బైబిలు ఉద్దేశము
దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?
“ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు—నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.”—లూకా 3:21, 22.
ప్రాచీన గ్రీసులో తత్వజ్ఞానులకు ఇచ్చిన ఒక ప్రసంగంలో అపొస్తలుడైన పౌలు దేవుణ్ని ‘ఆకాశమునకును భూమికిని ప్రభువు’ అని పిలిచాడు. ఆ దేవుడే “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు” మరియు “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు” అని స్పష్టం చేశాడు. (అపొస్తలుల కార్యములు 17:24-28) దేవుడు వీటన్నిటిని ఎలా సాధ్యపరుస్తున్నాడు? ఇది ఆయన పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి వలన మాత్రమే.
దేవునికి “అధికశక్తి” ఉన్నదని, ఆయనకు “బలాతిశయము” ఉన్నదని కూడా బైబిలు వివరిస్తుంది. (యెషయా 40:26) అవును ఆయన అధిక శక్తి, ఆయన బలాతిశయము ప్రదర్శితమయ్యే ఈ విశ్వాన్నంతటిని దేవుడే సృష్టించాడు.
చైతన్యస్థితిలోవున్న శక్తి
పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని చెప్పడం అంత సరియైనది కాదు. ఎందుకంటే, శక్తి అనేది నిబిడీకృతమైన, లేదా ఎవరిలోనైనా దేనిలోనైనా నిష్క్రియా స్థితిలో ఉండేది అయివుండవచ్చు. చార్జి చేయబడినా ఉపయోగించబడని బ్యాటరీలో ఉండే శక్తి ఇందుకు ఒక ఉదాహరణ. అయితే, బ్యాటరీని ఉపయోగిస్తున్నప్పుడు అందులో నుండి ప్రవహించే విద్యుత్తులా, దేవుని ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నట్టుగా లేఖనాలు దాన్ని వర్ణిస్తున్నాయి. (ఆదికాండము 1:2) అందుకని దేవుని పరిశుద్ధాత్మ ఆయన నుండి వెలువడిన శక్తి, ఆయన చురుకైన శక్తి.
పరిశుద్ధాత్మ ఒక కార్యాన్ని నిర్వర్తిస్తున్నట్లూ, లేక అది దేవునికి దూరంగా ఎక్కడో వేరేచోట ఉన్నట్లు బైబిలు కొన్నిసార్లు తెలియజేస్తుంది. (మత్తయి 28:19, 20; లూకా 3:21, 22; అపొస్తలుల కార్యములు 8:39; 13:4; 15:28, 29) ఇటువంటి లేఖనాలను చదివిన కొందరు, పరిశుద్ధాత్మ దేవుని నుండి వేరై తనదైన స్వంత అస్తిత్వాన్ని కలిగి ఉందని అనుకున్నారు. లేఖనాల్లో ఈ శైలి ఎందుకు ఉపయోగించబడింది? పరిశుద్ధాత్మ దేవుని నుండి వేరుగా అస్తిత్వంలో ఉన్నదా?
తన భౌతిక సృష్టికి పూర్తిగా వేరైన స్థాయిలో సర్వశక్తిమంతుడైన దేవుడు నివసిస్తున్నాడు. ఆయన మన పరిమిత ఇంద్రియాలకు అందని అదృశ్యమైన ఒక ఆత్మ. (యోహాను 4:24) యెహోవా దేవుడు పరలోకంలో నివసిస్తున్నాడనీ, అక్కడనుండి మానవజాతిని పరికిస్తున్నాడనీ బైబిలు చెబుతుంది. (కీర్తన 33:13, 14) ఇది అర్థం చేసుకొనదగినదే. ఆయన తన పనిలో ఉపయోగించే పదార్థాలకన్నా గొప్పవాడు. ఆయన దానిపైన యజమానిగా ఉన్నాడు, దాన్ని ప్రభావితం చేస్తాడు, రూపిస్తాడు, నియంత్రణలో ఉంచుతాడు.—ఆదికాండము 1:1.
ఆయన తన అదృశ్యనివాస స్థలం నుండి ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సంఘటనలు సంభవించేలా చేయగలడు. అందువల్ల, తన చురుకైన శక్తి పనిచేస్తున్న స్థలంలో ఆయన ఉండవలసిన అవసరం లేదు. ఏదైనా పనిని నెరేవేర్చేందుకు ఆయన తన ఆత్మను పంపించగలడు. (కీర్తనలు 104:30) నేడు టీవీని ఇతర గృహోపకరణాల్ని వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే ఆధునిక మనిషి దీన్ని సులభంగా అర్థం చేసుకోగలడు. విద్యుత్తు లేదా పరారుణ తరంగాలు వంటి వాటిలో ఉన్న శక్తిని నేడు మనం గుర్తిస్తాము. అదే విధంగా, ఆయన తన అదృశ్య పరిశుద్ధ శక్తితో లేదా తన ఆత్మతో దేవుడు తాను చేయాలని సంకల్పించిన దానినంతటినీ తాను ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళ్లనక్కర లేకుండానే నెరవేరుస్తాడు.—యెషయా 55:11.
బైబిలు కాలాల్లో ఈ భావనను గ్రహించేందుకు కాస్త కష్టంగా ఉండివుండవచ్చు. ఈనాడు పరిశుద్ధాత్మ వేరుగా ఉన్న ఒక శక్తి అని చెప్పడం, దేవుడు తన శక్తి పనిచేసే స్థలంలో తాను వ్యక్తిగతంగా ఉండనక్కర లేకుండానే ఆ శక్తిని ఆయన ఎలా ఉపయోగించగలడో అర్థం చేసుకోవడానికి ఇది నిస్సందేహంగా సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ ఇది చేసింది, అది చేసింది అని బైబిలు నివేదిస్తున్నప్పుడు, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వ్యక్తులపైన గానీ లేదా వస్తువులపైన గానీ తన చురుకైన శక్తిని ఉపయోగించాడని అర్థం.
పరిశుద్ధాత్మ యొక్క వేర్వేరు క్రియలు
సృష్టిలో జీవము గల వాటిని నిర్జీవమైన వాటిని సృష్టించడానికి యెహోవా పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. (కీర్తనలు 33:6) జలప్రళయం ద్వారా దుష్టులైన పశ్చాత్తాపం నొందని ఆ తరంలోని ప్రజలను నాశనం చేసేందుకు కూడా పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. (ఆదికాండము 6:1-22) తన కుమారుని అమూల్యమైన జీవాన్ని యూదా కన్యక అయిన మరియ గర్భంలోనికి మార్చినప్పుడు కూడా అదే చురుకైన శక్తిని దేవుడు ఉపయోగించాడు.—లూకా 1:35.
కొన్నిసార్లు, తమ జీవితాలు అపాయకర పరిస్థితుల్లో ఉన్నా కూడా శత్రువుల ఎదుట దృఢంగానూ, ధైర్యంగానూ సత్యాన్ని గురించి మాట్లాడేందుకు ఆ ఆత్మ వారిని శక్తిమంతులను చేసింది. (మీకా 3:8) బైబిల్లో ఉన్న అనేక దృష్టాంతాల్లో, ప్రత్యేకించి ప్రవచనాలు ఇమిడివున్న దృష్టాంతాల్లో, స్త్రీపురుషులు ప్రత్యేక అంతర్దృష్టిని, అవగాహనని ఈ శక్తి ద్వారానే పొందినట్లు ఉంది. భవిష్యత్తులో జరగబోయే దానిని ఏ మనిషీ ఖచ్చితంగా ముందుగా గ్రహించి చెప్పలేడు, ఇది ఆత్మ యొక్క విశిష్టమైన క్రియ.—2 పేతురు 1:20, 21.
ఆ ఆత్మ అద్భుతాలు చేసే శక్తిని కూడా కొంతమంది వ్యక్తులకు ఇవ్వగలదు. ఉదాహరణకు, ఈ శక్తి ద్వారానే యేసు ప్రకృతి శక్తులను అదుపు చేశాడు, రోగులను స్వస్థపర్చాడు, చివరికి మరణించినవారిని కూడా లేవనెత్తాడు. (లూకా 4:18-21; 8:22-26, 49-56; 9:11) భూవ్యాప్తంగా దేవుని సాక్షులుగా సేవచేసేందుకు తొలి క్రైస్తవులను సంస్థీకరించడంలోను, శక్తిమంతులను చేయడంలోను ఆ ఆత్మ కీలకమైన పాత్రను పోషించింది.—అపొస్తలుల కార్యములు 1:8; 2:1-47; రోమీయులు 15:18, 19; 1 కొరింథీయులు 12:4-11.
మన పక్షంగా పనిచేసే దేవుని శక్తి
నేడు దేవుని మానవ సేవకులకు ఆ అపరిమిత శక్తిని పొందడం సాధ్యమౌతుందా? అవును, సాధ్యమౌతుంది ! ప్రజలు తన చిత్తాన్ని అర్థం చేసుకుని, దాన్ని నెరవేర్చడంలో వారికి సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా నిజాయితీగా విన్నపం చేస్తారో, ఎవరికైతే సరైన హృదయ దృక్పథం ఉందో, తను కోరేవాటికి అనుగుణంగా ఎవరైతే మారతారో అలాంటి వారికి తన ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. (1 కొరింథీయులు 2:10-16) ఆ ఆత్మ అపరిపూర్ణ మానవులు ఆటంకాలను ఎదుర్కొంటూ దేవుణ్ని నమ్మకంగా సేవించేలా వారికి “బలాధిక్యము”తో కూడిన శక్తినిస్తుంది. అందుకని, దేవుని ఆత్మను పొందాలనీ, దాన్ని నిలుపుకోవాలనీ దేవునికి భయపడే ప్రజలు కోరుకుంటారు.—2 కొరింథీయులు 4:7; లూకా 11:13; అపొస్తలుల కార్యములు 15:8; ఎఫెసీయులు 4:30.
త్వరలో ఈ దుష్టలోకంలో ఉన్న అన్యాయానికీ బాధలకు అంతం తీసుకురావడానికి దేవుడు ఈ అధికశక్తిని ఉపయోగిస్తాడు. తద్వారా తన ఘనమైన పరిశుద్ధ నామాన్ని పవిత్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ మొత్తం లోకాన్ని మేలు నిమిత్తం ప్రభావితం చేస్తుంది, దాని ఫలాలు అందరికీ స్పష్టంగా కన్పిస్తాయి, వాటి మూలకర్తకు మహిమను తెస్తాయి.—గలతీయులు 5:22, 23; ప్రకటన 21:3, 4.