బ్రెసీల్యా—ఇటీవలే జన్మించినది, భిన్నమైనది, వేగంగా పెరుగుతున్నది
బ్రెజిల్‌లోని తేజరిల్లు! విలేఖరి
దేశ రాజధాని నగరానికి ఒరిజినల్ పథకాలు వేసిన డిజైనర్‌కు ఫోన్ చేయగల్గేది ఏ దేశంలో? రాజధానిలోని మొదటి ప్రభుత్వ కట్టడాలకు రూపకల్పన చేసి, ఆ పనిని సూపర్వైస్ చేసిన వాస్తుశిల్పిని మీరు ఎక్కడ కలవగలరు? మీరు రాజధాని నగరంలో నడుస్తుండగా, మీకు కనిపించినవారిలో 40 ఏండ్లకు పైబడినవారెవరైనా సరే అక్కడ జన్మించనివారేనని మీరు నిశ్చయం కలిగివుండగల నగరమేది? బ్రెజిల్ రాజధానియైన బ్రెసీల్యానే ఆ నగరం—ఇటీవలే జన్మించిన, అనుపమానమైన నగరం. దగ్గరి నుండి చూడదగిన నగరం అది.a
ఎంతోకాలంగా ఉన్న ప్రస్తావన
సావో పౌలో నుండి బ్రెసీల్యాకు వెళ్ళేందుకు విమానంలో దాదాపు ఒకటిన్నర గంట పడుతుంది. సౌకర్యప్రదమైన బస్సులో వెళ్ళడానికి సుమారు 12 గంటలు పడుతుంది. నేను బస్సులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల నగర చరిత్రను చదివేందుకు కావలసినంత సమయం దొరికింది.
18వ శతాబ్దాంతంలో, పోర్చుగీసుల పరిపాలనకు వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటు సంస్థీకరించబడిన సమయం నుండే బ్రెజిల్లో క్రొత్త రాజధానిని నిర్మించాలన్న కోరిక ఉంది. 1822లో బ్రెజిల్‌కు స్వాతంత్ర్యం లభించి ఎంతో కాలం గడవక ముందే, బ్రెజిలియన్ రాజనీతి విశారదుడు జూసీ బునీఫాస్యూ డీ అండ్రాడా ఈ సీల్వా, ఈ భావి రాజధానికి బ్రెసీల్యా అనే పేరు పెట్టాలని సూచించారు. అయితే ఈ పేరు అప్పటికే ఉపయోగించబడింది. అంటే 17వ శతాబ్దపు మ్యాప్ నిర్మాతలు యావత్ దేశాన్ని సూచించేందుకు ఆ పేరును అప్పటికే ఉపయోగించారు.
సెంట్రల్ హైల్యాండ్ ప్లెయిన్లోని చెట్లులేని 5,400 చతురస్ర మైళ్ళ స్థలానికి సరిహద్దు గుర్తులు వేయాలని దేశపు క్రొత్త రాజ్యాంగం 1891లో స్పష్టం చేసింది. తీరప్రాంతం నుండి 600 మైళ్ళ దూరంలో ఉన్న ఆ సమభూమిలో ఆ క్రొత్త రాజధాని నిర్మించబడనుంది. రియో డి జెనీరో నుండి దేశ రాజధానిని తరలించడం దేశపు అంతర్భాగాన ఉన్న పెద్ద ప్రదేశపు పురోగతికి ప్రేరణనిస్తుందని రాజకీయవేత్తలు వాదించారు. అయితే, ఏ చర్యా తీసుకోకుండానే మరో 50 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు, 1955లో, ఎంతో కాలంగానున్న ప్రస్తావన ముగిసి, క్రియాశీల అధ్యాయం ఆరంభం కానుంది.
పోటీ మరియు పథకం
ఆ సంవత్సరం, తాను అధ్యక్షుడుగా ఎన్నుకోబడినట్లైతే, తన కాలవ్యవధి ముగియక ముందే క్రొత్త రాజధాని అక్షరాల సాక్ష్యాత్కరించబడుతుందని అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థియైన జూసెలీనూ కూబీచెక్ వాగ్దానం చేశాడు. 1956 ఏప్రిల్‌లో, కూబీచెక్ ఎన్నుకోబడ్డాడు.
కొన్ని నెలల ముందు, ప్రభుత్వం ఒక పోటీని ప్రకటించింది: బ్రెజిల్‌లోని వాస్తుశిల్పులు, ఇంజనీర్లు, నగర ప్లానర్లు క్రొత్త రాజధాని నమూనా కొరకైన పథకాలకు రూపకల్పన చేసేందుకు ఆహ్వానించబడ్డారు. కేవలం కొన్ని నెలల్లోనే, 26 మంది అభ్యర్థులు తమ అభిప్రాయంలో ఆదర్శ రాజధాని ఎలా ఉండాలో తెలిపారు. 1957 మార్చ్‌లో, అంతర్జాతీయ జ్యూరీ విజేత పేరును ప్రకటించింది. విజేత పేరు లూస్యూ కొస్టా.
మిగతా అభ్యర్థుల్లా కాక, కొస్టా తన దృష్టిలోని క్రొత్త రాజధానిని సూచిస్తూ, కేవలం కొన్ని పేపర్లనే తీసుకుని వాటిమీద వ్రాసి, స్కెచ్లను గీసి, పూర్తి నగర నమూనాను మనిలా కవర్లో పంపించాడు! తను చాలా చిన్న అవుట్‌లైన్ పంపినందుకు క్షమాపణ తెలుపుతూనే, ఇలా జతచేశాడు: “ఇది తగనిదైతే, దీనిని పారవేయడం సులభంగా ఉంటుంది, నేను నా సమయాన్ని గానీ మరెవరి సమయాన్ని గానీ వృథా చేసినవాడనూ కాను.” అయితే, జ్యూరీకి ఆయన వేసిన ప్లాన్ నచ్చింది. అది “స్పష్టంగా, సూటిగా, ముఖ్యంగా సరళంగా” ఉంది అని నిర్ణయించారు. ఆయన ప్లాన్ దేనిని ప్రతిపాదించింది. అది కాంక్రీట్ నగరంగా ఎలా రూపుదిద్దుకుంది?
మట్టిలో “ఏర్ప్లేన్”
దానిని కనుగొనడానికి చక్కని మార్గం, మ్యూసేవు వీవూ డా మెముర్యా కాండాంగాను (లైవ్ మ్యూసియమ్ ఆఫ్ కాండాంగో మెమరీ) సందర్శించడమే. ఇప్పుడు మ్యూజియమ్‌గా ఉన్న ఈ కట్టడం రాజధానిలోని మొదటి ఆసుపత్రిగా ఉండేది గనుకనే, ఈ కట్టడాన్ని అక్షరార్థంగానే బ్రెసీల్యా ఉయ్యాలతొట్టి అని చెప్పవచ్చు. 40 సంవత్సరాల క్రితం బ్రెసీల్యాలో పుట్టిన మొదటి పిల్లలు తమ జీవితాన్ని ఆరంభించింది ఇక్కడే. అయితే, ఈ మునుపటి ఆసుపత్రి బ్రెసీల్యా జననాన్నీ, బాల్యాన్నీ గురించిన కథ చెబుతుంది. అది “మట్టి, క్యాన్వాస్, మరియు కాంక్రీట్ల” కథ అని మ్యూజియమ్‌లోని ఒక బోర్డుమీద కనిపిస్తుంది.
ఆ మ్యూజియమ్ సిబ్బందిలో సభ్యురాలైన లావురటీ మాషాడూ అది కేవలం “మట్టి”గా ఉన్న కాలంలోకి నన్ను తీసుకువెళ్ళారు. 1957లో తీసిన, చెట్లు లేని ఖాళీస్థలం గుండా వెళ్తున్న రెండు మట్టి రోడ్లు మనుష్యులు అంతగా లేని మారుమూల ప్రాంతంలో కలుసుకుంటున్న ఒక చిత్రం ముందు ఆమె ఆగారు. “ఈ ఫోటో, ఈ నగర నిర్మాణంలోని మొదటి మెట్టును సూచిస్తుంది” అని ఆమె చెప్పారు. తర్వాత, కొస్టా గీసిన స్కెచ్‌ను చూస్తే, ఆ చెట్లులేని ప్రాంతాన్ని వంపుగా మలచాలనే ఉద్దేశంతో ఆయన (ఆ అర్బనిస్ట్) ఆ రోడ్లలో ఒక రోడ్డును వంపుగా మలచాడని మనకు కనిపిస్తుంది. తర్వాత, కాండాన్గుస్b అని పిలువబడే పనివారు ఆ విధంగానే దాన్ని చేశారు. దానితో ఆ మట్టిలో ఏర్ప్లేన్ ఆకృతి ఏర్పడింది.
ఆ అసాధారణమైన ఆకృతి బ్రెసీల్యా నమునాగా ఉండిపోయింది. ఏర్ప్లేన్ కాక్‌పిట్ తూర్పుదిశవైపుగాను, వంపుగల దాని రెక్కలు ఉత్తర దక్షిణ దిశల వైపుగాను ఉన్నాయి. ప్రభుత్వపు మూడు శాఖలు కాక్‌పిట్ భాగంలో ఉన్న కట్టడాల్లో ఉన్నాయి. వ్యాపార ప్రాంతం దాని బాడీ స్థానంలో ఉంది. నివాస ప్రాంతాలు రెక్కల భాగంలో ఉన్నాయి.
క్యాన్వాస్ నుండి కాంక్రీట్‌కు
మ్యూజియమ్‌లోని, “క్యాన్వాస్,” “కాంక్రీట్” భాగాలు బ్రెజిల్‌లోని పనివారందరు నిర్మాణ స్థలానికి ప్రయాణమయ్యేందుకు తమ సొత్తులను అమ్ముకున్న కథనాన్ని చెబుతాయి. ‘మా నాన్నగారు ఒక ట్రక్కు కొన్నారు, మా కుటుంబంలోని వారినందరినీ—20 కన్నా ఎక్కువ మందిమి—తీసుకుని, ఇక్కడికి చేరుకునేందుకు ఆయన 19 రోజులు ట్రక్కు నడిపారు’ అని 1957 ఆగస్టులో అక్కడికి చేరుకున్న ఒక పనివాడు గుర్తు చేసుకుంటున్నాడు. ఇతరులు బస్సులో లేదా ఎడ్లబండిలో లేదా దారిలో కనిపించిన వాహనాల్లో ప్రయాణం చేసి వచ్చారు. మొత్తం 60,000 మంది పనివారు నిర్మాణ స్థలానికి చేరుకున్నారు.
ఈ నిర్మాణ గుంపు క్యాన్వాస్లతో చేసిన గుడారాల్లో నివసించడం అత్యవసరం అయ్యింది. ఎందుకంటే, నగర ప్రారంభోత్సవ తేదీ 1960, ఏప్రిల్ 21గా నిర్ణయించబడింది. దానర్థం, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, నిర్మాణ పనివారు 1,000 రోజుల్లో రాజధాని నగరాన్ని సిద్ధం చేయవలసి ఉంది—మహత్తర కార్యమే! అయితే, ప్రారంభోత్సవ రోజు కన్నా చాలా రోజులకు ముందే పనివారు పనిని ముగించేశారు. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ వయస్సుగల రాజధాని చెట్లులేని మనుష్యులు ఎక్కువగా లేని మట్టినుండి ఊపిరి పోసుకుని పుట్టింది.
మొదటిది, అద్వితీయమైనది
బ్రెసీల్యాలో ఉన్న ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యాలయం వారికి ఆ నగరం ఎడలా, దాని నిర్మాణకుల ఎడలా ప్రశంసాభావం ఇప్పటికీ ఉంది. “కొస్టా ప్లానుకు మల్లే మరే నగర ప్లానునూ అంత యథాతథంగా పాటించిన దాఖలాలు లేవు” అని యునెస్కోలోని ఒక సాంస్కృతిక అధికారి అయిన డా. బ్రీయానీ బికా నాకు చెప్పారు. “యునెస్కో యొక్క వాల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో ప్రపంచంలోని మొదటి మరియు ఏకైక 20వ శతాబ్దపు నగరంగా బ్రెసీల్యా ఉండడానికి అది ఒక కారణం.”c
ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న సిటీల లిస్ట్‌లో ఉన్న ఏకైక సిటీ కూడా బ్రెసీల్యానే. కనుకనే, ఇది ఒక సవాలును ఎదుర్కుంటుంది అని డా. బికా అంటున్నారు. “నగరం మారుతూ ఉండగా, నగరపు మొదటి ప్లాన్‌ను మనమెలా పరిరక్షించగలం?” వాస్తుశిల్పియైన లూస్యూ కొస్టా బ్రదికి ఉన్నప్పుడు, ఆయన తన 90వ పడిలో ఉన్నప్పటికీ ఆ సవాలును ఎదుర్కున్నారు. క్రొత్త నిర్మాణాలపై ఒక కన్నుంచుతూ, తన నమూనాను అవి అతిక్రమించకుండా నిశ్చయపరచుకునేవాడు. ఉదాహరణకు, బ్రెసీల్యాలో నగర రైల్వేను నిర్మించాలన్న ప్లాన్లను గురించి కొస్టా తెలుసుకున్నప్పుడు, ట్రెయిన్లు భూమి అంతర్భాగం నుండే వెళ్ళాలని ఆయన పట్టుపట్టారు.
స్పష్టమైన దృశ్యం
ఇది నగర పర్యటనకు సమయం. మీరు మొదటిసారిగా సందర్శిస్తున్నప్పటికీ, మీరు ఎక్కడున్నారో సులభంగా గ్రహించగలుగుతారు. నగరంలో ముఖ్యంగా రెండు దారులు ఉన్నాయి. నగరపు బస్‌స్టేషన్ ఈ దారులు కలిసే చోట ఉంది. ఒక దారి పడమర నుండి తూర్పుకు వెళ్తుంది (“ఏర్ప్లేన్” తోక నుండి కాక్‌పిట్‌కు) అది హోటళ్ళకూ, థియేటర్లకూ, బ్యాంకులకు, స్టోర్లకు తీసుకువెళ్తుంది. మరొక దారి ఉత్తరం నుండి దక్షిణానికి (ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు) వెళ్తుంది. ఆ దారి నివాస ప్రాంతాల గుండా వెళ్తుంది.
బ్రెసీల్యా ఎలా ఉంటుందో చూసేందుకు తగిన స్థలం టెలివిజన్ టవర్. అది ఏర్ప్లేన్ రెక్కల వెనుక ఉన్న బాడీ భాగంలో 224 మీటర్ల ఎత్తున్న కట్టడం. ఎలవేటర్ మిమ్మల్ని నేల నుండి 75 మీటర్ల ఎత్తువరకు ఉచితంగానే తీసుకువెళ్ళి, నగర మధ్య భాగాన్ని మీకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ మధ్య భాగం ప్లానో పైలటో అనిపిలువబడుతుంది. నగరంలో వంపుగా ఉన్న పచ్చిక ప్రాంతాలను చూస్తే, చాలా విశాలంగా, నిర్మానుష్యంగా ఉండి ఆకాశం వాటిని తాకుతున్నట్లు కనిపిస్తాయి. బ్రెసీల్యా విస్తీర్ణతను చూసి మీరు ముగ్ధులౌతారు. నిజానికి, ప్రపంచంలోని మరే రాజధానిలోని నివాసుల కన్నా కూడా ఇక్కడి నివాసులకే ఎక్కువ సస్యశ్యామల ప్రాంతం ఉందని చెప్పగల్గేలా, ప్రకృతి దృశ్యాలకు డిజైనర్ అయిన రోబర్టో బూర్లీమార్క్స్ ఇక్కడ పెద్ద పెద్ద పార్కులను, పచ్చికప్రాంతాలను వేయించాడు.
తూర్పు వైపుకు వచ్చేసరికి, రోడ్డుకు ఇరువైపులా పచ్చని గడ్డి పరుచుకుని ఉంటుంది. రోడ్డు వెంబడి ఒకే విధమైన 17 కట్టడాలు ఉన్నాయి. బాక్స్‌ను పోలిన ఈ కట్టడాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క వివిధ డిపార్ట్మెంట్లకు వసతినిస్తున్నాయి. పచ్చని గడ్డికి అవతల బ్రెసీల్యా చిహ్నం కనిపిస్తుంది. అదేమింటంటే, బ్రెజిల్ యొక్క శాసనసభయైన నేషనల్ కాంగ్రెస్‌కు పుట్టినిల్లుగా ఉన్న 28 అంతస్థుల రెండు కట్టడాల క్రింది భాగాన ఒకే విధంగా ఉండే రెండు గుమ్మటాలు, ఒకటి సరిగానూ, మరొకటి తలక్రిందులుగానూ ఉండడం కనిపిస్తుంది.
నేషనల్ కాంగ్రెస్ ఆకృతి న్యూయార్క్‌లో ఉన్న యునైటెడ్ నేషన్స్ హెడ్‌క్వార్టర్స్‌ను కొంత మేరకు మీకు జ్ఞప్తికి తేవచ్చు. అయితే దానికి కారణం లేకపోలేదు. యుఎన్ కట్టడ నిర్మాణ పథకంలో భాగం వహించిన వాస్తుశిల్పుల్లో ఒకరైన ఆస్కార్ నీమెయార్ అనే బ్రెజీలియన్ వాస్తుశిల్పే ఈ నేషనల్ కాంగ్రెస్‌కూ, అలాగే బ్రెసీల్యాలోని దాదాపు అన్ని ముఖ్య కట్టడాలకూ రూపకల్పన చేశారు. ఆయన చేసిన అతి చక్కని రూపకల్పనల్లో కొన్ని—ఫారిన్ మినిస్ట్రీ (పాలాస్యు ఈటామారేటీ), మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (పాలాస్యు డా జుస్టీసా) వంటివి—నేషనల్ కాంగ్రెస్ యొక్క కవల టవర్ల ప్రక్కన ఉన్నాయి.
మీరు ఎందుకు దారి తప్పిపోరంటే
అయితే, బ్రెసీల్యా అనేది వాస్తుశిల్పకళ ఉట్టిపడుతున్న పార్కు మాత్రమే కాదు. ఇది వేలాదిమంది ప్రజలకు మంచి సౌకర్యాలుగల నివాసగృహం కూడాను. మేము నగరంలోని నివాస ప్రాంతం గుండా వాహనంలో వెళ్తుండగా, “బ్రెసీల్యాకు తరలివెళ్ళిన చాలా మంది ప్రజలు అక్కడి క్రమబద్ధమైన పరిస్థితి తమను ఇతర నగరాల్లోని అస్తవ్యస్త పరిస్థితి నుండి విముక్తి పొందమని ఆహ్వానిస్తున్నట్లు కనుగొంటారు” అని బ్రెసీల్యాలోని న్యాయవాదియైన పౌలో వ్యాఖ్యానిస్తున్నాడు.
బ్రెసీల్యాలోని నివాసులు అపార్ట్మెంట్ కట్టడాల్లో నివసిస్తారు. ఒక ప్రాంగణం చుట్టూ వరుసగా ఉండే అలాంటి కట్టడాల సముదాయం ఒక సూపర్ బ్లాక్ అవుతుంది. అలాంటి సూపర్ బ్లాక్‌ల వరుసలు నగర ఉత్తర దక్షిణ రెక్కలను నింపుతాయి. ఇంటి చిరునామాలను సులభంగా కనుక్కోవచ్చు. ఉదాహణరకు, “N-102-L” అనే నెంబర్ నగరపు ఉత్తర రెక్క భాగంలో, 102వ సూపర్ బ్లాక్‌లో, నివాస కట్టడమైన Lలో కనిపిస్తుంది. ఆ బ్లాక్ నెంబర్లు (102 నుండి 116) వరకూ అలాగే వెళ్తుంటాయని మీరు గుర్తుంచుకుంటే, మీరు రెక్కల చివర్ల వరకు వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా, మీరు దారి తప్పే పరిస్థితే రాదు.
ఒక క్రమ పద్ధతిగా ఉండేందుకూ, దగ్గర దగ్గరగా ఉండేందుకూ నివాస కట్టడాలను ఆరు అంతస్థులను మించకుండా నిర్మించారు. అంటే, ఒక పిల్లవాడు ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు, తల్లి తన అపార్ట్మెంట్ కిటికీ గుండా, “మాన్వల్, వేన్ కా!” (మాన్వల్, ఇక్కడికి రా!) అని పిలిస్తే పిల్లవాడికి వినిపించే దూరమే ఉంటుందని సెన్హోర్ కొస్టా అంటున్నారు.
పెరుగుదలవల్ల కలిగే బాధలు
ప్లాన్ ప్రకారం నగరం నిర్మించబడిందని బ్రెసీల్యా గర్విస్తున్నప్పటికీ, బ్రెసీల్యాను కట్టిన పనివారికి బ్రెసీల్యా నమూనాలో స్థానం ఇవ్వలేదు. రాజధాని ప్రారంభోత్సవం తర్వాత, పనివారు తమ సుత్తులను, మరితర పరికరాలను తీసుకుని తమ సొంత ఊర్లకు తిరిగివెళ్తారని అనుకున్నారు. అయితే, ఆసుపత్రులు, పాఠశాలలు, లేదా పని దొరికే అవకాశాలు లేని ప్రాంతానికి తిరిగివెళ్ళడం పనివారికి అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. వాళ్ళు బ్రెసీల్యాలోనే ఉండిపోవాలని కోరుకున్నారు—కానీ ఎక్కడ?
తాము నిర్మించిన ఎక్కువ అద్దెగల అపార్ట్మెంట్లలో ఉండే స్థోమత వాళ్ళకు లేదు. కనుక వాళ్ళు బ్రెసీల్యా చుట్టూ ఉన్న సస్యశ్యామల ప్రాంతపు అంచుల్లో స్థిరపడ్డారు. ఎంతోకాలం గడవకముందే, బ్రెసీల్యా కన్నా పెద్ద నగరాలు పుట్టుకొచ్చాయి. ప్లాన్ ప్రకారం నిర్మితమైన ఈ నగరంలో నేడు కేవలం 4,00,000 మంది ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. అనేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి; దాదాపు 20 లక్షల మంది నివాసులు నిజానికి ప్లాన్ ప్రకారం నిర్మితమైన ఈ నగరానికి వెలుపలే స్థిరపడ్డారు. ఈ నగర నిర్మాణ ప్లాన్కున్న ఉద్దేశం సమానత్వాన్ని స్థాపించాలన్నదే అయినప్పటికీ, ఆదాయాల్లో ఉన్న తేడాలు, ప్రజలను పూర్తిగా వేరే నగరాల్లోకి పంపాయి.
అనూహ్యమైన విధంగా జనాభా పెరిగిపోవడం వల్లా, తరగతుల మధ్య గల భేదాల వల్లా ఏ నగరంలోనైనా సాధారణంగా తలెత్తే నేరం, మరితర సామూహిక ఆర్థిక సమస్యలూ ఇక్కడా ఉత్పన్నమౌతున్నాయి. ఇటీవలే జన్మించిన బ్రెజిల్ రాజధాని అతివేగంగా పెరగడం వల్ల కలిగే అనేక బాధలను అనుభవిస్తుంది. చక్కగా ఏర్పరచిన వీధులు, క్రొత్తరకపు వాస్తుశిల్పకళ ప్రజల హృదయాలనూ ప్రవర్తననూ మార్చడానికి పర్యాప్తం కావు అన్నది స్పష్టమైంది.
“బ్రెజిల్ హృదయ”మా?
బ్రెసీల్యా నగర పొలిమేరల్లో ఉన్న హైవే ప్రక్కన వరుసగా ఉన్న ప్రకటన బోర్డులు తాము “బ్రెజిల్ హృదయ” భాగంలోకి ప్రవేశించబోతున్నట్లు లోపలికి వచ్చే ప్రయాణికులకు తెలుపుతాయి. ఆ స్లోగన్ చెబుతున్నదానిలో కొంత నిజం ఉంది. బ్రెసీల్యా భౌగోళికంగా దేశపు మధ్యభాగంలో లేకపోయినప్పటికీ, అది దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు ఒకే దూరంలో ఉంది. అయితే, ఆ స్లోగన్ యొక్క లోతైన భావం విషయమేమిటి? బ్రెసీల్యా నిజంగానే బ్రెజిల్ హృదయభాగంగా ఉందా? అభిప్రాయాలు అనేక రకాలుగా ఉన్నాయి. మీరు ఈ అనుపమానమైన నగరాన్ని సందర్శించడమే మీ ప్రశ్నకు జవాబిస్తుంది. అయితే, మీరు బ్రెసీల్యాను గురించి తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదని గుర్తుంచుకోండి. “బ్రెసీల్యా సెడూస్ గ్రాడ్వాల్మెంట్” (బ్రెసీల్యా నెమ్మదిగా ఆకట్టుకుంటుంది) అని ఒక నివాసి చెప్పినట్లు, ఈ నగరం తన గురించి తాను వెల్లడిచేసుకునేందుకు కొంత సమయాన్నివ్వండి.
[అధస్సూచీలు]
a రూపకల్పన చేసినది లూస్యూ కొస్టా. ఈ శీర్షికను తయారు చేసిన కొన్నాళ్ళకే, ఆయన 1998 జూన్‌లో 96 ఏండ్ల వయస్సులో మరణించారు.
b ఈ పదం అంగోలన్ నుండి వచ్చింది (మునుపు పోర్చుగీసువారిని వర్ణించేందుకు ఆఫ్రికన్లు ఉపయోగించిన పదం) అది తర్వాత బ్రెసీల్యా నిర్మాణ పనివారికి ముద్దుపేరుగా మారింది.
c యునెస్కో తయారు చేసిన ఆ లిస్ట్, ప్రపంచం మొత్తంలో “సాటిలేని సహజ మరియు సాంస్కృతిక ప్రాధాన్యత”గల 552 స్థలాలను పేర్కొంది.
[15వ పేజీలోని చిత్రం]
“మట్టి, క్యాన్వాస్, కాంక్రీట్”ల కథ
[క్రెడిట్ లైను]
Arquivo Público do Distrito Federal
[15వ పేజీలోని చిత్రం]
“కాండాన్గుస్”ల పరేడ్
[క్రెడిట్ లైను]
Arquivo Público do Distrito Federal
[16, 17వ పేజీలోని చిత్రం]
స్పష్టంగా కనిపిస్తున్న బ్రెసీల్యా దృశ్యం
1. మంత్రిత్వశాఖలు
2. కాంగ్రెషనల్ ఆఫీస్ కట్టడాలు
3. సుప్రీం కోర్టు
4. ప్లాజా ఆఫ్ ద త్రీ పవర్స్
5. ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు
[క్రెడిట్ లైను]
Secretaria de Turismo, Brasília
[18వ పేజీలోని చిత్రం]
ప్రపంచంలోని రాజధానుల్లోకెల్లా అత్యంత హరిత వైభవం గల ప్రాంతం