శ్రీలంకలో నాగుపాములు శబ్దాన్ని వింటున్నాయి
“మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి [నాగు NW] పామువలె వారున్నారు.—కీర్తనలు 58:5.
జనవరి 10, 1954, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో “పాములు సంగీతం ద్వారా ‘మంత్రించ’ బడతాయా?” అనే అంశం క్రింద, కీర్తనలు 58:4, 5 వచనాలపై ఈ క్రింది రిపోర్టు యివ్వబడింది: “బాల్టిమోర్‌లోని [అమెరికా] మౌంట్ సైనాయ్ హాస్పిటల్లో ఔషధ పరిశోధనా నిపుణుడైన డా. డేవిడ్ ఐ. మక్ట్ నాగుపాము విషానికి సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాత అధికారుల్లో ఒకరు. (ఉదాహరణకు, నాగుపాము విషం, రక్తానికి సంబంధించిన రోగాలకు ఆమోదించబడిన మందు.) డా. మక్ట్ నివేదించేదేమంటే, నాగుపాములతోను, నాగుపాము విషంతోను ప్రయోగాలు చేయడంవల్ల, ఇండియాలోని చాలా ప్రదేశాలనుండి వచ్చిన, ఎక్కువ విద్యనభ్యసించిన, అనేకమంది హిందూ వైద్యులతో ఆయన బాగా పరిచయమయ్యాడు. పిల్లనగ్రోవి లేదా సంగీత బూరల నుండి వచ్చే కొన్ని సంగీత స్వరాలకు నాగుపాములు ప్రతిస్పందిస్తాయని అందరూ ఒప్పుకున్నారు. కొన్ని రకాల సంగీతాలు, వేరే రకాల కంటే ఎక్కువగా జంతువులను పురికొల్పుతాయని, ఈ వైద్యులు రిపోర్టు చేశారు. ఇండియాలో పల్లెప్రాంతాల్లోని, చిన్నపిల్లలు చీకటి పడిన తర్వాత నాగుపాములను ఆకర్షించే పాటలు పాడవద్దని కూడా హెచ్చరించబడ్డారని, ఆయనన్నారు. పాములు చెవిటివని పదేపదే చెప్పిన షేక్స్ఫియర్ను గూర్చి డా. మక్ట్ వ్యాఖ్యానించి . . . సాధారణంగా వున్న తప్పుడు అవగాహనను మామూలుగా తిరిగి చెప్పాడు. మరొకవైపు కీర్తనలు 58:5వ వచనంలో పాములు వినగలవని కీర్తనల గ్రంథకర్త సరిగ్గానే చెప్పాడని డా. మక్ట్ అన్నాడు.”
అలాగే, జూలై 1981లో జిమెక్స్ టెర్, సెల్మెంజ్ టెర్వెల్ట్ (జ్రిమెక్స్ యానిమల్, షెల్మన్స్ యానిమల్ వరల్డ్) అనే జర్మన్ జంతుశాస్త్ర పత్రికలో 34, 35 పేజీలలో, దాని రచయిత శ్రీలంకలో తన భూముల్లోని చెదలపుట్టలో నివసించిన నాగుపాము గూర్చి చెబుతున్నాడు. ఆ విషసర్పాన్ని పట్టి, దానిని నాట్యమాడించమని పాములు పట్టే ఒక మాంత్రికుని ఆయన అడిగాడు. ఆ రచయిత యిలా నివేదిస్తున్నాడు: “అక్కడ నిజంగా ఒక నాగుపాముందని నేను నా అతిథికి నచ్చజెప్పిన తర్వాత, ఆయన చెదలుపుట్ట దగ్గర కూర్చొని, తన నాగస్వరాన్ని ఊదడం ప్రారంభించాడు. చాలా సమయం తర్వాత—ఏమైనా జరుగుతుందని నేనిక నమ్మలేదు—అప్పుడు నాగుపాము దాని తలను కొన్ని సెంటీమీటర్ల వరకు రంధ్రం బయటకు ఎత్తింది. పాము దాని నోటిని తెరచేంతలోనే ఆ మాంత్రికుడు గబాలున పట్టి అతని బొటనవ్రేలు, మరి రెండువ్రేళ్ల మధ్యలోకి దాని తలను నొక్కేశాడు.” ఆ తర్వాత ఈ భారతీయుడు నిజంగా పామును నాట్యమాడించాడు.
కాబట్టి, నాగుపాము “మాంత్రికుల స్వరం వింటుంది” అనేదానికి ఆధారముంది.—న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్—విత్ రిఫరెన్స్, అపెండిక్స్ 7ఎ, పేజీ 1583. (g93 7/22)