భద్రతాలేమి—ఒక విశ్వవ్యాప్త సమస్య
మీ జీవితం, జీవిత విధానం అపాయాల్లో, అనిశ్చయతల్లో ఉన్నట్లు మీరెప్పుడైనా భావించారా? అయితే అలా భావించేది మీరు మాత్రమే కాదు. కోట్లాదిమంది ఇతరులు కూడా అలానే భావిస్తున్నారు. ఈ అభద్రతా భావం జాతీయ, మత, సాంఘిక హద్దులు లేకుండా మాస్కో నుండి మన్హాటన్ వరకు ఒక తెగులులా వ్యాపిస్తోంది.
మన జీవితాల్లో భద్రత లేదని మనకు అనిపించినప్పుడు మనం “భయం, చింత ఆవరించినట్లు భావిస్తాము” అని ఒక నిఘంటువు తెలియజేస్తుంది. చింత అనేది భావోద్వేగపరమైన భారం, అది ఒత్తిడిని కలుగజేసి ఆరోగ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అయితే మనం అభద్రతగానూ, వ్యాకులతతోను ఉన్నట్లు ఎందుకు భావిస్తున్నాము?
యూరోప్‌లోని చింతలు
యూరోపియన్ యూనియన్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు దారిద్ర్యరేఖ దిగువన జీవిస్తున్నారు, కోటి ఎనభై లక్షల మంది నిరుద్యోగులుగానూ, మరి అనేకులు తాము తమ ఉద్యోగం కోల్పోతారేమో అనే భయంతోనూ జీవిస్తున్నారు. చాలా యూరోపియన్ యూనియన్ దేశాల్లో శిశుకాముకులవల్ల (పిడోఫైల్స్) తమ పిల్లలకు సంభవించగల ప్రమాదం విషయంలో తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఒక యూరోపియన్ యూనియన్ దేశంలో, ప్రతి ముగ్గురిలో ఇద్దరు నేరాన్ని గూర్చి వ్యాకులపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగే విధ్వంసకాండలవల్ల, ఉగ్రవాదాలవల్ల, కాలుష్యంవల్ల అనేకమంది యూరోపియన్ యూనియన్ నివాసులు కలవరపడుతున్నారు.
జీవితం, జీవనాధారం అటువంటి సాంఘిక పరమైన వక్రతల వల్ల మాత్రమే అపాయంలో లేవు. ప్రకృతి విపత్తుల వల్ల కూడా అపాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకు, 1997 మరియు 1998 సంవత్సరాల్లో కుంభవృష్టిగా కురిసిన వర్షాలవల్ల, కొండచరియలు విరిగి పడడంవల్ల, సుడిగాలులవల్ల అమెరికాలో కొన్ని ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ఓడర్, నైసా నదులు ఉప్పొంగడం వల్ల మధ్య యూరోప్‌లో 1997లో వరదలు సంభవించాయి. పోలాండ్లోని పాలిటికా అనే వారపత్రిక ప్రకారం, 86 నగరాలు పట్టణాలు, దాదాపు 900 గ్రామాలతోపాటు పెద్ద విస్తీర్ణంలోని వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యాయి. దాదాపు 50,000 కుటుంబాలు తమ పంటల్ని కోల్పోయాయి, దాదాపు 50 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ ఇటలీలో, 1998 మే నెలలో కొండచరియలు విరిగిపడడం వల్ల వందమందికి పైగా మరణించారు.
వ్యక్తిగత భద్రత
పది సంవత్సరాల క్రితం జీవితంలో ఉన్న భద్రత కంటే ఇప్పుడు అధిక భద్రత ఉందని కొందరు అనుకోవడం లేదా? ప్రచ్ఛన్నయుద్ధం అంతమవడంతో సైనిక బలగాల్లో కోతను విధించడం జరగలేదా? అవును, జాతీయ భద్రత పూర్వం కంటే ఇప్పుడు మెరుగుపడి ఉండవచ్చు. అయితే వ్యక్తిగత భద్రత మాత్రం ఇంటా, బయటా జరిగే సంఘటనలవల్ల ప్రభావితం చెందుతుంది. మన ఉద్యోగం కోల్పోతే, లేక ఒక దోపిడీదారుడో, శిశుకాముకుడో ఇంటిబయట తచ్చాడుతుంటే ఎన్ని ఆయుధాల్ని నాశనం చేసినా సరేగాని మనం చింతను, అభద్రతను కలిగివున్నట్లు భావిస్తాము.
జీవితపు అనిశ్చయతలతో కొంతమంది ప్రజలు ఎలా వ్యవహరిస్తున్నారు? అంతకంటే ప్రాముఖ్యంగా, ప్రతి ఒక్కరి జీవితాలు—మీ జీవితం కూడా—నిరంతర భద్రతతో ఉండేలా చేసేందుకు ఏదైనా మార్గం ఉందా? ఈ విషయాలు తర్వాతి రెండు శీర్షికల్లోను పరిశీలించబడతాయి.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
UN PHOTO 186705/J. Isaac
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
FAO photo/B. Imevbore