‘మేమికమీదట మా కోసం జీవించడం లేదు’
జాక్ యోహాన్‌సన్ చెప్పినది
ఆఫ్రికాదేశస్థుడైన, మలావీ సైనికుడు ల్యాండ్ రోవర్ పడవ హెడ్‌లైట్ల వెలుతురులో నది ఒడ్డున నిలుచోమని నన్ను ఆజ్ఞాపించాడు. సైనికుడు తన రైఫిల్‌ను తన భుజానికి తగిలించుకుంటుండగా, లోయిడ్ లీక్వీడ్ నదీతీరానికి పరుగెత్తుకు వచ్చి నాకు అడ్డంగా నిలబడ్డాడు. “నన్ను కాల్చేయండి! ఆయనకు బదులు నన్ను కాల్చేయండి! ఏ తప్పు చేయని ఈ విదేశీయుడ్ని చంపకండి!” అని ఆయన ప్రాధేయపడ్డాడు. యూరప్ దేశస్థుడనైన నా కోసం ఆఫ్రికాదేశస్థుడొకరు తన ప్రాణాన్ని ఒడ్డేందుకు ఎందుకు తయారయ్యారు? దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను ఆఫ్రికాలో ఎలా ఒక మిషనరీనయ్యానో వివరిస్తానుండండి.
నాకు తొమ్మిదేండ్లున్నప్పుడు ఐదుగురు పిల్లలను పెంచే బాధ్యతను నాన్నగారికి వదిలిపెడుతూ మా అమ్మగారు 1942లో చనిపోయారు. నేనే అందరికన్నా చిన్నవాడ్ని. మా నాన్నగారు ఫిన్‌ల్యాండ్‌లో మొదటి యెహోవాసాక్షుల్లో ఒకరు. నాలుగునెలల తర్వాత ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోయి ఆయన కూడా చనిపోయారు. మా పెద్దక్క మాయ మమ్మల్ని నలుగుర్నీ చూసుకుంది. మేము మా పొలం పనులను చేసుకోగలిగాం. మాయక్క ఆధ్యాత్మిక కార్యాల్లో కూడా నాయకత్వం వహించింది. మా నాన్నగారు చనిపోయిన ఒక సంవత్సరంలోగానే మాయక్కా, ఒకన్నయ్యా నీటి బాప్తిస్మం పొందడం ద్వారా యెహోవా దేవుడికి తాము చేసుకున్న సమర్పణను తెలియజేశారు. ఒక సంవత్సరం తర్వాత, నేను నా 11వ ఏట బాప్తిస్మం పొందాను.
నిర్ణాయకమైన తీర్మానం
కమర్షియల్ కాలెజ్‌లో 1951లో నేను నా చదువు పూర్తి చేసిన తర్వాత, ఫిన్‌ల్యాండ్‌లోని ఫోర్డ్ మోటార్ కంపెనీలో పని చేయడం మొదలుపెట్టాను. ఆరు నెలల తర్వాత, యెహోవాసాక్షుల తెలివైన ఒక ప్రయాణ పరిచారకుడు నాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. పయినీరింగ్ చేయడం వల్ల, లేదా పూర్తికాల పరిచర్య వల్ల కలిగే ఆశీర్వాదాలను గురించి ఒక అసెంబ్లీలో ప్రసంగమివ్వమని నన్ను ఆహ్వానించాడు. నేను పూర్తికాల ఉద్యోగాన్ని చేస్తున్నాను గనుక, చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. నేను హృదయపూర్వకంగా ప్రసంగం ఇవ్వలేనని అనిపించింది. నేను ఆ విషయాన్ని గురించి యెహోవాకు ప్రార్థించాను. క్రైస్తవులు ‘ఇకమీదట తమ కోసం కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కోసమే జీవించాలి’ అని గ్రహించాను. కనుక, నేను పయినీరుగా సేవచేసేందుకు నా ప్రాధాన్యతలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను.—2 కొరింథీయులు 5:15.
నేను ఆ కంపెనీలోనే ఉంటే నా జీతాన్ని రెండింతలు చేస్తానని మా సూపర్‌వైజర్ మాటిచ్చారు. నేను ఒక నిర్ణయానికి వచ్చేశానని గ్రహించిన తర్వాత, “నువ్వు సరైన నిర్ణయానికి వచ్చావు. నేను నా జీవితమంతా ఈ ఆఫీస్‌లోనే గడిపాను. నేను నిజానికి ఎంతమేరకు ప్రజలకు సహాయపడ్డానని?” అని అన్నారు. అలా 1952 మేలో, నేను పయినీరును అయ్యాను. కొన్ని వారాల తర్వాత, నేను పూర్తి నమ్మకంతో పయినీరు పరిచర్యను గురించి ప్రసంగమివ్వగలిగాను.
కొన్ని నెలల వరకు నేను పయినీరుగా సేవ చేసిన తర్వాత, నా క్రైస్తవ తటస్థ వైఖరి కారణంగా జైల్లో ఆరు నెలలు గడిపాను. దాని తర్వాత, గల్ఫ్ ఆఫ్ ఫిన్‌ల్యాండ్‌లోని హాస్టో బూసోయ్ అనే దీవిలో ఇతర యువ సాక్షులతో ఎనిమిది నెలలు కారాగార వాసం చేశాను. అక్కడ మేము బైబిలును చాలా శ్రద్ధగా పఠించే ప్రోగ్రామ్‌ను సంస్థీకరించుకున్నాం గనుక ఆ దీవిని లిటిల్ గిలియడ్ అని పిలిచాం. అయితే, నిజమైన గిలియడ్‌కు, అంటే, న్యూయార్క్‌లోని సౌత్ లాన్‌సింగ్‌కు సమీపాన ఉన్న వాచ్ టవర్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు హాజరవ్వాలన్నది నా లక్ష్యం.
మేము ఆ దీవిలో అప్పటికీ కారాగారవాసంలోనే ఉన్నప్పుడు, యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయమని ఆహ్వానిస్తున్న ఒక లేఖ వాచ్ టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ నుండి వచ్చింది. నేను విడుదలైన తర్వాత, ఫిన్‌ల్యాండ్‌లోని స్వీడిష్ భాష మాట్లాడే ప్రాంతంలోని సంఘాలను సందర్శించవలసి ఉండింది. ఆ సమయంలో, నాకు కేవలం 20 ఏండ్లే. నేను యోగ్యుడను కానని నాకనిపించింది. కాని నేను నమ్మకాన్ని యెహోవాయందుంచాను. (ఫిలిప్పీయులు 4:13) నేను సేవ చేసిన సంఘాల్లోని సాక్షులు చాలా మంచివారు. నేను కేవలం “బాలుడ”ను కదా అని వాళ్ళు నన్ను చిన్నచూపు చూడలేదు.—యిర్మీయా 1:7.
మరుసటి సంవత్సరం నేను ఒక సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు, అమెరికా నుండి ఫిన్‌ల్యాండ్‌కు సెలవులకు వచ్చిన లిన్డాను కలిశాను. ఆమె అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత, చాలా త్వరగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించింది. త్వరలోనే, ఆమె బాప్తిస్మం పొందింది. మేము 1957లో పెళ్ళి చేసుకున్నాం. తర్వాత, 1958 సెప్టెంబర్‌లో 32వ గిలియడ్ స్కూల్‌కు రమ్మంటూ మాకు ఆహ్వానం లభించింది. మా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతి ఫిబ్రవరిలో, మమ్మల్ని ఆగ్నేయ ఆఫ్రికాలోని న్యాసాల్యాండ్‌కు నియమించారు. అది ఇప్పుడు మలావీ అని పిలువబడుతుంది.
ఆఫ్రికాలో మా పరిచర్య
ఆఫ్రికా సహోదరులతో మేము బహిరంగ పరిచర్యలో పాల్గొనడమంటే మాకు చాలా ఇష్టం. న్యాసాల్యాండ్‌లో అప్పుడు సహోదరుల సంఖ్య 14,000 కన్నా ఎక్కువగా ఉండేది. ఒక్కోసారి, మేము మాకు అత్యవసరమైన వస్తువులనన్నింటినీ తీసుకుని ల్యాండ్ రోవర్‌లో ప్రయాణం చేసేవాళ్ళం. శ్వేతజాతీయులు ఎన్నడూ రాని గ్రామాల్లో మేము నివసించాం. ఆ గ్రామవాసులు మమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరించేవాళ్ళు. మేము గ్రామాన్ని చేరుకోగానే గ్రామీణులందరూ మమ్మల్ని కలిసేందుకు బిలబిలమంటూ వచ్చేవారు. ఎంతో నమ్రతగా పలకరించిన తర్వాత, వాళ్ళు నిశ్శబ్దంగా నేల మీద కూర్చుని మాతో పాటు పఠించేవారు.
తరచూ, గ్రామీణులు మాపై దయతో, మా కోసం ప్రత్యేకంగా ఒక పూరిల్లును కట్టేవారు. కొన్నిసార్లు మట్టితోను, కొన్ని తరహాల గడ్డితోనూ పూరిల్లు కట్టేవారు. అది సరిగ్గా ఒక పడక వేసుకోవడానికి మాత్రమే సరిపోయేది. రాత్రుల్లో సివంగులు పూరిళ్ళ దగ్గరికి మెరుపులాగ వచ్చి, సరిగ్గా మేము తల పెట్టుకునే వైపుకే వచ్చి బిగ్గరగా భయంకరంగా అరిచేవి. అయితే, న్యాసాల్యాండ్‌లోని సాక్షులు అడవి మృగాల కన్నా మరింత ప్రమాదకరమైన శక్తులను ఎదుర్కోబోతున్నారు.
జాతీయతావాదం ఒక వివాదమౌతోంది
ఆఫ్రికా అంతటిలోనూ, స్వాతంత్రోద్యమాలు రేకెత్తాయి. న్యాసాల్యాండ్‌లోని ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న ఏకైక రాజకీయ పార్టీలో చేరాలని ఎదురుచూడబడింది. అకస్మాత్తుగా, మా తటస్థ వైఖరి తీవ్రమైన జాతీయ వివాదంగా మారింది. అప్పుడు మా బ్రాంచ్ ఓవర్‌సీయర్ మాల్‌కమ్ వైగో అక్కడ లేనందువల్ల నేను ఆ ఆఫీస్ వర్క్‌ను చూసుకుంటున్నాను. అప్పుడు న్యాసాల్యాండ్ ప్రధానమంత్రియైన డా. హాస్టింగ్స్ కామూజూ బాన్‌డాతో మీటింగ్‌లు జరపాలని అభ్యర్థన చేసుకున్నాను. నేనూ, ఇద్దరు ఇతర క్రైస్తవ పెద్దలూ ఆయనకు మా తటస్థ దృక్పథాన్ని గురించి వివరించాం. ఆ మీటింగ్ స్నేహభావంతోనే ముగిసింది. ఇంత జరిగినప్పటికీ, దాదాపు ఒక నెల తర్వాత, 1964 ఫిబ్రవరిలో ఎలాటన్ మ్వాచాండ్ పీడించబడి మొదట మరణించిన వ్యక్తి అయ్యాడు—కోపోద్రేకంతో ఊగిపోయిన జనసమూహం ఆయనను పొడిచి చంపింది. ఆతని గ్రామంలోని మిగతా సాక్షులు ఆ గ్రామం వదిలిపెట్టి పారిపోవడాన్ని తప్పనిసరి చేసింది.
తన అధికారాన్ని ఉపయోగించి అలాంటి హింసను ఆపించమని కోరుతూ మేము డా. బాన్‌డాకు టెలిగ్రామ్ పంపించాం. నన్ను రమ్మని చెబుతూ, త్వరలోనే ప్రధానమంత్రి కార్యాలయం నుండి నాకు పిలుపు వచ్చింది. డా. బాన్‌డాను కలవడానికి హరోల్డ్ గై అనే మరొక మిషనరీని, అలెక్సాండర్ మాఫామ్‌బానా అనే ఒక స్థానిక సాక్షినీ వెంట తీసుకుని వెళ్ళాను. ఇద్దరు ప్రభుత్వ మంత్రులు కూడా అక్కడ విచ్చేసి ఉన్నారు.
మేము కూర్చున్న వెంటనే, డా. బాన్‌డా ఏ మాట పలకకుండా, ఆ టెలిగ్రామ్‌ను కొంచెం పైకెత్తి పట్టుకుని ముందుకు వెనుకకు త్రిప్పడం మొదలుపెట్టారు. చివరికి, ఆయన నిశ్శబ్దాన్ని చీలుస్తూ, “మిస్టర్ యోహాన్‌సన్, మీరు ఇలాంటి టెలిగ్రామ్‌ను పంపించడంలో మీ ఆంతర్యమేమిటి?” అని అడిగారు. మేము మరొకసారి రాజకీయసంబంధంగా మా తటస్థ వైఖరిని వివరిస్తూ, “ఇప్పుడు, ఎలాటన్ మ్వాచాండ్ హత్యను పరిగణనలోనికి తీసుకుంటే, మాకు సహాయం చేయగల ఏకైక వ్యక్తి మీరే” అని చెప్పాను. అది డా. బాన్‌డాను సంతృప్తిపరచినట్లు అనిపించింది. ఆయన కాస్త శాంతించినట్లు అనిపించింది.
అయినప్పటికీ, ఒక సుదూర గ్రామంలోని సాక్షులు స్థానిక అధికారులతో సహకరించడంలేదని అక్కడ హాజరైన ఒక మంత్రి చెప్పారు. రెండవ మంత్రి కూడా ఏదో సుదూర గ్రామాన్ని పేర్కొంటూ, డా. బాన్‌డా గురించి సాక్షులు అగౌరవంగా మాట్లాడారని నిందమోపాడు. అయితే, ఆ విధంగా ప్రవర్తించినవారి పేర్లను వాళ్ళు చెప్పలేకపోయారు. ప్రభుత్వ అధికారులను ఎల్లప్పుడూ గౌరవించాలనే యెహోవాసాక్షులకు నేర్పించబడుతుందని మేము వివరించాం. విచారకరంగా, డా. బాన్‌డాకు, ఆయన మంత్రులకు కల్గిన తప్పుడు అభిప్రాయాలను సరిచేయాలన్న మా ప్రయత్నం సఫలం కాలేదు.
మా ప్రాణాలు అపాయంలో ఉన్నాయి
1964లో, న్యాసాల్యాండ్ స్వాతంత్ర్యాన్ని పొందింది. తర్వాత అది రిపబ్లిక్ ఆఫ్ మలావీ అయ్యింది. మా ప్రకటనా పని మామూలుగా జరిగింది. కానీ ఒత్తిడి అంతకంతకు పెరిగింది. ఈ సమయంలో, దేశపు దక్షిణ ప్రాంతంలోని సాక్షులు ఫోన్ చేసి, అక్కడ రాజకీయ తిరుగుబాటు తలెత్తిందని చెప్పారు. అక్కడి సాక్షుల పరిస్థితిని మదింపు చేసుకుని, కావలసిన నైతిక మద్దతునిచ్చేందుకు, ఒకరు అక్కడికి వెంటనే వెళ్ళవలసిన అవసరముందని మేము గ్రహించాం. మునుపు నా అంతట నేనుగా పొదల మాటున కొన్నిసార్లు వెళ్ళి వచ్చాను. లిన్డా దానిని ధైర్యంగా అంగీకరించింది. అయితే ఈసారి, స్థానిక యువ సాక్షియైన లోయిడ్ లిక్‌వైడ్‌ను వెంట తీసుకువెళ్ళమని లిన్డా నన్ను ప్రాధేయపడింది. ‘ఇది ఆమెను సంతోషపరచేటట్లయితే, అలాగే చేస్తాను’ అని అనుకుని, చివరికి అందుకు అంగీకరించాను.
సాయంకాలం ఆరు గంటలకు కర్ఫ్యూ ఆరంభించకముందే, మేము ఫలాని నదిని దాటాలని మాకు చెప్పబడింది. ఆ సమయానికెల్లా ఆ పడవను ఎక్కడానికి మేము ప్రయత్నించాం. కానీ, రోడ్లు బాగోకపోవడం వల్ల ఆలస్యమైపోయింది. నదీ తీరాన సాయంత్రం ఆరు గంటల తర్వాత మేమున్న వైపున ఎవరు కనిపించినా వారిని కాల్చి చంపేయమని ఆజ్ఞాపించబడిందన్న విషయాన్ని తర్వాత మాత్రమే తెలుసుకున్నాం. మేము నదివైపుగా ప్రయాణిస్తుండగా, పడవ అప్పటికే, నది అవతలి భాగాన్ని చేరుకోవడాన్ని చూశాం. వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్ళమని సహోదరుడు లిక్‌వైడ్ ఆ పడవవారిని అడిగాడు. అది వచ్చింది. కానీ ఆ పడవలో ఉన్న సైనికుడు, “నేను ఆ తెల్లవాడ్ని చంపాలి !” అని వెనుక నుండి అరిచాడు.
ఆయన ఊరికే బెదిరించడానికే అలా అన్నాడని మొదట అనుకున్నాను. కానీ పడవ దగ్గరికి వచ్చాక, ఆ పడవ లైట్ల వెలుతురులో నిలబడమని సైనికుడు నాకు ఆజ్ఞాపించాడు. ఆఫ్రికా దేశస్థుడైన నా స్నేహితుడు మా ఇద్దరి మధ్యలోకి దూసుకుని వచ్చి, నన్ను బదులు తనను కాల్చి చంపమని కోరింది అప్పుడే. నా కోసం తను చనిపోవడానికి ఆయన చూపించిన సుముఖతను చూసి ఆయన చలించిపోయాడనుకుంటా. అందుకే ఆ సైనికుడు తన రైఫిల్‌ను క్రిందికి దించాడు. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అన్న యేసు మాటలు నా మనస్సులో మెదిలాయి. (యోహాను 15:13) ఆ ప్రియ సహోదరుడ్ని వెంట తీసుకువెళ్ళమని లిన్డా ఇచ్చిన సలహాను పాటించినందుకు నేనెంతగా సంతోషించానో చెప్పలేను!
మరుసటి రోజు, లిక్‌వైడ్ సహోదరుడి పార్టీ సభ్యత్వ కార్డును చూడాలని డిమాండ్ చేసిన యువకులు బ్లాన్‌టైర్‌కు తిరిగివెళ్ళే రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు. ఇక చేయగల్గింది ఒక్కటే—అతివేగంగా వాళ్ళ మధ్య నుండి దూసుకుపోవడమే! నేను గియర్ మార్చి కారును అతి వేగంగా దూకించడంతో, జరుగుతున్నది ఏమిటో అర్థంకాని అయోమయంలో వాళ్ళు పడిపోయారు. దాన్నే అదనుగా తీసుకుని, అక్కడి నుండి వచ్చేయగలిగాం. జనాలు లిక్‌వైడ్ సహోదరుడ్ని పట్టుకుని ఉంటే, అది ఆయన అంతమై ఉండేది. మేము బ్రాంచ్ ఆఫీస్‌కు తిరిగి చేరుకున్నాక కూడా మేమిద్దరమూ చాలా వణికిపోతున్నాం. కానీ యెహోవా మమ్మల్ని కాపాడినందుకు మేము కృతజ్ఞులం.
తమ విశ్వాసం విషయమై జైలులో వేయబడ్డారు
1967 అక్టోబర్‌లో మలావీలో మా పని అధికారికంగా నిషేధించబడింది. అప్పట్లో దేశంలో దాదాపు 18,000 మంది సాక్షులు ఉండేవారు. రాజధానియైన లయోంగ్‌వేలో 3,000 మంది సాక్షులు జైలులో వేయబడ్డారని రెండు వారాల తర్వాత మాకు తెలిసింది. ఆ రాత్రే అక్కడికి, 190 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళి వాళ్ళకు కనీసం నైతిక మద్దతునివ్వాలని మేము నిర్ణయించుకున్నాం. మేము ల్యాండ్ రోవర్‌లో వాచ్‌టవర్ ప్రచురణలను నింపుకున్నాం. రోడ్‌బ్లాక్‌లనన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాం. యెహోవా కృప వలన మమ్మల్ని ఎవరూ తనిఖీ చేయలేదు. రోడ్డు మీద వెళ్తూ, వెళ్తూ దారి పొడవునా ఉన్న ఒక్కొక్క సంఘానికీ, సమయోచిత ఆధ్యాత్మిక ఆహారం గల కార్టన్‌లను చేరవేశాం.
మేము ఉదయాన జైలు దగ్గరకు వెళ్ళాం. ఏమి సన్నివేశమది ! రాత్రంతా వర్షం పడింది. మన సహోదర సహోదరీలను కంచెవేసిన కాంపౌండ్‌లో ఆరుబయట నిలబెట్టేశారు. వాళ్ళు తడిసి ముద్దయ్యారు. కొందరు తమ కంబళులను కంచె మీద ఆరవేసుకుంటున్నారు. మేము ఆ కంచె మీదుగా కొందరితో మాట్లాడగలిగాం.
మధ్యాహ్నం వాళ్ళ విచారణ జరిగింది. సాక్షులమని చెప్పుకున్న అనేకులు బోనులో నిలబడ్డారు. మేము వాళ్ళ కళ్ళతో కళ్ళు కలపాలని ప్రయత్నించాం. కాని వాళ్ళ ముఖభావాల్లో ఎలాంటి మార్పూ కన్పించలేదు. బోనులో ఉన్నవాళ్ళందరూ తమ విశ్వాసాన్ని త్యజించారు! అది మాకు దిగులు కలిగించింది. అయితే, తాము సాక్షులం కామని చెప్పుకున్నదెవరో స్థానిక యెహోవాసాక్షులకు ఎవరికీ కూడా తెలియదని నాకు తర్వాత తెలిసింది. అది యథార్థ క్రైస్తవులను నిరుత్సాహపర్చేందుకు పన్నిన పన్నాగం అని స్పష్టం.
ఇంతలో, మేము ప్రవాసులముగా వెళ్ళిపోవాలని ఆజ్ఞ జారీచేయబడింది. బ్లాన్‌టైర్‌లోని మా బ్రాంచ్ ఆఫీస్ జప్తు చేయబడింది. మిషనరీలు దేశాన్ని విడిచివెళ్ళేందుకు 24 గంటల గడువు ఇచ్చారు. మేము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ మా కోసం గేట్ తెరవడం ఎంత వింతైన విషయం! మరుసటి రోజు మధ్యాహ్నం, పోలీస్ అధికారి వచ్చి, కాస్త బాధపడుతూనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఏర్‌పోర్ట్‌కు తీసుకువెళ్ళాడు.
మలావీలోని మన క్రైస్తవ సహోదరులు విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నారని తెలుసుకుని 1967 నవంబరు 8న మేము ఆ దేశాన్ని విడిచి పెట్టాం. వారి విషయమై మాకు కలిగిన హృదయ వేదన అంతా ఇంతా కాదు. డజన్ల కొలది మంది తమ ప్రాణాలను కోల్పోయారు; వందలాది మంది క్రూరమైన వేధింపులను అనుభవించారు; వేలాది మంది తమ ఉద్యోగాలనూ, ఇండ్లనూ, ఆస్తులనూ కోల్పోయారు. అయినప్పటికీ, దాదాపు అందరూ తమ యథార్థతను కాపాడుకున్నారు.
క్రొత్త నియామకాలకు వెళ్ళడం
ఇన్ని కష్టాలు పడినప్పటికీ, మేము మిషనరీ పనిని వదిలిపెట్టవలసిన పరిస్థితి రాలేదు. బదులుగా, మేము క్రొత్త నియామకాన్ని అంగీకరించాం—వైవిధ్యంగల దృశ్యాలూ మనుష్యులూ గల దేశమైన కెన్యాకు వెళ్ళడమే ఆ నియామకం. మాసై ప్రజలను చూసి లిన్డా చాలా ముగ్ధురాలైంది. ఆ సమయంలో, మాసై ప్రజల్లో యెహోవాసాక్షులైనవారు ఎవరూ లేరు. కానీ తర్వాత, లిన్డా మాసై స్త్రీయైన డార్కాస్‌ను కలిసి, ఆమెతో బైబిలు పఠించనారంభించింది.
ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. దేవుడ్ని ప్రీతిపరచాలంటే, ఆమె తన వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని ఆమెకు తెలుసు. కాని తన పిల్లల తండ్రి అందుకు నిరాకరించాడు కనుక, డార్కాస్ తన పిల్లలను తనే పెంచడానికి ప్రయత్నించింది. ఆ మనిషికి సాక్షుల మీద కోపం వచ్చింది. కాని ఆయన తన కుటుంబం నుండి వేరుగా ఉన్నందుకు సంతోషంగా ఉండలేకపోయాడు. చివరికి, డార్కాస్ ప్రేరణతో, ఆయన కూడా యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించాడు. ఆయన తన జీవితాన్ని సరిదిద్దుకుని సాక్షి అయ్యాడు. డార్కాస్‌ను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె పయినీర్ అయ్యింది. ఆమె భర్తా, ఆమె పెద్ద కొడుకూ ఇప్పుడు సంఘ పెద్దలుగా సేవచేస్తున్నారు.
అకస్మాత్తుగా, 1973లో కెన్యాలో యెహోవాసాక్షుల పని నిషేధించబడింది. మేము అక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. కేవలం కొన్ని నెలల తర్వాత, ఆ నిషేధం ఎత్తివేయబడింది. కాని, అప్పటికెల్లా మాకు మూడవ నియామకం అందింది—అదే కాంగో (బ్రాజావిల్). మేము 1974 ఏప్రిల్‌లో అక్కడికి చేరుకున్నాం. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, మిషనరీలమైన మేము గూఢాచారులమని మాపై నింద మోపారు. మా పని నిషేధించబడింది. దానికి తోడు, బ్రాజావిల్ ప్రెసిడెంట్ హత్య చేయబడిన తర్వాత దేశంలో పోరాటాలు మొదలయ్యాయి. మిగతా మిషనరీలందరూ వివిధ దేశాలకు నియమించబడ్డారు. కానీ సాధ్యమైనంత కాలం మమ్మల్ని అక్కడే ఉండిపొమ్మని చెప్పారు. అనేక వారాలు మేము మరుసటి రోజును చూస్తామో లేదో అనుకుంటూ నిద్రకుపక్రమించేవాళ్ళం. కానీ మమ్మల్ని మేము యెహోవా రక్షణలో ఉంచుకుని బాగానే నిద్రపోయేవాళ్ళం. బహుశా మా విశ్వాసాన్ని అత్యధికంగా పరీక్షించిన సమయం బ్రాంచ్ ఆఫీస్‌లోనే ఉన్న ఆ కొన్ని నెలలే కావచ్చు. అలాగే మా మిషనరీ సేవ కాలంలో మునుపెన్నడూ లేనంత విశ్వాసాన్ని బలపరచిన సమయం.
1977 ఏప్రిల్‌లో మేము బ్రాజావిల్‌ను వదిలిపెట్టవలసి వచ్చింది. అప్పుడు నిజమైన ఆశ్చర్యం కలిగింది. మేము ఇరాన్‌లో క్రొత్త బ్రాంచ్ ఆఫీస్‌ను స్థాపించడానికి నియమించబడ్డాం. మా మొదటి సవాలు పర్షీయా భాషయైన పార్శీని నేర్చుకోవడానికి శ్రమ తీసుకోవాలన్నదే. మేము క్రొత్త భాషను నేర్చుకుంటున్నాం గనుక సంఘాల్లో చిన్నపిల్లలు ఇచ్చే అతి సరళమైన వ్యాఖ్యానాలనే మేము ఇవ్వగలిగాం! 1978లో ఇరాన్‌లో ప్రభుత్వం మారనారంభించింది. మేము అతి చెడ్డ పోరాటాల నడుమ కూడా బ్రతికిపోయాం. కాని 1980 జూలైలో మమ్మల్ని మిషనరీలనందరినీ బహిష్కరించేశారు.
మా ఐదవ నియామకం మమ్మల్ని తిరిగి మధ్య ఆఫ్రికాలోని జైర్‌కు తీసుకువెళ్ళింది. అది ఇప్పుడు డెమాక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని పిలువబడుతుంది. మేము జైర్‌లో 15 సంవత్సరాలు సేవ చేశాం. కొంత కాలం నిషేధంలో కూడా సేవ చేశాం. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ దేశంలో దాదాపు 22,000 మంది సాక్షులు క్రియాశీలంగా ఉండేవాళ్ళు—ఇప్పుడు అక్కడ 1,00,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు!
మళ్ళీ ఇంటికి!
1993 ఆగస్టు 12న, మలావీలోని యెహోవాసాక్షుల నిషేధం ఎత్తివేయబడింది. రెండు సంవత్సరాల తర్వాత, నేనూ లిన్డా మిషనరీ సేవను ఎక్కడ ప్రారంభించామో అక్కడికి, మలావీకి, ద వామ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని పిలువబడే అందమైన స్నేహశీలమైన దేశానికి నియమించబడ్డాం. 1996 జనవరి నుండి మలావీలో సంతోషంగా శాంతియుతంగా ఉండే ప్రజల మధ్య పనిచేయడంలో ఆనందిస్తున్నాం. మేము నమ్మకస్థులైన మలావీ సహోదరులతో మరోసారి సేవచేయడమనేది చాలా అమూల్యమైన విషయంగా ఎంచుతాం. వారిలో అనేకులు మూడు దశాబ్దాలపాటు పీడింపును సహించారు. మా ఆఫ్రికా సహోదరులు ఉత్సాహ వనరులుగా ఉన్నారు. మాకు వాళ్ళంటే చాలా ప్రేమ. “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని” పౌలు చెప్పిన మాటలను వాళ్ళు ఖచ్చితంగా అనుసరించారు. (అపొస్తలుల కార్యములు 14:22) మలావీలో ఉన్న దాదాపు 41,000 మంది సాక్షులు ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నారు. చాలా పెద్ద సమావేశాలను జరుపుకుంటున్నారు.
మేము మా నియామకాలను అన్నింటినీ చాలా బాగా ఆస్వాదించాం. ఏ అనుభవమైనా, ఎంత కఠినమైనదైనా సరే, మనం “యెహోవాయందు ఆనందించుట”లో కొనసాగితే అది మనలను మరింత మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దగలదని నేనూ లిన్డా నేర్చుకున్నాం. (నెహెమ్యా 8:10) మేము మా నియామకాలను వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు సర్దుకోవడం నాకు కాస్త కష్టంగా ఉండేది. కాని దేనికైనా సర్దుకుపోయే లిన్డా స్వభావమూ—ముఖ్యంగా, యెహోవా మీద ఆమెకున్న గట్టి విశ్వాసమూ నాకు సహాయపడ్డాయి. “మంచి భార్య” ఉండడంవల్ల కలిగే ఆశీర్వాదాలను గుణగ్రహించేలా చేశాయి.—సామెతలు 18:22, NW.
మేము ఎంత సంతోషకరమైన, ఉత్తేజకరమైన జీవితాన్ని గడిపామో! యెహోవా తన రక్షణ హస్తాన్ని ఇచ్చినందుకు ఆయనకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (రోమీయులు 8:31) పూర్తికాల పరిచర్యవల్ల వచ్చే ఆశీర్వాదాలను గురించి నేను ప్రసంగం ఇచ్చి, నాలుగు దశాబ్దాల కన్నా ఎక్కవే అయ్యింది. మేము ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొన్నందుకు’ చాలా ఆనందిస్తున్నాం. (కీర్తన 34:8; మలాకీ 3:10) ‘మనం ఇకమీదట మన కోసం జీవించకపోవడ’మే అన్నింటికన్నా శ్రేష్ఠమైన జీవితమని మాకు రూఢి అయ్యింది.
[23వ పేజీలోని బాక్సు/చిత్రం]
మేము సేవ చేసిన దేశాలు
ఇరాన్
రిపబ్లిక్ ఆఫ్ కాంగో
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
కెన్యా
మలావీ
[20వ పేజీలోని చిత్రం]
దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్ గుండా మలావీకి మేము వెళ్తున్నాం
[22వ పేజీలోని చిత్రం]
మమ్మల్ని అరెస్ట్ చేసి దేశాంతరం పంపించినప్పుడు
[24వ పేజీలోని చిత్రం]
మాసై ప్రజల్లో ఒకరైన డార్కాస్, తన భర్తతో