పాముల్ని గురించి ప్రజల్లో పాతుకుపోయిన తప్పుడు అభిప్రాయాలు
ఇండియాలోని తేజరిల్లు! విలేఖరి
ఒక అమ్మాయి కొప్పులోని మల్లెల గుభాళింపుకు మరులుకొల్పబడ్డ మిసమిసలాడుతున్న ఓ త్రాచు ఆమె వైపు దూసుకొచ్చింది. మెలికలు తిరిగినట్టున్న దాని భారీ శరీరం సముద్ర తరంగాల్ని పోలినట్టుంది. ఆమె ప్రకాశవంతమైన ఆభరణంలా మెరిసిపోతున్న ఒక మెరుపును దాని పడగపై చూసింది. అది కనికట్టుచేసే చూపులతో ఆమెను కట్టిపడేసింది. అకస్మాత్తుగా అది గాల్లోనుండి దూసుకెళ్లి ఆమె భుజాల్లోకి తన వాడియైన కోరల్ని కస్సున గుచ్చింది.
వాస్తవమా, అభూతకల్పనా? పైనున్న వర్ణనంతా శుద్ధ అబద్ధం, అది సామాన్యంగా ప్రజల్లో పాతుకుపోయిన తప్పుడు అభిప్రాయాలపై ఆధారపడింది. ఈ తప్పుడు అభిప్రాయాల్లో కొన్నింటిని పరిశీలించండి.
1. మల్లెల సువాసనలూ, గంధపు గుభాళింపులూ, మరితర పరిమళాలూ పాముల్ని ఆకర్షిస్తాయి. అసత్యం. పరిమళాలు కీటకాల్ని ఆకర్షిస్తాయి, ఆ కీటకాల కోసం కప్పలు వస్తాయి, కప్పలు పాముల ఆహారంలో ఒకటి గనుక వాటికోసం పాములు వస్తాయి.
2. పాములు తమ శరీరాల్ని లంబదిశలో కదుపుతూ కదులుతాయి. అసత్యం. పెద్ద పెద్ద రాళ్లపై నుండి పాములు కదులుతున్నప్పుడు అలా అన్పిస్తుంది. త్రాచు పాములూ, భూచరాలైన ఇతర పాములూ సామాన్యంగా రుజు మార్గంలో అడ్డదిడ్డంగా ప్రాకుతాయి. అవి తమ ముందు భాగాన్ని ముందుకు సాగదీసి, వెనుక భాగాన్ని ముందుకు లాగడమో లేక, నేలపై ఉండే వేటినైనా సరే ఆధారంగా చేసుకొని ఈ వైపు నుండి ఆ వైపుకు నెట్టుకుంటూ “క” అక్షరంలోని తలకట్టు తీసేస్తే ఎలా కన్పిస్తుందో ఆ రీతిలో ముందుకు కదులుతాయి.
3. కొన్ని పాములు, తమ పడగలపై అమూల్యమైన మణుల్ని కల్గివున్నాయి. అసత్యం. ప్రాచీన భారతావనిలోని మహా పురుషుల్ని త్రాచులు కాపాడాయనే నమ్మకంతోసహా ఇదీ ఓ కట్టుకథే.
4. త్రాచులు తమ ఎరల్ని కనికట్టు చేస్తాయి. అసత్యం. సాధారణంగా పాము భయానికి గురైనప్పుడు బిగిసుకుపోయి కదలకుండా చూస్తుంది, కాబట్టి పాము మానవులకు తారసపడినప్పుడు అది కనికట్టుచేసే చూపులతో స్థిరంగా తేరి చూస్తున్నట్టన్పించే అభిప్రాయాన్ని వాళ్లలో కలగజేస్తుంది. అయినా, తన ఎరల్ని పట్టుకోడానికి పాములు ఉపయోగించే పద్ధతి మాత్రమిది కాదు.
5. త్రాచులు తమ ఎరలపైకి దూకుతాయి. అసత్యం. త్రాచుపాము తన ఎరపై దాడి చేయడానికి తన ముందు భాగాన్ని ముందుకు తోసినా, తన శరీరం నిటారుగా నిలబడేలా, దాని శరీరంలో ఎక్కువ భాగం నేలపైనే ఉంటుంది. మహా అయితే, దాని శరీరంలో మూడింట ఒకవంతు పైకిలేచి నిలబడి దాడి చేస్తుంది.
6. సర్పాల, త్రాచు పాముల చర్మం మెరుస్తూ, ఎప్పుడూ చల్లగానూ ఉంటుంది. అసత్యం. పాములకున్న పొలుసులతోపాటూ వాటి చర్మం పొడిగా ఉండి, మెత్తని రబ్బరులా ఉంటుంది. పాములు శీతలరక్త జీవులు; వాటి శరీర ఉష్ణోగ్రత, బాహ్య ఉష్ణోగ్రతలోని మార్పులను బట్టి మారుతుంటుంది.
7. త్రాచులకు వినబడదు. అసత్యం. అనేకులకున్న తప్పుడు అభిప్రాయమిది. వాళ్లు పాములకున్న ఏకైక వినికిడి శక్తి నేలపై జరిగే శబ్ద ప్రకంపనలేననీ, వాటిని శరీరమందలి శబ్దగ్రాహకాల ద్వారా గ్రహిస్తాయనీ అనుకుంటారు. త్రాచు పాములు చెవిటివికావని కీర్తన 58:4, 5 వచనాల్లో బైబిలు ఖచ్చితంగా తెలియజేస్తోంది. త్రాచులు గాలిలో నుండి వచ్చే ధ్వనుల్ని వినగలవనీ, పాములవాళ్ల నాగ స్వరానికి అవి ప్రతిస్పందిస్తాయనీ ఇటీవల పరిశోధన తెలియజేస్తోంది.—తేజరిల్లు! (ఆంగ్లం) జూలై 22, 1993, 31వ పేజీ కూడా చూడండి.
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
Top snake: Animals/Jim Harter/Dover Publications, Inc.