సాక్ష్యమిచ్చు అవకాశములను పట్టుకొనుము
1 “మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడు,”—అని లేఖనములు మనలను గట్టిగా పురికొల్పుచున్నవి. (1 కొరిం. 10:31) రానైయున్న నెలలు దీనిని అనేక విధములుగా చేయుటకు అవకాశములనిచ్చును.
2 కొందరు ఈ సమయమున సెలవు తీసుకొనుచుందురు. ఏమైనప్పటికిని, మనలో ఎవరమును ఏ కాలమందైనను మన యొక్క ప్రకటించు మరియు బోధించు పనిని నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి సెలవులలోయున్నను, సమావేశమునకు హాజరగుచున్నను, లేక పాఠశాల సెలవులలోయున్నను ఇతరులకు సాక్ష్యమిచ్చుటకు ఆతురతను కలిగియుండుము. దీనిని మనమెట్లు చేయగలము?
సెలవులో ఉన్నప్పుడు
3 మీరు బంధువులను దర్శించ పథకము వేసుకొనుచున్నారా? మనలో ఎక్కువమందిమి మన కుటుంబబంధములను నూతనపరచుకొనుటను ఆనందించెదము. మీ బంధువులు సత్యములో లేనట్లయిన వారితో మీరు రాజ్యవర్తమానమును పంచుకొనవచ్చును. తమ బంధువులకు సాక్ష్యమిచ్చుటకు తగిన సమయము కొరకు ఓపికతో కనిపెట్టిన అనేకమంది సహోదరులు మంచి విజయమును పొందారు. ఈ విధముగా వారు బంధువులలో కొంతమంది సత్యమును నేర్చుకొనిరి.—ది వాచ్‌టవర్, ఫిబ్రవరి 15, 1990 25-7 పేజీలను చూడుము.
4 సెలవులో మీ యింటిని వదలివెళ్లి ప్రయాణించు పథకముతో యున్నట్లయిన ఆ స్థానిక సంఘముతో ప్రాంతీయ సేవలో పనిచేయుటకును, కూటములకు హాజరగుటకును ఎందుకు ఏర్పాటులను చేసికొనకూడదు? మనము “మన సహోదరులందరియెడల ప్రేమను కలిగియున్నాము,” మరియు ప్రాంతీయసేవలో వారితో కలిసి పనిచేయుట వారిని బాగుగా ఎరుగుటకును, సత్యములోని వారి అనుభవమునుండి ప్రయోజనము పొందుటకును అవకాశమును కలుగజేయును. (1 పేతు. 2:17) సెలవులోయున్నప్పుడు కూటములకు హాజరై, ప్రకటన పనిలో పాల్గొనుటవలన మనకై మనము ప్రయోజనమును కలుగజేసికొని మన సహోదరులతో నిజమైన విశ్రాంతిననుభవించెదము.—మత్త. 11:28, 29.
సమావేశమునకు హాజరగునప్పుడు
5 జిల్లా సమావేశమునకు హాజరగునప్పుడు ఇతరులకు సాక్ష్యమిమ్ము. బేడ్జిలను ధరించుకొనుట ఇతరుల ఆసక్తిని రేకెత్తించుటకు కారణమైన వారితో సత్యమును గూర్చి మాట్లాడుటకు మనకు మార్గము తెరచును. ఇంధనము కొరకు, ఆహారశాలలో భుజించుటకు, లేక ప్రజారవాణా కొరకు ఆగినప్పుడు సాక్ష్యమిచ్చు అవకాశములకై చూడుము. ఇలాంటి సమయములలోని తటస్థసాక్ష్యములు మంచి ఫలితములను ఉత్పత్తి చేయగలవు. కావున మీ బైబిలును, తగిన సాహిత్యములను అందుబాటులో యుంచుకొని సాక్ష్యమిచ్చుటకు సిద్ధపడియుండుము.
కుటుంబముగా అభివృద్ధికర కార్యము
6 రానైయున్న నెలలలో మనలో కొంతమందిమి పాఠశాలల నుండి లేదా పనినుండి సెలవు పొంది యుందుము గనుక ఆక్సిలరీ పయినీరు సేవచేయుట ద్వారా ఎక్కువ సమయమును ప్రాంతీయ పరిచర్యలో ఎందుకు గడపకూడదు? ఇతరులతో పనిచేయుట ద్వారా మీ పరిచర్యను వృద్ధి చేసికొని మీ ప్రేమను “విశాలపరచు”కొనవచ్చును. సంఘములో సాధ్యమైనంత ఎక్కువమందితో ఎందుకు పనిచేయకూడదు? (2 కొరిం. 6:11-13) కుటుంబములు కుటుంబములు కలసి సెలవు నెలలను ఆక్సిలరీ పయినీరు సేవను చేయుటకు ఉపయోగించినవి. ఇది వారి విశ్వాసమును బలపరచి కుటుంబముగా ఒకరితోయొకరిని మరియు యెహోవాతోను వారిని సమీపపరచినవి. ఇది సంఘమును కూడా ప్రోత్సాహపరచి, తత్ఫలితముగా ఇతరులును ఎక్కువ కార్యమును చేయుటకు ప్రేరేపించవచ్చును.
7 మన సమయమును అనేక సంగతులు ఆక్రమించుకొనగలవు గనుక దానిని ఎక్కువగా ఉపయోగించునట్లు మనము మంచి క్రమమును ఏర్పరచుకొను మనస్సును కలిగియుండవలెను. ఆత్మీయముగా ప్రాముఖ్యమైనవాటిని ముందుంచుటద్వారా ‘మన వెలుగును మనుష్యులయెదుట ప్రకాశింపజేయగలము.’ ఇతరులతో సత్యమును పంచుకొనుటకు మనము ప్రతి అవకాశమును పట్టుకొనినందువలన వారు మన సత్క్రియలను చూచుకొలది కొందరు యెహోవాకు ఘనతనిచ్చుటకు కదిలింపబడవచ్చును.—మత్త. 5:16.