కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 7/8 పేజీలు 13-15
  • సెలవుల్లో ప్రమాదాలను ఎలా నివారించగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెలవుల్లో ప్రమాదాలను ఎలా నివారించగలరు
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాగా సిద్ధపడండి
  • మీరు అక్కడికి చేరుకున్నప్పుడు
  • సెలవులు ఆస్వాదించగలవిగా ఉండేందుకు ముఖ్యమైనది
  • సాక్ష్యమిచ్చు అవకాశములను పట్టుకొనుము
    మన రాజ్య పరిచర్య—1990
  • వేసవిలో దైవపరిపాలనా పనులను వెంబడిస్తూ ఉండండి
    మన రాజ్య పరిచర్య—1994
తేజరిల్లు!—1998
g98 7/8 పేజీలు 13-15

సెలవుల్లో ప్రమాదాలను ఎలా నివారించగలరు

సెలవు కాలం—అన్న మాట మీలో దేనిని స్ఫురింపజేస్తుంది? ఎండ కాస్తున్న సముద్ర తీరాల్లో విరివిగా కనిపించే కొబ్బరిచెట్ల ఆహ్లాదకరమైన నీడల్లో విశ్రాంతి తీసుకోవడమా? లేదా పర్వత ప్రాంతంలోని చల్లని, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఉల్లసించడమా?

అయినప్పటికీ, భరించలేని అసహ్యమైన వాతావరణం, ఎయిర్‌పోర్ట్‌లో జరిగే ఆలస్యాలూ, ప్రయాణం చేసినప్పడు కలిగే అస్వస్థతలూ, తదితర విషయాల గురించి మీరు విచారపడవచ్చు. మీ తలంపులు ఏవైనప్పటికీ, మీ సెలవులను ఆస్వాదించగలవిగా చేసుకునేందుకు మీరేమి చేయగలరు?

బాగా సిద్ధపడండి

జ్ఞానపూర్వకంగా సెలవులను ఉపయోగించేవాళ్ళు ముందుగానే పథకం వేసుకుంటారు. వాళ్ళు ప్రయాణ మరియు ఆరోగ్య సంబంధ వివరణ పత్రాన్ని ముందుగానే సంపాదించుకుంటారు, అలా వాళ్ళు ప్రయాణం ప్రారంభమయ్యే వేళకు అవి సిద్ధంగా ఉంటాయి. ఎదురుకాగల ఆరోగ్య ప్రమాదాలను గురించి అడిగి తెలుసుకోవడం, ఏ నివారణా చర్యలను తీసుకోవాలో నిర్ణయించుకునేందుకు వారికి సహాయపడుతుంది.

తాము ప్రయాణం చేస్తున్నది మలేరియాకు జన్మస్థలాలైన చోట్లకైతే, ఆ ప్రయాణానికి కొన్ని రోజులు ముందే యాంటీ మలేరియా మందులను కొందరు తీసుకోనారంభిస్తారు. సురక్షితత్వం కోసం, వాళ్ళు ఆ మందులను సెలవు కాలమంతటిలోనూ, దాని తర్వాత నాలుగు వారాల వరకూ కూడా వాడాలని తరచూ సలహా ఇవ్వబడుతుంది. మలేరియా పరాన్నజీవులు అంత కాలం వరకూ శరీరంలో గుడ్లను పొదుగుతాయన్నదే కారణం. అయితే మిగతా ముందుజాగ్రత్తలు కూడా అవసరమే.

లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో పనిచేస్తున్న డా. పాల్‌ క్లార్క్‌ ఇలా సలహా ఇస్తున్నారు: “కీటకాలను నిరోధించే మందును చర్మానికి, లేదా మణికట్టుకు రాయడం, చీలమండ పట్టీలు, దోమ తెరలు, విద్యుచ్ఛక్తితో నడిచే క్రిమిసంహారక వేపొరైజర్‌, అన్నీ సమాన ప్రాముఖ్యత గలవే.” ఇలాంటి ఉపకరణాలను మీరు సెలవులకు బయలుదేరక ముందే కొనుక్కోవడమే సాధారణంగా మంచిది.

ప్రయాణ అస్వస్థత ఏ యాత్రనైనా అసంతోషకరంగా చేస్తుంది. దానికి కారణం ఏమిటి? ఒక పరిశోధకుడు చెప్పేదేమంటే, పరిచయం లేని చోట్ల ఉన్నప్పుడు, మెదడుకు చేరే క్రొత్త సంకేతాల వల్ల మెదడుకు అమిత భారం కలుగుతుంది కనుక, ప్రయాణంలో శరీరం కుదుపులకు గురైనప్పుడు అస్వస్థత కలుగుతుంది. ఓడ కదలిక, ఎయిర్‌ క్రాఫ్ట్‌ కంపనం, లేదా మీ కారు ఇంజిన్‌ చప్పుడు ఈ సమస్యను సృష్టిస్తున్నట్లైతే, మీ అవధానాన్ని నిశ్చలమైన దేనిపైనైనా, బహుశ క్షితిజంపైనా, లేదా ముందున్న రోడ్డు మీదనైనా కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. కావలసినంత గాలి ప్రసరణ అత్యవసరమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. కుదుపుల వల్ల అస్వస్థతనొందే చాలా మంది విషయానికి వస్తే, యాంటీ హిస్టమైన్‌ మందులు రోగ నివారణకు సహాయపడవచ్చు. అయితే, మత్తుగా ఉండడం వంటి రాగల సైడ్‌ ఎఫెక్ట్‌ల విషయమై అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇవి ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలవు అనే హెచ్చరిక సముచితమైనది.

సుదూర విమాన ప్రయాణాల్లో జలశూన్యత వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. కొందరి విషయంలో, అదే పనిగా కూర్చోవడమూ, చాలా సేపు ఇరుక్కుని కూర్చోవడమూ కాలిలో రక్తం గడ్డ కట్టుకుపోగల ప్రమాదాన్ని అధికం చేస్తాయి. గడ్డ కట్టుకున్న రక్తం ఒక చోట నుండి మరోచోటుకు వెళ్తూ, ఊపిరితిత్తిని లేదా గుండెను చేరుకున్నట్లయితే, అది మరింత ప్రమాదకరం కాగలదు. కనుక, కొందరు సుదూర ప్రయాణపు విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్లమధ్యవున్న దారిలో నడవడం, కూర్చునే ఉండి తుంటి మరియు కాళ్ళ కండరాలను కదల్చడం వంటి వ్యాయామాలు చేయవలసి ఉండవచ్చు. జలశూన్యతను తగ్గించేందుకు, మద్యేతర పానీయాలను బాగా త్రాగాలి.

పైన పేర్కొనబడిన విషయం విమాన ప్రయాణమంటే మీకున్న భయాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తుందా? అలాగైతే, విమాన ప్రయాణమే సాపేక్షికంగా సురక్షితమైనదన్న వాస్తవాన్ని బట్టి మీరు ఊరట పొందండి. అది మోటర్‌ సైకిల్‌ నడిపించేదానికన్నా 500 రెట్లు సురక్షితమనీ, కారులో ప్రయాణించడం కన్నా 20 రెట్లు సురక్షితమనీ నివేదించబడుతుంది మరి ! అయితే, ఆ గణాంకాలు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేశారు అన్నదానిపైనే కానీ, ఎంత సేపు ప్రయాణం చేశారు అన్నదానిపై ఆధారపడినవి కావని కొందరంటారు.

చిన్న పిల్లలతో ప్రయాణం చేయడం మరో సవాలును ముందుంచుతుంది. “సైన్యం దాడికి సిద్ధమైనట్లు, మీరు మీ ప్రయాణం కోసం ముందుగా పథకం వేసుకోండి” అని బ్రాడ్‌కాస్టర్‌ అయిన కాతీ అర్నోల్డ్‌ అంటున్నారు. మీరు అలా చేయలేకపోయినప్పటికీ, మీతోపాటు పుస్తకాలను, ఆటవస్తువులను లేదా మీ పిల్లల ఆసక్తిని ఆకట్టుకునే వస్తువులను తీసుకువెళ్ళండి. ఇలా చేయడంవల్ల కుటుంబంలో అందరికీ ఆ ప్రయాణం మరింత ఆహ్లాదకరమైనదౌతుంది.

మీరు అక్కడికి చేరుకున్నప్పుడు

‘నేను అక్కడ ఉండడానికి అలవాటుపడేందుకు ముందు నేను నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది’ అని సెలవులకు వెళ్ళే అనేకులు చెబుతారు. నిజమే, క్రొత్త పరిసరాలకు అలవాటుపడేందుకు సమయం పడుతుంది. కనుక, మీరు అక్కడికి చేరుకున్న తర్వాత, మొదటి రోజు లేదా మొదటి రెండు రోజులు అటు ఇటు వెళ్ళకపోవడమే జ్ఞానయుక్తం. విభిన్నమైన షెడ్యూల్‌కు మీ శరీరమూ, మనస్సూ సర్దుకుపోయేందుకు అనుమతించండి. అలా చేయకపోతే మీకు ఒత్తిడి కలుగుతుంది, సెలవుల్లో మీరు పొందగల ప్రయోజనం నీరు కారిపోతుంది.

ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం విదేశానికి ప్రయాణం చేసే అనేక కోట్లమంది ప్రజల్లో కనీస సగం మంది ఏదో ఒక రకమైన అనారోగ్యం వల్లనో, గాయం వల్లనో బాధపడతారు. కనుక, ట్రావెలెర్స్‌ హెల్త్‌ సంపాదకుడైన డా.  రిచర్డ్‌ దావూద్‌ ఇలా వివరించారు: “ఆరోగ్యానికి తరుణోపాయం నివారణే, దాన్ని ఏ ప్రయాణికుడూ అలక్ష్యం చేయకూడదు.” వాతావరణంలోని, ఆహారంలోని, నీటిలోని వివిధ జాతుల బ్యాక్టీరియాలకు ప్రయాణికుని శరీరం అలవాటుపడవలసిన అవసరం ఉంటుంది గనుక, మొదటి కొన్ని రోజులు ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారన్న విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

“తాజాగా వండిందేననీ, బాగా ఉడికిందేననీ (క్రిములు నిర్జీవమయ్యేంతగా ఉడికిందని) నిశ్చయం లేనప్పుడు,—మాంసం విషయానికొస్తే ఎరుపు రంగు పోయేంతగా ఉడకనప్పుడూ—ఆహారం సురక్షితమైనదే అయ్యుంటుందిలే అని అనుకోవద్దు” అని డా. దావూద్‌ హెచ్చరిస్తున్నారు. అయితే, ఆహారం వేడివేడిగా ఉన్నంత మాత్రాన సురక్షితమైనదని చెప్పలేము. కనుక, “చద్దన్నమే వేడి చేసి వడ్డించడంలేదని నిశ్చయపరచుకోండి.”

కనుక మీరు నివసించే ప్రాంతానికి పూర్తి భిన్నమైన ప్రాంతంలో మీరు సెలవు దినాలను గడుపుతున్నట్లయితే, సరిగ్గా మీరనుకున్నప్పుడు, మీరనుకున్నచోట, మీరనుకున్నది ఎల్లవేళలా తినలేకపోవచ్చు. ఇది నిజానికి అతిసారాన్ని నివారించేందుకు చెల్లించవలసిన కేవలం చిన్న మూల్యం మాత్రమే. అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఐదింట రెండవవంతు మందిని అతిసారం బాధించినట్లు నివేదించబడింది.

పానీయాల విషయానికి వస్తే, సీసా నీళ్ళు స్థానికంగా దొరికే నీళ్ళకన్నా సురక్షితమైనవి. అయితే, సమస్యలను నివారించేందుకు సీసాలోని డ్రింక్స్‌ను, క్యాన్‌లలో ముందే తయారు చేసి ఉంచిన డ్రింక్స్‌ను మీ ఎదుటే ఓపెన్‌ చేయించుకోవడమే జ్ఞానయుక్తమైన పని. ఐస్‌ ఉపయోగించకపోవడం కూడా జ్ఞానయుక్తమైన పని. సురక్షితమైనదన్న భరోసా లేని దేనినైనా సరే సురక్షితమైనది కాదన్నట్లుగానే దృష్టించండి.

సెలవులు ఆస్వాదించగలవిగా ఉండేందుకు ముఖ్యమైనది

తన పాఠకులపై సర్వే చేసిన తర్వాత, ఒక ప్రయాణ సంపాదకురాలు ఇలా నివేదించారు: “ఒక సెలవు రోజు సరదాగా గడవడానికి, లేదా అంత సరదాగా ఉండకపోవడానికి వాతావరణమే ముఖ్య కారణమని మీరు చెప్పవచ్చు, అయితే స్నేహితులు అంతకన్నా ముఖ్య పాత్ర వహిస్తారు.” వాస్తవానికి, “సాఫీగా నడిచే హోటళ్ళకన్నా, సమస్యలులేని యాత్రల కన్నా, మంచి ఆహారం కన్నా, చూడదగిన దృశ్యాలకన్నా మంచి సహవాసమే” సెలవులను ఆస్వాదించేందుకు ముఖ్యంగా తోడ్పడేదని తలంచబడుతుంది.

సెలవుల మీద ఉన్నప్పుడు మీరు ఆరోగ్యకరమైన క్రొత్త స్నేహితులను ఎలా కలవగలరు? సరే, అలాంటి స్నేహితులను కనుగొనే ఒక మార్గం, మీరు సెలవులకు వెళ్ళాలనుకుంటున్న దేశంలో పనిచేస్తున్న వాచ్‌టవర్‌ సొసైటీ కార్యాలయానికి ముందుగా తెలపడమే. వాళ్ళు మీరు వెళ్ళే ప్రాంతానికి అతి దగ్గర్లో ఉండే యెహోవాసాక్షుల రాజ్యమందిర చిరునామాను అలాగే, అక్కడి కూటాల సమయాన్ని గూర్చిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. ఈ కార్యాలయాల కొన్ని చిరునామాలు ఈ పత్రిక యొక్క ఐదవ పేజీలో కనిపిస్తాయి. యెహోవాసాక్షుల ఇటీవలి వార్షికపుస్తకంలో చిరునామాల మరింత పెద్ద పట్టికను మీరు చూడవచ్చు.

మీ సెలవులను ఆస్వాదించడంలోనూ, పశ్చాత్తాపపడవలసిన పరిస్థితులను నివారించడంలోను ముఖ్య కారకం “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని బైబిలు ఇస్తున్న జ్ఞానపూర్వకమైన సలహాను పాటించడమే. (1 కొరింథీయులు 15:33) సుదూర మారుమూల ప్రాంతంలో సెలవులు గడుపుతున్నప్పుడు క్రైస్తవ ప్రమాణాలనూ, పద్ధతులనూ ప్రక్కకు పెట్టాలన్న కోరిక మీలో ఉన్నట్లు అనిపిస్తున్నట్లయితే, అది ఒక బలహీనత అని జ్ఞానపూర్వకంగా గ్రహించి, ఆ కోరికతో పోరాడేందుకు దైవిక సహాయాన్ని కోరుకోండి. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ చూపవలసిన అవసరం కూడా ఉంది. మీరు ఎక్కడున్నప్పటికీ, “ఇవి వ్యవహరించడానికి కష్టంగా ఉండే క్లిష్టమైన కాలాలని” గుర్తుంచుకోండి.—2 తిమోతి 3:1, NW.

మీరు కుటుంబ సమేతంగా సెలవుల్లో ఉన్నప్పుడు, అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా చేసే పనులన్నీ ఇప్పుడు కూడా చేస్తుందిలే అని అనుకోకండి. దైనందిన పనుల్లో సహాయపడేందుకు సిద్ధంగా ఉండండి, సహకరణ మనోభావాన్ని చూపండి. అలాంటి దృక్పథం సెలవుల్లో అందరి ఆనందానికి ఎంతో తోడ్పడుతుంది.

మీ సెలవులు ఆహ్లాదకరంగా ఉంటాయా? జ్ఞాపకార్ధంగా, ఫోటోలనూ, పోస్ట్‌కార్డ్‌లను, ఆ సంతోషకరమైన స్మృతులను తిరిగి తెచ్చే కొన్ని వస్తువులను, బహుశా కొన్ని స్థానిక కళాకృతులను ఎంపిక చేసుకోండి. మరిముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవలసింది క్రొత్తగా కనుగొన్న స్నేహితులనేనన్న విషయంలో సందేహం లేదు. వాళ్ళతో సంప్రదింపులను కొనసాగించండి. ఆసక్తికరంగా ఉండే అనుభవాలను ఉత్తరాల్లో వ్రాసుకోండి. మీ సెలవులను ఆస్వాదించగలవిగా చేసుకునేందుకు చాలా మార్గాలున్నాయి.

[15వ పేజీలోని బాక్సు]

కొన్ని సెలవుకాల జ్ఞాపికలు

మీరు బయల్దేరే ముందు

• ప్రయాణ మరియు ఆరోగ్య సంబంధ అత్యవసర వివరణ పత్రాలను తీసుకోండి

• నివారణ మందులను సంపాదించండి

ప్రయాణం చేస్తున్నప్పుడు

• మద్యేతర పానీయాలను బాగా త్రాగండి, బహుదూరపు విమాన ప్రయాణాల్లో ఉన్నప్పుడు వ్యాయామం చేయండి

• మీ చిన్నారుల కోసం ఆసక్తికరమైన వస్తువులను వెంట తీసుకువెళ్ళండి

గమ్యస్థానానికి చేరుకున్నాక

• మీ శరీరమూ, మనస్సూ సర్దుకుపోయేందుకు సమయాన్నివ్వండి

• సురక్షితమైన ఆహార పానీయాలను మాత్రమే తీసుకోండి

• నైతిక అప్రమత్తతను కాపాడుకోండి

• కుటుంబ సభ్యులతో కలిసి దైనందిన పనులను చేయండి

[14వ పేజీలోని చిత్రం]

సెలవుల్లో ఉన్నప్పుడు, మీ సహవాసాల విషయమై జాగ్రత్తపడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి