జనసందోహముగల హాంకాంగ్ నందు నా జీవితంలో ఒక రోజు
హాంకాంగ్ ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత గల దేశాలలో ఒకటి. దాని 1,070 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 58 లక్షల మంది ప్రజలు అంటే ఒక చదరపు కిలోమీటరుకు 5,592 మంది నివసిస్తున్నారు. అనగా ప్రజలు ఆక్రమించిన ప్రతి చదరపు కిలోమీటరులో సరాసరి షుమారు 54,000 మంది ఉన్నారన్న మాట! అయినను, స్థానిక ప్రజలు ఆ క్రిక్కిరిసిన జనాభాగల నగరంలో తొక్కిసలాటకు, ఇరుకు స్థలానికి, వాహనాల రొదకు, కలుషితానికి ప్రశంసనీయంగా అలవాటు పడ్డారు.
నా గడియారం ఉదయం 7:30 నిమిషములకు టంగున అలారం కొట్టగానే నా పడకమీదనుండి దిగ్గునలేచి త్వరగా బట్టలు వేసుకున్నాను. ఉద్యోగం చేస్తున్న నా ముగ్గురు చెల్లెళ్లు, నా తలిదండ్రులతోపాటు నేను ఒక చిన్న ఫ్లాటులో వుంటున్నాను. అందుకే స్నాన గదికి మేమంతా వరుసలో వుండవలసివస్తుంది, మాకున్న సమయం కొంచెమే. త్వరగా నాస్త ముగించి నా సైకిలు ఎక్కి రైల్వే స్టేషన్‌కు వెళ్తాను. ఇక దిన కార్యక్రమం ప్రారంభమైంది. రొదతోనిండిన హాంకాంగ్‌లో ఉద్యోగానికి వెళ్లే జనసందోహంలో నేనొకడినవుతాను.
నేను వెళ్లే రైలు క్రిక్కిరిసిన మనుష్యులు గల భవంతులు, ఆకాశ హర్మ్యాలు దాటి అతి వేగంగా పోతుంది. తర్వాత నేను హార్బర్ దాటడానికి ఓ బస్సు ఎక్కాలి. వాహనాల వత్తిడితో మేము ఓ సొరంగం గుండా ప్రయాణిస్తాము. పిదప హాంకాంగ్ ద్వీపంలో డబ్బు లావాదేవీలు జరిగే కేంద్ర ప్రాంతానికి చేరుకొనుట ఎంతో హాయి అన్పిస్తుంది. ఈ ప్రయాణమంతా ప్రయాణ రద్దీనిబట్టి ఒక గంట నుండి గంటన్నర కాలం పడుతుంది. అంటే నేను 9:30 కల్లా అక్కడికి చేరుకుంటాను. అయితే ఊరకుండటానికి వీల్లేదు. ఫోను మ్రోగుట ప్రారంభమౌతుంది. అతడే నా మొదటి ఖాతాదారుడు. దాంతో ఆ రోజుకు నా కథ ప్రారంభం, ఒకదాని తర్వాత ఒకటి ఫోను మ్రోగుతూనే వుంటుంది క్రింద పెట్టేదేలేదు. తర్వాత కొద్దిసేపు భోజన విరామం.
ఇప్పుడు ఆ ప్రాంతంలోని అనేక రెస్టారెంట్లలో కూర్చోవడానికి స్థలం దొరకడం ఒక సమస్య. ఎలావుంటుందంటే అందరూ ఒకేసారి, ఒక స్థలంలో, ఒకే బల్లమీద కూర్చొని తినటానికి ప్రయత్నిస్తున్నారా అనిపిస్తుంది మరి! ఇక నేను బల్లమీద ముక్కుమొఖం తెలియని వారి ప్రక్కనే కూర్చోవలసి వస్తుంది. అదే జనసందోహంగల హాంకాంగ్ జీవిత మంటే. త్వరత్వరగా పుష్టిగల చైనా భోజనాన్ని ముగించి ఆ వెంటనే నేను ఆఫీసుకు వెళ్తాను.
అసలు నాపని 5:30 కు అయిపోవాలి గానీ అదెప్పుడూ వీలుపడదు. ఆఖరుకు నేను కొంచెం విశ్రాంతి కొరకు పని ఆపి చూస్తే యింకేముంది అప్పుడే 6:15 అవుతుంది. కొన్ని సార్లు నేను బయట పడేసరికి ఏడు దాటుతుంది కూడ. మరల తిరుగు ప్రయాణం ప్రారంభమౌతుంది.
మొదట బస్సు, తర్వాత రైలు. చివరికి అది రైల్వేస్టేషన్లో ఆగినవెంటనే నా సైకిలు కొరకు వెళ్తాను. నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తూ మా కుగ్రామం ఎలా క్రిక్కిరిసిన జనసందోహంతో పెద్ద నగరంగా మారిందో జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. చిన్న గ్రామపు ఇండ్లు, 20 నుండి 30 అంతస్థులున్న ఎత్తైన భవంతులుగా మారినవి. స్థలమంతా పెద్ద పెద్ద విశాలమైన రహదారులుగా మారి, రోడ్డుపై భాగాన వంతెనలు వెలసి, వాహనాల రొదతో నిండిపోయింది. హాయిగావుండే పాత జీవితమంతా శాశ్వతంగా కొట్టుకుపోయింది.
మా ఇల్లు చిన్నది, మా ఆరుగురికొరకు 28 చదరపు మీటర్ల కంటె తక్కువ స్థలమేవున్న ఇల్లు మరియు నాకు ప్రత్యేకంగా గదిలేదు. అందుకే నేను మొదటి గదిలో బల్లమీద పడుకుంటాను. కనీసం మా అమ్మ నాన్నలకైనా ఒక గది ప్రత్యేకంగా వుంది. నా ముగ్గురు చెల్లెళ్లు వారి చిన్న గదిలో ఒకదానిపై ఒకటి అమర్చబడిన పడకలమీద పడుకుంటారు. ఏకాంతం మాకు చాలా మూల్యమైనది.
అది చిన్నగా వున్నప్పటికి, ఇంతకుముందు మేమంతాకలిసి గవర్నమెంటు వారిచ్చిన ఒక్కగదిలో ఉన్నదానికంటె మేలే. అయితే మొన్ గాక్ జిల్లాలో నివసించే వేలాదిమంది స్థితిగతులతో పోల్చితే అదెంతో మేలు, అక్కడివారు “గుహలవంటి గదులను అద్దెకిస్తారు,” అవి మూడు దొంతరులుగల్గి ఒక్కొక్కటి 1.8 మీటర్ల పొడవు, .8 మీటర్ల లోతు .8 మీటర్ల ఎత్తువుంటాయి. అందులో వారికి ఒక పరుపు, కొన్ని స్వంత వస్తువులు పెట్టుకోవడానికే స్థలముంటుంది. ఇతర సామానులకు స్థలమే ఉండదు.
రాత్రి తొమ్మిది గంటలకల్లా అందరం ఇంటికి చేరుకుంటాము. తరువాత రాత్రి భోజనానికి కూర్చుంటాము. ఆ తర్వాత ఎవరో ఒకరు టి.వి. పెడతారు. దానితో ప్రశాంతంగా చదువుకుందాం, పఠిద్దామనే నా కోరిక అంతమౌతుంది. అందరూ నిద్రపోయేంతవరకు రాత్రి 11 గంటల దాకా మేలుకుంటాను, తర్వాత గదిలో నేనొక్కడినే ఉంటాను, ధ్యానముంచడానికి కొంచెం నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది. అర్థరాత్రి అయ్యేసరికి నేనుకూడా నిద్రపోవడానికి తయారవుతాను.
నేను పాఠశాల ముగించినప్పటినుండి అంటే 12 సం.ల నుండి యీ ఉద్యోగం చేస్తున్నా. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను గానీ జీవనోపాధి కొరకు కష్టించి పని చేయవలసి వస్తుంది, గనుక నాకు కాబోయే ఆవిడను పరిశీలించి తెలిసికొనేంత వ్యవధి నాకు దొరకడం లేదు. నివసించడానికి స్థలం కనుక్కోవడమే నింగికెగసినంత పని, అని మేము చెప్పుకుంటాం. ఏలాగో ఓలాగు ఇలా ఉండటానికి అలవాటు పడినప్పటికి రద్దీగావున్న నగర జీవనం నాకంత సహజమనిపించడంలేదు. అయిననూ, లోకంలో మంచి ఇల్లు, విద్యుత్‌చ్ఛక్తి, నీళ్ల కొళాయి లేక మరుగు దొడ్లు లేకుండ నివసించే లక్షలాదిమంది, బహుశా కోట్లాది మందితో పోల్చితే నేనెంతో మెరుగ్గా నివసిస్తున్నానని నేను అంగీకరిస్తున్నాను. నిశ్చయంగా మనకు మంచి విధానం మంచిలోకం, మంచి జీవనం అవసరము.—కిన్ కుర్న్ చెప్పిన గాథ. (g91 11/8)