కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 7/8 పేజీలు 20-23
  • ఫైబ్రోమ్యాల్‌జియా అర్థం చేసుకుని భరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫైబ్రోమ్యాల్‌జియా అర్థం చేసుకుని భరించండి
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫైబ్రోమ్యాల్‌జియాను నిర్వచించడం
  • FMSకు కారణం
  • FMS నిర్ధారణలో సమస్యలు
  • చికిత్స
  • అది మీ పనిపై ప్రభావం చూపినప్పుడు
  • మీరెలా సహాయం చేయగలరంటే
  • మార్పులకు అలవాటుపడండి
  • ఇక ఎన్నడూ ఉండని నొప్పి
    తేజరిల్లు!—1994
  • నొప్పికి చికిత్సచేయడంలో పురోభివృద్ధి
    తేజరిల్లు!—1994
  • మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
    తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1998
g98 7/8 పేజీలు 20-23

ఫైబ్రోమ్యాల్‌జియా అర్థం చేసుకుని భరించండి

మీ ఒళ్ళంతా నొప్పులుగా ఉందా? మీరు చాలా అలసిపోయారా? మీరు ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు, పట్టేసినట్లుగా ఉందా, నిస్సత్తువగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు మీ జ్ఞాపకశక్తి మందగిస్తుందా? ఇవి ఫైబ్రోమ్యాల్‌జియా సిండ్రోమ్‌ (FMS) యొక్క కొన్ని లక్షణాలై ఉండవచ్చు.

“1989లో, ఒక రోజు ఉదయం నాకు మెలకువ వచ్చాక 45 నిమిషాలు నిస్సత్తువగా ఉండిపోవడం ఎన్నటికీ మర్చిపోలేను” అని టెడ్‌a అంటున్నాడు. అప్పటి నుండి ఫైబ్రోమ్యాల్‌జియాతో టెడ్‌ పోరాటం ఆరంభమైంది. ఫైబ్రోమ్యాల్‌జియా అంటే, ముఖ్యంగా “స్నాయుబంధనంలో, ఎముకల బంధనాల్లో, కండరాల్లో నొప్పి” అని అర్థం.

ఒక వేళ ఒక స్నేహితునికో, కుటుంబ సభ్యునికో FMS ఉండవచ్చు. మీరెలా సహాయం చేయగలరు? ఒక వేళ మీకే ఉంటే ఏమి చేయాలి? ఈ సమస్యను అర్థం చేసుకుని, భరించేందుకు దాని గురించి క్షుణ్ణంగా తెలిసికొని ఉంటే ఎంతో సహాయకరంగా ఉంటుంది. అయినప్పటికీ, పై లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ FMS ఉందని కాదు.

ఫైబ్రోమ్యాల్‌జియాను నిర్వచించడం

అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ రూమటాలజీ అభిప్రాయం ప్రకారం, “ఫైబ్రోమ్యాల్‌జియా రోగనిర్ధారణ అనేది వ్యక్తికి దీర్ఘకాలంగా శరీరమంతటా ఉన్న నొప్పిపైనా, వైద్యుడు శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల్లో నొప్పిగా ఉన్న భాగాలను గుర్తించేదానిపైనా ఆధారపడి ఉంటుంది.” ఇంకా వేరే లక్షణాలు కూడా ఉన్నాయి. కొన్ని లక్షణాలు క్రానిక్‌ ఫటీగ్‌ సిండ్రోమ్‌ (CFS) లక్షణాలకు సాదృశ్యంగా ఉంటాయి.

నిజానికి, FMS ఉన్న చాలా మంది ప్రజలకు, CFS, అలాగే మరితర రుగ్మతలు కూడా ఉన్నాయి. డిప్రెషన్‌, అసాధారణ భయం అనేవి FMSతో బాధపడుతున్నవారిలో సాధారణంగా కనబడతాయి. FMS వల్లే ఇవి కలుగుతున్నట్లు కాక, వీటి వల్లే FMS వస్తుందన్నట్లు కనిపిస్తుంది. శారీరక శ్రమ అధికం కావడం లేదా మరీ తక్కువ కావడం, చల్ల గాలి సోకడం, రాత్రి నిద్రలేకపోవడం, లేదా అదనపు ఒత్తిడి వంటి బాహ్య పరిస్థితులు FMSను అధికం చేయవచ్చు.

మునుపు ఇది ఫైబ్రోసైటిస్‌ అనే పేరుతో సహా అనేక పేర్లలో తెలియబడేది. FMS విరూపాన్ని కలిగించదు, లేదా వికలాంగులనుగా చేయదు. అసలు అంత ప్రాణాంతకమైనది కాదు కూడా. FMS వారసత్వంగా వస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, కొన్ని కుటుంబాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది సభ్యుల్లో ఇది కనుగొనబడింది. ఇది లక్షలాదిమంది ప్రజల్ని బాధిస్తుంది. అన్ని వయస్సుల్లోని వయోజనులకూ వస్తుంది. పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలే దీనికి బాధితులౌతున్నారు.

FMSకు కారణం

FMS కారణాన్ని అనేక థియరీలు సూచించాయి. ఒక వైరస్‌ కావచ్చు, లేదా కలత నిద్రకు కారణం కాగల సమతుల్యత లేని న్యూరోట్రాన్స్‌మిట్టర్‌ సెరోటనిన్‌ కావచ్చు. శరీర సహజ వేదనా విరోధులైన ఎన్‌డ్రోఫిన్స్‌ వంటి రసాయనాల అసమతుల్యం కూడా కారణం కావచ్చు. ఈ థియరీల్లోను అలాగే ఇతర థియరీల్లోను పరిశోధన ఇప్పటికీ కొనసాగుతుంది.

FMS ఉన్న వారి కండరాలు సూక్ష్మదర్శిని క్రింద చూస్తే ఆరోగ్యంగానే కనిపిస్తాయి. కానీ శక్తిని ఉత్పన్నం చేసే కణాలు మామూలుగా పనిచేయకపోతుండవచ్చు. దానికి కారణం గానీ చికిత్సగానీ ఏమిటో తెలియదు. చాలా మంది విషయానికొస్తే, ఆ వ్యక్తులు తమ రోగలక్షణాలు కనిపించిన ఆరంభాన్ని శారీరకమైన లేదా భావోద్వేగ సంబంధమైన భయంకరమైన సంఘటనతో ముడిపెడ్తారు. ఇతరుల విషయానికొస్తే, ఆరంభం చాలా సూక్ష్మంగా ఉంటుంది.

FMS నిర్ధారణలో సమస్యలు

దాని లక్షణాల్లో అనేకం ఇతర అనారోగ్య పరిస్థితుల్లో కనుగొనబడతాయి కనుక, కెనడాలోని డా. కార్లా ఒక్‌లీ ఇలా అంటున్నారు: “కీళ్ళ నొప్పితో ఒక రోగి డాక్టర్‌ దగ్గరికి వచ్చినప్పుడు మొదట పరీక్ష జరిగేది FMS కోసం కాదు. అనేక సార్లు వచ్చిన తర్వాత కూడా సమస్య అలాగే ఉన్నట్లయితే, అప్పుడు మేము మరి ఎక్కువ పరీక్షలు చేస్తాం. FMS లక్షణాలు కనిపించినప్పుడు, దాన్ని స్థిరీకరించుకునేందుకు రోగిని రూమటాలజిస్ట్‌ దగ్గరకు పంపుతాను.”

అయినప్పటికీ, ఇటీవలి కాలం వరకూ కూడా, FMS నిర్ధారణకు ఏ కొలమానమూ ఉండేది కాదు. కనుక ఆ సమస్య ఆత్మగ్రాహ్యమైనదిగా ఉండేది—అంటే రోగి మాత్రమే ఆ విషయాన్ని గ్రహించగలడు—పరీక్షా ఫలితాలు అంతా మామూలుగానే ఉన్నట్లు చూపిస్తాయి. కనుక చాలా మంది డాక్టర్లకు దాని గురించి అంతగా తెలియదు. రేచల్‌ అనే స్త్రీ ఇలా వాపోతుంది: “నేను 25 సంవత్సరాలు అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నాకు FMS ఉందని ఖచ్చితంగా నిర్ధారించబడే సరికి వేల కొలది డాలర్లు ఖర్చయ్యాయి.”

అయితే, మీకు ఫైబ్రోమ్యాల్‌జియా ఉందని మీరనుకుంటున్నట్లయితే, మీరెక్కడ నుండి సహాయం పొందగలరు? స్థానిక ఆర్తరైటిస్‌ ఫౌండేషన్‌వారి బ్రాంచ్‌ను . . . లేదా రూమటోలజిస్ట్‌ను సంప్రదించమని వెన్‌ మజిల్‌ పెయిన్‌ వోన్ట్‌ గో అవే అనే తన పుస్తకంలో గేల్‌ బ్యాక్‌స్ట్రోమ్‌ సలహా ఇస్తోంది.

చికిత్స

FMS కోసం ఏ చికిత్స చేయాలో ఇప్పటివరకూ రుజువు కాలేదు. కనుక చికిత్స సాధారణంగా రోగలక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రోగ లక్షణాల్లో ముఖ్యమైన వాటిలో ఒకటి నొప్పి. అది మిగతా రోగ లక్షణాల్లాగే, ఒక్కో వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. ఒకే వ్యక్తిలోనే అది ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది.

దానికి తోడు, పెయిన్‌కిల్లర్‌ మందులూ, కొన్ని రకాల చికిత్సా విధానాలూ కాలక్రమేణా నిర్వీర్యమౌతున్నట్లు అనిపిస్తుంది. గేల్‌ బ్యాక్‌స్ట్రోమ్‌ ఈ విధంగా చెబుతుంది: “కొంత కాలం తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగిస్తే, మరోసారి కొంత కాలం దాకా అనుకూల ఫలితాలను పొందడం తరచూ జరుగుతుంది.” అయితే, మొదట మీ డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌లు కలగడమో, లేదా దానికి బానిసలవ్వడమో జరిగే ప్రమాదం కూడా ఉంది. కనుక, “నొప్పి నుండి ఉపశమనాన్నిచ్చే స్ట్రాంగ్‌ మందులను ఉపయోగించకూడదు” అని అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ రూమటోలజీ సిఫారసు చేస్తుంది.

రెండవ గంభీరమైన లక్షణం, నొప్పివల్లా, మరితర నిద్రాభంగాలవల్లా నిద్ర లేకపోవడమే. నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తనంత పొడవు దిండును మెలనీ ఉపయోగిస్తుంది, బయటి నుండి వచ్చే చప్పుడు వినిపించకుండా ఉండేందుకు హ్యుమిడిఫయర్‌ను ఆన్‌ చేసి, చిన్న శబ్దం వచ్చేలా సెట్‌ చేసుకుంటుంది. ఇయర్‌ ప్లగ్‌లనూ, ఫోమ్‌ పాడ్‌లనూ, లేదా ఎగ్‌క్రేట్‌ మాట్రెస్‌ టాప్పర్‌ అని పిలువబడే ఉపకరణాన్నీ కూడా ఇతర సహాయకాలుగా ఉపయోగించవచ్చు.b ఉత్తర కరోలీనాకు చెందిన డా. డ్వేన్‌ ఏయర్స్‌ ఇలా అంటున్నారు: “వాళ్ళు నిద్ర విషయంలో కాస్త మెరుగుపడేందుకు నేను ఒకసారి సహాయపడ్డాక, నా పేషెంట్‌లు మిగతా చికిత్సలకు బాగా ప్రతిస్పందిస్తారు.”

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్తరైటిస్‌ అండ్‌ మస్కులోస్కెలెటల్‌ అండ్‌ స్కిన్‌ డిసీజెస్‌ అభిప్రాయం ప్రకారం, “ఫైబ్రోమ్యాల్‌జియా రోగులు వ్యాయామం, మందులు, ఫిజికల్‌ థెరపీ, విశ్రాంతి మొదలైనవాటి నుండి ప్రయోజనం పొందవచ్చు.” మిగతా చికిత్సల్లో, మర్దనా చికిత్సా, స్ట్రెస్‌ మ్యానేజ్‌మెంట్‌, స్ట్రెచ్చింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఇమడ్చవచ్చు. అయినప్పటికీ, ఎడతెగని వేదననుభవిస్తున్న లేదా అలసిపోతున్న వ్యక్తులకు వ్యాయామం చేయడం అసాధ్యమని అనిపించవచ్చు. కనుక నెమ్మదిగా వ్యాయామం చేయడం మొదలుపెట్టమని కొందరు సిఫారసు చేస్తారు. మీరు ఏ వ్యాయామ కార్యక్రమాన్నైనా చేపట్టే ముందు మీ డాక్టర్‌ను తప్పక సంప్రదించండి.

మీరు ఒకసారే 20 లేదా 30 నిమిషాలు వ్యాయామం చేయలేనట్లయితే, “ప్రతి రోజూ ఐదు నిమిషాలు చొప్పున ఆరు సార్లు నడవవచ్చు, అది ప్రయోజనకరమైన ఫలితాలను తెస్తుంది” అని ఉరిగన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లోని వ్యాయామ ఫిజియోలజిస్ట్‌ మరియు పరిశోధకురాలైన షారోన్‌ క్లార్క్‌ చెప్పారని ఫైబ్రోమ్యాల్‌జియా నెట్‌వర్క్‌ అనే వార్తాలేఖ జూలై 1997 సంచికలో ఉటంకించింది. మితమైన ఏరోబిక్‌ టైప్‌ వ్యాయామం వల్ల ఎన్‌డోర్ఫిన్‌ల ఉత్పత్తి అధికమవుతుంది, నిద్ర బాగా పడుతుంది, శరీర వ్యవస్థకూ, కండరాలకూ ఆక్సీజన్‌ లభిస్తుంది.

అయినప్పటికీ, రోగులు అందరూ ఒకేలా ఉండరు. FMS రోగులందరూ FMS యొక్క ఒకే దశలోనూ ఉండరు. ఇలేన్‌ మనకిలా చెబుతున్నారు: “మా ఇంటి ముందు సొంతగా వేయించుకున్న రోడ్డు మీద ఒకసారి నడిచి వెళ్ళి తిరిగి నడిచి రాగల్గానన్నదే నేను సాధించిన గొప్ప విషయం. FMS ఉన్న నా సన్నిహిత నేస్తం కూడా ఒక మైలు నడుస్తుంది.” దానర్థం “నొప్పీ లేదు, పెద్ద ప్రయోజనమూ లేదు” అనే పరిస్థితి కాదు, అది “విడువక ప్రయత్నించ వలసిన” పరిస్థితి. CFS మరియు FMS ఉన్న టెడ్‌ ఇలా చెబుతున్నాడు: “మొదట్లో వారానికి ఒకసారి, రెండో మూడో నిమిషాలు మాత్రమే నా ఎక్సర్‌సైజ్‌ బైక్‌ను ఉపయోగించగల్గేవాడ్ని. నేను ఇప్పుడు వారంలో మూడో నాలుగో సార్లు 20 కన్నా ఎక్కువ నిమిషాలు వాడగల్గుతున్నాను. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నాకు నాలుగు కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టింది.”

అక్యుపంచర్‌, వెన్నెముక మర్దనం, మరితర చికిత్సా పద్ధతులు లేదా మూలికల ఉపయోగం లేదా మరితర ఆహార నియమాలు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను విషయంలో విభిన్నాభిప్రాయాలున్నాయి. పై ప్రత్యామ్నాయాల్లో కొన్నింటిని ఉపయోగించడం వల్ల తమ పరిస్థితి మెరుగుపడిందని అనేకులు చెబుతున్నప్పటికీ కొందరి పరిస్థితిలో మాత్రం మార్పేమీ కలుగలేదు. పరిశోధకులు వీటిలో అనేకములను అధ్యయనం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏమీ స్పష్టం కావడం లేదు.

కొన్నిసార్లు ఈ మందులవల్ల ఆకలి మంట కలుగుతుంది, లేదా ఆతురతను నివారించేందుకు ఆబగా తినడమే పరిష్కారమన్నట్లు అవుతుంది. అయితే, అమిత భారం కండరాలపై అమిత ఒత్తిడిని కలిగిస్తుంది. దానివల్ల నొప్పి అధికమౌతుంది. కనుక కొన్ని కిలోగ్రాముల బరువును తగ్గించమని కొంతమంది రోగులకు డాక్టర్‌ సలహా ఇవ్వవచ్చు.

FMS ఉందన్న నిర్ధారణ భయాన్నీ, కోపాన్నీ కలిగించవచ్చు. అయినప్పటికీ, ఎవరి మనస్సునూ కష్టపెట్టకుండా ఉండేలా ఈ సాధారణ అనుభూతులతో వ్యవహరించగల మార్గాలున్నాయి. దుఃఖం సాధారణంగా కలిగే మరో ప్రతిస్పందన. మన ఆరోగ్యంలాంటి మనకు ప్రియమైన దేనినైనా కోల్పోతే దుఃఖించడం సాధారణ విషయమే.

అది మీ పనిపై ప్రభావం చూపినప్పుడు

FMS ఉన్నవాళ్ళు ఉద్యోగ స్థలంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. లీ అనేక సంవత్సరాలుగా పని చేస్తుంది. కానీ ఇప్పుడు అనారోగ్యం వల్ల ఆమెకు పని మరింత కష్టంగా ఉంది. ఆమె కంపెనీ యజమానులతో మాట్లాడి, ఆ కంపెనీలోనే పార్ట్‌టైం ఉద్యోగం సంపాదించుకుంది. ఇది ఆమెకు ఒత్తిడిని తగ్గించింది. అంతేకాక, ఆమె చేసే ప్రతి గంటకు ఇచ్చే జీతం పెరిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది.

మీరు మీ శరీరంపై ఎక్కువ ఒత్తిడి లేకుండా మీ పనిని చేసే మార్గాలను కనుక్కోవడానికి ఒక్యుపేషనల్‌ లేదా ఫిజికల్‌ థెరపిస్ట్‌ మీకు సహాయం చేస్తారు. లీసా చేతులున్న డస్క్‌ చెయర్‌ను వాడడం సహాయకరంగా ఉందని కనుగొంది. వేరొక కుర్చీని, అలాగే వేరొక డస్క్‌ను ఉపయోగించమని ఈవన్‌కు సలహా ఇవ్వబడింది. ఉద్యోగం మార్చుకోవడం అవసరమైతే, మీకు సహాయం చేయగల ఏజన్సీలు కూడా ఉన్నాయి.

మీరెలా సహాయం చేయగలరంటే

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, చిన్నవారు కూడా FMS గురించి తెలుసుకోవాలి, FMSతో బాధపడుతున్నవారు ఆరోగ్యంగా కనిపించినా, ఆయన గానీ, ఆమె గానీ వేదననూ అలసటనూ కలిగించే దీర్ఘకాలిక రుగ్మతతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. విషయాలను గురించి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. జెనీ ఈ విధంగా చెబుతుంది: “ప్రతి ఒక్కరూ ఎలా సహాయపడగలరు అనే విషయాన్ని తరచూ కుటుంబసమేతంగా చర్చించుకుంటాం.” FMSను విజయవంతంగా భరిస్తూ జీవించడంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే రోగి తన పనులను చేసుకుంటూనే తన సత్తువను కూడబెట్టుకోవడాన్ని నేర్చుకోవడమే. అందుకు ఇతరుల సహకారంతోపాటు తనకు పరిస్థితిని ఎదుర్కునే సామర్థ్యం అవసరం. ఒక్యుపేషనల్‌ థెరపిస్ట్‌ ఈ విషయంలో కూడా మీకు సహాయపడవచ్చు.

తీర్పు తీర్చేవారిగా కాక, “వినే చెవి” గలవారై FMS ఉన్న మీ నేస్తానికి మీరు సహాయపడగలరు. అనుకూల విషయాలను గురించి చర్చించడానికి ప్రయత్నించండి. మీ సంభాషణ అంతటిలోను ఫైబ్రోమ్యాల్‌జియా గురించే మాట్లాడకండి. ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు? సలహాల కోసం 22వ పేజీలోని బాక్స్‌ను చూడండి. మీకు FMS ఉంటే, “వినే” వ్యక్తులను ఒకరి కన్నా ఎక్కువ మందిని సంపాదించండి. అలాగైతే “వినే” వ్యక్తి విసిగిపోయే ప్రసక్తి రాదు. మీ FMS గురించి వినేందుకు అందరూ అన్ని వేళలా సిద్ధంగా ఉండరని కూడా గుర్తుంచుకోండి.

మార్పులకు అలవాటుపడండి

కొన్నిసార్లు మనం మార్పులకు, ముఖ్యంగా బలవంతంగా వచ్చే మార్పులకు చికాకుపడతాం. కానీ, FMSతో బాధపడుతున్న దాదాపు వందమందికి సహాయపడిన ఫిజికల్‌ థెరపిస్ట్‌ మనకు ఇలా చెబుతున్నారు: “తమ పరిస్థితికి అలవాటుపడవలసిన అవసరం ఉందని వాళ్ళు అర్థం చేసుకునేందుకు సహాయపడతాను. వాళ్ళు తమ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. తాత్కాలిక సమస్యలు లేదా ఉద్రిక్తతల వల్ల నిరుత్సాహపడకుండా ఉండేందుకు నేర్చుకోవాలి. ఆత్మ-సంభాళింపు, జ్ఞానం, అవగాహన, వ్యాయామాల ద్వారా, FMS తమను అదుపులో ఉంచే బదులు, తామే FMSను అదుపులో ఉంచుకోవచ్చు.”

FMS ఉన్న డేవ్‌ ఇలా చెబుతున్నాడు: “మీరు ఒంట్లో కాస్త బాగున్నప్పుడు ఎక్కువ పని చేసేందుకు మ్రొగ్గు చూపుతారు, కానీ, మీ సత్తువను మరుసటి రోజు కోసం కూడా దాచుకోవడం వారంలోని మిగతా రోజులు పడకేయకుండా ఉండేందుకు సహాయపడుతుంది.” అయినప్పటికీ, తర్వాత కాస్త ఇబ్బందిపడినా, సామాజిక కార్యక్రమాల కోసం, లేదా ప్రత్యేక సందర్భాల కోసం వెళ్ళడం తగినదేనని మీరు కొన్నిసార్లు భావించవచ్చు. మీకు FMS ఉందన్న విషయాన్ని దాచడం అన్నివేళలా యుక్తం కాదు. ముఖ్యంగా మీపై శ్రద్ధ చూపేవారినుండి దాచడం. హాస్య భావాన్ని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. “సాధారణంగా బాగా నవ్విన తర్వాత లేదా మంచి హాస్య చిత్రాన్ని చూసిన తర్వాత నాకు బాగా నిద్ర పడుతుందని కనుగొన్నాను” అని ఆన్‌డ్రే వ్యాఖ్యానిస్తున్నారు.

యెహోవా మీ క్రియాశీలతను ఇతరుల క్రియాశీలతతో పోల్చడు గానీ, మీరు ప్రదర్శించే విశ్వాసాన్నీ, ప్రగాఢమైన ప్రేమనూ మెచ్చుకుంటాడు. (మార్కు 12:41-44) అమిత జాగ్రత్తగా, లేదా మరీ అశ్రద్ధగా ఉండక, మీ పరిమితుల్లో జీవించేందుకు నేర్చుకోవడం ప్రాముఖ్యమైన విషయం. మీకు సాధ్యమైనంత మట్టుకు చేసేందుకు మీకు జ్ఞానాన్ని, బలాన్నీ ఇచ్చేందుకు యెహోవా వైపుకు చూడండి. (2 కొరింథీయులు 4:16) ఈ భూమి “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన[ని]” పరదైసుగా మారే కాలం త్వరలోనే వస్తుందన్న వాగ్దానాన్ని మీ మనస్సులో ఉంచుకోండి. (యెషయా 33:24) అవును, ఒకరోజు మీరు మళ్ళీ ఆరోగ్యవంతులౌతారు!

[అధస్సూచీలు]

a  కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b  తేజరిల్లు! నిద్రకు ఉపకరించే ఏ సహాయకాన్ని గానీ FMS కోసం నిర్దిష్ట చికిత్సను గానీ సిఫారసు చేయడం లేదు.

[21వ పేజీలోని బాక్సు]

బైబిలు నుండి స్వాంతనము

• యెహోవా నలిగిన మనస్సుగలవారిని రక్షిస్తాడు.—కీర్తన 34:18.

• యెహోవా మిమ్మల్ని ఆదరిస్తాడు.—కీర్తన 41:3.

• మీ భారము యెహోవామీద మోపండి, ఆయనే మిమ్మల్ని ఆదుకొంటాడు.—కీర్తన 55:22; 1 పేతురు 5:7.

• మీరు చేసే సేవ ఎంత తక్కువైనా, మీరు యెహోవాకు సేవ చేసేందుకు మీరు మీ పూర్ణ ప్రాణముతో చేసే ప్రయత్నాలనుబట్టి ఆయన ఆనందిస్తాడు.—మత్తయి 13:8; గలతీయులు 6:4; కొలొస్సయులు 3:23, 24.

• మనం విరమించుకోం.—2 కొరింథీయులు 4:16-18.

[22వ పేజీలోని బాక్సు]

ఏమని చెప్పాలంటే

• మిమ్మల్ని కలిసినందుకు సంతోషిస్తున్నాను.

• మీరు ఇక్కడికి వచ్చేందుకు చాలా కృషి చేసి ఉంటారు కదా.

• మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం.

• మీరు చేయగల్గుతున్న విషయాలను మెచ్చుకుంటున్నాను.

ఏమి చెప్పకూడదంటే

• మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను.

• మీరు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. మీకు ఆరోగ్యం బాగోలేకపోవడమేమిటి?

• మీకు ఏమైనా అవసరముంటే నన్ను పిలవండి.

[20వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

నల్లని చుక్కలు ఫైబ్రోమ్యాల్‌జియా నిర్ధారణ కోసం పరిశీలించే సున్నిత భాగాల్లో కొన్నింటిని చూపిస్తున్నాయి

[23వ పేజీలోని చిత్రం]

విషయాల గురించి అరమరికలు లేకుండా మాట్లాడడమూ, కుటుంబ చర్చలూ చాలా ప్రాముఖ్యం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి