సముద్రంలోని స్ఫటిక భవనాలు
కెనడాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
“సరిగ్గా ఎదురుగా మంచు పర్వతం ఉంది!” అని బయటకు చూస్తున్న వ్యక్తి ఆతృతతో అరిచాడు. ఓడరేవులోని సిబ్బంది వెంటనే చర్యను తీసుకుంటారు. ఢీకొనడాన్ని నివారించేందుకు ఇంజన్లను వెంటనే వెనక్కి త్రిప్పారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. ఓడ ముందుభాగం తీవ్రంగా దెబ్బతినింది.
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం, అప్పట్లో ప్రపంచంలోని పెద్ద ఖరీదైన సముద్ర ప్రయాణపు ఓడను మూడు కన్నా తక్కువ గంటల్లోనే మ్రింగేసింది. ఏప్రిల్ 15, 1912 నాడు మొట్టమొదటిసారిగా ఐరోపానుండి ఉత్తర అమెరికాకు టైటానిక్ చేసిన అయిదు రోజుల ప్రయాణంలో అది సముద్ర అడుగు భాగానికి, అంటే ఉపరితలానికి నాలుగు కిలోమీటర్లు క్రిందిగా చేరుకుంది. దాదాపు 1,500 ప్రయాణికులు మరియు దాని సిబ్బంది సముద్రంలో చనిపోయారు.
ఆ పెద్ద మంచు పర్వతంలో మరిక ఏమి మిగిలింది? మొత్తానికి అది చెక్కుచెదరకుండానే ఉండిపోయింది. టైటానిక్ దాని కొనకు మాత్రమే ఢీకొనింది. మరుసటి రోజు ఏమీ జరుగలేదా అన్నట్లు అది వెచ్చని నీళ్ళపై దక్షిణం వైపు తేలుతూ వెళ్ళడాన్ని పరిశోధకులు గుర్తించారు. మంచు పర్వతం లేకుండాపోవడం, అది మహా సముద్రంలో కరిగిపోవడం త్వరలోనే మరువబడుతుంది. అయితే, టైటానిక్ మునిగిపోవడం, పెద్ద ప్రమాదం జరిగిన సముద్ర విపత్తుగా ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోబడుతుంది.
మంచుబండలా! అవి ఎంతో ఆకర్షణీయంగా, ఠీవితో ఉంటాయి, అయినప్పటికీ దృఢంగా ఉంటాయి. మీరు వాటినెన్నడైనా దగ్గరి నుండి చూసి, మానవుని మీద మరియు ప్రకృతి మీద అవి చూపగల ప్రభావాన్ని వివేచించారా? అవి ఎందుకు, ఎలా ఉనికిలోకి వస్తాయో తెలుసుకోవాలని మీరు ఇష్టపడతారా? మంచుబండల వల్ల కలిగే అపాయాల నుండి సముద్రంలో ఉన్న ప్రజలను కాపాడేందుకు ఏమి చేయబడుతుంది? (“అంతర్జాతీయ మంచు పహారా” అనే బాక్సును చూడండి.)
ఉద్భవం మరియు జీవిత చక్రం
మంచు పర్వతాలు పెద్ద పరిమాణంలోని తాజానీటి మంచు పలకల వంటివి. అవి ఉత్తరంలోని మరియు అంటార్కిటిక్‌లలోని హిమమంచు ప్రవాహాల నుండి మరియు నిత్యముండే మంచు పొరల నుండి తయారౌతాయి. అంటార్కిటిక్ మంచు పొరలు భూమ్మీది 90 శాతం మంచు పర్వతాలను ఉత్పత్తి చేస్తాయని మీకు తెలుసా? అవి అతి పెద్దవైనవాటిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అవి జలరేఖకు మీదుగా 100 మీటర్ల ఎత్తున నిలబడతాయి. 300 కన్నా ఎక్కువ మీటర్ల పొడవుగాను మరియు 90 కిలోమీటర్ల వెడల్పుగాను ఉంటాయి. పెద్ద మంచు పర్వతాలు 20 లక్షల నుండి నాలుగు కోట్ల టన్నుల వరకు ఉంటాయి. మంచు పొరలవలె ఏ రెండు మంచు పర్వతాలూ ఒకేలా ఉండవు. కొన్ని సమతలంగా ఉంటాయి లేదా శిఖరాన సమతలంగా ఉంటాయి. మరి కొన్ని చీల ఆకారంలోను, బురుజుల శిఖరాగ్రాల వలెను, గుమ్మటాకారంలోను ఉంటాయి.
సాధారణంగా, మంచు పర్వత శ్రేణి యొక్క పూర్తి భాగంలో ఏడవ వంతు నుండి పదియవ వంతు వరకు మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. ముఖ్యంగా శిఖరాన సమతలంగా ఉండే మంచుబండల విషయంలో అది వాస్తవం. ఒక గ్లాసు నీళ్ళలో ఒక ఐస్‌క్యూబ్ తేలుతున్నప్పుడు మీకు కనిపించే దానిలాగే ఉంటుందది. అయితే, మంచు పర్వతం ఎంత మునిగి ఉంటుంది, ఎంత బయటకు కనిపిస్తుందన్నది మంచుబండ ఆకృతిపై ఆధారపడి వేర్వేరుగా ఉంటుంది.
అంటార్కిటికా మంచుబండలు శిఖరాన సమతలంగాను, దాని ప్రక్కలు బల్లపరుపుగాను ఉంటాయి, అయితే, ఆర్కిటిక్ మంచుబండలు తరచూ ఎగుడు దిగుడుగా, గోపురాల్లా ఉంటాయి. చివర పేర్కొనబడినవి, ఎక్కువగా గ్రీన్‌లాండ్‌ను ఆవరించికొని ఉండే పెద్ద మంచు పొరల నుండి వచ్చేవి, అట్లాంటిక్ సముద్రానికి ఆవలనున్న ఓడ మార్గంలోనికి కొట్టుకునిపోవచ్చు గనుక అవి మానవునికి అపాయకరమైనవి.
మంచు పర్వతాలు ఎలా ఉత్పన్నమౌతాయి? భూమ్మీది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కరిగిపోవడానికన్నా, ఆవిరైపొయ్యే దానికన్నా పేరుకుపోయిన హిమం మరియు వర్షంగా కురిసి గడ్డకట్టుకుపోయిన మంచు తరచూ ఎక్కువగా ఉంటుంది. భూమ్యుపరితలంపై మంచు పొరలు పెరగడానికి కారణమైన ఇది మంచు ప్రవాహంగా మారుతుంది. ఒక్కో సంవత్సరం తరువాత హిమం, వర్షం ఎక్కువగా పడుతున్న కొలది, అవి పేరుకు పోవడమనేది జరుగుతూనే ఉంటుంది. గ్రీన్‌లాండ్ వంటి విశాలమైన ప్రాంతాల్లో ఇది పెద్ద మంచు పొరలను సృష్టిస్తుంది. చివరికి, ఆ పెద్ద మంచు బండ ఎత్తైన ప్రదేశాలనుండి నెమ్మదిగా లోయల్లోకి, చివరకు సముద్రంలోనికి జారిపోవడాన్కి కారణమయ్యేంత గట్టిగా దృఢంగా మంచు తయారౌతుంది. బర్నార్డ్ స్టోన్‌హౌస్, నార్త్ పోల్, సౌత్ పోల్ అనే తన పుస్తకంలో ఈ కదలికలను గూర్చి వర్ణిస్తూ ఈ విధంగా చెప్పాడు: “దృఢంగా ఉండే మంచు స్థితిస్థాపక గుణం కలది, అయితే దాని ఆకృతి త్వరగా మార్చబడగలదు; ఒత్తిడికి గురైనప్పుడు దాని షడ్భుజ స్ఫటికాలు సమరేఖలోకి వచ్చి, అవి ప్రవహించే, కదిలే క్రియ మొదలవ్వడానికి స్ఫటికాలు ఒకదానిపై ఒకటి పడతాయి వీటిని మనం మంచుగడ్డలతో జతచేస్తాము.”
ఎగుడు దిగుడుగానున్న విశాల ప్రదేశంలో హిమ వర్షం చల్లని పానకంలా చాల నెమ్మదిగా ప్రవహించడాన్ని ఒక్కసారి ఊహించి చూడండి. అప్పటికే లోతైన పొడుగాటి పగుళ్లను కలిగివున్న ఈ పెద్ద మంచుపొర తీర ప్రాంతానికి చేరుకునే సరికి అద్భుతమైన అసాధారణ విషయం ఇంకా సృష్టించేందుకు ప్రభావితం చేయబడగలదు. అలల ఆటుపోట్లతో, లోపలికి వెళ్ళే తరంగాలతో మరియు నీటి అడుగున జరిగే సముద్ర కోతతో మంచుపొర నుండి 40 కిలోమీటర్ల విస్తారంలో ఉండే ఓ పెద్ద తాజానీటి మంచు ముక్క, ఉరుములా విరుచుకు పడుతుంది. ఒక మంచు పర్వతం ఉద్భవించింది! ఒక పరిశీలకుడు దానిని “తేలుతున్న స్ఫటిక కోట!” అని వర్ణించాడు.
ఆర్కిటిక్‌లో సంవత్సరానికి 10,000 నుండి 15,000 మంచు పర్వతాలు రూపొందుతాయి. అయితే, ఇతరవాటితో పోలిస్తే, న్యూఫౌండ్‌లాండ్ తీరప్రాంతంలో దక్షిణానికి చాలా కొన్ని మాత్రమే చేరుతాయి. అలా చేరేవాటికి ఏమి సంభవిస్తుంది?
మంచు పర్వతం వలస
మంచు పర్వతాలు ఉద్భవించిన తరువాత, వాటిలో కొన్నింటిని పడమరకు, దక్షిణానికి మళ్ళీ ఐస్‌బర్గ్ అల్లీ అనే ముద్దుపేరు గల లాబ్రడార్ సముద్రంలోనికి చివరికి తీసుకెళ్లే ముందు సముద్ర ప్రవాహాలు వాటిని తీసుకుని సుదూర ప్రయాణం చేస్తాయి. మంచు పర్వతాలు తమ జన్మస్థలం నుండి లాబ్రడార్ మరియు న్యూఫౌండ్‌లాండ్ ప్రక్కగా అట్లాంటిక్ సముద్రానికి దాదాపు రెండు సంవత్సరాలు కొట్టుకువెళ్తూ తప్పించుకుని కొద్దికాలం జీవిస్తాయి. వెచ్చని నీళ్ళలోకి కొట్టుకుని వెళ్తూ, అవి కరగడంవల్ల, తరగిపోవడంవల్ల, మరిన్ని పుట్టడంవల్ల చాలా ఎక్కువ క్షీణించిపోతాయి.
మామూలుగా, పగలు సమయంలో మంచు కరిగి, నీరు దాని చీలికల్లో చేరుకుంటుంది. రాత్రి నీరు ఘనీభవించి, ఆ పగుళ్ళలో విస్తరించి, ముక్కలుగా పగిలిపోవడానికి కారణమౌతుంది. ఇది మంచు పర్వతం ఆకృతిలో అకస్మాత్తుగా మార్పును తెస్తూ, దాని గురుత్వాకర్షణ కేంద్రాన్ని మారుస్తుంది. తరువాత మంచు ముద్ద నీటిలో దొర్లుతుంది, క్రొత్త హిమ శిల్పాన్ని పూర్తిగా వెలుపలికి తెస్తుంది.
ఈ చక్రం కొనసాగుతుండగా, మంచు కోటలు మళ్ళీ విడిపోవడం ద్వారా చిన్న పరిమాణానికి మారుతూ, తమ స్వంత మంచు పర్వతాలను ఉత్పత్తి చేస్తాయి, అవి “బెర్జీ బిట్స్” అని పిలువబడుతాయి. అవి మామూలు ఇంటి పరిమాణంలో ఉంటాయి, “గ్రోలర్లు” దాదాపు చిన్న గదుల పరిమాణంలో ఉంటాయి, అవి సముద్రం మీద తేలేటప్పుడు చేసే చప్పుడును బట్టే వీటిని అలా పిలుస్తారు. ఇంకా చిన్న మంచు పర్వతాలు తీరప్రాంతం అంచున ఉన్న తక్కువ లోతుగల నీటిలోను, ప్రవేశ ద్వారాల్లోను పడి దొర్లవచ్చు.
పరిస్థితులేమైనప్పటికీ, మరీ దక్షిణాన ఉన్న నీళ్ళలోని పర్యావరణం, మంచుబండ త్వరలోనే చిన్న చిన్న తాజానీటి మంచు గడ్డలుగా విడిపోయి, మహా సముద్రంలో భాగమయ్యేలా చేస్తుంది. అయితే, అది జరిగేవరకు మంచు పర్వతాలతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది.
మంచు పర్వతాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి
తమ జీవనోపాధికోసం మహా సముద్రంపై ఆధారపడే జాలరులు మంచు పర్వతాలను ఆటంకాలుగా ప్రమాదకరమైనవిగా దృష్టిస్తారు. “మంచు పర్వతం వినోద యాత్రికులకు కోరదగినదిగా ఉండవచ్చు, కాని జాలరులకు అది ప్రమాదకారిగా ఉంటుంది” అని ఒక జాలరి అన్నాడు. జాలరులు మళ్ళీ వచ్చి చూసేసరికి, వాళ్లు పట్టిన చేపలను, విలువైన వలలను అలలు మరియు ప్రవాహము కదిలించిన మంచు పర్వతం నాశనం చేస్తుంది.
మంచు పర్వతాలతో జాగ్రత్తగా మెలగాలి. “మీరు కావలసినంత దూరంలో ఉండండి. మంచు పర్వతాల విషయాలను అస్సలూహించలేం! పెద్ద వాటినుండి పెద్ద భాగాలు విడిపోవచ్చు, లేదా క్రింది భాగం గుద్దుకున్నప్పుడు పెద్ద ముక్కలు విడిపోవచ్చు, అది మీ మీద పడవచ్చు. పెద్ద మంచు ముక్కలు తిరుగుతూ దొర్లుతూ ఉంటాయి వాటి దగ్గరికి వెళ్ళడానికి సాహసించే ఎవరికైనా అవి వినాశకరం కాగలవు!”
సముద్రం అడుగుభాగం మంచు పర్వతాలతో తుడిచి పెట్టుకుపోతుందేమోనన్నది విచారకరమైన మరో విషయం. ఒక పరిశీలకుని అభిప్రాయం ప్రకారం, “మంచు గడ్డ మునిగివున్న భాగమూ నీటి లోతూ దాదాపు సమానంగా ఉన్నట్లయితే, అది దాని అడుగు భాగంలో పొడవైన, లోతైన తూము మార్గాలను త్రవ్వవచ్చని చెప్పబడుతుంది. చమురు అన్వేషణ ప్రాంతాల్లోని చమురు బావుల వంటి సముద్ర అడుగు భాగాల్లో తూము మార్గాలు ఏర్పడడం వల్ల వినాశకరమైన ఫలితాలు ఉంటాయి.”
ఇప్పటికల్లా, మంచు బండలు లేకుండా ఉండడమే మేలని మీరు అనుకొని ఉండవచ్చు. అయితే, మంచు పర్వతాల కథంతా ప్రతికూలమైనది కాదు. ఒక న్యూఫౌండ్‌లాండ్ నివాసి ఈ విధంగా చెప్పాడు: “సంవత్సరాల క్రితం రెఫ్రిజిరేషన్ సాధారణం కాక ముందు, తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లోని ప్రజలు చిన్న మంచు ముక్కలను తెచ్చుకుని, నీళ్ళను చల్లగా చేసుకునేందుకు తమ బావుల్లో వేసుకొనేవారు. మంచు ముక్కలను ఇంట్లో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకునేందుకుగాను రంపపు పొట్టు ఉండే డ్రమ్ములో నిలువ ఉంచడం మరొక అలవాటు.”
యాత్రికులు తేలుతున్న మంచుపొరల పెద్ద పర్వతాల వైపుకు ముఖ్యంగా ఆకర్షించబడతారు. అట్లాంటిక్‌ను స్పష్టంగా చూసేందుకు, సముద్రంలోని ఈ పెద్ద ఆకారాలను చూస్తూ కనుల విందు చేసుకునేందుకు గాను న్యూఫౌండ్‌లాండ్ యొక్క చిందరవందరగా ఉన్న సముద్ర తీరంలో మంచి స్థానం కోసం వారు వెదకుతారు. ఆ నిమిషాన్ని ఫిలిమ్‌లో పట్టేందుకు అలా ఎన్నో ఫోటోలు తీసుకోబడ్డాయి.
మంచుబండలు త్రాగే తాజానీటిని బహుశ అనంతంగా సరఫరా చేసే శక్తిని కూడా కలిగి ఉన్నాయి. ముందెన్నడూ లేని విధంగా జలం కలుషితమౌతున్న ఈ కాలంలో మంచుబండను కారనిచ్చి ఆ నీటి బిందువులను సీసాలో పట్టడం చివరికి చేయదగిన సాహస కార్యంగా మారవచ్చు. ఎక్కువ పరిమాణంలో త్రాగే నీరు లభించేందుకు, ఓ పెద్ద “మంచు పర్వతాన్ని” కనుగొని దానిని ఆ ప్రక్రియ కొరకు లాగి, వంపడం చాలా సులభంగా అనిపించవచ్చు. వాస్తవానికైతే, ఇంతవరకు భయంకరమైనదని నిరూపించబడిన ఓ పెద్ద సవాలది.
యెహోవా సృష్టిలోని అద్భుతము
“మంచు గడ్డ యెవని గర్భములోనుండి వచ్చును?” అని భూమ్యాకాశముల సృష్టికర్త అడుగుతున్నాడు. (యోబు 38:29) ఎలీహూకు అది తెలుసు, అందుకే “దేవుని ఊపిరివలన మంచు పుట్టును” అని దానికి ముందుగానే చెప్పాడు.—యోబు 37:10.
అలా సముద్రంలోని ఉన్నతమైన నిగనిగలాడుతున్న అద్భుతాలను మనం చూసినప్పుడు, వాటిని అక్కడ ఉంచిన సృష్టికర్తవైపుకు మన ఆలోచనలు మరలుతాయి. కీర్తన రచయిత వలె మనం కూడా ఇలా అంటాం: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” ఆయనింకా ఈ విధంగా చెబుతున్నాడు: “నీ కార్యములు ఆశ్చర్యకరములు.”—కీర్తన 104:24; 139:14.
నిజంగా, యెహోవా అద్భుతములు చేసే సృష్టికర్త. ఆయనను గూర్చి మరెక్కువగా తెలుసుకోవాలని మనమెంతగా కోరుకుంటామో! ఆయన వాక్యానికి శ్రద్ధనిస్తూ మనమలా చేయగలం.—రోమీయులు 11:33.
[18వ పేజీలోని బాక్సు]
అంతర్జాతీయ మంచు పహారా
మహా సముద్ర యానంలో జరిగిన టైటానిక్ దుర్ఘటన తరువాత, మంచుబండల స్థానాన్ని నిర్ణయించి, సముద్ర ప్రవాహాలను మరియు గాలి వీచేదాని ఆధారంగా వాటి కదలికను ముందుగా తెలుసుకుని, మంచును గూర్చి ప్రజలకు హెచ్చరికనిచ్చేందుకుగాను 1914 లో అంతర్జాతీయ మంచు పహారా (ఐ.ఐ.పి) స్థాపించబడింది. సముద్రంలోని ఈ భయంకరమైన స్ఫటికాల నుండి రక్షణనిచ్చేందుకుగాను, మంచు యొక్క ప్రత్యేకతలను, కదలికలను గూర్చిన జ్ఞానాన్ని సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంలో, ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా దృశ్య మరియు రాడార్ పరిశీలన, వాణిజ్య ఓడలు మంచును చూసిన నివేదికలు, ఉపగ్రహ ఫోటోగ్రఫీలు, మహా సముద్రాల గ్రాఫ్ విశ్లేషణ మరియు అంచనాలు చేరివున్నాయి.
[16,17వ పేజీలోని చిత్రం]]
బురుజుల శిఖరాగ్రాలు
గుమ్మటాకారం
చదునైన ఉపరితలం