిగేవారు.” విభిన్నమైన శైలిని వర్ణిస్తూ ఒక స్త్రీ అకౌంటెంట్ ఇలా చెప్తుంది: “ఒద్దికగా వస్త్రాలు ధరించని లేక మగవారిలా వస్త్రాలు ధరించే స్త్రీలతో పురుషులు ఎలా ప్రవర్తిస్తారో నేను గమనించాను. అలాంటి స్త్రీలు జిత్తులమారి వారిగా పరిగణింపబడతారు, పురుషులు వారితో అంత సున్నితంగా వ్యవహరించరు.”
జెఫ్ఫీ అనే ఒక అమ్మాయి తన తల వెంట్రుకలను చాలా అధునాతనంగా కత్తిరించుకున్నప్పుడు తాను ఇతరులకు గందరగోళమైన సూచనలను ఇస్తున్నానని కనుగొన్నది. “అది కేవలం ‘భిన్నంగా’ కనిపిస్తుందని నేను అనుకున్నాను” అని ఆమె జ్ఞాపకం చేసుకుంటోంది. “కాని ప్రజలు నన్ను, ‘నీవు నిజంగా యెహోవాసాక్షివేనా?’ అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అదెంతో అవమానకరంగా ఉండేది.” జెఫ్ఫీ తనను తాను కొన్ని నిక్కచ్చి అయిన ప్రశ్నలు వేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి, “హృదయమందు నిండియుండు దానినిబట్టి” కేవలం మన నోరే కాదుగాని మన దుస్తులు, మనం తలదువ్వుకునే విధానం కూడా మాటలాడతాయన్నది నిజం కాదంటారా? (మత్తయి 12:34) మీ వస్త్రాలు ఏమి వెల్లడి చేస్తున్నాయి—సృష్టికర్తవైపుకు అవధానాన్ని మళ్లించే ఉద్దేశంగల హృదయాన్నా లేక మీ వైపుకు అవధానాన్ని మళ్లించుకునే ఉద్దేశంగల హృదయాన్నా?
“స్వస్థబుద్ధి”తో వస్త్రాలు ధరించండి
మీ వస్త్రాలు మీ మీద చూపించగల ప్రభావాన్ని కూడా పరిశీలించండి. ఠీవియైన వస్త్రధారణ, విపరీతపు వస్త్రధారణ మీ అహాన్ని తృప్తిపర్చవచ్చు, అవకతవక వస్త్రధారణ మీపట్ల మీకున్న ప్రతికూల తలంపులను బలపర్చవచ్చు, మీ అభిమాన చిత్రాన్ని లేక క్రీడాకారుడ్ని లేక మరితర కథానాయకుడ్ని గురించి ప్రకటించే టీ-షర్ట్లు మిమ్మల్ని మనుష్యుల ఆరాధనవైపుకు అంటే విగ్రహారాధన వైపుకు మళ్ళించవచ్చు. అవును, మీ వస్త్రాలు ఇతరులతో మాట్లాడతాయి—మీ గురించి వాళ్లకు చెప్తాయి.
హృదయాన్ని దోచుకోవడానికి లేదా హృదయాన్ని చెడగొట్టడానికి మీరు వస్త్రాలు ధరిస్తుంటే మీ వస్త్రాలు మీ గురించి ఏమి చెప్తున్నాయి? వాస్తవానికి మీరు అధిగమించడానికి పోరాడవలసిన వ్యక్తిత్వ లక్షణాలను మీరు బలపర్చుకుంటున్నారా? అంతేగాక, మీరు ఎలాంటి వ్యక్తిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు? రోమీయులు 12:3లో వ్రాయబడివున్న ఉపదేశం స్వార్థపరత్వాన్ని, నిస్సారతను, ప్రతికూల ఆలోచనావిధానాన్ని జయించడానికి సహాయం చేయగలదు. అక్కడ అపొస్తలుడైన పౌలు, “[మనల్ని మనం] ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, . . . స్వస్థబుద్ధిగల వా[రమ]గుటకై తగినరీతిగా [మనల్ని] ఎంచుకొనవలెనని” మనకు ఉపదేశిస్తున్నాడు. “స్వస్థబుద్ధి” కలిగివుండడమంటే బుద్ధి గ్రాహ్యత కలిగివుండడమని భావం.
ప్రత్యేకంగా, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారికీ, నమ్మకంగా ఉండవలసిన స్థానాల్లో ఉన్నవారికీ ఇది ప్రాముఖ్యం. వారి మాదిరి ఇతరులపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సహజంగానే, క్రైస్తవ సంఘంలో సేవాధిక్యతల కోసం ప్రయాసపడుతున్నవారు, వారి క్రైస్తవ భార్యలు అలాగే తమ వస్త్రధారణలోనూ, తలదువ్వుకునే విధానంలోనూ అణకువ, గౌరవప్రదమైన దృక్పథం కల్గివుండాలి. పెండ్లి విందును గురించిన తన ఉపమానంలో యేసు చెప్పిన ఒక వ్యక్తిలా ఉండాలని మనం ఎన్నడూ కోరుకోము: “రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొకని చూ[సెను.]” అలాంటి అగౌరవకరమైన దుస్తులు ధరించడానికి ఆ వ్యక్తికి తగిన కారణం లేదని తెలుసుకుని, “రాజు—వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి . . . [అని] పరిచారకులతో చెప్పెను.”—మత్తయి 22:11-13.
కాబట్టి, తల్లిదండ్రులు తమ మాట ద్వారానూ, మాదిరి ద్వారానూ తమ పిల్లల్లో దుస్తుల పట్ల మంచి దృక్పథాన్ని, దుస్తుల విషయంలో మంచి అభిరుచిని ఏర్పరచడం ప్రాముఖ్యం. అంటే తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ కుమారునితో లేక కుమార్తెతో తర్కించేటప్పుడు దృఢంగా ఉండాలని దీనర్థం. వస్త్రధారణ విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ మనమూ మన పిల్లలూ ఎంతో ఉన్నతమైన ప్రమాణాలను కలిగివున్నామని అనుకోనిరీతిగా మనకు ప్రశంస లభించినప్పుడు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా!
అవును, యెహోవా సేవకులు నిస్సారత నుండి, ఖరీదైన వేలంవెర్రి నుండి, స్వీయాభిమానం నుండి స్వేచ్ఛను పొందారు. వారిని నడిపించడానికి లోకాత్మ కాదుగాని, దైవిక సూత్రాలు వారికున్నాయి. (1 కొరింథీయులు 2:12) మీరు ఈ సూత్రాలకు అనుగుణంగా జీవిస్తే, వస్త్రాలను ఎంపిక చేసుకోవడం మీకు కష్టమేమీ కాకూడదు. అంతేగాక, ఒక చిత్రం కోసం ఎంపిక చేయబడిన చక్కని ఫ్రేములా, మీ వస్త్రాలు మీ వ్యక్తిత్వాన్ని ఊదరపెట్టవు లేక దాన్ని అవమానించవు. మీరు దేవుని వలె ఉండడానికి ఎంతగా ప్రయత్నిస్తే, మీరు మీ వస్త్రాల పరిధులను మించిన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అంతగా వృద్ధి చేసుకోగల్గుతారు.