అతడు వదిలిపెట్టలేదు
1995, అక్టోబర్ 5న, 14 ఏండ్ల మాట్ టాపీయో మెదడు స్టమ్లోని ట్యూమర్‌కు సర్జరీ జరిగింది. ఆ ట్యూమర్ చాలా ప్రమాదకరమైనదని తేలింది. తర్వాతి రెండున్నర సంవత్సరాల్లో ఆయన చేయించుకోబోయే సర్జరీల్లో అది మొదటిది. ఆ తర్వాత, కెమోథెరపీ మరియు రేడియేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి.
అమెరికాలోని మిచిగన్‌లో మాట్ నివసించేవాడు. అక్కడే అతడు పబ్లిక్ స్కూల్‌కూ, క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవాడు. టీచర్లతోనూ, తోటివిద్యార్థులతోనూ తన నమ్మకాల గురించి మాట్లాడే అవకాశాలనూ బహిరంగ పరిచర్యలో ఇతరులను సందర్శించడంలో భాగం వహించే అవకాశాలనూ ఉపయోగించుకున్నాడు. అతడు హాస్పిటల్లో తరచూ ఉండాల్సి వచ్చింది. తన జీవితంలో చివరి రెండున్నర సంవత్సరాల్లో ఆయన 18 నెలలు ఆసుపత్రిలో గడిపాడు. అలా ఆసుపత్రిలో ఉండవల్సి వచ్చిన సమయాల్లో తాను అక్కడ కలిసినవాళ్ళకు వందల కొలది బైబిలు సాహిత్యాలను అందించాడు.
మాట్ ఇక బ్రతకడు అని అనేకసార్లు అనిపించింది. కానీ ప్రతిసారీ ఏదో విధంగా బ్రతికిపోయేవాడు. ఒకసారి, అతడు ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో, అతడికి మూర్ఛ వచ్చింది, ఊపిరాడడం ఆగిపోయింది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయడం ప్రారంభించారు, ఆ తర్వాత, అతడు మళ్ళీ ఊపిరితీసుకోవడం మొదలుపెట్టాడు. అతడికి స్పృహ వచ్చాక, “నేను పోరాడువాడను! నేను పోరాడువాడను! వదిలిపెట్టేవాడ్ని కాను!” అని బిగ్గరగా అంటూ ఏడ్చేశాడు. మాట్కు దేవుడి మీద ఉన్న విశ్వాసమే అతడ్ని ఇంతకాలం బ్రతికించింది అని ప్రజలు అన్నారు.
1996, జనవరి 13న, మాట్ యెహోవా దేవుడికి తనను తాను సమర్పించుకున్నదానికి ప్రతీకగా బాప్తిస్మం పొందడంతో అతడు పెంచుకున్న కోరిక వాస్తవమైంది. ఇన్ఫెక్షన్ కాగల ప్రమాదం ఉన్నందువల్ల, ఆయనకు ప్రత్యేక పూల్‌లో బాప్తిస్మం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ సర్జరీ చేయించేందుకు అతడ్ని మళ్ళీ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. 1997 ఆగస్టులో, మాట్కు కొన్ని వారాల తరబడి వాంతులు అయ్యాయి. కానీ, సర్జరీ తర్వాత వాంతులు ఆగిపోయాయి.
ఇన్ని జరిగినప్పటికీ, మాట్ మంచి హాస్యరస భావాన్ని చూపిస్తూ, డాక్టర్లతోనూ, నర్సులతోను తమాషాగా మాట్లాడేవాడు. అతడు ఇంత అద్భుతమైన హాస్యరస భావాన్ని ఎలా చూపించగల్గుతున్నాడన్నది వాళ్ళు అర్థం చేసుకోలేక పోయారు. డాక్టర్లలో ఒకరు, “మాట్, నేనే నీ స్థానంలో ఉంటే, ఆసుపత్రిలో నా పడక చుట్టూ ఒక కర్టెన్ వేయించుకుని, ముఖంపై దుప్పటి కప్పుకుని, అందరినీ ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని గదమాయించేవాడ్ని” అని అన్నారు.
1998 ఫిబ్రవరిలో, మాట్ తన హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగివచ్చాడు—తను ఇంటికి తిరిగి రాగలిగిన చివరి పర్యాయాల్లో అదొకటి—తను ఇంకా సజీవంగా ఉన్నందుకూ, అదీ ఇంట్లో ఉన్నందుకూ ఎంతో పులకించిపోయి, తలుపు దగ్గరకు చేరుకోగానే, “నేను చాలా సంతోషంగా ఉన్నాను! ప్రార్థన చేద్దాం రండి” అన్నాడు. తర్వాత అతడు తన సంతోషాన్ని యెహోవాకు చేసిన ప్రార్థనలో వ్యక్తీకరించాడు. రెండు నెలల తర్వాత, ఏప్రిల్ 19న చివరికి అతడు ఆ క్యాన్సర్ వల్ల మరణించాడు.
మునుపు మాట్‌తో చేసిన ఇంటర్వ్యూను రికార్డు చేశారు. దానిని స్థానిక రాజ్యమందిరంలో యెహోవాసాక్షుల ఒక కూటం జరుగుతున్నప్పుడు ప్లే చేశారు. “మనలో కొద్దో గొప్ప ఆరోగ్యమున్న వారితో మన క్రైస్తవ పరిచర్యా మరియు క్రైస్తవ కూటాల విషయమై ఏమి చెప్పాలనుకుంటున్నావ్?” అని మాట్ను అడిగారు.
“మీరు ఇప్పుడు చేయగల్గేదంతా చేయండి. . . . ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు . . . కాని ఏమి జరిగినప్పటికీ, యెహోవా గురించి సాక్ష్యమివ్వడాన్ని ఎన్నడూ మానవద్దు” అని అతడు జవాబిచ్చాడు.