నిరంతర భద్రతగల జీవితం
మీరు తీవ్రజ్వరంతో ఉన్నప్పుడు తలనొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు, లేకపోతే వేడి తగ్గడానికి ఐస్‌బ్యాగ్ ఉపయోగిస్తారు. కానీ టాబ్లెట్లు, ఐస్‌బ్యాగ్‌లు జ్వరము, తలనొప్పి వంటివాటిని భరించడానికి సహాయపడతాయేమో గాని వాటి మూలకారణంపై ప్రభావాన్ని చూపలేవు. మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంటే మీకు అనుభవజ్ఞుడైన వైద్యుడి చికిత్స అవసరం కావచ్చు.
మానవజాతి అభద్రతాభావం అనే దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతుంది. ఆ రోగ లక్షణాలనుండి ఉపశమనం పొందడానికి తాత్కాలిక చర్యలు తీసుకున్నా, మన పరిస్థితిని కచ్చితంగా నిర్ధారించగల వ్యక్తి మాత్రమే దాన్ని నయం చేయగలడు. మానవజాతి గురించి మన సృష్టికర్త కంటే మరెక్కువగా ఎవరికీ తెలియదు. మనం ఎదుర్కొంటున్న సమస్యల వల్ల మన జీవితాల్లో భద్రత లేదని ఆయనకు తెలుసు.
తొలినాటి భద్రత తుడిచిపెట్టుకు పోయింది
యెహోవా మొదటి మానవ జతను పరిపూర్ణంగా సృష్టించి, భద్రతగల వాతావరణంలో వారిని ఉంచాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు చింత అనేదే లేకుండా ఉన్నారు. పూర్తి భద్రతతో భూమిపై నిరంతరం జీవించాలన్నది మానవులపట్ల దేవునికిగల సంకల్పం. “చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును” ఉన్న పరిస్థితిలో తొలి మానవులు ఉంచబడ్డారు. వారి భౌతిక అవసరతలు తీర్చబడ్డాయి; అలాగే వారి భావోద్రేక అవసరతలు కూడా తీర్చబడ్డాయని గమనించండి, ఎందుకంటే “చూపునకు రమ్యమైనది” అని ఆ వాతావరణం వర్ణించబడింది. స్థిరమైన, సమస్యల్లేని జీవితం అనుభవించగల పరిసరాల్లో మొదటి మానవజత ఉంచబడిందని దానర్థం.—ఆదికాండము 2:9.
ఆదాము హవ్వలు దేవుని ప్రేమపూర్వక సర్వోన్నత అధికారాన్ని ధిక్కరించడం వల్ల, సందిగ్ధ స్థితి, భయం, సిగ్గు, అపరాధభావం, భద్రతాలేమి వంటివి వారి జీవితాల్లో ప్రవేశించాయి. దేవుణ్ని ధిక్కరించిన తర్వాత ఆదాము తాను ‘భయపడుతున్నానని’ అంగీకరించాడు. అప్పటివరకు వారు ఎవరితోనైతే సన్నిహిత, ప్రయోజనకరమైన సంబంధాన్ని ఆనందంగా అనుభవించారో ఆ ప్రేమ గల సృష్టికర్త నుండి తమను తాము దాచుకున్నారు.—ఆదికాండము 3:1-5, 8-10.
యెహోవా అసలు సంకల్పం మారలేదు. మన సృష్టికర్త ప్రేమగల దేవుడని బైబిలు తెలియజేస్తుంది, ఆయన త్వరలోనే విధేయులైన మానవజాతికి భూమిని పరదైసుగా పునఃస్థాపించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు అంతేగాక వారు నిరంతరము భద్రతతో జీవించడాన్ని కూడా సాధ్యపరుస్తాడు. ప్రవక్తయైన యెషయా ద్వారా ఈ వాగ్దానం ఇవ్వబడింది: “నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను; . . . మీరు ఎల్లప్పుడు హర్షించి, ఆనందించుడి.” (యెషయా 65:17, 18) ఈ క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిలను గూర్చి అపొస్తలుడైన పేతురు ఇలా చెబుతున్నాడు: “వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.
ఇది ఎలా సాధించబడుతుంది? యెహోవా స్థాపించిన ప్రభుత్వం ద్వారానే. ఆ ప్రభుత్వం కోసమే ప్రార్థించమని యేసుక్రీస్తు తన అనుచరులకు చెప్పాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:9, 10.
మానవ ప్రభుత్వాల స్థానంలో దేవుని రాజ్యం వచ్చి ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రేమ పూర్వక సంకల్పాన్ని నెరవేరేలా చేస్తుంది. (దానియేలు 2:44) ఆదాము కాలంనుండి మానవజాతిని పీడించిన సందిగ్ధ స్థితి, భయం, సిగ్గు, అపరాధ భావం, భద్రతాలేమి లేకుండా పోతాయి. బైబిలు చెప్తున్నదాని ప్రకారం ఆ రాజ్యం అతి సమీపంలో ఉంది. ఇప్పుడు కూడా, దేవుని రాజ్యం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారు ఈ అనిశ్చయ ప్రపంచంలో సహితం కొంత భద్రతను పొందుతున్నారు.
ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వండి
భయం అంటే ఏమిటో, ఆందోళన అంటే ఏమిటో దేవుని సేవకుడైన దావీదుకు బాగా తెలుసు. అయినప్పటికీ, కీర్తన 4:8లో ఆయన ఇలా వ్రాశాడు: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” (ఇటాలిక్కులు మావి.) దావీదు కొన్నిసార్లు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పటికీ, ఆయన భద్రతా భావాన్ని అనుభవించేలా యెహోవా సహాయం చేశాడు. దీని నుంచి మనమేమైనా నేర్చుకోవచ్చా? ఈ భద్రతారాహిత్య లోకంలో మనం కొంత భద్రతను ఎలా అనుభవించవచ్చు?
ఆదికాండములోని ఆదాము హవ్వల వృత్తాంతాన్ని పరిశీలించండి. వారు భద్రతా భావాన్ని ఎప్పుడు కోల్పోయారు? సృష్టికర్తతో వ్యక్తిగత సంబంధాన్ని ఎప్పుడైతే తెగతెంపులు చేసుకున్నారో, మానవజాతి కొరకైన దేవుని సంకల్పాలకు అనుగుణంగా జీవించడం ఎప్పుడైతే మానుకున్నారో ఆ క్షణాన్నే. అందువల్ల, యెహోవా దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని తిరిగి దృఢపర్చుకోవడం ద్వారా, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం ద్వారా, ఇప్పుడు కూడా మనం మరింత భద్రతాయుత జీవితాన్ని అనుభవించగలము.
బైబిలును చదవడం ద్వారా యెహోవాను గురించి తెలుసుకోవడం జీవిత పరమార్థాన్ని గ్రహించడానికి సహాయం చేస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఎవరమో, ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసుకుంటాము. మనం దేవుణ్ని ప్రేమించినప్పుడు, మానవజాతి కొరకైన దేవుని సంకల్పాలను తెలుసుకొని ఆ సంకల్పంలో మనమెక్కడ ఇమిడివున్నామో తెలుసుకుంటే మనం భద్రత గల జీవితాన్ని పొందగలం. చాలా సంవత్సరాల క్రితం పాల్ అనే పేరు గల వ్యక్తి దాన్ని చూపించాడు.
జర్మనీ సముద్రతీరానికి దగ్గరలోని ఒక ద్వీపంలో పాల్ పుట్టి, పెరిగాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో తన తల్లిదండ్రులకు కలిగిన అనుభవాలను బట్టి, ఆయన కుటుంబానికి మతం అంటే ఆసక్తి పోయింది. యౌవనస్థుడైన పాల్ ఇలా తెలియజేస్తున్నాడు: “నేను దేన్నీ నమ్మేవాడిని కాను, ఎవరినీ గౌరవించేవాడిని కాను. వారానికి రెండు, మూడు సార్లు అతిగా త్రాగడం వల్ల నా బాధల్ని మందులో ముంచేసేవాడిని. నా జీవితంలో భద్రత లేకుండా పోయింది.”
అప్పుడు ఒక యెహోవాసాక్షితో పాల్ చర్చించాడు. పాల్ చాలా వాదించిన మీదట సాక్షి చెప్పిన ఒక విషయం ఆయన్ని ఆలోచించేలా చేసింది. “మూలం లేకుండా ఏమీ రాదు.” వేరే మాటల్లో చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతికి తప్పకుండా సృష్టికర్త ఉండి తీరాలి.
“ఈ విషయాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచించిన మీదట నేను ఒప్పేసుకున్నాను.” అలా పాల్ యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని చేసి యెహోవాను గూర్చి తెలుసుకున్నాడు. “నా తల్లిదండ్రులను మినహాయించి, నా జీవితంలో ఎవరైనా ఏదైనా చేశారంటే ఆ మొదటి వ్యక్తి యెహోవాయే” అని ఆయన తెలియజేశాడు. పాల్ సాక్షిగా బాప్తిస్మం తీసుకున్నది 1977లో, ఆయన ఇలా చెప్పాడు: “ఇప్పుడు నేను తెలుసుకున్నాను నిజంగా జీవితానికిగల సంకల్పమేమిటో. నేను యెహోవా చిత్తానికి అనుగుణంగా జీవించడానికి సంతోషిస్తున్నాను. భవిష్యత్తులో యెహోవా సరి చేయలేనిదేదీ, ఇప్పుడు నాకు గానీ నా కుటుంబానికి గానీ ఏదీ సంభవించదు అనే నిశ్చయత కలిగి నేను పూర్తి భద్రతా భావంతో ఉన్నాను.”
ఈ అనుభవం నుంచి మనమేమి నేర్చుకోవచ్చు? పాల్ వస్తు సంపదలపై కాక ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి నిల్పడం ద్వారా భావోద్రేకపరమైన భారం అయిన అభద్రతా భావాన్ని తను అధిగమించగలిగాడు. సృష్టికర్తతో పటిష్టమైన సంబంధాన్ని పెంపొందించుకున్నాడు. లక్షలాదిమంది యెహోవాసాక్షులు అలాంటి సంబంధాన్నే అనుభవిస్తున్నారు. ఇది వారికి మనోస్థైర్యాన్ని ఇచ్చి, ఇతరులతో వారి వ్యవహారాల్లో స్వయంత్యాగ స్ఫూర్తిని కలిగివుండేలా సహాయం చేస్తుంది. ప్రజలను వారి గృహాల్లో సందర్శిస్తూ, ఆధ్యాత్మిక విషయాలపై ధ్యానముంచడం ద్వారా ప్రజలు మరింత భద్రతా భావాన్ని పొందేలా సాక్షులు వారి స్వంత సమయాన్ని వినియోగిస్తున్నారు. కానీ సాక్షులు ప్రకటించడం మాత్రమే చేయడంలేదు.
“మీ దేవుడైన యెహోవా నామాన్ని పిలవండి”
1997, జూలై నెలలో ఉత్తర యూరోప్‌లోని విస్తారమైన ప్రాంతాలు ఓడర్ నది వరదతో ముంచెత్తబడినప్పుడు, జర్మన్‌లోనున్న యెహోవాసాక్షులు తమ పొరుగు దేశమైన పోలాండ్ ప్రజల దురవస్థను గూర్చి విన్నారు. ఇప్పుడు వాళ్లేమి చేస్తారు? చాలా కొద్ది దినాల్లోనే 46 లక్షల 40 వేల రూపాయలు స్వచ్ఛందంగా చందా ఇవ్వడం ద్వారా తమ మహత్తరమైన ఔదార్యాన్ని బెర్లిన్‌లోనూ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ ఉన్న సాక్షులు చూపించారు.
బెర్లిన్ నుండి పోలాండ్‌లోని వురొక్లా ప్రదేశానికి తమ స్వంత ఖర్చులతో ఆరు గంటలు ప్రయాణించి నిర్మాణపనిలో అనుభవజ్ఞులైన యెహోవాసాక్షులు వెళ్లారు. ఒక చిన్న పట్టణంలో, చాలా వరకు ఇళ్ళు బాగా పాడయ్యాయి. ఒక యెహోవాసాక్షి కుటుంబానికి చెందిన గృహంలోకి ఆరు మీటర్ల ఎత్తున నీరు లోపలికి ప్రవేశించింది. వారి కుమార్తె తర్వాతి నెలలో వివాహం చేసుకుని అదే గృహంలో తన భర్తతో పాటు నివసించాలని అనుకుంది. ఆ ఇంటిని బాగుచేసేందుకూ, సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబానికి సహాయపడేందుకూ ఏమి చేయవచ్చు?
వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పొరుగువారిలో ఒక వ్యక్తి వ్యంగ్యంగా ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా నామాన్ని పిలవండి, అలా పిలిస్తే ఆయన మీకు సహాయం చేస్తాడేమో?” ఆ తర్వాతి రోజే చాలా మోటారు బండ్లు జర్మన్ నుంచి వచ్చి ఆ యెహోవాసాక్షి గృహం ముందు పోగవ్వడంతో ఆ పొరుగువాడు ఎంత ఆశ్చర్యపోయుంటాడో కదా! ఇతర దేశాల నుంచి వచ్చిన ఆ గుంపు వాహనాలపై నుంచి దిగి ఆ ఇంటిని బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. “వారెవరు? ఇంటి సామాగ్రికి డబ్బు ఎవరు ఇస్తున్నారు?” అని ఆ పొరుగతను అడిగాడు. వారు తమ ఆధ్యాత్మిక సహోదరులని, వారే ఆ ఖర్చు భరిస్తున్నారని యెహోవాసాక్షులైన ఆ కుటుంబం వివరించింది. ఆ పట్టణ కాపురస్థులు ఆ ఇల్లు పునరుద్ధరింపబడుతుండగా చూసి చాలా ఆశ్చర్యపోయారు. కాకతాళీయంగా, అనుకున్న రోజునే వాళ్లమ్మాయి పెళ్ళి జరిగిపోయింది.
అంతర్జాతీయ సహోదరత్వానికి చెందడం ద్వారా, ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాక ఈ భద్రతారాహిత్య లోకంలో కొంత భద్రత కూడా లభిస్తుంది అని ఈ కుటుంబం తెలుసుకుంది. ఇటువంటి అనుభవాలు అనుభవించినది వీరు మాత్రమే కాదు. దెబ్బ తిన్న ఆ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల ఇళ్ళు, రాజ్య మందిరాలు కూడా పునరుద్ధరించబడ్డాయి. యెహోవాసాక్షులు కాని పొరుగువారిని మరిచిపోవడం జరగలేదు. వారి ఇండ్లలో కూడా చాలా పని జరిగింది, అందుకు ఎంతో కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి.
నీతి, నిమ్మళము, నిబ్బరము
చివరికి మన తీవ్రమైన జ్వరం తగ్గిపోయి, మన ఆరోగ్యం కుదుట పడినప్పుడు, మనకు సహాయం చేసిన ఆ వైద్యునిపట్ల ఎంత కృతజ్ఞత కలిగివుంటాము! మానవజాతిని ఆవరించుకొని ఉన్న అభద్రతా భావం అనే ఈ జ్వరం, దేవుని రాజ్యం ద్వారా పూర్తిగా నిర్మూలించబడుతుంది, అప్పుడు మనం దేవునికెంత కృతజ్ఞులమై ఉంటామో కదా! అవును, “నీతివలన నిత్యమును నిమ్మళము, నిబ్బరము” ఉండే జీవితాన్ని ఇస్తానని వాగ్దానము చేస్తున్నది ఆయనే. ఎంతటి అద్భుతమైన నిరీక్షణయో కదా!—యెషయా 32:17.
[10వ పేజీలోని చిత్రం]
వస్తు సంపదపై కాక, ఆధ్యాత్మిక విషయాలపై అవధానాన్ని నిలపడం ద్వారా భావోద్వేగపరమైన భారం నుండి మనం ఉపశమనం పొందగలము
[8, 9వ పేజీలోని చిత్రం]
దేవుడు వాగ్దానం చేసే నూతన లోకంలో ప్రతి ఒక్కరూ నిరంతర భద్రతను అనుభవిస్తారు