యౌవనస్థులు ఇట్లడుగుదురు. . .
నేను కాస్తంత డబ్బును ఎలా సంపాదించగలను?
“నాకు సరిపడినంత డబ్బును సంపాదించిపెట్టే ఉద్యోగం కావాలి.”—టాన్యా.
చాలామంది యౌవనస్థులు టాన్యాలాగానే భావిస్తుంటారు. “నేనొక స్కూటరు కొనుక్కోవడానికీ, బట్టలు కొనుక్కోవడానికీ నాకు డబ్బు కావాలి” అని సెర్జో అనే యువకుడు అంటున్నాడు. “నేను ప్రతీదానికీ నా తల్లిదండ్రుల మీద ఆధారపడడం నాకిష్టం లేదు.” యౌవనస్థురాలైన లోరీయాన్ పనిచేయడానికి అటువంటి కారణమే ఉంది. “నేనొక అమ్మాయిని, నాకు షాపింగ్ చేయడం అంటే ఇష్టం” అంటుందామె.
అందుకే, “[అమెరికా] హైస్కూలు జూనియర్లలోనూ, సీనియర్లలోనూ ప్రతి నలుగురిలో ముగ్గురు ఇప్పుడు స్కూలు తర్వాతా, వారాంతాల్లోనూ పోలోమని పనికి వెళ్లిపోతున్నారు” అని యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ పత్రిక నివేదించడంలో అంత ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు. కొంతవరకు ఇది, నేటి ఐశ్వర్యాసక్తిగల లోకంలో ఎంతో ప్రబలివున్న సమతుల్యాన్ని కోల్పోయిన “ధనాపేక్ష”ను ప్రతిబింబిస్తుంది. (1 తిమోతి 6:10) అయితే, డబ్బు సంపాదించాలని ప్రయత్నించే యౌవనులందరూ ఐశ్వర్యాసక్తికి లోనైనవారేనని కాదు.
“ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు అంటుంది. (ప్రసంగి 7:12) క్రైస్తవ యువతగా మీరు కొంత డబ్బును సంపాదించడానికి న్యాయమైన కారణాలే ఉండవచ్చు.a ఉదాహరణకు, యువకుడైన ఏవియన్ తాను వారానికి రెండురోజులు ఎందుకు పనిచేస్తాడన్నది వివరిస్తున్నాడు: “నేను క్రమ పయినీరుగా [పూర్తికాల సువార్తికుడు] నన్ను నేను పోషించుకోవడానికి నాకు ఇది సహాయపడుతుంది.”
పార్ట్‌టైమ్ ఉద్యోగం సంపాదించాలనుకోవడానికి అటువంటి కారణాలు మీకూ ఉండవచ్చు. బహుశ ఒక క్రైస్తవ సమావేశానికి హాజరు కావాలన్న లక్ష్యం మీకుండవచ్చు. లేకపోతే సంఘ కూటాల్లో వేసుకోవడానికి యుక్తమైన బట్టలు మీకు మరిన్ని అవసరమై ఉండవచ్చు. ఏదేమైనా, వీటన్నిటికీ డబ్బు కావాలి. నిజమే, ‘దేవుని రాజ్యాన్ని మొదట వెదికే’ వారిని దేవుడు పోషిస్తాడని యేసు వాగ్దానం చేశాడు. (మత్తయి 6:33) కానీ ఇది మీరు ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరతను తీసివేయదు. (అపొస్తలుల కార్యములు 18:1-3 పోల్చండి.) మరైతే, మీరు కొంత డబ్బును సంపాదించాల్సిన అవసరం వస్తే తీసుకోగల ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలేమిటి?
కార్యోన్ముఖులు కండి
మీ తల్లిదండ్రులు మీరు ఏదైనా పనిచేయడానికి సమ్మతించినట్లైతే, మీరు తీసుకోగల మొట్టమొదటి చర్య మీ పొరుగువారినీ, టీచర్లనూ, బంధువులనూ కలుసుకోవడమే. మీరు పనికోసం వెదుకుతున్నట్లు వారికి తెలియజెప్పండి. మీరు వారిని సూటిగా అడగడానికి మొహమాట పడుతున్నట్లైతే, వారు టీనేజ్‌లో ఉన్నప్పుడు వారేమి పని చేశారో వారిని అడగవచ్చు. వారు మీకు కొన్ని ఉపయోగకరమైన ఐడియాలను ఇవ్వవచ్చు. మీరు పని కోసం వెదుకుతున్నారని ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత ఎక్కువగా మీకు సహాయపడే సమాచారం దొరుకుతుంది, అంత ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి.
తర్వాత వార్తాపత్రికల్లో ప్రకటనలనూ, దుకాణాల్లో, మీ స్కూల్లో, మరితర బహిరంగ స్థలాల్లో నోటీసు బోర్డులనూ చూడండి. “నేను ఉద్యోగాన్ని అలాగే సంపాదించాను” అని యువకుడైన డేవ్ అంటున్నాడు. “నేను వార్తాపత్రిక చూసి, వారికి నా గురించి క్లుప్తంగా వివరిస్తూ ఫాక్స్ చేశాను, తర్వాత వారికి ఫోను చేశాను.” కానీ చాలా ఉద్యోగాల కొరకు ప్రకటనలు వేయబడవని మీకు తెలుసా? సెవెంటీన్ అనే పత్రిక ప్రకారం, “దాదాపు పది ఉద్యోగాల్లో మూడు సరిగ్గా కావల్సిన వ్యక్తి లోపలికి నడిచి వచ్చేంత వరకు ఉనికిలో ఉండవు” అని కొంతమంది అంచనా వేస్తున్నారు. అందుకని, బహుశ ఒక యజమాని మీకోసం ఉద్యోగాన్ని వెదికి పెట్టాల్సిన అవసరం ఉందని మీరు ఆయన్ను ఒప్పించగలరేమో చూడండి!
కానీ ఎలా? ‘నాకేమో అనుభవం లేదు’ అని మీరు అనవచ్చు. ఆగండి, మళ్లీ ఆలోచించండి. మీ నాన్నగారి స్కూటరును రిపేరు చేయడానికి మీరు సహాయం చేశారా? అది మీకు కాస్త మెకానికల్ నైపుణ్యం ఉన్నట్లు చూపిస్తుంది. మీకు కంప్యూటర్ ఉపయోగించడం వచ్చా? లేక ఏదైనా వినూత్నమైన ప్రాజెక్టును చేపట్టినందుకు మీకు మంచి మార్కులు వచ్చాయా? ఇవన్నీ ఉద్యోగం సంపాదించడానికి మంచి ప్లస్ పాయింట్లు.
మీ హాబీలను, మీ ఆసక్తులను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఉదాహరణకు, మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించగల్గితే, మ్యూజిక్ షాపులో ఖాళీ ఉందేమో చూడండి. మీరు షాపులోని ఉత్పత్తులపట్ల ఆసక్తి కల్గివున్నారన్నది నిర్వివాదాంశం, కాబట్టి మీరు వినియోగదారుల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మంచి స్థానంలో ఉంటారు.
ఉద్యోగం కోసం అప్లై చేయడం
ఏదైనా ఉద్యోగం కోసం మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి. మీ వస్త్రధారణకూ, కేశాలంకరణకూ అవధానమివ్వండి, ఎందుకంటే మీ రూపం మీ గురించి చెబుతుంది. అది, “బాధ్యతగలవాడు, పరిశుభ్రమైన వ్యక్తి, చక్కని వ్యవస్థీకరణ గలవ్యక్తి” అని చెప్పగలదు, లేక దానికి పూర్తి విరుద్ధంగా కూడా చెప్పగలదు. క్రైస్తవ స్త్రీలు ‘అణకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేత . . . అలంకరించుకోవాలని’ బైబిలు ప్రోత్సహిస్తున్నప్పుడు అది ఆచరణయోగ్యంగానే మాట్లాడుతుంది. (1 తిమోతి 2:9) అది పురుషులకు కూడా వర్తిస్తుంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు అది ఎటువంటి ఉద్యోగమైనా వెర్రిఫ్యాషన్‌లను అనుసరించి వస్త్రధారణ చేయకండి, లేక అపరిశుభ్రమైన బట్టలు ధరించకండి.
మీ వైఖరి, మర్యాదలూ కూడా మీ గురించి చాలానే చెబుతాయి. సువర్ణ నియమాన్ని పాటించండి: మీరు ఎలా వ్యవహరించబడాలని కోరతారో మీరూ ఇతరులతో అలాగే వ్యవహరించండి. (మత్తయి 7:12) మీ అప్పాయింట్‌మెంట్‌కి అనుగుణ్యంగా సరిగ్గా సమయానికి అక్కడ ఉండండి. ఉత్సాహంగా, చురుకుగా ఉండండి. చక్కని మర్యాదలను పాటించండి. ప్రగల్భాలు పలకకుండా లేక అతిశయోక్తులు పలకకుండా, మీరా స్థానానికి అర్హులని ఎందుకు భావిస్తున్నారో వివరించండి. నిర్దిష్టంగా చెప్పండి.
మీరు మీ గురించిన క్లుప్తమైన వివరణను స్పష్టంగా, వరుసక్రమంలో వ్రాసి మీతోపాటే తెమ్మని (లేకపోతే ముందే పంపించమని) కొంతమంది నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అందులో మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, ఉద్యోగం చేయడంలో మీ లక్ష్యం, విద్యార్హతలు (మీరు పొందిన అదనపు శిక్షణ ఏదైనా ఉంటే అది కూడా), మునుపటి ఉద్యోగ అనుభవం (జీతాన్ని పొందిన ఉద్యోగమైనా లేక స్వచ్ఛంద సేవకు సంబంధించినదైనా), ప్రత్యేక నైపుణ్యాలు, వ్యక్తిగత ఆసక్తులూ హాబీలు (ఇవి మీ సామర్థ్యాలను గురించి తెలుపుతాయి), చివరన కోరినట్లైతే అర్హతా పత్రాలు కూడా జతచేయబడతాయని ఒక చిన్న నోట్ వ్రాయండి. మిమ్మల్ని ఉద్యోగం కోసం సిఫారసు చేయగల కొంతమంది వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోను నెంబర్లతో కూడిన ఒక లిస్టును కూడా వేరేగా తయారుచేయవచ్చు. మీరు ముందుగానే వారి అనుమతి కోరడం మాత్రం మర్చిపోకండి. ఆ లిస్టులో మీ మునుపటి యజమానులు, మీ టీచరు, ఒక స్కూలు సలహాదారు, ఒక పెద్దవయస్కుడైన స్నేహితుడు—మీ నైపుణ్యాలూ, సామర్థ్యాల గురించీ, మీ వ్యక్తిత్వాన్ని గురించీ ప్రమాణం ఇవ్వగల ఎవరైనా చేరివుండవచ్చు.
మీకై మీరే పని చేయడం
మీరెంతగా ప్రయత్నించినా ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోతే అప్పుడేమిటి? ఇది చాలా దేశాల్లో సర్వసాధారణం. కానీ నిస్పృహకు గురికాకండి. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడమే మీ విషయంలో సరైన పరిష్కారం కావచ్చు. దాన్లోని ప్రయోజనాలేమిటి? మీరు మీ స్వంత షెడ్యూలు వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ కావాలంటే అంతగా లేక ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువగా పనిచేయవచ్చు. నిజమే, స్వయం-ఉపాధి కల్పించుకోవడానికి మీరు పూర్తిగా ప్రేరణపొంది, క్రమశిక్షణతో పనిచేస్తూ, చొరవ తీసుకోవడానికి సంసిద్ధతతో ఉండాలి.
కానీ మీరు ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు? మీ పొరుగువారి గురించి ఆలోచించండి. వేరే ఎవరూ అందించని వస్తు సామగ్రిగానీ లేక సేవలు గానీ ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకు, బట్టలు కుట్టడం ఇష్టమనుకోండి. కొంత డబ్బు తీసుకుని మీ పొరుగువారి బట్టలను కుట్టడమో లేక సైజుచేయడమో చేస్తానని చెప్పండి. లేకపోతే మీకు ఏదైనా వాయిద్యం వాయించడం వచ్చేమో. మీరు ఇతరులకు ఆ సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్పించగలరా? లేక ఇతరులు సాధారణంగా ఏవగించుకునే పనులైన కడగడం, శుభ్రం చేయడం వంటి పనులు చేయవచ్చేమో. ఒక క్రైస్తవుడు తన చేతులతో పని చేయడానికి సిగ్గుపడడు. (ఎఫెసీయులు 4:27, 28) మీరు ఏదైనా క్రొత్త రంగంలో కౌశలాన్ని సంపాదించడానికి ప్రయత్నించవచ్చు కూడా. గ్రంథాలయాల్లో ఫలానిది ఎలా చేయవచ్చు అనే పుస్తకాలు వెదకండి, లేక ఒక స్నేహితుడ్ని నేర్పించమని కోరండి. ఉదాహరణకు, యౌవనస్థుడైన జాషువా కాలిగ్రాఫిలో శిక్షణను పొందాడు. తర్వాత పెళ్లిళ్లకీ పార్టీలకీ ఆహ్వాన పత్రికలను డిజైన్ చేస్తూ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు.—“మీకై మీరు సృష్టించుకోగల పనులు” అనే బాక్సు చూడండి.
ఒక హెచ్చరిక: అందులో ఇమిడివున్న ఖర్చులూ, సాధకబాధకాలు అన్నీ జాగ్రత్తగా అధ్యయనం చేయకముందే దేనిలోనికీ దిగవద్దు. (లూకా 14:28-30) మొట్టమొదటిగా, దీన్ని గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. అంతేగాక, అటువంటి వ్యాపారాల్నే చేసిన ఇతరులతో మాట్లాడండి. మీరు పన్నులు కట్టాల్సివస్తుందా? మీరు లైసెన్సులూ లేక పర్మిట్‌లూ తీసుకోవల్సివస్తుందా? వివరాల నిమిత్తం స్థానిక అధికారులను సంప్రదించండి.—రోమీయులు 13:1-7.
మీ సమతుల్యాన్ని కాపాడుకోండి!
మీరు ఎత్తగల భారం కన్నా ఎక్కువగా మీదవేసుకునే ప్రమాదం ఉందన్నది మాత్రం నిజం. ఉద్యోగం చేస్తున్న కొంతమంది యౌవనస్థుల గురించి లోరీయాన్ ఇలా చెబుతుంది: “వారు హోమ్‌వర్కూ ఎక్కువగా చేయరు, ఇటు క్లాస్‌రూమ్‌లోనూ అవధానం నిలపడానికి వారికి శక్తిలేనంతగా అలసిపోతుంటారు.” నిజమే, ప్రపంచంలోని కొన్ని భాగాల్లో తమ కుటుంబ సభ్యులను పోషించడానికి యౌవనస్థులు గంటల తరబడి పని చేయాల్సివస్తుంది. కానీ మీరు అటువంటి పరిస్థితిలో లేనప్పుడు, ఈ విషయంలో ఎందుకు అతికి పోవడం? స్కూలుకు హాజరౌతూనే వారానికి 20 గంటలు పనిచేయడం పరిమితిని మించడం అనీ ప్రతిఫలదాయకం కానే కాదనీ చాలామంది నిపుణులు చెబుతున్నారు. పనిచేయడానికి వారానికి ఎనిమిది నుండి పది గంటలు వెచ్చించవచ్చని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.
మీ సమయమూ, శక్తీ, చురుకుదనమూ వీటన్నింటినీ స్కూలు తర్వాతి కార్యకాలాపాలకు వెచ్చించారా, మీ ఆరోగ్యమూ, మార్కులూ, ప్రాముఖ్యంగా మీ ఆధ్యాత్మికత క్రిందికి దిగజారడం ప్రారంభం కావచ్చు. అవును, “ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును” ఊపిరి ఆడనీయకుండా చేసింది పెద్దలను మాత్రమే కాదు. (మార్కు 4:18, 19) అందుకని మీ సమతుల్యాన్ని కాపాడుకోండి. సొలొమోను అత్యధికంగా పనిచేయడం గురించి ఇలా చెబుతూ హెచ్చరించాడు: “శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.”—ప్రసంగి 4:6.
అవును, డబ్బు సంపాదించడం అవసరమే కావచ్చు. మిమ్మల్ని అలా చేయడానికి ప్రేరేపించే కారణాలు మునుపు పేర్కొనబడిన ఏవియన్‌కి ఉన్న కారణాలలాగా ఆరోగ్యకరమైనవీ, దైవికమైనవీ అయితే యెహోవా మీ ప్రయత్నాల్ని ఆశీర్వదిస్తాడని మీరు నిశ్చయతను కల్గివుండవచ్చు. అయితే, మీరు “శ్రేష్ఠమైన కార్యములను,” అంటే ఆధ్యాత్మిక ఆసక్తులను మర్చిపోయేంతగా పనిలో మునిగిపోవద్దు. (ఫిలిప్పీయులు 1:9-11) “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అయినప్పటికీ, మిమ్మల్ని నిజంగా విజయవంతులను చేసేది దేవునితో మీ సంబంధమే.—కీర్తన 91:14.
[అధస్సూచీలు]
a నవంబరు 22, (ఆంగ్లం) 1990; డిసెంబరు 8, (ఆంగ్లం) 1990; అక్టోబరు 8, 1997 సంచికల్లోని, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” శీర్షికలు, స్కూలు తర్వాత చేసే ఉద్యోగాల విషయంలో లాభనష్టాలను గురించి చర్చించాయి.
[22వ పేజీలోని బాక్సు]
మీకై మీరు సృష్టించుకోగల పనులు
• కడగడం లేక శుభ్రం చేయడం
• వార్తాపత్రికలను అమ్మడం లేక డెలివరీ చేయడం
• టైలరింగ్
• పుస్తకాల బైండింగు
• సాయంకాలపు టిఫిన్ స్టాలు
• బూట్ల పాలిష్
• బట్టల్ని ఇస్త్రీ చేయడం
• తోటల్ని పెంచి, అమ్మడం
• కోళ్లను పెంచడం లేక గ్రుడ్లను అమ్మడం
• టైపింగ్ చేయడం లేక కంప్యూటర్ ఆపరేట్ చేయడం
• ఇండ్లకు వస్తుసామగ్రిని డెలివరీ చేయడం
• సంగీతం నేర్పడం లేక మరితర ట్యూషన్‌లు చెప్పడం
[21వ పేజీలోని చిత్రం]
అతిగా పనిచేయడం మీ మార్కులు తగ్గిపోయేలా చేయగలదు