మంచు తెచ్చిన విపత్తు
“దేశ చరిత్రలోని అతి ఘోరమైన ప్రకృతి విపత్తు.” జనవరి నెలలో ఒంటారియో, క్యూబెక్, న్యూ బ్రూన్స్‌విక్ అనే కెనడా మండలాలను విధ్వంసం చేసిన మంచు తుపాను గురించి టొరొంటో స్టార్ పై విధంగా చెప్పింది. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మెయిన్‌నూ, న్యూ హామ్‌షైర్‌నూ, అలాగే వెర్మంట్‌లోని కొన్ని ప్రాంతాలనూ, న్యూయార్క్‌లోని ఉత్తర ప్రాంతాలనూ విపత్తు సంభవించిన ప్రాంతాలుగా ప్రకటించాడు.
తుపాను వల్ల సుమారు 35 మరణాలు సంభవించాయని చెప్పబడుతుంది. ఆ తుపానులో దాదాపు ఐదు రోజులు పడిన వర్షం, పడినది పడినట్లు ఘనీభవించింది. అలాంటి వర్షం సాధారణంగా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, కానీ ఈసారి, వెచ్చని గాలిపొర భూమికి దగ్గరగా ఉన్న చల్లని గాలిపైన తిష్టవేసుకుని కూర్చుంది. దానితో వర్షం ఉపరితలాన్ని తాకినప్పుడు అది వెంటనే ఘనీభవించింది. అలా అది రెండు మూడు అంగుళాల మందం గల మంచు పొరలను తయారు చేసింది. మంచు బరువు వల్ల చెట్లూ చేమలూ, పవర్ లైన్లూ, వాటికి ఊతనిచ్చే స్తంభాలూ, ట్రాన్స్‌మిషన్ పవర్లూ నేలకూలి పోయాయి. చాలా విషాదకరమైన పర్యవసానాలు కలిగాయి.
క్యూబెక్‌లో, వందలాది, పెద్ద స్టీల్ ట్రాన్స్‌మిషన్ టవర్లు ఫోయిల్ పేపర్లతో చేసినవా అన్నట్లు నేల కూలాయి. ఆతురతగల ఒక ప్రయాణికుడు ఇలా చెప్పాడు: “[టవర్] ప్లాస్టిక్‌దా అన్నట్లు మెలికలు తిరిగిపోవడాన్ని చూశాను. అది రెండు పాయలుగా పెనవేసుకుని తర్వాత బంతిలా మారి, నేలకొరిగిపోయింది. పవర్‌లైన్లు హైవే అంతటా ఉండేవి. మొదట ఒక లైన్ పడిపోయిన తర్వాత, దాని వెనక ఉన్న మిగతా మూడు లైన్లు పడిపోయాయి.”
మంచు పోగైపోవడం వల్ల 74,000 కన్నా ఎక్కువ మైళ్ళ పవర్ లైన్లు నేలమట్టం అయ్యాయి. భూమిని మూడుసార్లు వలయం చేయగల్గినన్ని పవర్ లైన్లవి! కెనడాలో, ముప్పై లక్షల నుండి నలభై లక్షల ప్రజలకు విద్యుచ్ఛక్తి సరఫరాగానీ, వెచ్చదనం గానీ లేకుండా పోయింది, కొందరైతే, మూడు వారాలో అంతకన్నా ఎక్కువగానో ఆ పరిస్థితిని ఎదుర్కున్నారు.
మెయిన్‌లో ఆన్గస్ కింగ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, అక్కడ 2,00,000 కన్నా ఎక్కువ మందికి విద్యుచ్ఛక్తి సరఫరా లేకుండా పోయింది. “ఈ స్టేట్‌ను ఇంతవరకు బాధించిన ఇటువంటి విపత్తుల్లో ఇది అతి పెద్ద విపత్తు” అని గవర్నర్ చెప్పారు. “మీ నగరాలన్నింటిలోనూ జీరో పవరే ఉంది” అని న్యూయార్క్ గవర్నర్ జార్జ్ పతకీ ఉద్ఘాటించారు.
సెయింట్ లారన్స్ నది యొక్క దక్షిణ తీరం వెంబడి ఉన్న పవర్‌లైన్ల సుమారు 30,000 కొయ్య ఊత స్తంభాలు ఆ తుపానులో ధ్వంసమయ్యాయి. న్యూయార్క్‌కు ఉత్తరాన ఉన్న ఆ నదికి సమీపంలో నివసించే జిమ్ కెల్లీ, చలితో వణుకు పుట్టించే 17 గంటల వర్షం తర్వాత, ఇలా వ్రాశారు: “మేమిక కిటికీ వెలుపలికీ చూడలేము. అది కేవలం మంచుగడ్డా లేక పొగమంచో కాదు, కానీ చాలా గట్టి మంచు గడ్డ. ఇంటి నలుదిక్కుల నుండి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.”
కెల్లీ ఇలా వివరించారు: “దూరం నుండి తుపాకీ పేలుళ్ళలాంటి చప్పుళ్ళు వినిపించాయి. ఢాం! కాసేపు నిశ్శబ్దం. మళ్ళీ, ఢాం! అని శబ్దం. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. అదిగో మళ్ళీ ఢాం, ఢాం! అనే శబ్దం.” అవి చెట్లు విరిగిపడ్డ చప్పుడని, టెలిఫోన్ స్తంభాలు విరిగిపోయిన చప్పుళ్ళని ఆయన తర్వాత తెలుసుకున్నారు.
విధ్వంసానికి గురైన తర్వాత కూడా, అక్కడి ప్రకృతి దృశ్యం మెరిసిపోతున్న అందాన్ని సంతరించుకుంది. ఒంటారియోలో రెండు వందల కోట్ల మేపుల్ చెట్లు పడిపోయి ఉంటాయన్న భయం వ్యక్తం చేయబడింది, అలా పడిపోతే, అది మేపుల్ సిరప్ పరిశ్రమకు పెద్ద దెబ్బే. మేపుల్ చెట్లను పెంచే ఒక వ్యక్తి ఇలా బాధపడుతున్నాడు: “ఆకాశంవైపుకు గురిపెట్టిన ఈటెల్లా ఉండేవి ఆ చెట్లు.”
“ఒక అందమైన యుద్ధ స్థలం”
కెనడాలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రీయల్‌ను టొరొంటో స్టార్ పై విధంగా వర్ణిస్తుంది. “ఇక్కడ వీధులు బాంబుల దాడికి గురైనట్లు కనిపిస్తున్నాయ్!” అని ఒక నివాసి చెబుతున్నాడు. కేవలం మాంట్రీయల్ ప్రాంతంలో జరిగిన నష్టమే 50 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువని అంచనావేయబడుతుంది.
ఒంటారియోలోని బెల్లివిల నివాసి ఈ విధంగా చెప్పాడు: “న్యూక్లియర్ యుద్ధం జరిగినట్లు అనిపిస్తుంది. అన్నిచోట్లా తెల్లని దుమ్ము కనిపిస్తుంది, చాలా భయానకంగా ఉంది.” ఆయన దానిని “భయానకమైన అందం” అని పేర్కొన్నాడు.
తుపాను జరిగిన తర్వాతి వారం, లక్షలాది మంది ప్రజలు విద్యుచ్ఛక్తి సరఫరా లేక, విపరీతమైన చలితో బాధపడుతుండగా, పోలీసులు ప్రజలను అపాయకరమైన నివాస స్థలాల నుండి తరలించనారంభించారు. “మనం వాళ్ళను వేడుకోవాలా లేక ఆజ్ఞాపించాలా?” అని ఒక ఆఫీసర్ అడిగారు.
“వాళ్ళు బయటికి వెళ్ళవలసిందే. అయినా సమాధానంగా చతురంగా ఉండండి” అని ఇన్‌చార్జ్‌లో ఉన్న ఒకరు అన్నారు. “మనం యుద్ధకాలంలో ఉన్నాం అని అనుకోండి” అని కూడా ఆయన అన్నారు.
తృటిలో తప్పిన వైపరీత్యాలు
పవర్ పోవడంతో, మాంట్రీయల్‌లో దాదాపుగా ఎక్కడా కూడా ట్రాఫిక్ లైట్లు వెలగలేదు, భూగర్భ రైల్వే విధానం ఆగిపోయింది. తుపాను జరిగిన చివరి రోజుకెల్లా, ఆ నగరానికి సేవలు అందిస్తున్న ఐదు ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌లలో నాలుగు పాడైపోయాయి, లేదా విధ్వంసమయ్యాయి. వాటి పర్యవసానాలేమై ఉండవచ్చు?
“మధ్యాహ్నంపూట మా ముందు ఎలాంటి పరిస్థితి ఉందంటే కొద్ది గంటల్లో మాంట్రీయల్ అంతటా కరెంటు పోవచ్చు, అంతే కాదు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడేలా ఉంది” అని క్యూబెక్ ప్రధానమంత్రి లూస్‌యాన్ బూషార్ వివరించారు. కరెంట్ లేనందువల్ల, “నీటిని వడగట్టే రెండు ప్లాంట్లు ఆగిపోయాయి, ఇంక రెండు గంటలకు సరిపోను నీళ్ళే ఉన్నాయి.” క్రొవ్వొత్తులను ఉపయోగిస్తున్న, నీళ్ళు దొరుకుతాయన్న ఏ నిరీక్షణా లేకుండా ఉన్న ప్రజలకు విపత్తు కలిగే అవకాశం ఎక్కువ.
రెండు వారాల తర్వాత, జనవరి 24న యెహోవాసాక్షుల మాంట్రీయల్ అసెంబ్లీ హాల్‌లో సర్కిట్ అసెంబ్లీకి 1,889 మంది సమావేశమైనప్పుడు మరో విపత్తును తప్పించుకోవడం జరిగింది. ఒక్క రాత్రిలోనే, పది అంగుళాలు ఉన్న తేమగల మంచుపొర మాంట్రీయల్‌ను కప్పివేసింది, ఉదయం అసెంబ్లీ కార్యక్రమం సమయాన, హాల్ లోకప్పూ, గోడలూ దెబ్బతిన్నట్లు గమనించారు. మధ్యాహ్న కార్యక్రమం రద్దుచేయబడింది. ఇంటికి వెళ్ళి, బట్టలు మార్చుకుని, అసెంబ్లీ హాల్‌కు తిరిగివచ్చి, పనిచేయవలసిందిగా హాజరైనవారికి మనవి చేయబడింది.
ఒక్క గంటలోనే 300 మంది స్వచ్ఛందసేవకులు పారలనూ, పలుగులనూ, మరితర పరికరాలను తీసుకుని వచ్చి 77,000 చదరపు అడుగుల కప్పును శుభ్రం చేయనారంభించారు. ఉపరితలాన ఉన్న మంచును తీసివేసిన తర్వాత, అనేక చోట్ల ఉన్న మంచు 60 సెంటీమీటర్ల కన్నా మందంగా ఉందని కనుగొనబడింది! మంచు గడ్డను చతురస్ర ముక్కలుగా కోసేందుకు మర రంపాలను ఉపయోగించారు. వాటిని హాల్ కప్పు చివరకు లాగి క్రింద పడవేశారు. సుమారు 1,600 టన్నుల మంచును, మంచుగడ్డనూ తొలగించడం జరిగింది! దాని ఫలితంగా లోకప్పు పూర్వస్థాయికి చేరుకుందనీ, గోడల్లో విడిపోయిన భాగాలు తిరిగి కలుసుకున్నాయనీ తర్వాతి పరిశోధన తెలిపింది. కార్యక్రమం ఆదివారం ఉదయం సురక్షితంగా పునరారంభమైంది.
వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు
నిజమే, ఆ ప్రాంతంలోని కొందరు వర్షమూ చలీ ఉన్న ఆ సమయంలో ఇతరుల దుఃస్థితి నుండి లాభం గడించాలని చూశారు. కానీ మొదటి శతాబ్దంలోలాగా, అనేకులు “చేసిన ఉపచారమింతంతకాదు.” (అపొస్తలుల కార్యములు 28:2) “సంస్థీకరించేందుకు వాటర్‌టౌన్‌లోని రాజ్యమందిరంలో కలుసుకున్న పురుషులు వేర్వేరు సభ్యుల ఇండ్లకు వెళ్ళడానికి నియమించబడ్డారు. కానీ వాళ్ళు వాళ్ళ పొరుగువారికీ, వీధిలో అక్కడా ఇక్కడా ఉన్న వారికి కూడా సహాయం చేయడం మొదలు పెట్టారు” అని ప్రజలకు సహాయం చేయడానికి బయలుదేరిన యెహోవాసాక్షుల గురించి న్యూయార్క్‌లోని రోమ్‌లోని ద డెయిలీ సెన్టినల్ ఆఫ్ రోమ్ చెబుతుంది.
“ఆడమ్స్, పాట్స్‌డమ్, మలోన్, ఉగ్‌డన్స్‌బర్గ్, ప్లాట్స్‌బర్గ్, మాసానా, గవర్నుర్, ఎలన్‌బర్గ్‌ల మండలాల్లోని” ప్రజల కోసం సహాయ కార్యక్రమాలు సమన్వయపరచబడ్డాయని ఆ శీర్షిక చెబుతుంది. కొందరు స్వచ్ఛంద సేవకులు ఫర్నేస్‌లను వేడి చేసేందుకు జెనరేటర్లను ఉపయోగించి ఇండ్లకు కొన్ని గంటలు వెచ్చదనాన్నిచ్చారు. తుపాను తర్వాత అనేక స్థలాల్లో ఉష్ణోగ్రత సున్నా కన్నా తక్కువయిపోయిందన్నది విషాదకరమైన విషయం.
ఒకసారి, సాక్షులు ఇండ్లను సందర్శిస్తుండగా, పోలీసులు వాళ్ళను దొంగలని అపార్థం చేసుకున్నారు. తాము ఏమి చేస్తున్నారో సాక్షులు వివరించినప్పుపడు, తన తండ్రి యెహోవాసాక్షి కాకపోయినప్పటికీ, మాంట్రీయల్‌లో నివసిస్తున్న ఆయనకు తుపాను తర్వాత యెహోవాసాక్షులు సహాయం చేస్తూ వచ్చారని ఆ పోలీసుల్లో ఒకరు చెప్పారు. ఇవ్వబడిన ఆ సహాయానికి ఆ కుమారుడు తన మెప్పుదలను తెలియజేశాడు.
ముఖ్యంగా “ట్రయాంగిల్ ఆఫ్ డార్క్‌నెస్” (చీకటి త్రికోణం) అని పిలువబడే దక్షిణ మాంట్రీయల్‌లోని 100 పట్టణాలు తుపాను వల్ల తీవ్రంగా బాధించబడిన ప్రదేశాలు. తుపాను జరిగిన పది రోజుల తర్వాత కూడా ఈ పట్టణాల్లో విద్యుచ్ఛక్తి సరఫరా లేకుండా పోయింది. నిజానికి, చాలా మంది, ఒక నెల కన్నా ఎక్కువ రోజులు విద్యుచ్ఛక్తి సరఫరా లేక బాధపడ్డారు! ఈ ప్రాంతంలోని వారికి సహాయం చేసేందుకు టొరొంటోలోని యెహోవా సాక్షుల బ్రాంచ్ ఆఫీస్ ప్రత్యేక సందర్శనాలను జరిపే ఏర్పాట్లను చేసింది. దీపాలకు కావలసిన ఆయిల్‌నూ, బ్యాటరీలనూ, ఫ్లాష్‌లైట్లనూ నిర్ణయించబడిన పంపిణీ కేంద్రానికి ట్రక్కులో పంపించి, అవసరతలో ఉన్నవారికి వాటిని అక్కడి నుండి సరఫరా చేశారు.
ఈ ప్రాంతాల్లో జీవిస్తున్న వారి అవసరాలు ఏమిటో నిర్ధారించేందుకు క్రైస్తవ పెద్దలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గుంపు పెద్దలు ఒక్క వారంలోనే 11 సంఘాలను సందర్శించి, అనేక ప్రోత్సాహకరమైన మీటింగ్‌లను జరిపారు. ఆధ్యాత్మిక ప్రోత్సాహం ఇవ్వబడిన ఈ కూటాల తర్వాత, ఎవరూ ఇంటికి తిరిగి వెళ్ళాలని కోరుకోలేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ, సంఘటనలను పోల్చుకుంటూ, సహవాసాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయారు. నిజానికి తుపాను తర్వాతి కూటాల క్రమ హాజరు మునుపెన్నటికన్నా ఎక్కువగా ఉంది.
వేడి చేసుకునే వనరు, అంటే కట్టెలు ఉన్న లేదా విద్యుచ్ఛక్తినిచ్చే జెనరేటర్ ఉన్న అనేకులు తమ ఇంట్లో వెచ్చదనాన్నిచ్చే వనరు ఏ మాత్రం లేని వారిని ఆహ్వానించారు. కొంత మంది సాక్షుల ఇండ్లలో అయితే 20 మంది దాకా నివసించారు. విద్యుచ్ఛక్తిని కోల్పోయిన ఆ ప్రాంతానికి వెలుపల ఉన్న అనేకులకు కూడా వసతి ఇవ్వబడింది. ఉదాహరణకు, “ట్రయాంగిల్ ఆఫ్ డార్క్‌నెస్”కు 500 మైళ్ళ దూరంలో ఉన్న నగరమైన సెప్ట్‌ల్స్‌లోని సాక్షులు 85 కుటుంబాలకు వసతిని ఇచ్చారు.
రిమోస్కీ వంటి సుదూర మారుమూల ప్రాంతాల్లోని సాక్షులు చెట్లను నరికి కలపను రవాణా చేశారు. కొందరు సమయం తీసుకుని దుంగలపైన లేఖనాలు వ్రాసి మరీ పంపారు. ఒక సాక్షి తనకు బహుమానంగా వచ్చిన దుంగను సాక్షికాని పొరుగువ్యక్తితో పంచుకున్నారు. “యెహోవా నన్ను రక్షించును” అన్న కీర్తన 55:16 వ్రాయబడి ఉన్న దుంగ ఆ వ్యక్తికి లభించింది. ఆ దుంగను తన చేతిలో పట్టుకుంటూ, దాన్ని చూసి, “యెహోవా, నీకు కృతజ్ఞతలు” అని ఆయన అన్నాడు.
వీటన్నింటిలో ఉన్న గుణపాఠాలేమిటి?
విద్యుచ్ఛక్తి పోతుండడం వల్లా, తాము దానిపై అంతగా ఆధారపడడం వల్లా అనేకులు నిర్ఘాంతపోయారు. “మేము క్రొత్త ఇల్లు కట్టిస్తే, కట్టెల పొయ్యి ఉంటుందీ, ఒక జెనరేటర్ ఉంటుంది, . . . ఒక గ్యాస్ స్టవ్ కూడా ఉంటుందని అంటున్నాను” అని ఒక వ్యక్తి అంటున్నాడు.
తుపాను జరిగిన దాదాపు ఆరు వారాల తర్వాత, ఒక వ్యాఖ్యాత ఇలా చెబుతున్నాడు: “మంచుగడ్డ చాలా ఉండేది. చిమ్మ చీకటిగా ఉండేది, ఆలోచించేందుకు బోలెడంత వ్యవధి ఉండేది. టీ.వీ. పని చేయదు కనుక, ఆ పని సులభంగా జరుగుతుంది.” తర్వాత ఆయన ఇలా పేర్కొంటున్నాడు: “వాతావరణశక్తుల వల్ల మనమెంతగా దెబ్బతింటామన్న వాస్తవానికి ఆశ్చర్యపోయాం.”
ప్రస్తుత విధానాన్ని తీసివేసిన తర్వాత భూమిని భూగోళవ్యాప్త పరదైసుగా పునఃస్థాపిస్తానన్న సృష్టికర్త వాగ్దానాన్ని బైబిలు విద్యార్థులు తలపోస్తారు. ఆయన ఒకప్పుడు అలాంటి ఒక లోకాన్ని మునుపు తుడిచిపెట్టాడు కూడా. (మత్తయి 24:37-39; 2 పేతురు 2:5) తన శక్తిమంతమైన ఆయుధ గిడ్డంగిని చూపిస్తూ, “నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను [ఘనీభవించే వర్షపు నీటితో సహా] నీవు చూచితివా?” అని దేవుడు అడుగుతున్నాడు.—యోబు 38:22, 23.
[16వ పేజీలోని చిత్రం]
ట్రాన్స్‌మిషన్ టవర్లు ఫోయిల్ పేపర్లకు మల్లే చుట్టుకుపోయాయి
[17వ పేజీలోని చిత్రం]
స్వచ్ఛంద సేవకులు అసెంబ్లీ హాల్ కప్పు నుండి హిమమునూ, మంచుగడ్డనూ తొలగించడం ద్వారా రాబోయిన విపత్తును తప్పించారు
[17వ పేజీలోని చిత్రం]
తుపాను బాధితులకు కలప