జవాబుల కోసం దృష్టిని క్రిందికిగాక పైకి సారించండి
కాలక్రమంలో జరిగిన మార్పులు ఉన్నత జంతువులుగా మనల్ని క్రమంగా రూపుదిద్దాయనే విషయాన్ని పరిణామవాదం బోధిస్తోంది. మరోవైపున, మనం దేవుని పోలికన పరిపూర్ణులుగా జీవితాన్ని ఆరంభించినప్పటికీ, అటు తర్వాత కొద్దికాలానికి అపరిపూర్ణత పరిచయం చేయబడిందనీ, మరి మానవజాతి అంతకంతకూ దిగజారిపోవడం ఆరంభమైందనీ బైబిలు తెలియజేస్తోంది.
మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు నైతిక స్వేచ్ఛను పొందడానికి ప్రయత్నించి, ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపించడం ద్వారా తమ మనస్సాక్షుల్ని గాయపర్చుకోవడంతో ఈ తిరోగమనం ప్రారంభమైంది. భద్రతకోసం ఏర్పాటు చేసిన గార్డ్రెయిల్లో నుండి దూసుకుపోయేలా నడిపించబడిన వాహనంలా, వాళ్లు దేవుని చట్టాలనే భద్రతా గార్డ్రెయిల్లో నుండి ఉద్దేశపూర్వకంగా దూసుకుపోయి, ఇప్పుడు మనమున్న స్థితిలోకి అంటే జాతి దురభిమానాలూ, మతవిద్వేషాలూ, భయంకరమైన యుద్ధాలతోపాటుగా రోగాలతో, వృద్ధాప్యంతో, మరణాలతో బాధననుభవించే స్థితిలోకి పడిపోయారు.—ఆదికాండము 2:17; 3:6, 7.
జంతు జన్యుకణాలా, లోపమున్న జన్యుకణాలా?
ఆదాము హవ్వలు పాపంచేసినప్పుడు వాళ్ల పరిపూర్ణ దేహాలకు ఏం జరిగిందనే విషయాన్ని బైబిలు శాస్త్రీయ పరిభాషలో వివరించడంలేదు. కారు యజమాని మాన్యుల్ ఎలా అయితే ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన టెక్ట్స్ పుస్తకంకాదో అలాగే బైబిలూ సైన్సు పుస్తకం కాదు. అయితే, కారు యజమాని మాన్యుల్లానే బైబిలు ఖచ్చితమైనది; అది కల్పితగాథ కాదు.
ఆదాము హవ్వలు భద్రతకోసం ఏర్పాటుచేయబడిన దేవుని చట్టాలనే కంచెను దాటినప్పుడు, వారి దేహపరిస్థితి దెబ్బతింది. తర్వాత, అవి నెమ్మది నెమ్మదిగా కృశించిపోతూ మరణానికి నడిపించాయి. వంశానుగత సూత్రాల ద్వారా, వారి పిల్లలైన మానవాళికి అపరిపూర్ణత సంక్రమించింది. అందుకే, వాళ్లు కూడా మరణాన్ని చవిచూస్తున్నారు.—యోబు 14:4; కీర్తన 51:5; రోమీయులు 5:12.
విచారకరంగా, మనకు వారసత్వంగా సంక్రమించినవాటిలో పాపంవైపు మొగ్గుచూపించడం కూడా చేరివుంది, అది స్వార్థము, అనైతికతల రూపంలో పైకి కనబడుతోంది. నిజమే, సెక్సు ఉండాల్సిన స్థానంలో ఉంటే దాంట్లో తప్పేమీలేదు. దేవుడు మొదటి మానవ దంపతులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం[చండి].” (ఆదికాండము 1:28) ప్రేమగల సృష్టికర్తగా ఆయన, ఆ ఆజ్ఞను నెరవేర్చడంలో భార్యాభర్తలు ఆనందాన్ని పొందేలా చేశాడు. (సామెతలు 5:18) కానీ మానవ అపరిపూర్ణత సెక్సును దుర్వినియోగపర్చేందుకు నడిపించింది. నిజానికి, అపరిపూర్ణత మన మనస్సూ, శరీరమూ నిర్వర్తించే విధులన్నింటితోపాటూ మన జీవితాల్లోని ప్రతీదాన్నీ ప్రభావితం చేసింది, దాన్ని గురించి మనకందరికీ బాగా తెలుసు.
కానీ అపరిపూర్ణత మన నైతిక భావనను తుడిచివేయలేక పోయింది. మనం నిజంగా కావాలనుకొంటే, “స్టీరింగ్ వీల్”ని మన చేతుల్లోకి తీసుకొని, పాపంవైపుకు మొగ్గుచూపించే ప్రవృత్తితో పోరాడడం ద్వారా జీవితంలోని ఉచ్చుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించవచ్చు. అపరిపూర్ణుడైన ఏ మానవుడూ పాపంతో సాగించే పోరాటంలో పూర్తిగా విజయాన్ని సాధించలేకపోవచ్చు, మరి దేవుడు దయాపూర్వకంగా ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు.—కీర్తన 103:14; రోమీయులు 7:21-23.
మనమెందుకు మరణించాలని అనుకోం
పరిణామ సిద్ధాంతం సంతృప్తికరంగా వివరించలేని మరొక సమస్యపై అంటే మరణం సహజమైందిగానూ, అనివార్యమైందిగానూ ఉన్నప్పటికీ, మరణాన్ని అంగీకరించని మానవుని సాధారణ విముఖతపై కూడా బైబిలు వెలుగును ప్రసరింపచేస్తోంది.
బైబిలు బయల్పరుస్తున్నట్టుగా, మరణమనేది పాపం మూలంగానూ, దేవునికి అవిధేయత చూపించడం మూలంగానూ సంభవించింది. మన ఆది తల్లిదండ్రులు విధేయులై ఉండి ఉన్నట్లైతే, వాళ్లు తమ పిల్లలతోపాటూ నిరంతరమూ జీవించి ఉండేవారు. నిజానికి దేవుడు, నిరంతరమూ జీవించాలనే అభిలాషతో మానవ మనస్సుని ప్రోగ్రామ్ చేశాడు. “అతడు [దేవుడు] నరునికి శాశ్వతత్వమును . . . [ఇ]చ్చెను” అని క్యాతలిక్ అనువాదము ప్రకారంగా ఉపదేశకుడు [ప్రసంగి] 3:11 చెబుతోంది. అందుకే, వారికి విధించబడిన మరణ దండన, మానవుల్లో అంతర్గత సంఘర్షణనను అంటే ఎడతెగని అసంగతత్వాన్ని రేపింది.
ఈ అంతర్గత సంఘర్షణను సమన్వయపర్చేందుకూ, జీవించాలనే సహజసిద్ధమైన అభిలాషను తీర్చుకోవడానికీ, మానవులు అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతం నుండి పునర్జన్మనందు విశ్వసించడం వరకూ అన్నిరకాలైన నమ్మకాల్ని సృష్టించుకున్నారు. సైంటిస్టులు వృద్ధాప్య ప్రక్రియకు సంబంధించిన మర్మాన్ని పరిశోధిస్తున్నారు, ఎందుకంటే వాళ్లు కూడా దాన్ని అరికట్టాలనీ లేదా కనీసం ఆయుష్షునైనా పెంచాలనీ అనుకుంటున్నారు. దేవుడులేడనే పరిణామవాదులు, మానవులు ఉన్నతశ్రేణికి చెందిన జంతువులు మాత్రమేననే తమ దృక్పథంతో, నిత్యమూ జీవించాలనే అభిలాష విభేదిస్తోంది గనుక దాన్ని పరిణామవాదపు ట్రిక్గానూ లేదా మోసంగానూ త్రోసిపుచ్చుతున్నారు. మరోవైపున, మరణం మానవజాతి శత్రువు అనే బైబిలు వ్యాఖ్యానం జీవించాలనే మన సహజ అభిలాషతో ఏకీభవిస్తోంది.—1 కొరింథీయులు 15:26.
అయితే, మనం నిరంతరం జీవించడానికే చేయబడ్డామని తెలియజేసే క్లూస్‌ని వేటినైనా మన శరీరం ఇస్తోందా? ఇస్తోందనేదే జవాబు! మనం జీవిస్తున్న దానికన్నా మరింత దీర్ఘకాలం జీవించేందుకే మనం చేయబడ్డామనే తిరుగులేని రుజువుతో మానవ మెదడు మనల్ని దిగ్భ్రాంతుల్ని చేస్తోంది.
నిరంతరం జీవించేందుకే చేయబడ్డాం
మెదడు 1.4 కేజీల బరువు ఉంటుంది. దాంట్లో 10 నుండి 100 బిలియన్ల న్యూరాన్ల వరకూ ఉంటాయి, ఏ రెండు న్యూరాన్లూ ఖచ్చితంగా ఒకేలా ఉండవు అని చెప్పబడుతోంది. ప్రతీ న్యూరానూ 2,00,000 ఇతర న్యూరాన్లతో కలుపబడి, మెదడులో అపరిమితమైన సంఖ్యలో సర్క్యూట్లనూ లేదా మార్గాల్ని ఏర్పాటు చేసుకోగలదు. అంతేగాక, “ప్రతీ న్యూరానూ ఒక అధునాతనమైన కంప్యూటర్” అని సైంటిఫిక్ అమెరికన్ చెబుతోంది.
మెదడు రసాయనిక ద్రవంలో మునిగి తేలుతుంది. అది న్యూరాన్లు ప్రవర్తించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడు అతి శక్తివంతమైన కంప్యూటర్‌కన్నా అత్యంత సంక్లిష్టమైనది. “ప్రతి తలలోనూ ఒక అద్భుతమైన పవర్‌హౌస్ అంటే చిన్నదైన నైపుణ్యవంతమైన అవయవం ఉంది, దాన్ని గురించి నేర్చుకొనేకొద్దీ దాని సామర్థ్యం అనంతంగా వ్యాపిస్తున్నట్టు అనిపిస్తోంది” అని టోనీ బుఝాన్, టెర్నాన్ట్స్ డిక్సన్ రాశారు. ప్రొఫెసర్ ప్యూటర్ ఆన్కోన్ చెప్పినదాన్ని ఎత్తిరాస్తూ వాళ్లిలా జోడించారు: “తన మెదడుకున్న సామర్థ్యమంతటినీ పూర్తిగా ఉపయోగించుకోగల్గే మనిషింతవరకూ పుట్టలేదు. ఈ కారణాన్నిబట్టే మేం మానవ మెదడుకున్న పరిమితులను గూర్చిన ఆశావాదపూరితమైన ఎలాంటి అంచనాలను అంగీకరించం. అది అపరిమితమైనది.”
ఆశ్చర్యచకితుల్ని చేసే ఈ వాస్తవాలు పరిణామ సిద్ధాంతాన్ని బాహాటంగా తిప్పికొట్టాయి. లక్షలాది లేదా కోట్లాది జీవితకాలాలపాటు పనిచేయగలిగే శక్తిగల అవయవాన్ని పరిణామసిద్ధాంతం, కేవలం గుహల్లో నివసించేవారి కొరకో లేక నేటి ఉన్నత విద్యావంతుల కొరకో ఎందుకు “సృష్టించింది”? నిజంగా, నిత్యజీవం మాత్రమే సహేతుకమైనదని అన్పిస్తుంది! అయితే మన శరీరం విషయమేమిటి?
రిపేర్ అండ్ రిన్యూవల్—జర్నీ త్రూ ది మైండ్ అండ్ బాడీ అనే పుస్తకమిలా తెలియజేస్తోంది: “దెబ్బతిన్న ఎముకలూ, కణధాతువులూ, అవయవాలూ వాటంతటవే నయమయ్యే తీరు, నిజంగా ఓ అద్భుతమైన విషయం. మనం దాన్ని గురించి కాస్సేపు ఆలోచిస్తే, చర్మమూ, వెంట్రుకలూ, గోళ్లూ—శరీరంలోని ఇతర అవయవాలూ వాటంతటవే యథావిధిగా పూర్వస్థితికి రావడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయమని మనం గ్రహిస్తాం: అక్షరార్థంగా చెప్పాలంటే అది మనల్ని క్రమంగా పునఃనిర్మిస్తోంది, జీవరసాయనిక పరిభాషలో చెప్పాలంటే, మన జీవితకాలాల్లో అనేకసార్లు పునర్నిర్మిస్తుంది.”
దేవుని నియమిత కాలంలో, దానంతటదే తిరిగి భర్తీచేసుకొనే అద్భుతమైన ఈ ప్రక్రియ నిత్యమూ నిరాటంకంగా కొనసాగేలా చేయడం దేవునికి కష్టమేమీ కాదు. అప్పుడు, చివరకు ‘మరణం నశింపచేయబడుతుంది.’ (1 కొరింథీయులు 15:26) అయితే మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే, మనకు నిత్యజీవంకన్నా మరెంతో అవసరమైవుంది. మనకు సమాధానం అవసరం, అంటే దేవునితోనూ, మన తోటి మానవులతోనూ సమాధానంగా ఉండడం అవసరం. ప్రజలు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకొంటేనే అలాంటి సమాధానం వాస్తవరూపం దాల్చుతుంది.
ప్రేమపై ఆధారపడిన ఓ క్రొత్త లోకం
“దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8 చెబుతుంది. కాబట్టి ప్రేమ—మరి విశేషంగా యెహోవా దేవుని ప్రేమ శక్తివంతమైంది. నిరంతరం జీవిస్తామని మనం నిరీక్షించవచ్చనే దాని వెనుకనున్న కారణమదే. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16 చెబుతోంది.
నిత్యజీవమా! ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షో గదా! కానీ మనం పాపాన్ని స్వతంత్రించుకొన్నాం గనుక, మనకు జీవించే హక్కు లేదు. “పాపమువలన వచ్చు జీతము మరణము” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 6:23) అయితే, మన తరుపున మరణించేందుకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమ కదిలించింది. అపొస్తలుడైన యోహాను యేసును గురించి ఇలా రాశాడు: “ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను.” (1 యోహాను 3:16) ఆయనయందు విశ్వాసాన్నుంచిన మనం మన పాపాలు పరిహరించబడి, నిత్యజీవాన్ని అనుభవించేలా ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని అర్పించాడు. (మత్తయి 20:28) బైబిలు ఇలా వివరిస్తోంది: “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను.”—1 యోహాను 4:9.
అయితే, దేవుడూ, ఆయన కుమారుడూ మన ఎడల చూపించిన ప్రేమకు మనమెలా ప్రతిస్పందించాలి? బైబిలు ఇంకా ఇలా తెలియజేస్తోంది: “ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.” (1 యోహాను 4:11) దేవుని క్రొత్త లోకంలో ప్రేమే మూలరాయి అయ్యుంటుంది కాబట్టి మనం ప్రేమించడం నేర్చుకోవాలి. యెహోవా దేవుడు తన వాక్యమైన బైబిల్లో ప్రేమను గురించి నొక్కిచెప్పినట్టుగానే నేడు అనేకమంది ప్రేమకున్న ప్రాముఖ్యతను గుణగ్రహిస్తున్నారు.
ప్రేమ, ప్రకృతిలో దాని స్థానము అనే పుస్తకం, ప్రేమించకపోతే “పిల్లలు చనిపోతారు” అని పేర్కొన్నది. అయితే ప్రేమ కోసమైన ఆ అవసరత, ప్రజలు పెద్దవారౌతున్నప్పుడు అంతమైపోదు. “మన సౌర కుటుంబ వ్యవస్థకు సూర్యుడు కేంద్రబిందువుగా ఉన్నట్టుగానే మానవ అవసరాలన్నింటికీ [ప్రేమే] కేంద్రబిందువుగా నిలుస్తుంది . . . ప్రేమించబడని పిల్లవాడు ప్రేమించబడిన పిల్లవానికన్నా జీవరసాయనికంగా, భౌతికంగా, మానసికంగా ఎంతో భిన్నంగా ఉంటాడు. ప్రేమించబడని పిల్లవాడు ప్రేమించబడిన పిల్లవానికన్నా భిన్నంగా పెరుగుతాడు కూడా” అని ప్రఖ్యాతిగాంచిన ఆంత్రోపాలజిస్ట్ గుర్తించాడు.
భూమి మీద ఉన్న వారందరూ ఒకరినొకరు నిజంగా ప్రేమించుకొనేటప్పుడు జీవితమెలా ఉంటుందో మీరు ఊహించగలరా? అంతెందుకు, ఓ వ్యక్తి మరో దేశానికి చెందినందునా, మరో జాతి సభ్యుడైనందునా లేదా అతని శరీర వర్ణం వేరైనందునా ఇకెన్నడూ మరలా దురభిమానాన్ని ఏ ఒక్కరూ పెంచుకోరు! దేవుని నియమిత రాజైన యేసుక్రీస్తు పాలనా నిర్వహణలో, ఈ క్రిందనున్న ప్రేరేపిత బైబిలు కీర్తన నెరవేర్పులో భాగంగా భూమి సమాధానంతోనూ, ప్రేమతోనూ నింపబడుతుంది:
“దేవా, రాజునకు నీ న్యాయవిధులను . . . తెలియజేయుము. శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.”—కీర్తన 72:1, 4, 7, 8, 12, 13.
బైబిల్లోని మరొక కీర్తనలో వాగ్దానం చేయబడినట్టుగానే దేవుని క్రొత్త లోకంలో జీవించడానికి దుష్టులు అనుమతించబడరు: “కీడు చేయవారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:9-11.
అయితే, మృతుల్లోనుండి పునరుత్థానంద్వారా లేపబడిన వారితోపాటూ విధేయులైన మానవులందరి మనస్సులూ, శరీరాలూ స్వస్థపర్చబడతాయి. చివరకు, సజీవులైన ప్రతి ఒక్కరూ దేవుని పోలికను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తారు. సరియైనదాన్ని చేయడం కొరకు సలిపే గొప్ప పోరాటం చివరకు సమసిపోతుంది. జీవించాలనే మన అభిలాషకూ, కఠోర వాస్తవమైన ప్రస్తుత మరణానికి మధ్యనున్న అసంబద్ధత కూడా సమసిపోతుంది. అవును, మన ప్రేమగల దేవుని తప్పిపోని వాగ్దానమిదే: “మరణము ఇక ఉండదు.”—ప్రకటన 21:4; అపొస్తలుల కార్యములు 24:15.
కాబట్టి, సరియైనది చేయాలని మీరు సాగించే పోరాటాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకండి. ఈ దైవిక ఉద్బోధనను లక్ష్యపెట్టండి: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము.” దేవుని క్రొత్త లోకంలోని ఆ జీవితాన్నే బైబిలు “వాస్తవమైన జీవము” అని పిలుస్తోంది.—1 తిమోతి 6:12, 18, 19.
బైబిల్లో వ్యక్తపర్చబడిన ఈ సత్యాన్ని మీరు గుణగ్రహించుదురుగాక: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి, ఆయనే మనలను పుట్టించెను.” ఆ సత్యాన్ని గుణగ్రహించడమే యెహోవా ప్రేమగల నీతియుక్తమైన క్రొత్తలోకంలో జీవం పొందడానికి అర్హతను సంపాదించే దిశగా ప్రాముఖ్యమైన మెట్టైవుంది.—కీర్తన 100:3; 2 పేతురు 3:13.
[11వ పేజీలోని చిత్రం]
దేవుని క్రొత్త లోకంలోని జీవితాన్నే బైబిలు “వాస్తవమైన జీవము” అని పిలుస్తోంది.—1 తిమోతి 6:19
[9వ పేజీలోని చిత్రం]
దేవుని చట్టాలనే భద్రతా గార్డ్రెయిల్ల్లో నుండి మానవులు ఉద్దేశపూర్వకంగా దూసుకుపోయారు, అది భయంకరమైన పర్యవసానాలను తెచ్చిపెట్టింది
[10వ పేజీలోని చిత్రం]
దేవుని పరిపాలనలో మానవజాతి క్రొత్తలోకంలోని సమాధానాన్ని అనుభవిస్తుంది