ప్రపంచ పరిశీలన
“సూపర్ క్రిముల” గురించి అప్రమత్తత
“ఎంతో శక్తివంతమైన మందులను ‘సూపర్ క్రిములు’ తట్టుకోగల్గుతున్నాయన్న విషయం వైద్య వృత్తిలో ఉన్నవారినే గాక వినియోగదారులను కూడా అప్రమత్తులను చేయాలని” దక్షిణ ఆఫ్రికా వార్తాపత్రిక అయిన స్టార్ చెబుతుంది. “ఒకప్పుడు అదుపులోకి తీసుకోబడిన రోగాలు లేక దాదాపు నిర్మూలించబడిన రోగాలు మార్పు చెందాయి, మళ్లీ తిరిగి తలెత్తుతున్నాయి” అని పెథాలజిస్ట్ అయిన మైక్ డోవ్ హెచ్చరిస్తున్నాడు. మందులను ఎక్కువగా వాడడం మూలంగా క్షయ, మలేరియా, టైఫాయిడ్, గనేరియా, మెనిజైటిస్, న్యుమోనియా వంటివాటిలోనే క్రొత్త తరహా రోగాలు పుట్టుకొస్తున్నాయి, వాటికి చికిత్స చేయడం చాలా కష్టం, అవి ఆధునిక మందులకు లొంగడం లేదు. కేవలం క్షయ రోగం మూలంగానే సాలీనా ముప్ఫై లక్షల కంటే ఎక్కువమంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ క్రింది విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా రోగులు సహాయాన్ని పొందవచ్చు: ముందుగా, మీకు గొంతు నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవడం, అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో గొంతును శుభ్రం చేసుకోవడం వంటి చికిత్సలను ప్రయత్నించండి. మందులు ఇవ్వమని మీ డాక్టరుపై ఒత్తిడి తీసుకురాకండి—అవి నిజంగా అవసరమో కాదో అతడినే నిర్ణయించనివ్వండి. మందులు ప్రిస్క్రైబ్ చేయబడితే, మెరుగుపడినట్లు అనిపించినా, ఎల్లప్పుడూ ఆ కోర్సును పూర్తి చేయండి. బాక్టీరియా మూలంగా గాక వైరస్‌ల మూలంగా వచ్చే జలుబు ఫ్లూ వంటివాటికి మందులు చికిత్స చేయలేవని గుర్తుంచుకోండి. “ఆరోగ్య సంబంధమైన విపత్తును కలుగజేయగల, చింతాక్రాంతమైన ఈ విశ్వ సమస్యను ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి” అని డోవ్ అంటున్నాడు.
కృంగుదల ఖరీదు
“ఉద్యోగానికి గైరుహాజరవ్వడానికి, ప్రపంచంలో తక్కువ నాణ్యమైన ఉత్పత్తికి భౌతిక రుగ్మతల కంటే ఎక్కువగా కృంగుదలే ముఖ్య కారణంగా ఉందని” బ్రెజిల్ వార్తాపత్రికయైన ఓ గ్లోబూ చెబుతుంది. 1997లో 2,00,000 మంది మరణించడానికి కారణం మానసిక రుగ్మతలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఒకటి చూపిస్తుంది. అంతేగాక, మానసిక స్థితిలో మార్పుల వంటి చిన్న చిన్న మానసిక రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 60 లక్షలకంటే ఎక్కువమంది ప్రజల వృత్తిసంబంధ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ సంఖ్య, వినికిడి సమస్యలకు గురైనవారి సంఖ్యయైన 12 కోట్ల 30 లక్షలమంది పనివారలకన్నా లేక పనిస్థలంలో దుర్ఘటనలకు గురైన 2 కోట్ల 50 లక్షలమంది కన్నా ఎక్కువే. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన గై గుడ్‌విన్ చేసిన అధ్యయనం ప్రకారం, రానున్న సంవత్సరాల్లో కృంగుదల సమస్య అధికమౌతుంది. దాంతో ఉత్పత్తి తగ్గిపోయి, చికిత్సా వ్యయం పెరిగిపోతుంది గనుక అది సమాజంపై విపరీతమైన భారంగా పరిణమిస్తుంది. కేవలం అమెరికాలోనే, కృంగుదల మూలంగా సాలీనా వచ్చే నష్టాలు ఇప్పటికే 5,300 కోట్ల అమెరికా డాలర్లకు చేరుకున్నాయి.
ప్రతీకారం చేయడమే వాళ్ల వ్యాపారం
“కచ్చితంగా గోప్యంగా ఉంచుతామని” వాగ్దానం చేస్తూ, జపానులో ఎక్కడైనా సరే సేవను అందజేయగలమన్న ఒక టోక్యో కంపెనీ ఇలా ప్రకటన చేసింది: “మేము మీ తరపున ప్రతీకారం చేస్తాము.” ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే, “తొలుత మా ఖాతాదారుని బాధకు గురిచేసిన వ్యక్తి అదే బాధకు గురయ్యేలా చేయడమే” అని ఆ సేవావిభాగాన్ని నడిపించే వ్యక్తి చెబుతున్నాడు. ఆసాహి ఈవినింగ్ న్యూస్ నందు నివేదించబడినట్లుగా, ఆ కంపెనీ, “ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని కోల్పోయేలా చేయడం,” సంబంధాలను చెడగొట్టడం, “తోటి ఉద్యోగి ఉద్యోగం ఊడిపోయేలా చేయడం లేక లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన యజమానిని అవమానించడం” వంటివి కచ్చితంగా జరిగేలా చూసి, “చట్టబద్ధమైన పగతీర్చుకునే చర్యను నిర్వర్తిస్తుంది.” ప్రతిరోజు టెలిఫోను ద్వారా ఆ కంపెనీ సేవలను కోరే దాదాపు 50 మంది ప్రజల్లో 20 మంది హత్య చేయడం గురించే అడుగుతారు; కాని కంపెనీ సాధారణ నియమం ఏమిటంటే, కండబలాన్ని ఉపయోగించకూడదు లేక చట్టాన్ని అధిగమించకూడదు, “అయితే కొన్నిసార్లు అది దాదాపు అదే పని చేస్తుంది.” ఆ సేవలో ఎంతోమంది పనివాళ్లు ఉన్నారు, వారిలో చాలామంది ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారిలో కొంతమంది స్వయంగా బాధలకు గురైన వ్యక్తులు, పగతీర్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయాలని కోరుకునేవారు. “మీరు గతంలో చేసిన దేదైనా ఇతరులకు కష్టం కలిగించి వాళ్లు మీపై పగ పట్టేలా చేసివుండవచ్చు. జాగ్రత్తగా ఉండండి,” అని ఆ కంపెనీ యజమాని హెచ్చరించాడు.
వివాహం ఆరోగ్యదాయకమైనది
వివాహం చేసుకోవడం స్త్రీ పురుషుల “జీవితాయుష్షును పెంచుతుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని స్థూలంగా పెంపొందింపజేస్తుంది, ఆదాయాన్ని అధికం చేస్తుంది” అని ద న్యూ యార్క్ టైమ్స్ నందు ఒక పరిశోధకురాలు పేర్కొంటుంది. చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన లిండ జె. వేట్ చేసిన అధ్యయనం, వివాహిత స్త్రీలు ఎక్కువ మానసిక ఒత్తిడికి గురౌతారని సూచిస్తూ 1972లో ప్రచురించబడిన నివేదికను తిప్పికొట్టింది. “వివాహం ప్రజల ప్రవర్తనలో మంచి మార్పును తెస్తుందని” అంటే త్రాగుడు తగ్గించడం వంటి మార్పును తెస్తుందని డా. వేట్ కనుగొన్నది. వివాహం కృంగుదలను కూడా తగ్గిస్తున్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి, “అధ్యయన ఆరంభంలో, అవివాహిత పురుషులు ఒక గుంపుగా కృంగుదలకు గురయ్యారు, అయితే వారు అలాగే ఒంటరివారిగా ఉండిపోయినప్పుడు ఇంకా ఎక్కువ కృంగుదలకు గురయ్యారు.” అయితే, గణాంకాలు కేవలం సగటును సూచిస్తుంది, అంతేగాని వివాహం చేసుకున్న వారంతా బాగుంటారనీ లేక సరైన వ్యక్తిని వివాహం చేసుకోని వారు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారనీ దీని భావం కాదని మిన్నెసొటా విశ్వవిద్యాలయానికి చెందిన డా. విలియమ్ జె. డోర్తీ పేర్కొంది.
దౌర్జన్యపూరిత వీరులు
మీడియాలోని దౌర్జన్యపు ప్రభావాన్ని గురించి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, పిల్లలకు ఎంతో ప్రియమైన ఆదర్శప్రాయులలో కొందరు, యాక్షన్ సినిమాల హీరోలే. 23 దేశాల్లో, ఇంటర్వ్యూ చేయబడిన ఐదు వేలమంది 12 ఏళ్ల పిల్లల్లో, 26 శాతం మంది తమ ప్రవర్తనకు మాదిరిగా ఈ సినిమా హీరోలకు “పాప్ స్టార్‌లకన్నా సంగీతకారులకన్నా (18.5 శాతం), మతనాయకులకన్నా (8 శాతం), లేక రాజకీయ నాయకులకన్నా (3 శాతం) ఎక్కువ ప్రాముఖ్యతను” ఇచ్చారని బ్రెజిల్‌కు చెందిన జర్నల్ డె టార్డె అనే వార్తాపత్రిక పేర్కొన్నది. ప్రాముఖ్యంగా కష్టతరమైన పరిస్థితులను ఎలా తప్పించుకొని బయటపడాలనే విషయంలో దౌర్జన్యపూరితులైన హీరోలను పిల్లలు ఆదర్శప్రాయులుగా పరిగణిస్తారని స్పష్టమౌతుందని అధ్యయన సమన్వయకర్తయైన ప్రొఫెసర్ జో గ్రూబెల్ చెబుతున్నాడు. పిల్లలు దౌర్జన్యానికి ఎంతగా అలవాటుపడితే, వాళ్లు అంత ఎక్కువగా మితిమీరి ప్రవర్తిస్తారని గ్రూబెల్ హెచ్చరిస్తున్నాడు. ఆయనిలా జతచేస్తున్నాడు: “దౌర్జన్యం సాధారణమైనదీ, అది ప్రయోజనకరమైనదీ అనే తలంపును మీడియా వృద్ధి చేస్తుంది.” కల్పనకు వాస్తవానికి మధ్యనున్న తేడాను గుర్తించేందుకు తమ పిల్లలకు నిర్దేశాన్నివ్వడంలో తల్లిదండ్రులు ప్రాథమికమైన పాత్ర నిర్వహిస్తారని గ్రూబెల్ నొక్కి చెప్పాడు.
“యువతుల పాలిట నంబర్ వన్ హంతకి”
ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో, సాధారణంగా 65 ఏళ్లు పైబడ్డ పురుషులకు క్షయ వస్తుందని నాన్డో టైమ్స్ నివేదిస్తుంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భూగోళ వ్యాప్తంగా క్షయ “ప్రపంచంలోకెల్లా, యువతుల పాలిట నంబర్ వన్ హంతకి”గా తయారయ్యిందని నివేదిక చెబుతుంది. “భార్యలూ తల్లులూ సంపాదనాపరులూ తమ ప్రౌఢప్రాయంలోనే నేలకొరిగిపోతున్నారని” ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క భూగోళ క్షయ కార్యక్రమానికి చెందిన డా. పాల్ డోలిన్ చెబుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల కంటే ఎక్కువమంది స్త్రీలకు క్షయ సోకుతోందని స్వీడెన్‌లోని గోట్‌బోర్గ్‌లో ఇటీవల ఒక వైద్య సంబంధ సెమినార్ వద్ద సమకూడిన నిపుణులు చెప్పారు. ప్రతి సంవత్సరం, వీరిలో దాదాపు పది లక్షలమంది చనిపోతారు, వారిలో ఎక్కువమంది వయస్సు 15 నుండి 44 మధ్యే ఉంటుంది. బ్రెజిల్ వార్తాపత్రికయైన ఓ ఇస్టాడో డె ఎస్. పౌలో ప్రకారం, ఈ మరణ రేటుకు ఒక కారణం ఏమిటంటే, చాలామంది వ్యాధి పూర్తిగా నయం కాక ముందే చికిత్సను నిలిపివేయడమే.
ఎండ్రకాయలు—పర్యావరణం
చీమలు, చెదలు, పురుగులు అడవిలోని నేలమీద ఉండే ఆకులను చెత్తా చెదారాన్ని కుళ్లబెడతాయి, కాని అప్పుడప్పుడూ వరదలతో ముంచెత్తబడే ఉష్ణమండల వర్షాధార అడవులకు ఏమి జరుగుతుంది? అక్కడ ఎండ్రకాయలు ఆ పనిని చేస్తాయి. అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణవేత్త, కోస్టారీకాలోని పసిఫిక్ తీరాన్నున్న అడవిలోని నేలమీది చాలా ప్రాంతంలో ఆకులకు బదులుగా అసంఖ్యాకమైన పెద్ద రంధ్రాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాలిన ఆకులను, పళ్లను, లేత మొక్కలను రాత్రి సమయంలో ఎండ్రకాయలు వచ్చి, మూడు అడుగుల లోతునున్న తమ కన్నాల అడుగుకు తీసుకువెళ్లడం ఆయన గమనించాడు. ఆ ఎండ్రకాయలు ఎకరానికి 24,000 ఉన్నట్లు అంచనా వేయబడింది. ఎనిమిది అంగుళాల పొడవుండే ఈ ఎండ్రకాయలకు గాలి పీల్చుకోవడానికి మార్పుచేయబడిన మొప్పలున్నాయి, అవి సంతానోత్పత్తి కోసం మాత్రమే అప్పుడప్పుడూ సముద్రం దగ్గరికి వెళతాయి, లోతుగా వేరులు పారిన చెట్లకు పోషణనివ్వడానికి ఇవి సహాయం చేస్తాయి. ఈ జీవులు చేసేదాన్ని బట్టే అడవి అంతటి పర్యావరణమూ నిర్ణయింపబడుతుందని లండన్‌కు చెందిన ద టైమ్స్ నివేదిస్తుంది.
కుటుంబమంతా కలిసి భోంచేయడం
527 మంది యౌవనస్థులపై జరిపిన ఒక అధ్యయనంలో, వారంలో కనీసం ఐదుసార్లు తమ కుటుంబాలతో కలిసి భోంచేసినవారిలో “మత్తుపదార్థాలకు అలవాటుపడడం గాని లేక కృంగుదలకు గురవ్వడం గాని తక్కువగా ఉంటుందని, వారు పాఠశాలలో ఎక్కువగా పురికొల్పబడివుంటారని, స్నేహితులతో మంచి సంబంధాలు కలిగివుంటారని” కెనడా వార్తాపత్రిక టోరంటో స్టార్ చెబుతుంది. “‘సరిగ్గా సర్దుకుపోలేని వారు’ అని పేరుపొందిన యౌవనులు వారానికి మూడు లేక అంతకన్నా తక్కువ రోజులు తమ కుటుంబాలతో కలిసి భోంచేసేవారు.” కుటుంబమంతా కలిసి భోంచేసే అలవాటు “ఆరోగ్యదాయకమైన కుటుంబ లక్షణమని” మానసిక శాస్త్రవేత్త బ్రూస్ బ్రైన్ ఘంటాపథంగా చెబుతున్నాడు. కలిసి భోంచేయడం కుటుంబ బంధాలను పటిష్టంచేసి, సంభాషణా నైపుణ్యాలను సన్నిహితత్వాన్ని పెంపొందింపజేస్తుంది, అంతేగాక టేబుల్ మ్యానర్స్ నేర్చుకోవడానికి, సంభాషణ, హాస్యం, ప్రార్థన వంటివాటిలో భాగం వహించడానికి అవకాశాన్ని ఇస్తుందని ఆ నివేదిక పేర్కొంటుంది. క్రమంగా కలిసి భోంచేసే కుటుంబానికి చెందిన ఒక ఎదిగిన కుమార్తె, తాము ఎప్పుడూ అలా చేసివుండకపోతే “నేను వాళ్లకిప్పుడు ఎంత సన్నిహితంగా ఉన్నానో అంత సన్నిహితంగా ఉండలేనని నేననుకుంటున్నాను” అని చెప్పింది.
పొగాకు క్రీడలను సమర్పించడం
పొగాకు కంపెనీ తమ ఉత్పత్తులను వృద్ధి చేసుకోవడానికి క్రీడా కార్యక్రమాలను ఇతర వినోద కార్యక్రమాలను విస్తృతంగా ఉపయోగించుకోవడం, “క్రీడలకు . . . సిగరెట్లు త్రాగడానికి మధ్య అనుకూలమైన సహవాసాన్ని” సృష్టిస్తోందని ఆస్ట్రేలియాస్ విక్టోరియన్ హెల్త్ ప్రమోషన్ ఫౌండేషన్‌కు చెందిన రాండ గాలబల్లీ చెబుతుంది. ఫలితంగా, తరచూ క్రీడల్లో ఎంతో యుక్తిగావుండే పొగాకు ప్రకటనలు ప్రజలు పొగత్రాగేలా ప్రేరేపించవచ్చు. “టీవిలో ఫార్ములా వన్ కార్ రేసింగ్‌ను చూసి ఆనందించే అబ్బాయిలు పొగత్రాగడాన్ని ప్రారంభించే సాధ్యత రెండింతలు ఉంది” అని బ్రిటన్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ ప్రచారం కనుగొన్నదని పానోస్ అనే న్యూస్ ఏజెన్సీ నివేదిస్తుంది. “యూరోపంతటిలో, కేవలం కార్ రేసింగ్‌కు మద్దతునివ్వడంలోనే పొగాకు కంపెనీలు ప్రతి సంవత్సరం కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయి.” తరచూ టీవీ తెర మీద కనబడే కార్లు, కదిలే అడ్వర్టయిసింగ్ ఏజెంట్లు.