కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీలు 11-13
  • చిన్న దీవి నుండి బిజీ విమానాశ్రయంగా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చిన్న దీవి నుండి బిజీ విమానాశ్రయంగా
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దీవిపై విమానాశ్రయం
  • దీవి నుండి దీవికి వారథులు
  • విమానాశ్రయం నుండి నగరానికి 23 నిమిషాల్లోనే!
  • భవిష్యత్తు కోసం రూపొందించబడిన విమానాశ్రయం
  • “కాన్‌కూ” విమానాశ్రయం కనిపిస్తుంది కాని శబ్దం వినపడదు
    తేజరిల్లు!—1996
  • వంతెనలు—అవి లేని జీవితం ఎలా ఉంటుంది?
    తేజరిల్లు!—1998
  • జనసందోహముగల హాంకాంగ్‌ నందు నా జీవితంలో ఒక రోజు
    తేజరిల్లు!—1992
  • వాస్కోడ గామా—పేరుపెట్టబడిన ఒక వంతెన
    తేజరిల్లు!—1998
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీలు 11-13

చిన్న దీవి నుండి బిజీ విమానాశ్రయంగా

హాంకాంగ్‌లోని తేజరిల్లు! విలేఖరి

“మనం ఇళ్ల మీదున్న టీవీ యాంటెన్నాలను పడగొట్టేస్తామేమో!” తాను కూర్చుని ఉన్న విమానం, హాంకాంగ్‌లోని కాయ్‌ టాక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి దిగుతుండగా కిటికీ గుండా బయటకి చూసి బెదిరిపోయిన ఒక ప్రయాణీకురాలు అలా కేకలు వేసింది. దానికి సమీపంలోవున్న కవ్లూన్‌ నగరంలో తన భవనం మీద బట్టలు ఆరేస్తున్న ఒక స్త్రీ, విమానం తన తలపైనుండి దూసుకుపోతుండగా కర్ణభేరి అదిరిపోయే ఆ శబ్దానికి ఆమె క్రిందికి వంగి కూర్చుంది.

ప్రమాదకరమైన రీతిలో అలా ఎన్నోసార్లు విమానాన్ని క్రిందికి దింపిన పైలట్‌ జాన్‌ ఇలా అన్నాడు, “పర్వతాలే ఒక సమస్య. వాయవ్యం నుండి క్రిందికి దిగాలంటే రన్‌వే మీదికి రాకముందు ప్రమాదకరమైన విధంగా మలుపు తిప్పాలి. పర్వతాల మూలంగా ప్రమాదకరమైన చలిగాలులు వీస్తాయి, మేము వాటిని పదునైన గాలులు అని పిలుస్తాము.”

భీతిల్లివున్న ప్రయాణికులకు, పైలట్లకు, ప్రాముఖ్యంగా కవ్లూన్‌ నగరవాసులకు, కాయ్‌ టాక్‌కు చివరి విమానయానం జరిగిన దినం ఏమంత త్వరగా రాలేదు. 1998 జూలైలో హాంకాంగ్‌ క్రొత్త విమానాశ్రయాన్ని ఆరంభించడంతో ఆ దినం వచ్చేసింది.

దీవిపై విమానాశ్రయం

1980లలో కాయ్‌ టాక్‌ విమానాశ్రయం చాలా ఇరుకైపోయింది. దాన్ని ఇక విశాలపరిచే అవకాశం లేదు కాబట్టి ఒక క్రొత్త విమానాశ్రయం కోసం స్థలం వెదకడం జరిగింది. కాని విమానాశ్రయానికి సరిపోయేంత పెద్ద సమతలమైన స్థలం హాంకాంగ్‌లో లేదు. అంతేగాక, రణగొణ ధ్వనులతోకూడిన విమానాశ్రయం తమ పెరట్లోనే ఉండడాన్ని ప్రజలు ఇష్టపడలేదు. పరిష్కారం? ఇంకా అంతగా అభివృద్ధి చెందని పెద్ద దీవియైన లాన్‌టావుకు ఉత్తరానవున్న చెక్‌ లప్‌ కాక్‌ అనే చిన్న దీవి. దానితో సివిల్‌ ఇంజనీర్‌ల స్వప్నం నెరవేరినట్లయ్యింది.

విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఆ చిన్న దీవినీ దగ్గర్లో ఉన్న మరో చిన్న దీవినీ కలిపి సమానంగా చేసి చదును చేయడానికి, సముద్రంలో నుండి దాదాపు తొమ్మిదిన్నర చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని మట్టిని తీసుకు వచ్చి మెరక చేయవలసి వచ్చింది. విమానాశ్రయాన్ని హాంకాంగ్‌ నగరంతో కలపడానికి 34 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ రైలు రోడ్డు మార్గాన్ని నిర్మించారు, ఆ రెండు మార్గాలు దీవులమీదుగా కాలువల మీదుగా ప్రయాణించి, కవ్లూన్‌ నగరం గుండా వెళ్లి విక్టోరియా హార్బర్‌ను దాటి ముందుకు సాగుతాయి. కాబట్టి దీని కోసం వారథులు, సొరంగాలు, వంతెనలు నిర్మించవలసి వచ్చింది. ఇదంతా కూడా ఇంతకు మునుపెన్నడూ నిర్మించనంత భారీ నిర్మాణపనికి దారితీసింది.

దీవి నుండి దీవికి వారథులు

లాన్‌టావు దీవిని ప్రధాన భూభాగంతో కలిపే ప్రపంచ ప్రసిద్ధమైనదైన లాన్‌టావు లింక్‌ను చూడడానికి వేలాదిమంది ప్రజలు హాంకాంగ్‌ పట్టణ ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కేబుల్‌ వైర్లతో నిర్మించబడిన ఆ వారధి లాన్‌టావు దీవి నుండి చిన్న దీవియైన మా వాన్‌ దీవికి ఒక వంతెన, ఆ దీవి మీదుగా మరో వంతెన, ఆ తర్వాత ఆ దీవి నుండి మూడవ దీవియైన చింగ్‌ యీ దీవికి ఇంకో వంతెన అలా మూడు భాగాలుగా ఆ వారధి నిర్మించబడింది. మా వాన్‌ దీవి నుండి చింగ్‌ యీ దీవికి వేయబడిన సస్పెన్షన్‌ బ్రిడ్జి పొడవు 1,377 మీటర్లు. రెండు అంతస్థులుగా నిర్మించబడిన ఈ బ్రిడ్జీలు ప్రపంచంలోకెల్లా ఈ విధమైన బ్రిడ్జీల్లో పొడవైనవి, ఆ బ్రిడ్జి మీద పైఅంతస్థులో వాహనాలు వెళతాయి, మూసుకుని ఉండే క్రింది అంతస్థులో రైలు మార్గమూ మరో రెండు రోడ్డు మార్గాలూ ఉన్నాయి.

సస్పెన్షన్‌ బ్రిడ్జిని నిలబెట్టివుంచే కేబుల్‌ వైర్లు దూరం నుండి చాలా పెళుసైనవిగా కనిపిస్తాయి. ఇంజనీర్లు సరైన లెక్కలు వేశారా లేక బ్రిడ్జి నీటిలో మునిగిపోతుందా అని ఒకరు ఆశ్చర్యపోవచ్చు. అయితే దగ్గరి నుండి గమనిస్తే ఆ కేబుల్‌ వైర్లు ఏమాత్రం పెళుసైనవి కావని తెలుస్తుంది. 1.1 మీటరు మందమున్న కేబుల్‌లు 1,60,000 కిలోమీటర్ల వైర్లను కల్గివున్నాయి, అంటే అవి భూమిని నాలుగుసార్లు చుట్టడానికి సరిపోయేంత పొడవైనవి. ఒక్కొక్కటి 500 టన్నుల బరువున్న 95 ప్రిఫాబ్రికేటెడ్‌ సెక్షన్‌లతో బ్రిడ్జి రూపొందించబడింది కాబట్టి ఆ బ్రిడ్జి బరువును మోయడానికి ఆ కేబుల్స్‌ అంత బలంగా ఉండాల్సిందే. ఆ కేబుల్స్‌ పూర్తైనప్పుడు, ప్రిఫాబ్రికేటెడ్‌ సెక్షన్‌లను పెద్ద బల్లకట్టువంటి దానిమీద ఆ స్థలానికి తీసుకువెళ్లి నీటికిపైగా వాటిని అమర్చడం జరిగింది.

పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, సస్పెన్షన్‌ కేబుల్‌లను వాటి స్థలంలో ఉంచడానికి సహాయపడే టవర్లు పైకి లేవడం చూసి విస్మయం చెందారు. నిర్మాణపనుల్లో సాధారణంగా ఉపయోగించే పరంజాల వంటివేవీ లేకుండానే టవర్లు ఆకాశంలోకి లేచాయి. నిర్మాణకులు స్లిప్‌ఫామింగ్‌ అని పిలువబడే పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయబడే అచ్చులను ప్రతి స్థాయిలోనూ వేరుచేసి వాటిని తిరిగి నిలబెట్టవలసిన అవసరంలేకుండా ఆ అచ్చులను మెల్లిగా పైకి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ క్రొత్త పద్ధతిని ఉపయోగించడం ద్వారా నిర్మాణకులు 190 మీటర్ల ఒక బ్రిడ్జి టవరును కేవలం మూడు నెలల్లో నిలబెట్టగలిగారు.

హాంకాంగ్‌ పెనుతుఫాన్లు వచ్చే ప్రాంతంలో ఉంది. బలంగా వీచే గాలులు ఈ బ్రిడ్జి మీద ఏ ప్రభావాన్ని చూపిస్తాయి? గంటకు 68 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, 1940లో అమెరికాలోని వాషింగ్‌టన్‌లో ఉన్న టకోమ నారోస్‌ బ్రిడ్జిని వెదురు బొంగులతో చేయబడినదాన్ని మెలికలు తిప్పినట్లు మెలికలు తిప్పడంతో అది ధ్వంసమైపోయింది. అప్పటి నుండి ఇప్పటికి బ్రిడ్జి నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడే విధంగా ఈ క్రొత్త బ్రిడ్జిలు రూపకల్పన చేయబడి, పరీక్షించబడ్డాయి.

విమానాశ్రయం నుండి నగరానికి 23 నిమిషాల్లోనే!

క్రొత్త విమానాశ్రయం నాలుగురెట్లు దూరంలో ఉన్నప్పటికీ కాయ్‌ టాక్‌లోని మునుపటి విమానాశ్రయం నుండి కంటే కూడా క్రొత్త విమానాశ్రయం నుండే హాంకాంగ్‌ దీవికి త్వరగా చేరుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే అక్కడి నుండి హాంకాంగ్‌ వ్యాపార ప్రాంతానికి రైళ్లు గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి, ఆ వ్యాపార ప్రాంతాన్ని సెంట్రల్‌ [కేంద్రం] అని పిలువడం సబబే. మొదటగా, లాన్‌టావు ఊషర పర్వతాల సుందర దృశ్యాలను చూడవచ్చు. ఇక ఆ తర్వాత ఆ రైలు, సరుకును రవాణా చేసేవాటిలో ప్రపంచంలోకెల్ల అతిపెద్దదైన క్వీ చుంగ్‌లోని నౌకాశ్రయాన్ని దాటి, మరో రెండు దీవులను కూడ దాటుకుని ప్రధాన భూభాగానికి చేరుకుంటుంది. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అది, 1,70,000 మందికి నివాసస్థలమైన మాంగ్‌ కాక్‌కు చేరుకుంటుంది. తర్వాత అది పర్యాటక కేంద్రమైన చిమ్‌ షా చ్యీని దాటి విక్టోరియా హార్బర్‌ క్రిందుగా సెంట్రల్‌లోని గమ్యస్థానానికి చేరుకుంటుంది, అంటే విమానాశ్రయం నుండి బయలుదేరిన కేవలం 23 నిమిషాల్లోనే అది తన గమ్యాన్ని చేరుకుంటుంది!

భవిష్యత్తు కోసం రూపొందించబడిన విమానాశ్రయం

1992 డిసెంబరులో, చెక్‌ లప్‌ కాక్‌ ఒక చదరపు మైలు వైశాల్యంగల శిలామయమైన దీవిగా ఉండేది. 1995 జూన్‌కల్లా, అది క్రొత్త విమానాశ్రయం కోసం 3,084 ఎకరాల సమతల భూమిగా తయారయ్యింది, దానితో హాంకాంగ్‌ భూ విస్తృతి దాదాపు 1 శాతం పెరిగింది. అసలు దీవి 44,000 టన్నుల శక్తివంతమైన విస్ఫోటన పదార్థంతో సమతలం చేయబడగా, మట్టినిపైకి తీసే పెద్ద పెద్ద సాధనాలు సముద్ర గర్భంలో నుండి ఇసుకను ఆ దీవి మీదకు తీసుకువచ్చాయి. నిర్మాణం ఉద్దృతంగా సాగుతున్న సమయంలో, రోజుకు ఐదు ఎకరాల చొప్పున భూమిని తిరిగి పొందడం జరిగింది. సగటున, మొత్తం 31 నెలల్లోనూ ప్రతి క్షణానికి భూవిస్తరణకు అవసరమైన పది టన్నుల పదార్థం చేరవేయబడింది. భూవసతిని కల్పించిన కాంట్రాక్టర్‌లు తమ వంతు పనిని ముగించి వెళ్లగానే, విమానాశ్రయాన్ని నిర్మించే ఇతర పనివారు రంగంలోకి దిగారు.

ఆ ప్రాజెక్టులో చాలా ఎక్కువగా భాగం వహించిన స్టీవ్‌ కొన్ని ఉన్నతాంశాలను ఇలా తెలియజేశాడు: “సరిగ్గా నిర్మించని రన్‌వేను ఈనాటి జంబో జెట్లు పాడుచేయగలవు. కాబట్టి, తారు పోయక ముందు భారీ రోలర్లను ఉపయోగించి నేలను చదును చేయడం జరిగింది. మొదటి రన్‌వేనూ విమానాలు నిలిపే స్థలాన్నీ ఈ రోలర్లు సిద్ధం చేసేసరికి అవి దాదాపు 1,92,000 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు అంచనా వేయబడుతుంది, అంటే ఆ దూరం భూమి చుట్టు కొలతకు ఐదురెట్లతో సమానం.

“మా కంపెనీకి టెర్మినల్‌ నిర్మించే కాంట్రాక్ట్‌ లభించింది; మేము స్టీల్‌ రూఫ్‌-ట్రసస్‌ను నిర్మించి నిలబెట్టాము. ఇవి ఒక్కొక్కటి 150 టన్నుల బరువుంటాయి. వీటిని మేము ఒక పెద్ద క్రేన్‌ సహాయంతో మల్టీవీల్‌ ట్రయిలర్‌ల మీదికి ఎక్కించాము, ఆ మల్టీవీల్‌ ట్రయిలర్‌లు గంటకు 2 కిలోమీటర్ల వేగంతో వాటిని టెర్మినల్‌ దగ్గరికి తీసుకువెళ్లాయి.”

ఈ టెర్మినల్‌ కాంక్రీట్‌తో కట్టిన బాక్సువంటిది కాదు. బదులుగా, విమానాశ్రయ సిబ్బందికీ అలాగే ప్రయాణీకులకూ ఆహ్లాదకరంగా ఉండేలా గాలి వెలుతురు పుష్కలంగా ప్రసరించే విధంగా నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంతేగాక, ఎక్కువ ఆలస్యం జరుగకుండా వీలైనంత త్వరగా ప్రయాణీకులను గమ్యస్థానం చేర్చేలా విమానాశ్రయం రూపకల్పన చేయబడింది. చెక్‌-ఇన్‌ కౌంటర్‌ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రయాణికులు 30 నిమిషాల్లో విమానంలో కూర్చోగలుగుతారు. ప్రయాణాన్ని మరింత సుగమం చేసేందుకు, ప్రయాణికులను టెర్మినల్‌ యొక్క ఈ చివరి నుండి ఆ చివరికి తీసుకువెళ్లేందుకు డ్రైవర్‌లేని ట్రెయిన్‌ ఏర్పాటుచేయబడింది. అదనంగా, అలసిపోయిన ప్రయాణికుల కాళ్లకు శ్రమ తగ్గేలా 2.8 కిలోమీటర్ల కదిలే వాక్‌ వేలు ఏర్పాటు చేయబడ్డాయి.

స్టీవ్‌ ఇంకా ఇలా కొనసాగించాడు: “1995లో 2,70,00,000 కంటే ఎక్కువమంది ప్రయాణికులను చూసిన కాయ్‌ టాక్‌ నుండి ఎంత భిన్నమైనదో కదా! క్రొత్త విమానాశ్రయం సంవత్సరానికి 3,50,00,000 మంది ప్రయాణికులనూ, 30 లక్షల టన్నుల సరుకునూ రవాణా చేయగలదు. చివరికి అది 8,70,00,000 ప్రయాణికులనూ 90 లక్షల టన్నుల సరుకును రవాణా చేయగల్గుతుంది!”

ఈ ప్రాజెక్ట్‌ మీద హాంకాంగ్‌ చాలా ఎక్కువ పెట్టుబడి పెడుతోంది—దాదాపు 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడిని, లేదా 63 లక్షలమంది ఉన్న హాంకాంగ్‌ వాసుల్లో ఒకొక్కరి కోసం దాదాపు 3,300 డాలర్లను పెట్టుబడి పెడుతోంది. హాంకాంగ్‌ తనకు ఇప్పుడున్న సంపన్నతను కాపాడుకునేందుకు చెక్‌ లప్‌ కాక్‌ విమానాశ్రయం సహాయం చేస్తుందని ఆశించబడుతుంది. అయితే దాని కోసం వేచి చూడవలసిందే, ఒకటి మాత్రం కచ్చితం: హాంకాంగ్‌ విమానాశ్రయంలో దిగడం తప్పకుండా చిరస్మరణీయమైన అనుభవంగా మిగిలిపోతుంది.

[12వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

విమానాశ్రయ రైలుమార్గం ఎక్స్‌ప్రెస్‌ వే

చెక్‌ లప్‌ కాక్‌లోని విమానాశ్రయం

లాన్‌టావు లింక్‌

నార్త్‌ లాన్‌టావు ఎక్స్‌ప్రెస్‌ వే

లాన్‌టావు దీవి

కాప్‌ షూయ్‌ మున్‌ బ్రిడ్జి

చింగ్‌ మా వారధి

వెస్ట్‌ కవ్లూన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

కవ్లూన్‌

కాయ్‌టాక్‌లోని విమానాశ్రయం

హాంకాంగ్‌ దీవి

[13వ పేజీలోని చిత్రం]

చింగ్‌ మా వారధిని కట్టడం

[11వ పేజీలోని చిత్రసౌజన్యం]

New Airport Projects Co-ordination Office

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి