భద్రతగల జీవితానికై అన్వేషణ
భద్రతను గూర్చి వివిధ రకాల ప్రజలు వివిధ రకాల భావాల్ని కలిగివున్నారు. ఒక వ్యక్తి భద్రత అంటే ఉద్యోగం అనుకుంటాడు, మరో వ్యక్తి సంపద అనుకుంటాడు, ఇంకొక వ్యక్తి నేరాలు లేని సమాజమే భద్రత అనుకుంటాడు. మరి మీరేమనుకుంటారు?
ఏమనుకున్నాగానీ, మీ జీవితం కావల్సినంత భద్రంగా ఉండేందుకు మీరు నిస్సందేహంగా చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత భద్రత కోసం యూరోప్‌లోని ప్రజలు ఏమి చేస్తున్నారో పరిశీలించండి.
ఉన్నత విద్య
యూరోపియన్ కమీషన్ అధ్యక్షుడైన జాక్ సాంటే అభిప్రాయం ప్రకారం, యూరోపియన్ యూనియన్‌లో 20 శాతం మంది యౌవనస్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. కాబట్టి, ఆ వయస్సులోని యౌవనులకు, నా జీవితాన్ని భద్రంగా ఉంచే ఉద్యోగాన్ని నేనెలా సంపాదించగలను? అన్న ఒక్క ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఆ లక్ష్యాన్ని ఉన్నత విద్య ద్వారా సాధించవచ్చని చాలామంది నమ్ముతారు, అది విద్యార్థికి “ఉద్యోగావకాశాల్ని ఎక్కువ చేస్తుంది” అని లండన్ వార్తాపత్రిక ది సండే టైమ్స్ వ్యాఖ్యానించింది.
ఉదాహరణకు జర్మనీలో నాసాయిషే నాయి ప్రెస్సి అనే వార్తాపత్రిక తెలుపుతున్నదాని ప్రకారం, “జర్మనీలో విద్య అన్నా విద్యాస్థాయి అన్నా ఉన్న మక్కువ మునుపటిలాగానే ఎంతో అధికంగా ఉంది.” ఆ దేశంలో ఒక విద్యార్థికి విశ్వవిద్యాలయ చదువును ముగించడానికి సగటున 22 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ ఆ కోరిక అధికంగానే ఉంది.
కష్టపడి విద్యను సముపార్జిస్తూ, ఉద్యోగ భద్రత కోసం ప్రయత్నించే యౌవనులను మెచ్చుకోవల్సిందే. అంతేకాదు మంచి నైపుణ్యాలు, అర్హతలు ఉన్నవారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఉన్నత విద్య అన్ని సందర్భాల్లోనూ ఉద్యోగ భద్రతను ఇస్తుందా? ఒక విద్యార్థిని “నా కోర్సు ఖచ్చితమైన వృత్తిని, భద్రతను ఇవ్వదని నాకు మొదట్నుంచీ తెలుసు” అని చెప్పింది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేది ఆమె మాత్రమే కాదు. ఇటీవల ఒక సంవత్సరంలో, జర్మనీలో నిరుద్యోగులైన విశ్వవిద్యాలయ పట్టా పొందిన విద్యార్థుల సంఖ్య అత్యధిక స్థాయిని చేరుకుంది.
ఫ్రాన్స్‌లో, నిరుద్యోగులుగా ఉన్న యౌవనులు అధికంగా ఉండడంవల్ల వారు హైస్కూల్ చదువుకు విలువ లేదని గుర్తించి విశ్వవిద్యాలయాలకు హాజరవుతున్నారు అని ఒక వార్తాపత్రిక తెలియజేస్తుంది. అయినప్పటికీ, చాలామంది విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత, “తమ చేతిలో పట్టా తప్ప మరేమీ మిగలడం లేదని” గ్రహిస్తున్నారు. “విద్యా జీవితంలోని ఒత్తిడులు విద్యార్థులపై దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి” అని బ్రిటన్‌లోని ది ఇండిపెండెంట్ అనే వార్తాపత్రిక తెలియజేస్తుంది. జీవితంలో అభద్రతా భావాలతో పోరాడటానికి విద్యార్థులకు సహాయం చేయాల్సింది పోయి విశ్వవిద్యాలయ జీవితం కొన్నిసార్లు కృంగుదలకు, ఆందోళనలకు, ఆత్మగౌరవం లేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తోంది అని నివేదికలు చెబుతున్నాయి.
విశ్వవిద్యాలయ డిగ్రీ సంపాదించడంకన్నా, ఏదైనా వృత్తివిద్యను నేర్చుకోవడమో లేక ఏవైనా వస్తువులను తయారుచేసే రంగంలో నైపుణ్యం సంపాదించడమో చేస్తే ఉద్యోగం లభించే అవకాశాలు సాధారణంగా ఎక్కువ ఉంటాయి.
10,000 వస్తువులు సరిపోతాయా?
చాలామంది భద్రతగల జీవితానికి రహస్యం సంపద అని తలుస్తారు. అలా తలంచడం జ్ఞానయుక్తంగానే కనిపించవచ్చు, ఎందుకంటే మంచి బ్యాంకు బ్యాలెన్సు ఉండడంవల్ల అత్యవసర పరిస్థితుల్లో సహాయపడుతుంది. బైబిలు ఇలా తెలియజేస్తుంది: “ద్రవ్యము ఆశ్రయాస్పదము.” (ప్రసంగి 7:12) అయినప్పటికి, అధిక సంపద అన్ని సందర్భాల్లోనూ అధిక భద్రతను ఇస్తుందా?
అలా కానవసరం లేదు. గతించిన 50 సంవత్సరాల్లో పెరిగిన సంపదను పరిశీలించండి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేటప్పటికి, జర్మన్ ప్రజలలో అధిక శాతంమంది దగ్గర దాదాపుగా ఏమీ లేదు. ఈరోజు, సగటు జర్మన్ దేశస్థుడికి 10,000 వస్తువులు ఉన్నాయి అని ఒక జర్మన్ వార్తాపత్రిక తెలియజేస్తుంది. ఆర్థిక అంచనాల లెక్క నిజమైతే, భవిష్యత్ తరాలవాళ్ళు అంతకంటే ఎక్కువే కలిగి ఉంటారు. కానీ ఈ ధన సేకరణ జీవితాన్ని మరింత భద్రంగా చేయగలదా? లేదు. 20 లేక 30 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు అతి తక్కువ భద్రత ఉందని ప్రతి ముగ్గురిలో ఇద్దరు భావిస్తున్నట్లుగా జర్మన్‌లోని ఒక సర్వే తెలియజేసింది. కనుక, సంపద విపరీతంగా పెరగడం ప్రజలు మరింత భద్రతగా భావించేలా చేయలేదు.
ఇది అర్థం చేసుకొనదగినదే ఎందుకంటే, గత శీర్షికలో చర్చించినట్లుగా అభద్రతా భావం అనేది భావోద్రేకపరమైన భారం. అందుకని వస్తుసంపదవల్ల మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా విడుదల పొందలేము. నిజమే, పేదరికంవల్ల వచ్చే కష్టాలనుండి సంపద కాస్త కాపుదలను ఇస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో, డబ్బు తక్కువగా కలిగి ఉండటం ఎన్ని బాధల్ని తెస్తుందో, అధికంగా కలిగివుండడం అంత ఎక్కువ సమస్యల్ని తెస్తుంది.
అందువల్ల, వస్తుసంపద పట్ల సమతూక దృక్పథాన్ని కలిగివుండడం, సంపద ఒక ఆశీర్వాదమే కానీ అది భద్రత గల జీవితానికి మూలకారకం కాదు అనే విషయాన్ని మనస్సులో ఉంచుకొనేందుకు సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఇలా చెప్పి వారిని ప్రోత్సహించాడు: “ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కా[దు].” (లూకా 12:15) సంపూర్ణ భద్రతను కలిగివున్నట్లు భావించాలంటే, ఒక వ్యక్తికి వస్తుసంబంధ సంపద కంటే ఎక్కువే అవసరం.
వృద్ధులకైతే, వారి దగ్గర ఉన్న వస్తువులంటే వారికి ఉన్న ఇష్టం వాటి విలువ మూలాన కాదుగాని సెంటిమెంటు మూలానే. అయితే, వృద్ధులకు చింతను కలిగించేది సంపద కాదుగాని ఏదైనా నేరానికి బలి అవుతామేమోనన్న భయమే.
అప్రమత్తంగా ఉండండి!
బ్రిటన్‌లో ప్రచురించబడిన నేరాన్ని నివారించడానికి ఆచరణయోగ్యమైన విధానాలు (ఆంగ్లం) అనే బుక్‌లెట్ చెబుతున్నదాని ప్రకారం “గత 30 సంవత్సరాల్లో నేరం . . . ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సమస్యగా ఉంది.” పోలీసు దళాలు తమ యథాశక్తితో పనిచేస్తున్నాయి. కొంతమంది ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారు.
వ్యక్తిగత భద్రత ఇంటినుండి మొదలవుతుంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌లో ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఆయన సురక్షితమైన తాళాలు, పటిష్టమైన తలుపులు, చువ్వల కిటికీలను తయారుచేస్తూ దొంగలు చొరబడలేని విధంగా ఉండేలా ఇండ్లను డిజైన్ చేస్తాడు. ఈ ఇండ్ల యజమానులు “నా ఇల్లే నా కోట” అనుకునేలా ఉంటాయి. ఫోకస్ అనే వార్తాపత్రిక ప్రకారం ఈ గృహాలు చాలా ఖరీదైనవి కానీ డిమాండ్ అధికంగా ఉంది.
ఇంటా, బయటా వ్యక్తిగత భద్రతను పెంచేందుకు కొన్ని దేశస్థుల వాళ్లు తమ ప్రాంతాలను పహారా కాసే పథకాల్ని వేశారు. మరి కొన్ని శివార్లలో నివాసులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు, తమ ప్రాంతాన్ని ఫలాని గంటల్లో పహారా కాసేందుకు భద్రతా కంపెనీలకు డబ్బు చెల్లిస్తున్నారు. నిర్మానుష్యమైన పట్టణ వీధుల్లో రాత్రిపూట ఒంటరిగా నడవడం అంత జ్ఞానయుక్తమైనది కాదని చాలామంది భావిస్తారు. సహజంగా తమ పిల్లల సంక్షేమాన్ని గురించి ఆలోచించే తల్లిదండ్రులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ పేజీలో ఉన్న బాక్సులోని సూచనలను పరిశీలించండి.
దొంగలు చొరబడలేని ఇండ్లు కొనుక్కునే తాహతు అందరికీ ఉండదు. అంతేకాక, చుట్టుప్రక్కల ప్రాంతాలను పహారా కాసే పథకాల వల్ల, భద్రతా కంపెనీలకు డబ్బు చెల్లించే పద్ధతుల వల్ల నేరం పూర్తిగా తీసివేయబడదు; రక్షణ అంతగా లేని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువ కావచ్చు. అందుకని, వ్యక్తిగత భద్రతకు నేరం ఇప్పటికీ ముప్పుగానే ఉంది. మనం భద్రతగల జీవితాల్ని గడిపేందుకు, నేరాన్ని నిర్మూలించేందుకైన ప్రయత్నాలు మాత్రమే సరిపోవు.
రోగలక్షణాలకు కాదు—రోగానికి వైద్యం
వ్యక్తిగత భద్రత మనందరి సహజ కోరిక కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరేందుకు, మనం సహేతుకమైన, ఆచరణయోగ్యమైన చర్యలు తీసుకోవడం మంచిది. కానీ నేరము, నిరుద్యోగము, ఇంకా మన జీవితాన్ని భద్రత లేకుండా చేసే మిగతా లక్షణాలన్నీ మానవజాతిని ప్రభావితం చేస్తున్న ఒక స్థితి యొక్క లక్షణాలు మాత్రమే. ఈ స్థితిని నివారించేందుకు రోగ లక్షణాలపై కాక మూలకారణానికి చికిత్స చేయాలి.
మన జీవితాల్లోని భద్రతాలేమికి మూల కారణం ఏమిటి? మన జీవితాల్లో భద్రతను ఎలా నింపుకోగలం? తద్వారా భద్రతాలేమిని పూర్తిగా ఎలా తీసివేయగలము? ఇవి తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
[6వ పేజీలోని బాక్సు]
చిన్న పిల్లల్ని కాపాడే మార్గాలు
చిన్న పిల్లలపై దాడులు, అపహరణలు, హత్యలు తరచుగా సంభవించడం వల్ల, తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ క్రిందివి చెప్పడం ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించారు:
1. తమకు చెడ్డపని అనిపించిన పని ఎవరైనా చేయమని చెబితే చేయను అని ఖండితంగా చెప్పాలి.
2. తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పుడు తప్పించి—డాక్టర్ లేక నర్స్ విషయంలో తప్పించి—మరింకెవ్వరూ తమ ఆంతరంగిక శరీర భాగాలను ముట్టేందుకు అనుమతించకూడదు.
3. ప్రమాదంలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్లిపోవడమో, అరవడమో, లేక దగ్గరున్న పెద్దవారి సహాయాన్ని కోరడమో చేయాలి.
4. పిల్లలకు ఇబ్బందిగా ఉన్న ఏ సంఘటన అయినా, లేక సంభాషణ అయినా తల్లిదండ్రులకు చెప్పాలి.
5. తల్లిదండ్రుల దగ్గర ఏమీ దాచకూడదు.
చివరిగా, తమ పిల్లలదగ్గర ఎవర్నైనా ఉంచేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంచాలి.
[5వ పేజీలోని చిత్రాలు]
మన జీవితాలు భద్రతతో ఉండాలంటే, మనకు విద్య, సంపద, లేక నేరాన్ని పూర్తిగా తొలగించడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే చాలవు