టెలివిజన్ ఎంత ప్రమాదకరమైనది?
ఒక టెలివిజన్ కార్టూన్ జపాన్ నందలి టోక్యోలోని అనేకులను వ్యాధిగ్రస్థులను చేసిందని డిసెంబరు 18, 1997నాటి వార్తా పత్రిక ముఖ శీర్షిక నివేదించింది. వందలాదిమంది ఆసుపత్రుల పాలయ్యారు. “కొంతమంది పిల్లలు రక్తం వాంతి చేసుకున్నారు, ఇతరులకు గుండెపోటు వచ్చింది లేక స్పృహతప్పింది” అని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తోంది. “నేడు చూపబడుతున్న కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు పిల్లలకు ఎంత ప్రమాదకరమైనవిగా తయారయ్యాయనే విషయానికి ఈ ఎపిసోడ్ ఒక మహత్తరమైన జ్ఞాపిక అని వైద్యులూ, మనస్తత్వ శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.”
న్యూయార్క్‌కు చెందిన డెయిలీ న్యూస్ ఇలా చెప్పింది: “టీవీలో చూపబడుతున్న కార్టూన్‌లోని వింతజంతువు తన ఎర్రటి కళ్లను పెద్దవిగా చేసి ఉరిమినప్పుడు దేశమంతటా వందలాదిమంది పిల్లలు వణికిపోయి స్పృహతప్పి పడిపోయినప్పుడు నిన్న జపాన్‌లో భయం తాండవమాడింది.
“దాదాపు 600మంది పిల్లలూ కొంతమంది పెద్దలూ మంగళవారం రాత్రి . . . ఒక టీవీ కార్టూన్ చూసిన తర్వాత ఎమర్జెన్సీ వార్డుల్లోకి త్వరగా తీసుకెళ్లబడ్డారు.” కొందరికి ఊపిరాడటం కష్టంగా ఉన్నందున, వాళ్లను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలో చేర్చవలసి వచ్చింది.
ఎనిమిది సంవత్సరాల బాలిక తల్లి అయిన యుకీకో ఇవాసాకీ ఇలా వివరిస్తోంది: “నా కూతురు స్పృహ తప్పడం చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. నేను ఆమె వీపుపై చరిచిన తర్వాతనే ఆమె ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది.”
పిల్లల కొరకు టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించేవారు, “వందల సార్లు” ఉపయోగించబడినదని వారు చెబుతున్న ఆనిమేటెడ్ టెక్నిక్ అలాంటి ప్రమాదకరమైన, తీవ్రమైన ప్రతిస్పందనకు ఎలా కారణం కాగలదో వివరించలేకపోతున్నారు.
టెలివిజన్‌ను చూడటం ద్వారా వచ్చే ప్రమాదకరమైన ప్రభావాలను గురించి తెలిసినవారై, కొంతమంది తలిదండ్రులు టీవీలో ఏ కార్యక్రమాలను చూడాలనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు లేక కొందరు టీవీని తమ ఇంటిలోనుండే తొలగించేశారు. అమెరికానందలి టెక్సాస్‌లోని అలెన్‌కు చెందిన ఒక తండ్రి, తమ ఇంట్లోనుండి టీవీని తీసివేయక ముందు తన పిల్లలు “కొంతసేపు మాత్రమే అవధానాన్ని నిలపగలిగే వారనీ, చికాకుగా మద్దతునివ్వకుండా ఉండేవారనీ, చాలా విసుగ్గా ఉండేవారనీ” చెబుతున్నాడు. ఆయన ఇలా వివరించాడు: “ఈరోజు నా ఐదుగురు పిల్లల్లో—వాళ్ల వయస్సులు 6 నుండి 17 సంవత్సరాల వరకూ ఉన్నాయి—ప్రతి ఒక్కరూ ఏ గ్రేడు తెచ్చుకునే విద్యార్థులే. టీవీని తీసివేయడంతో, వాళ్లు త్వరలోనే క్రీడలు, చదవడం, కళలు, కంప్యూటర్‌ను ఉపయోగించడం వంటి విభిన్న విషయాల్లో ఆసక్తిని వృద్ధి చేసుకున్నారు.
“దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రాముఖ్యంగా ఎంతో మరపురాని సంఘటన జరిగింది. తన స్నేహితుని స్లీప్ ఓవర్ పార్టీకి—ఆ పార్టీలో అందరూ పార్టీ జరిగే ఇంట్లోనే రాత్రంతా నిద్రపోతారు—వెళ్లిన నా తొమ్మిదేండ్ల కుమారుడు, పార్టీ జరుగుతుండగా నాకు ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తానని అన్నాడు, . . . నేను వెళ్లి వాణ్ని పికప్ చేసుకున్న తర్వాత ఏమైందని వాణ్ని అడిగాను, ‘అబ్బా, చాలా బోర్ కొడుతుంది డాడీ. వాళ్లు ఊరికే కూర్చుని టీవీ చూద్దాం అన్నారు!’ అని వాడు చెప్పాడు.”