‘నాకు తేనె త్రాగినట్లు అనిపించింది’
అది 1993 మధ్యభాగం, అమెరికాలోని ఓక్లహోమానందలి ఆల్టస్లో అమెరికా వైమానిక దళాధికారి అయిన చింతగల ఒక తండ్రి, వైవాహిక సమస్యలు కలిగి విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తున్న తన కుమార్తెకు సహాయం చేసేందుకు తనకు నడిపింపు కావాలని ప్రార్థన చేశాడు. ఆ మర్నాటి ఉదయం ఒక యెహోవాసాక్షి ఆయన తలుపు తట్టి, “విడాకులు—ఆనందమయ జీవితానికి ద్వారమా?” అనే అంశంగల జూలై 8, 1993 (ఆంగ్లం) తేజరిల్లు! పత్రికను ఆయనకు అందించడం జరిగింది.
ఆ వ్యక్తి యెహోవాసాక్షులను ముందు ఎన్నడూ ఇష్టపడనప్పటికీ వాళ్లు చెప్పేది ముందు ఎన్నడూ విననప్పటికీ, ఆయన ఆ పత్రికలను వెంటనే తీసుకుని తేజరిల్లు!ను చదివాడు. తర్వాత అందులోని లేఖనాలనూ అంశాలనూ ఆయన తన కుమార్తెకు కూడా చూపించాడు. తేజరిల్లు!తోపాటూ ఆయనకు ఇవ్వబడిన కావలికోట పత్రికను కూడా ఆయన చదివాడు. అందులో ఉన్న ఒక శీర్షిక, తాను తన జీవితకాలమంతా నమ్ముతూ వచ్చిన త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి గంభీరంగా ఆలోచించేలా చేసింది. తన కుమార్తెకు సంబంధించి సహాయం నిమిత్తం తాను చేసిన ప్రార్థనకు జవాబు లభిస్తోందని ఆయన గుర్తించాడు, అయితే త్రిత్వ సిద్ధాంతంలో విశ్వాసముంచని ప్రజలను తన ప్రార్థనలకు సమాధానాన్ని ఇచ్చేందుకు దేవుడు ఎందుకు ఉపయోగిస్తాడని ఆయన ఆలోచించాడు. ప్రజలు సత్యాన్ని బోధించకపోతే ప్రార్థనలకు సమాధానాలు ఇచ్చేందుకు దేవుడు వాళ్లను ఉపయోగించడని ఆయన తర్కించాడు.
అలా ఆయన యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి ఫోన్ చేసి, త్రిత్వ సిద్ధాంతాన్ని గురించిన వారి విశ్వాసాలను మరింత సవివరంగా తెలియజేసే ప్రచురణలను గురించి అడిగేందుకు పురికొల్పబడ్డాడు. క్రైస్తవ పెద్దలకు జరుగుతున్న కూటానికి హాజరైన వ్యక్తి ఫోన్ ఎత్తాడు. ఆ వైమానిక అధికారి వెంటనే రాజ్యమందిరానికి వెళ్లాడు, అక్కడ ఆయనకు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకమూ త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రొషూరూ ఇచ్చారు.
ఆ వ్యక్తి, ఆ రాత్రే ఆ బ్రొషూరును మొత్తం చదివేశాడు. దాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఎంతగా ఉత్తేజితుడయ్యాడంటే, ఆయన ‘కాస్త ఆగు. ఇది ఎంతో అసాధ్యంగా అనిపిస్తుంది. అది వాస్తవం కాలేనంత చక్కగా ఉంది’ అని తనకు తాను చెప్పుకోవలసి వచ్చిందని ఆయన తర్వాత చెప్పాడు. త్రిత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా బైబిలు రుజువులను ఆ బ్రొషూరు ఎంత స్పష్టంగా చూపిందంటే, ఆయన దాన్ని చదివినప్పుడు, “నాకు నిజంగా తేనె త్రాగినట్లు అనిపించింది” అని ఆయన వివరించాడు. తర్వాత సాయంత్రం ఆయన యెహోవాసాక్షుల కూటానికి మొదటిసారి హాజరయ్యాడు, అక్కడ ఆయన విన్న సంగతులను బట్టి ఆయనెంతో ఆనందించాడు.
యెహోవాసాక్షులతో ఆయన చేసిన మొదటి బైబిలు పఠనమూ, పొగత్రాగడానికి సంబంధించి బైబిలు దృక్పథాన్ని గురించిన స్పష్టమైన చర్చ తర్వాత, ఆయన తనవద్ద ఉన్న సిగరెట్లను పారేశాడు, ఆ తర్వాత ఎన్నడూ పొగత్రాగలేదు. ఒక్కో వారంలో అనేకసార్లు ఆయనతో బైబిలు పఠనం నిర్వహించబడేది. త్రిత్వము బ్రొషూర్ను చదివిన మూణ్నెల్లకి ఆయన మిలిటరీ నుండి రిటైరయి, ఆయన బహిరంగ ప్రకటనా పనిలో సాక్ష్యమివ్వడం ప్రారంభించాడు. మరో మూణ్నెల్ల తర్వాత యెహోవా దేవునికి తన సమర్పణకు సూచనగా ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన పూర్తికాల పరిచారకునిగా సేవ చేస్తున్నాడు.