పుడమిపై నాకున్న ప్రేమ సదా తృప్తి చెందుతుంది
డొరతీ కన్నెలీ చెప్పినది
నేను ఆదిమవాసిని గనుక నరకానికి వెళ్తావని చిన్నప్పుడు నాకు చెప్పారు. సంవత్సరాల తర్వాత, 1936లో, బైబిలు ప్రసంగాల రికార్డును విన్నాను. అది నాలో నరకాగ్ని భయాన్ని ఆర్పివేసి, నిరీక్షణ జ్వాలను రగిలించింది. ఆ జ్వాల ఇప్పుడు మునుపెన్నటికన్నా మరింత ఉజ్జ్వలంగా ఉంది. ఎందుకో వివరించే ముందు, నా గురించి కొంత చెబుతానుండండి.
నేను బహుశా 1911లో జన్మించి ఉంటాను. “బహుశా” అని ఎందుకంటున్నానంటే, ఆ రోజుల్లో ఆదిమవాసులు తేదీల గురించి బర్త్ సర్టిఫికెట్ల గురించీ అంత పట్టించుకునేవారు కాదు. నా తల్లిదండ్రులు కష్టించి పనిచేసేవారు, దైవంభయంగల వాళ్ళు. ఆస్ట్రేలియాలోని మధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని మెరకపల్లాలుగల, అందమైన కార్నర్వన్ పర్వత శ్రేణికి సమీపాన ఉన్న స్ప్రింగ్‌సర్ అనే చిన్న పట్టణంలో మేము నివసించేవాళ్ళం.
నా తండ్రి శ్వేత జాతీయుల ఒక కుటుంబంలో రోమన్ క్యాథలిక్ విశ్వాసంలో పెరిగారు. అయినప్పటికీ ఆదిమవాసులైన నా తల్లిదండ్రులు నాలో స్వదేశ ఆచారాలనూ, భూమి ఎడల ప్రేమను నా మనస్సులో నాటారు. మేము కంగారూలనూ, ఎమూ పక్షులనూ, సముద్ర తాబేళ్ళనూ, పాములనూ వేటాడేవాళ్ళం. చేపలను, విచెటీ గ్రబ్‌లను (తినే పెద్ద కాటర్‌పిల్లర్‌లు) పట్టేవాళ్ళం. నేను ఎమూలు తినేదాన్నికాను. మా కుటుంబంలో, ఎమూ నాకు మాత్రమే నిషిద్ధం. ఎందుకంటే అది నా వ్యక్తిగత గణచిహ్నం. ఆదిమవాసుల సాంప్రదాయం ప్రకారం, లేదా “డ్రీమ్‌టైమ్” ప్రకారం, మా తెగలోని ప్రతి ఒక్కరికీ సొంత గణచిహ్నం ఉంటుంది, ఆ నిషిద్ధాన్ని కుటుంబమూ, మా తెగా అమలులో పెడుతుంది.
గణచిహ్నవాదం మూఢవిశ్వాసంలో వేళ్ళూనినదైనప్పటికీ, ఈ విధంగా పవిత్రీకరించడం, ప్రాణం యొక్క పవిత్రతను గుర్తు చేసేది. ఆదిమవాసులు సరదా కోసం ప్రాణులను చంపేవారు కాదు. నేను చిన్నప్పుడు గొల్లభామ జాతి పురుగు రెక్కలను విరగ్గొడుతుండగా పట్టుబడిన నేను నాన్న కోపోద్రేకానికి గురై కుంచించుకుపోవడం నాకు గుర్తుంది. “అది చాలా ఘోరమైన పని!” “దేవుడు క్రూరత్వాన్ని ద్వేషిస్తాడని నీకు తెలియదా? ఎవరైనా నీ రెక్కలను విరగ్గొడితే నీకెలా అనిపిస్తుంది?” అని నాన్నగారు కేకలేశారు.
మాకు చాలా మూఢవిశ్వాసాలు ఉండేవి. ఉదాహరణకు, విల్లీ వాగ్‌టెయిల్ (ఒక చిన్న పక్షి) మా క్యాంపులో తిరుగుతూ ఉన్నట్లయితే, దానర్థం ఏదో చెడువార్త వినబోతున్నామనీ; లేదా ఒక గుడ్లగూబ దగ్గర్లో ఒక చెట్టు మోడు మీద పగలు కూర్చుని కనిపిస్తే ఎవరో చనిపోతారనీ నమ్మేవాళ్ళం. కొన్ని కలలను అపశకునాలుగా కూడా దృష్టించేవాళ్ళం. ఉదాహరణకు, కలలో మురికి నీరు కనిపించిందంటే, కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగోలేదనీ, మట్టితోపాటు నీళ్ళు కదులుతున్నట్లయితే ఎవరో చనిపోయి ఉంటారని అనుకునేవాళ్ళం. నిజమే, మేము క్యాథలిక్కులమే. కానీ మా తెగవారి మూఢవిశ్వాసాలేవీ మమ్మల్ని వీడలేదు.
మా కుటుంబం ఆదిమవాసుల భాషను కూడా మరిచిపోలేదు. అయితే, ఇప్పుడు, అది అంతరించబోతున్న అనేక భాషల్లో ఒకటి. అయితే, ఇప్పటికీ, బైబిలు గురించి ఇతరులతో మాట్లాడుతుండగా, అప్పుడప్పుడు దానిని ఉపయోగించగల్గుతున్నాను. అయితే, ఎక్కువగా నేను ఇంగ్లీష్‌లో లేదా స్థానికంగా ఉపయోగిస్తున్న సరళ భాషలో మాట్లాడుతాను.
బాల్యంలో విలువైన తర్ఫీదు
నాకు పదేండ్లున్నప్పుడు, మా కుటుంబం, స్ప్రింగ్‌సర్‌కు 20 మైళ్ళ దూరంలో గొర్రెలదొడ్డి లేదా పశుపాలన క్షేత్రంపై ఆధారపడేది. ప్రతిరోజూ, నా పనులను నిర్వహించేందుకు గొర్రెలదొడ్డికి ఒకటి లేదా రెండు మైళ్ళు నడిచేదాన్ని. ఒక క్యాన్ నిండా పాలూ, ఒక బ్రెడ్డూ నాకు రోజూ దొరికే జీతం. సాంప్రదాయక నివాసాలైన బెరడుతో చేసిన గుడిసెల్లో మా కుటుంబం నివసించేది. వర్షం పడినప్పుడు, దగ్గర్లో ఉండే గుహల్లో రాత్రులు నిద్రపోయేవాళ్ళం. ఈ సాధారణ జీవితం చాలా బాదరబంధీగా ఉందని నేను భావించానా? లేదు. శతాబ్దాలుగా ఆదిమవాసుల జీవిత విధానం అలాగే ఉండేది, మేము దానిని అనుసరిస్తూ వచ్చాం.
నిజానికి, మా జీవితం వడ్డించిన విస్తరిగా ఉండనందుకు సంతోషిస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు క్రమశిక్షణ ఇచ్చేవారు. వాళ్ళు నాతో పని చేయించేవారు, నేల నుండి నన్ను నేను ఎలా పోషించుకోవాలో నాకు నేర్పించారు. 1934లో, మేము క్వీన్స్‌ల్యాండ్‌లోని ఊరబిండాకు సమీపాన మాకు కేటాయించబడిన స్థలానికి తరలివెళ్ళాక, నేను మొదటిసారిగా, ఇల్లు వదిలి పెట్టి, పశువుల కొట్టంలో పనిచేసేందుకు ఇంటిపనులు చేసేందుకూ, మరితర చేతిపనులు చేసేందుకూ పశ్చిమంగా వెళ్ళాను. నా పని చివరకు నన్ను తూర్పువైపుకు, రాకామ్టన్ నగర తీరప్రాంతం వెలుపలకు తీసుకువెళ్ళింది. ఐర్లాండ్ దేశస్థుని కుమారుడైన నా భర్త మార్టిన్ కన్నెలీని నేను అక్కడే కలిశాను. మేము 1939లో పెండ్లి చేసుకున్నాం. ఆయన ఇప్పుడు లేరు.
బైబిలు సత్యాన్ని నేర్చుకోవడం
నాకు బైబిలు అంటే ఎల్లప్పుడూ అపార గౌరవం ఉండేది. నా చిన్నప్పుడు, ఇంటి యజమానురాలు, మమ్మల్ని పిల్లల్నందరినీ—ఆదిమవాసి పిల్లలనూ, శ్వేతజాతీయుల పిల్లలనూ—సమావేశపరచి, మాకు యేసును గురించిన కథలు చెప్పేది. ఒకసారి, “చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి” అన్న యేసు మాటలకు అర్థాన్ని ఆమె వివరించింది. (మత్తయి 19:14) నేను నరకానికి వెళ్తానని మునుపు నాతో చెప్పడం జరిగింది గనుక, ఇప్పుడు నాలో ఒక ఆశాకిరణం కనిపించింది.
తర్వాత, మొదట్లో పేర్కొన్న ప్రకారం, రికార్డు చేసిన ప్రసంగాలను విన్నాను. నరకం వేడిగా ఉండే స్థలం కాదని విన్నాను. అది నేను ఆలోచించనారంభించేలా చేసినప్పటికీ, తర్వాత 1949 వరకూ నేను యెహోవాసాక్షులను కలవలేదు. రాకామ్టన్‌కు పడమట దాదాపు 150 మైళ్ళ దూరాన ఉన్న ఎమరాల్డ్‌లో మేము తర్వాత నివసించాం. మమ్మల్ని సందర్శించే ఆర్. బెన్నెట్ బ్రికిల్a బైబిలు గురించి మాతో మాట్లాడారు. ఆ తర్వాత బెన్ మా ప్రాంతంలోనికి వచ్చినప్పుడెల్లా మా ఇల్లు బెన్ ఇల్లయ్యేది. మార్టిన్, మా నలుగురు పిల్లలతో సహా మాకందరికీ ఆయనంటే అపార గౌరవం ఏర్పడింది. మార్టిన్ బైబిలు సందేశంలో ఆసక్తి చూపించేవారు కాదు, అయినప్పటికీ, యెహోవాసాక్షులతో, ముఖ్యంగా బెన్‌తో ఆయన ఎల్లప్పుడూ దయగా, అతిథి మర్యాదతో వ్యవహరించేవారు.
బెన్ నాకు అనేక బైబిలు పఠన సహాయకాలను ఇచ్చారు. అయితే ఒక పెద్ద చిక్కు ఉంది—నాకు చదవడం రాదు. కనుక, బెన్ ఎంతో ఓపిగ్గా బైబిలును, బైబిలు ఆధార సాహిత్యాన్ని నాకూ, పిల్లలకూ చదివి వినిపిస్తూ, అలా చదువుతుండగానే వాటి భావాన్ని మాకు వివరించి చెప్పేవారు. ఒకసారి మతాచార కర్మలను నిర్వహించిన తర్వాత, చదవడం నేర్పించేందుకు ఒక ఐదు నిమిషాలు కూడా గడపని చర్చి పాదిరీలకు ఆయనకు ఎంత తేడానో! మా సొంత జనాంగంతో పాటు మానవజాతినంతటినీ బంధించిన అనేక మూఢవిశ్వాసాల రచయితలు సాతానూ, అతని దయ్యాలేనని బైబిలు నుండి బెన్ మాకు చూపించారు. “అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” యేసు చెప్పిన మాటలను అలా గుణగ్రహించనారంభించాను.—యోహాను 8:32.
తనకు విధేయత చూపించేవారికి భూ పరదైసును ఇవ్వాలన్న దేవుని సంకల్పాన్ని గురించి తెలుసుకున్నప్పుడు నాకు భలే పులకింత కలిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా, మృతుల పునరుత్థాన విషయమై నాకెంతో ఆతృత కలిగింది; మా అమ్మ 1939లోనూ, మా నాన్న 1951లోనూ చనిపోయారు. నేను వాళ్ళను కౌగిలించుకుని, వాళ్ళు ప్రేమించిన పుడమికి వారు తిరిగి రావడాన్ని ఆహ్వానించే రోజు కోసం తరచూ ఎదురు చూస్తుంటాను. యెహోవా దేవుని గురించీ, ఆయన రాజ్యాన్ని గురించీ వాళ్ళకు బోధించడం ఎంత పులకింత కలిగించేదిగా ఉంటుందో!
నిరక్షరాస్యురాలైన ఒక బోధకురాలు
నా బైబిలు పరిజ్ఞానం పెరిగేసరికి, నేను దానిని ఇతరులతో పంచుకోవాలని కోరుకున్నాను. నేను నా బంధువులతోను, మిత్రులతోను మాట్లాడాను. అయితే నేను నా పరిచర్యను విపులీకరించుకోవాలనుకున్నాను. కనుక బెన్ ఈ సారి ఎమరాల్డ్‌కు వచ్చినప్పుడు, నేను పిల్లలను తొందరపెట్టాను, మేమందరం కలిసి ఆయనతో ప్రకటనా పనికి వెళ్ళాము. ఆయన నాకు సరళమైన అందింపులను చూపించాడు, ప్రార్థన ద్వారా యెహోవాపై ఎలా ఆధారపడాలో నాకు నేర్పాడు. నా అందింపు అంత చక్కగా ఉండేది కాదని నేనొప్పుకోవలసిందే. కాని అది నా హృదయాంతరం నుండి వచ్చేది.
నాకు చదువురాదని గృహస్థులకు మొదటే చెప్పేదాన్ని; ఆ తర్వాత, బైబిలులో నేను చూపించిన భాగాన్ని చదవమని వాళ్ళను కోరేదాన్ని. నేను ఆ భాగాలు కంఠతపట్టేదాన్ని. ఎక్కువగా శ్వేతజాతీయులు ఉన్న పట్టణంలో ప్రజలు నన్ను ఆశ్చర్యంతో చూసేవారు. కఠినులైనవారు తారసపడడం చాలా అరుదు. మెల్లగా, నేను చదవడం నేర్చుకున్నాను. ఇది నా నమ్మకాన్నీ, నా ఆధ్యాత్మికతనూ అధికం చేసింది!
నా మొదటి సమావేశం
1951 మార్చ్ నెలలో, నేను యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకుని నా జీవితంలో తరువాతి రెండు మైలురాళ్ళను చేరుకున్నాను; అవేవంటే, నీటి బాప్తిస్మమూ, యెహోవాసాక్షుల సమావేశానికి నేను మొదటి సారిగా హాజరు కావడమూనూ. అంటే పెద్ద నగరమైన సిడ్నీకి ప్రయాణం చేయవలసి ఉండిందన్నమాట—ఒక పల్లెటూరు వనితకు అది భయం కలిగించే విషయమే. మరో విచారకరమైన విషయమేమిటంటే, ట్రెయిన్ చార్జీలకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. మరి నేను ఏమి చేయగల్గేదాన్ని?
నేను ట్రెయిన్ చార్జీల కోసం జూదమాడి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను. ‘నేను యెహోవా కోసం ఇది చేయబోతున్నాను. నేను గెలిచేందుకు యెహోవా తప్పకుండా నాకు సహాయపడతాడు’ అని అనుకున్నాను. పేకాట కొన్ని రౌండ్‌లు ముగించేసరికి, నేను వెళ్ళి వచ్చేందుకు అవసరమైన డబ్బు వచ్చింది గనుక, ఆయనే నాకు సహాయం చేశాడని భావిం చాను.
సిడ్నీకి వెళ్ళాలన్న నా ప్లాను బెన్‌కు తెలుసు. కనుక, ఆయన ఈ సారి వచ్చినప్పడు, నా దగ్గర కావలసినంత డబ్బు ఉందా అని అడిగారు. “ఎందుకు లేదు, ఉంది! జూదమాడడం ద్వారా నాకు కావలసినంత డబ్బు వచ్చింది” అని చెప్పాను. అంతే, ఆయన ముఖం కందగడ్డలా తయారైంది. నేనేదో తప్పు చెప్పానని నాకు వెంటనే తెలిసిపోయింది. వెంటనే నన్ను నేను సమర్థించుకుంటూ, “నేనేం తప్పు చేశానని? నేను దొంగతనమేమీ చేయలేదు!” అన్నాను.
తనను తాను సంభాళించుకుని, క్రైస్తవులు ఎందుకు జూదమాడరో దయాపూర్వకంగా నాకు వివరిస్తూ, నన్ను అనునయిస్తూ “తప్పు మీది కాదు, నేను మీకు చెప్పలేదు కదా” అన్నారు.
స్వాగతించబడ్డానన్న అనుభూతినిచ్చారు
1951 మార్చ్ నెల 22-25 వరకు జరిగిన నాలుగు రోజుల సమావేశంలో నేను మొదటిసారిగా అనేక మంది సాక్షులను కలిశాను. బెన్నూ, చేతివ్రేళ్ళ మీద లెక్కపెట్టగల్గేంత కొద్ది మందీ మాత్రమే నాకు పరిచయమున్నారు గనుక, నాకెలాంటి ఆదరణ లభిస్తుందో కచ్చితంగా ఊహించలేకపోయాను. అయితే, నా భావి ఆధ్యాత్మిక సహోదర సహోదరీల ప్రవర్తనలో దురభిప్రాయాల ఆచూకీ ఏ మాత్రం కనిపించకపోవడమే కాక, వారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించినందుకు నేనెంతగా ఉత్తేజం పొందానో మీరు ఊహించగలరు. నేను నిజంగా ఇంట్లో ఉన్నట్లుగా, హాయిగా అనిపించింది.
ఆ సమావేశమూ, ముఖ్యంగా బోటనీ బేలో బాప్తిస్మం పొందిన 160 మందిలో నేను ఒకరై ఉండడమూ నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. యెహోవాసాక్షిగా మారిన మొదటి ఆస్ట్రేలియా ఆదిమవాసుల్లో నేను ఒకరినన్నది స్పష్టం. ఆదివారం వార్తాపత్రికలోనూ, అలాగే సినిమా థియేటర్లలో చూపించిన న్యూస్‌రీల్‌లోనూ నా ఫోటో వచ్చింది.
పట్టణంలోని ఏకైక సాక్షిని
నేను సిడ్నీ నుండి వచ్చి ఒక నెల అయిన తర్వాత, మా కుటుంబం మౌంట్ ఐఝకు తరలి వెళ్ళింది. క్వీన్స్‌ల్యాండ్‌లోని ఈశాన్యమున ఉన్న గనుల పట్టణమది. ఆరు సంవత్సరాలుగా, మేము పట్టణానికి వెలుపల ఉన్న ఒక పెద్ద బ్లాక్ చూసుకునేవారముగా ఒక షెడ్డులో నివసించనారంభించాం. దగ్గరిలోని అడవిలోని కలపతో మా షెడ్డుకు గోడలను నిర్మించుకున్నాం. తారు డబ్బాలను నిలువుగా కోసి వాటిని వెడల్పుగా పరచి ఇంటి కప్పుగా వేసుకున్నాం. మార్టిన్‌కు రైల్వేలో ఉద్యోగం దొరికింది. కానీ, ఆయన త్రాగుడు చివరకు ఆయన ఆరోగ్యంపై దెబ్బ తీసింది. తర్వాత, నేనే మా కుటుంబాన్నంతటినీ పోషించవలసి వచ్చింది. ఆయన 1971లో చనిపోయారు.
మొదట్లో మౌంట్ ఐఝలో నేనే ఏకైక సాక్షిని. బెన్ ప్రతి ఆరునెలలకొకసారి అలా దర్శించేవారు. ఎందుకంటే ఆయన పెద్ద సాక్ష్య ప్రదేశంలో మౌంట్ ఐఝ ఒక భాగం. ఆయన యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ సమయంలో పట్టణంలో ఉంటే, ఆయన దాన్ని మా కుటుంబంతో ఆచరించేవారు. కొన్ని సార్లు ఒక చెట్టు క్రింద ఆచరించేవాళ్ళం. క్రీస్తు మరణ జ్ఞాపకార్థం ఆయనకు చాలా ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే ఆయనకు పరలోక జీవిత నిరీక్షణ ఉంది.
సాధారణంగా బెన్ ఎక్కువ కాలం ఉండేవారు కాదు. కనుక, నేనూ, నా నలుగురు పిల్లలూ మా అంతట మేమే సాక్ష్యమిచ్చేవాళ్ళం. నిజం. మేము ఒంటరివాళ్ళమే; కానీ యెహోవా ఆత్మ మాకు శక్తినిచ్చింది. ఆయన ప్రేమపూర్వక సంస్థ కూడా శక్తినిచ్చింది. నమ్మకస్థులైన ప్రయాణ పైవిచారణకర్తలూ, వారి భార్యలు వేడినీ, ఈగలనూ, దుమ్మునూ, ఎగుడు దిగుడుగా ఉండే రోడ్లనూ సహిస్తూ మమ్మల్ని ప్రోత్సహించేందుకు మౌంట్ ఐఝకు వచ్చేవాళ్ళు. అనేక సంవత్సరాల వరకూ మా గ్రూపు చాలా చిన్నగా ఉన్నప్పటికీ వాళ్ళలా చేసేవాళ్ళు. అలాగే, 800 మైళ్ళ కన్నా ఎక్కువ దూరంలో ఉండే డార్విన్‌లో క్రొత్తగా రూపొందిన పొరుగు సంఘంలోని సాక్షులు కూడా అప్పుడు మమ్మల్ని సందర్శించేవాళ్ళు.
ఒక సంఘం రూపొందింది
మౌంట్ ఐఝలో 1953 డిశంబర్‌లో ఒక సంఘం రూపొందింది. బెన్నే ఈ సంఘ నియమిత పైవిచారణకర్త. నేనూ నా కూతురు ఆన్ మాత్రమే అప్పట్లో అక్కడ పరిచర్యలో పాల్గొనే ఇతర వ్యక్తులు. అయితే త్వరలోనే ఇతర సాక్షులు పట్టణంలోకి తరలివచ్చారు. మా ప్రదేశం కూడా పెరుగుతున్న శిష్యుల గ్రూపుకు జన్మనిచ్చింది, కాలక్రమేణా అనేక మంది ఆదిమవాసి ప్రజల నుండి కూడా శిష్యులు తయారయ్యారు.
సంఘం పెరుగుతూ వచ్చింది. మా కూటాలను జరుపుకునేందుకు ఒక రాజ్యమందిరం అవసరమని స్పష్టమైంది. 1960 మేలో, ఎంతో శ్రమతీసుకున్న తర్వాత, మేము మా సొంత క్రొత్త హాలును నిర్మించుకున్నాం. తర్వాతి 15 సంవత్సరాల్లో, దాన్ని రెండు సార్లు పెద్దగా చేశాం. కానీ 1970ల మధ్యలో, బహిరంగ పరిచర్యలో పాల్గొనేవారి సంఖ్య 120 అయ్యింది. హాలు మళ్ళీ చిన్నదైపోయింది. కనుక, 120 సీట్లుగల చక్కని రాజ్యమందిరాన్ని నిర్మించాం. అది 1981లో ప్రతిష్ఠించబడింది. ఆ హాల్ చాలా పెద్దగా ఉండడం వల్ల, సర్కిట్ సమావేశాలు అని పిలువబడే పెద్ద సమావేశాలకు కూడా ఉపయోగించబడుతుంది.
ఆదిమవాసుల్లో అభివృద్ధి
మౌంట్ ఐఝ సంఘానికి అనుబంధంగా, 1996లో ఆదిమవాసుల, ద్వీపవాసుల ఒక గ్రూపు రూపొందించబడడం నాకు ఉత్తేజాన్నిచ్చిన విషయం. ఆస్ట్రేలియాలోని ప్రధాన భూభాగానికి సమీపానవున్న దీవుల నుండి వచ్చిన ఆదిమవాసులే ఆ ద్వీపవాసులు. ఈ గ్రూపు ముఖ్య ఉద్దేశం, శ్వేతజాతీయులతో వ్యవహరించడంలో కాస్త ఇబ్బందిగా ఫీలయ్యే కొందరు ఆదిమవాసులకు మంచి సాక్ష్యమివ్వాలన్నదే.
అలాంటి దాదాపు 20 ఇతర ఆదిమవాసి గ్రూపులు ఆస్ట్రేలియా చుట్టుప్రక్కల విస్తరించి ఉన్నాయి. అంతేకాక, ఆదిమవాసి ప్రజల సంఘాలు అడెలెయిడ్‌లోనూ, కార్న్‌జ్‌లోనూ, ఇప్స్విచ్‌లోనూ, పెర్త్‌లోనూ, టౌన్స్‌విల్‌లోనూ రూపొందించబడ్డాయి. దాదాపు 500 మంది ప్రజలు—అందులో కొందరు మా కుటుంబంలోనివారు—ఈ గ్రూపులకూ, సంఘాలకూ హాజరౌతారు. ఆదిమవాసులైన ప్రచారకుల్లో దాదాపు 10 శాతం మంది పయినీర్లు లేదా పూర్తికాల పరిచారకులు!
1975లో నాకు డయబెటిస్ వచ్చింది. అనేక సంవత్సరాలుగా ఈ రుగ్మత అనేక ఆదిమవాసులను బాధించి, మూల్యం కట్టించుకుంది. చదవడం నాకు చాలా కష్టమైపోతోంది. అయితే, యెహోవా నన్ను పోషిస్తూ, నాకు ఆనందాన్నిస్తూ వస్తున్నాడు.
నాకూ, నా కుటుంబానికి అవసరమైన సపర్యలను చేసిన ధైర్యవంతులైన పరిచారకులకు నా కృతజ్ఞతలు. వారి అజేయమైన ఆసక్తి, వారి ప్రేమ, క్వీన్స్‌ల్యాండ్‌లోని మారుమూల ప్రాంతపు నిర్జనమైన రోడ్ల గుండా, ట్రాక్‌ల గుండా వారు సైకిళ్ళ మీద తీసుకువచ్చే ఆధ్యాత్మిక నిక్షేపాలు మేము సత్యం తెలుసుకోవడాన్ని సాధ్యం చేశాయి. పుడమిపై నాకున్న ప్రేమ సదా తృప్తి చెందుతుందని నమ్మకంతో ఇప్పుడు ఎదురు చూస్తున్నాను.
[అధస్సూచీలు]
a బెన్ బ్రికెల్ యొక్క గుర్తించదగిన జీవిత కథ కావలికోట సెప్టెంబర్ 1, 1972, 533-6 (ఆంగ్లం) పేజీల్లో వచ్చింది.
[13వ పేజీలోని బాక్సు/చిత్రం]
పెర్త్
డార్విన్
కార్న్‌జ్
టౌన్స్‌విల్
మౌంట్ ఐఝ
రాకామ్టన్
ఎమరాల్డ్
స్ప్రింగ్‌సర్
ఊరబిండా
ఇప్స్విచ్
సిడ్నీ
అడెలెయిడ్
నేడు డొరొతీ
[11వ పేజీలోని చిత్రం]
1950ల తొలిభాగంలో బెన్‌తో ప్రాక్టీస్ సెష్షన్‌లు