కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 7/8 పేజీలు 5-7
  • దేవుని స్వరూపమందా లేక మృగ స్వరూపమందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని స్వరూపమందా లేక మృగ స్వరూపమందా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జంతువుల నుండి మనం భిన్నంగా ఉన్న విషయాలు
  • వారధివేయలేనంత పెద్ద అగాధమా?
  • ఊగిసలాడే సిద్ధాంతం
  • దుఃఖకరమైన పర్యవసానాలు
  • ఆరాధించాల్సింది సృష్టినా లేక సృష్టికర్తనా?
  • విచారణలో ఉన్న పరిణామ సిద్ధాంతం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మానవులం మనమెవరం?
    తేజరిల్లు!—1998
  • జంతువులు పరలోకానికి వెళ్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • జీవితమునకు ఇంకనూ చాలా ఉన్నది!
    జీవితమునకు ఇంకనూ చాలా ఉన్నది!
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 7/8 పేజీలు 5-7

దేవుని స్వరూపమందా లేక మృగ స్వరూపమందా?

మొదటి మానవుడైన ఆదాము ‘దేవుని కుమారుడు’ అని పిలువబడ్డాడు. (లూకా 3:38) ఏ జంతువూ ఆ వైవిధ్యాన్ని అనుభవించలేదు. అయినప్పటికీ, అనేక విషయాల్లో మానవులకు జంతువులతో సామ్యం ఉందని బైబిలు తెలియజేస్తోంది. ఉదాహరణకు, మానవులకూ జంతువులకూ నెఫెష్‌ అనే హెబ్రీ పదం ఉపయోగించబడింది, శ్వాసించేవారని ఆ పదం యొక్క అక్షరార్థ భావం.

జంతువుల్ని గురించి, ఆదికాండము 1:24 ఇలా చెబుతోంది: “వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని [జీవముగల నెఫెష్‌లను], అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను.” మనం దేవుని స్వరూపమందు సృష్టించబడ్డామని బయల్పర్చడం ద్వారా మానవులను ఘనపర్చినా, జంతువులతోపాటుగా మానవులూ భూసంబంధమైన జీవులేనని [నెఫెష్‌లని] చెప్పడం ద్వారా బైబిలు మన స్థాయిని గురించి మనకు జ్ఞాపకం చేస్తోంది. అయితే, మరొక విషయంలో కూడా మానవులకూ జంతువులకూ సామ్యం ఉంది.

బైబిలు ఇలా వివరిస్తోంది: “నరులకు సంభవించునది యేదో అదే, మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; . . . మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; . . . సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.” అవును, మరణమందు మనుష్యులకూ జంతువులకూ పట్టే గతి ఒక్కటే. మనుష్యులూ జంతువులూ తామెక్కడనుండి వచ్చారో/వచ్చాయో ఆ ‘నేలకే,’ ఆ ‘మంటికే’ తిరిగి చేరుకుంటారు/చేరుకుంటాయి.—ప్రసంగి 3:19, 20; ఆదికాండము 3:19.

అయితే, మానవులు మరణం విషయంలో ఎందుకంత అధికంగా కలత చెందుతారు? నిరంతరం జీవించాలని మనమెందుకు కలలు కంటాం? జీవితంలో ఓ సంకల్పాన్ని మనమెందుకు కల్గివుండాలి? నిశ్చయంగా, మనం జంతువుల నుండి ఎంతో భిన్నంగా ఉన్నాం!

జంతువుల నుండి మనం భిన్నంగా ఉన్న విషయాలు

తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం తప్ప మరే సంకల్పంలేని జీవితాన్ని గడపడంలో మీకు సంతోషం ఉంటుందా? అంకితభావంగల పరిణామవాదుల్ని సహితం ఆ ఆలోచన కదిలించివేస్తుంది. పరిణామవేత్త టి. డబ్ఝాన్ష్కీ ఇలా రాస్తున్నాడు: “జ్ఞానీ, సంశయవాదీ, అజ్ఞేయతావాదీ అయిన ఆధునిక మానవుడు కనీసం అంతరంగంలోనైనా సరే ఈ క్రింది ప్రశ్నల్ని గురించి ఆలోచించకుండా ఉండలేడు: నన్ను నేను సజీవంగా ఉంచుకొంటూ, జీవితచక్రాన్ని నిరాటంకంగా కొనసాగించడం మాత్రమే కాకుండా నా జీవితానికి మరేదైనా పరమార్థం, సంకల్పం ఉందా? నేను జీవిస్తున్న ఈ విశ్వానికి ఏదైనా అర్థమంటూ ఉందా?”

వాస్తవానికి, సృష్టికర్త ఉనికిని కాదనడం జీవితార్థం కొరకైన మానవుని అన్వేషణను ఆపలేదు. చరిత్రకారుడైన ఆర్నాల్డ్‌ ట్యోయన్బీ చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ రిచర్డ్‌ లీకే ఇలా రాస్తున్నాడు: “[మానవుని] ఆధ్యాత్మిక సామర్థ్యం, తాను పుట్టిన విశ్వంతో సమాధానపడేందుకు జీవితాంతం పోరాటాన్ని సాగించమని అతణ్ణి నిర్దేశిస్తోంది.”

అయినప్పటికీ, మానవ స్వభావాన్ని గూర్చిన, మన ఆవిర్భావాన్ని గూర్చిన, మన ఆధ్యాత్మికతను గూర్చిన మౌలిక ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. మానవులకూ, జంతువులకూ మధ్యన పెద్ద అగాధం ఉందని స్పష్టమౌతోంది. ఆ అగాధమెంత పెద్దది?

వారధివేయలేనంత పెద్ద అగాధమా?

మానవుల్ని జంతువులనుండి వేరుచేసే పెద్ద అగాధమే పరిణామవాద సిద్ధాంతానికి ప్రధాన సమస్య. వాస్తవానికి, అదెంత పెద్ద అగాధం? దాన్ని గురించి కొంతమంది పరిణామవేత్తలు చెప్పిన కొన్ని విషయాల్ని పరిశీలించండి.

19వ శతాబ్దంలో పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారిలో ప్రముఖుడైన థామస్‌ హెచ్‌. హుక్స్‌లే ఇలా రాస్తున్నాడు: “మనుష్యులకూ మృగాలకూ . . . మధ్యనున్న అగాధం ఎంత పెద్దగా ఉందనే విషయాన్ని గురించి నేను ఒప్పించబడినంత బలంగా ఎవ్వరూ ఒప్పించబడలేదు . . . , అతడు [మానవుడు] మాత్రమే అద్భుతమైన బుద్ధిగ్రాహ్య సామర్థ్యాన్నీ, వివేకయుక్తంగా మాట్లాడే శక్తినీ కల్గివున్నాడు . . . తన తోటి జీవజాలానికన్నా ఎంతో పైస్థాయిలో, పర్వతశిఖరంపైనున్నట్టుగా ఉన్నాడు.”

పరిణామవేత్త మైఖెల్‌ సి. కొర్బాల్లస్‌ ఇలా పేర్కొన్నాడు: “మానవులకూ, మరితర ప్రయిమేట్స్‌కూ మధ్య పెద్ద అగాధం ఉందని స్పష్టమౌతోంది . . . ‘మనంత పరిమాణంలో ఉండే ప్రయిమేట్‌కు ఎంత పరిమాణంలో మెదడు ఉండాలని మనం అనుకుంటామో దానికన్నా మన మెదడు మూడు రెట్లు పెద్దదిగా ఉంది.” న్యూరాలజిస్ట్‌ రిచర్డ్‌ యమ్‌. రెస్టాక్‌ ఇలా వివరిస్తున్నాడు: “[మనకు] తెల్సిన విశ్వంలో తనను తాను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించే ఏకైక అవయవం [మానవుని] మెదడే.”

లీకే ఇలా అంగీకరిస్తున్నాడు: “[మానవ] విచక్షణాజ్ఞానం సైంటిస్టులను సందిగ్ధావస్థలో పడవేస్తోంది, అది పరిష్కారయుతమైనది కాదని కొంతమంది విశ్వసిస్తున్నారు. వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలని మనలో ప్రతి ఒక్కరికీ ఉన్న ఇంద్రియ జ్ఞానం ఎంతో ప్రశస్తమైనది, అది మనం ఆలోచించే, చేసే ప్రతీదాన్నీ ఉద్దీపింపచేస్తోంది.” ఆయనింకా ఇలా అంటున్నాడు: “భాష హోమో సేపియన్జ్‌కూ [మానవులకూ], మిగతా సహజ ప్రపంచానికీ మధ్య నిశ్చయంగా ఓ అగాధాన్ని సృష్టిస్తోంది.”

మానవ మేధస్సుకున్న మరొక అద్భుత లక్షణాన్ని సూచిస్తూ పీటర్‌ రస్సల్‌ ఇలా రాస్తున్నాడు: “జ్ఞాపకశక్తి అన్నది నిస్సందేహంగా, అత్యంత ప్రముఖమైన మానవ సామర్థ్యాల్లో ఒకటై ఉంది. అది లేకుండా నేర్చుకోవడంగానీ, . . . మేధో సంబంధమైన విధులను నిర్వర్తించడం గానీ, భాషాజ్ఞానాన్నీ లేక సాధారణంగా మానవునిలో ఉండే ఏ ఇతర లక్షణాలనూ . . . పెంపొందించుకోవడం గానీ జరగదు.”

అంతేగాక, మృగాలేవీ ఆరాధనలో పాల్గొనవు. అందుకే, ఎడ్వర్డ్‌ ఒ. విల్సన్‌ ఇలా పేర్కొన్నాడు: “మతపరమైన నమ్మకంవైపు మొగ్గు చూపడమనేది మానవ మేధస్సులో ఉండే అత్యంత సంకీర్ణమైన బలమైన శక్తి, అది బహుశా మానవ స్వభావాన్నుండి తొలగించలేని భాగమైవుంది.”

“మానవ ప్రవర్తన డార్విన్‌ సిద్ధాంతంలోని అనేక ఇతర మర్మాలను మన ముందు ఉంచుతుంది” అని పరిణామవేత్త రాబర్ట్‌ రైట్‌ అంగీకరిస్తున్నాడు. “చతురోక్తుల, చిరునవ్వుల విధులేమై ఉన్నాయి? ప్రజలు చివరి ఘడియల్లో తమ అపరాధాల్ని ఎందుకు ఒప్పుకుంటారు? . . . దుఃఖం నిర్వర్తించే విధి ఏమిటి? . . . ఇప్పుడా వ్యక్తి గతించిపోయాక, ఆ దుఃఖం జన్యుకణాలకు [మానవ కుటుంబానికి] ఎలా ప్రయోజనకరమైనదౌతుంది?”

పరిణామవేత్త ఇలేన్‌ మార్గాన్‌ ఇలా అంగీకరిస్తోంది: “మానవుల్ని గురించిన నాలుగు అత్యంత విశిష్టమైన మర్మాలు ఏమిటంటే: (1) వాళ్లు రెండు కాళ్లపై ఎందుకు నడుస్తారు? (1) వాళ్లు తమ శరీరమ్మీది బొచ్చును ఎందుకు కోల్పోయారు? (3) అంత పెద్ద పెద్ద మెదళ్లు వాళ్లలో ఎలా పెరిగాయి? (4) వాళ్లు మాట్లాడ్డాన్ని ఎందుకు నేర్చుకున్నారు?”

ఈ ప్రశ్నలకు పరిణామవేత్తలు ఎలా జవాబిచ్చారు? మార్గాన్‌ ఇలా వివరిస్తోంది: “ఈ ప్రశ్నలకు ఏకగ్రీవంగా వచ్చే జవాబులేమిటంటే: (1) ‘మాకింకా తెలియదు’; (2) ‘మాకింకా తెలియదు’; (3) ‘మాకింకా తెలియదు,’ (4) మాకింకా తెలియదు.’”

ఊగిసలాడే సిద్ధాంతం

ది లాప్సైడెడ్‌ ఏప్‌ అనే పుస్తక గ్రంథకర్త “కాలగమనంలో జరిగిన మానవపరిణామాన్ని గూర్చి అనిర్దిష్టమైన వివరణను ఇవ్వడమే” తన లక్ష్యమని చెప్పాడు. అనేక నిర్ధారణలు ఊహాజనితమైనవే, ఎందుకంటే అవి ప్రధానంగా పురాతన కాలానికి చెందిన కొన్ని దంతాలపైనా, ఎముకలపైనా, రాళ్లపైనా ఆధారపడి ఉన్నాయి.” నిజం చెప్పాలంటే, డార్విన్‌ రూపొందించిన సిద్ధాంతాన్ని కూడా అనేకమంది అంగీకరించలేదు. రిచర్డ్‌ లీకే ఇలా చెబుతున్నాడు: “మనం పరిణామం చెందే విధానాన్ని గూర్చిన డార్విన్‌ వాదం, కొన్నేళ్ల క్రిందటి వరకు శరీరనిర్మాణ శాస్త్రాన్ని అదుపు చేసింది, అటు తర్వాత అది తప్పని తేలింది.”

ఇలేన్‌ మార్గాన్‌ ప్రకారంగా, అనేకమంది పరిణామవేత్తలు “ముప్పై ఏళ్ల క్రిందట తమకు తెలుసని తామనుకొన్న జవాబులపై నమ్మకాన్ని కోల్పోయారు.” అందుకే, పరిణామవేత్తలు నమ్మిన కొన్ని సిద్ధాంతాలు కుప్పకూలిపోయాయంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు.

దుఃఖకరమైన పర్యవసానాలు

ఒక మగ జంతువు ఎన్ని ఆడ జంతువులతో జతకడుతుందనే విషయానికీ, జతకడుతున్న జంతువుల శరీరాల మధ్యనున్న పరిమాణ భేదానికి సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. దీన్నిబట్టి, మానవ లైంగిక అలవాట్లు చింపాంజీల లైంగిక అలవాట్లలానే ఉంటాయనే నిర్ధారణకు కొంతమంది వచ్చారు, ఎందుకంటే తమకు ప్రతిరూపాలైన మానవులవలే మగ చింపాంజీలు ఆడ చింపాంజీలకన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. కాబట్టి చింపాంజీల్లానే మానవులు కూడా ఎక్కువమంది లైంగిక భాగస్వాములను కల్గివుండేందుకు అనుమతించాలని కొంతమంది వాదిస్తారు. మరి నిజానికి అనేకమంది అలానే చేస్తారు.

కానీ చింపాంజీల విషయంలో చక్కగా పనిచేస్తున్నట్టున్నది మానవుల విషయంలో సాధారణంగా వినాశనకరమైనదిగా రుజువైంది. లైంగిక విచ్ఛలవిడితనమనేది కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడమూ, గర్భస్రావాలూ, రోగాలు, మానసికంగానూ భావోద్రేకంగానూ ఉద్వేగానికి గురవ్వడమూ, అసూయా, కుటుంబంలో హింసా, విడిచిపెట్టబడిన పిల్లలు పెద్దయిన తర్వాత సంతుల్యాన్ని కోల్పోవడమూ, వాళ్లా తర్వాత అదేవిధమైన పరిస్థితిని పునరావృతం చేయడమూ వంటి బాధలకు దారితీస్తుందని వాస్తవాలు చూపిస్తున్నాయి. మానవులు జంతువులకున్న స్వభావాన్ని కల్గివున్నారనే విషయమే వాస్తవమైతే పైన ప్రస్తావించిన విషయాలు మానవులకు భావోద్రేకపరమైన బాధను ఎందుకు కల్గిస్తాయి?

పరిణామవాద ఆలోచనా సరళి, మానవ జీవిత పవిత్రతపై కూడా సందేహాన్ని రేకెత్తిస్తోంది. మనం దేవుడు లేడని చెబుతూ, మనల్ని మనం ఉన్నతశ్రేణికి చెందిన జంతువులుగా దృష్టించుకుంటే దేని ఆధారంగా మానవ జీవితం పవిత్రమైనదని చెప్పగలం? బహుశా మన తెలివితేటల్నిబట్టా? తెలివితేటల్నిబట్టేనని చెప్పినట్లైతే, మానవ వైవిధ్యం (ఆంగ్లం) అనే పుస్తకంలో లేవదీయబడిన ఈ క్రింది ప్రశ్న ఎంతో సముచితమైనదై ఉంటుంది: “[పరిణామక్రమం మూలంగా వచ్చిన] ప్రయోజనాలన్నింటినీ మనం పొందినందువల్లనే మానవుల్ని కుక్కలకన్నా పిల్లులకన్నా ఎంతో ఉన్నతమైనవారిగా చూడడం సమంజసమేనా?”

పరిణామవాదపు ఆలోచనా సరళిని గూర్చిన క్రొత్త వర్షన్‌ వ్యాప్తిచెందుతుండగా, అది “నైతిక ఆలోచనను తీవ్రంగా ప్రభావితం చేయడం అనివార్యం” అని నైతిక జంతువు (ఆంగ్లం) అనే పుస్తకం చెబుతోంది. కానీ హెచ్‌. జి. వెల్స్‌ చెబుతున్నట్టుగా “బలిష్టులూ, జిత్తులమారితనంగల వాళ్లూ బలహీనులనూ, ఇతరుల్ని విశ్వసించేవాళ్లనూ దోచుకుంటారు” అనేది దేనిద్వారా జరుగుతుందో ఆ “ప్రకృతి వరణము” ద్వారా మనం రూపొందించబడ్డామనే పూర్వానుమానం క్రూరమైన నైతికత్వం.

ప్రాముఖ్యంగా, గడిచిపోయిన అనేక సంవత్సరాల్లో నైతికత్వాన్ని నెమ్మది నెమ్మదిగా నిర్మూలించిన పరిణామవాదుల అనేక సిద్ధాంతాలు ఆలోచనాపరుల మరొక తరంగంతో తుడిచిపెట్టుకు పోయాయి. కానీ అలాంటి సిద్ధాంతాలు కలుగజేసిన హాని మాత్రం మిగిలిపోవడం విషాదకరమైన విషయం.

ఆరాధించాల్సింది సృష్టినా లేక సృష్టికర్తనా?

పరిణామవాదం ఒకడు జవాబులకోసం తన దృష్టిని పైకి సృష్టికర్తవైపుకిగాక క్రిందికి సృష్టివైపుకి సారించేలా చేస్తుంది. మరో వైపున బైబిలు, నైతిక విలువల కోసమూ, జీవిత సంకల్పం కోసమూ మనం మన దృష్టిని పైకి సత్య దేవునివైపుకి సారించేలా చేస్తుంది. తప్పుచేయకుండా ఉండడానికి మనమెందుకు పోరాడాల్సి వస్తుందో, మరణం మూలంగా మానవులు మాత్రమే ఎందుకంతగా కలతచెందాల్సి వస్తుందో కూడా అది వివరిస్తోంది. అంతేగాక, చెడును చేయడానికి మనమెందుకు మొగ్గు చూపిస్తామనే దానిని గురించిన బైబిలు వివరణ మానవ మనస్సులకూ, హృదయాలకూ సత్యమని అనిపిస్తుంది. ఆ సంతృప్తికరమైన వివరణను పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

[7వ పేజీలోని చిత్రాలు]

మానవునికీ, మృగానికీ మధ్యనున్న అగాధం ఎంత పెద్దది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి