అంగారకునిపై ఒక రోబోట్ అన్వేషణ
ఆ రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కనేవరల్‌లోని లాంచ్‌పాడ్ నుండి మార్స్ పాత్‌ఫైండర్ అంతరిక్ష నౌకను మోసుకుని ఎగురుతుండగా నేనూ నా కుటుంబమూ ఎంతో ఉత్సాహంతో చూస్తున్నాం. ‘అది అంగారకునిపై విజయవంతంగా కాలూనుతుందా? క్రొత్తగా ఇంకా ఏ విషయాలు కనుగొనబడతాయో?’ అని అనుకున్నాం.
మార్స్ అబ్‌సర్వర్, మార్స్ 96ల ద్వారా మునుపు అంగారకుని (ఆంగ్లంలో మార్స్) వైపుకు చేసిన రెండు రోదసీ యాత్రలు విఫలమవ్వడమే ఈ పాత్‌ఫైండర్ విజయవంతమౌతుందా లేదా అన్న చింతకు పాక్షిక కారణం. అంతేకాక, పాత్‌ఫైండర్ ఆ గ్రహంపై అడుగు మోపడానికి మునుపటికన్నా కఠిన ప్రయత్నం చేయవలసి ఉంది.
ఆ అంతరిక్ష నౌక అంగారక వాతావరణంలోకి గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళింది. ఆ వేగాన్ని తగ్గించేందుకు ఒక పారాచూట్ తెరిచిన తర్వాత, అది 320 అడుగుల ఎత్తుకు దిగుతూ, ఇంకాస్త వేగం తగ్గేందుకు రాకెట్‌లను పేల్చింది. ఈలోగా, వాయువు నింపిన పెద్ద ఎయర్ బ్యాగ్‌లతో చేసిన సంరక్షక కుషన్‌ను అంతరిక్షనౌకకు అందించడం జరిగింది. 1997 జూలై 4న గంటకు 65 కిలోమీటర్ల వేగంలో, మార్స్ పాత్‌ఫైండర్ అంగారక ఉపరితలాన్ని తాకింది.
ఆ అంతరిక్ష నౌక అంగారక గ్రహాన్ని మొదటిసారి తాకి 15 మీటర్ల ఎత్తుకు లేచింది. బలంగా నేలను తాకిన పెద్ద బంతిలాగా ఆ అంతరిక్ష నౌక మరో 15 సార్లు అంగారకాన్ని తాకిన తర్వాత ఆగింది. ఎయర్ బ్యాగ్‌లు వాయువును విడుదల చేసి కుచించుకుపోయాయి. పాత్‌ఫైండర్ తనంతట తాను తిరిగి సరైన స్థితికి రాగల్గేలా రూపకల్పన చేయబడినప్పటికీ, ఆ అవసరం లేకుండా, అది సరిగ్గానే నిలబడింది. చివరకు అది పుష్పంలాంటి దాని రేకులను విప్పి, వైజ్ఞానిక ఉపకరణాలనూ, రేడియో ఆంటెన్నాలను, సోలార్ బ్యాటరీలను, సోజర్నర్ అని పిలువబడే రోవర్‌ను బహిర్గతం చేసింది.
అంగారక అన్వేషణ
త్వరలోనే పాత్‌ఫైండర్ కెమెరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాన్ని పరిశీలించింది. అది ఏర్స్ వాలీస్‌కి, లేదా “మార్స్ వాలీ”కి దగ్గర్లో ఉన్న “బంగారపు మైదానాలు” అనే అర్థంగల క్రూసే ప్లానిట్‌యా అనే విశాల మైదానంలో ఆగింది. రాళ్ళతోవున్న, మిట్టపల్లాలుగా ఉన్న ఉపరితలాన్ని, సుదూర కొండలను పాత్‌ఫైండర్ వెల్లడిచేసింది. అది సోజర్నర్ అన్వేషణకు తగిన స్థలం. ఈ సమర్థవంతమైన చిన్న రోబోట్ 25 అంగుళాల పొడవు ఉంది. అది దాని కెమెరాతో దృశ్య పరిశీలనను చేసి, అక్కడి రాళ్లలోను, మంటిలోను ఉండే రసాయనిక మూలకాల పరిమాణాన్ని స్పెక్ట్రోమీటర్‌తో కొలవడానికి ఉద్దేశించబడినది.
ఈ రోదసీ యాత్రను చేపట్టిన శాస్త్రజ్ఞులూ, ఇంజనీర్లూ సోజర్నర్ ద్వారా అన్వేషణకు శ్రీకారం చుట్టారు. రేడియో సంకేతాలు భూమికీ, అంగారకునికీ మధ్య ప్రయాణించేందుకు అనేక నిమిషాలు పడుతుంది కనుక, ఈ రోదసీ యాత్ర నిర్వాహకులు సోజర్నర్‌ను నేరుగా నడిపించలేరు. అందువల్లే, అంగారక నేలపైని ప్రమాదాలను నివారించేందుకుగాను సోజర్నర్ తన సొంత సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా ఆశ్రయించింది. తన దారిలో ఉన్న రాళ్ళ స్థానాన్నీ, వాటి పరిమాణాన్నీ నిర్ణయించేందుకు లేజర్ కిరణాలను ఉపయోగించింది. దాని తర్వాత ఆ రాళ్లు కాస్త చిన్నవైతే వాటిమీదినుండే వెళ్ళమనీ, లేక అవి మరీ పెద్దగా ఉంటే వాటి ప్రక్కనుండి వెళ్లమనీ దాని కంప్యూటర్ దానికి నిర్దేశమిచ్చింది.
సాహసం చేసి కనిపెట్టడం
దినపత్రికల్లోనూ, పత్రికల్లోను ఇవ్వబడిన నివేదికల్లో పాత్‌ఫైండర్ తీసిన అంగారక ఉపరితల చిత్రాలు లక్షలాదిమందికి కనువిందు చేశాయి. తిరుగుతున్న రోవర్ తీసిన అంగారకపు క్రొత్త చిత్రాలను చూసి భూమ్మీద ఉన్న ప్రజలు వినోదించారు. రాళ్ళ, పర్వత ప్రాంతపు దృశ్యాల వర్ణ చిత్రాలను కుతూహలంతో చూశారు. అంగారక ఆకాశంలో కనిపించే మేఘాల మరియు సూర్యాస్తమయాల దృశ్యాలను చూసి ఆనందించారు. ఈ అంతరిక్ష నౌక యొక్క కార్యకలాపాల్లో ఆసక్తివున్న వారు ఇంటర్‌నెట్‌లోని ఈ పాత్‌ఫైండర్ వెబ్ పేజీని చూసి ఆనందించారు. ఆ రోదసీ యాత్ర యొక్క మొదటి నెలలోనే, ఈ వెబ్ పేజీ 50 కోట్లసార్లు “తెరిచి చూడబడింది” అని నమోదు చేయబడింది.
పాత్‌ఫైండర్ సమాచారాన్ని పుంఖానుపుంఖాలుగా అందజేసింది, ఈ రోదసీ యాత్రను చేపట్టిన శాస్త్రజ్ఞులు ఎదురుచూసినదానికన్నా ఎక్కువ సమాచారాన్ని అందజేసింది. అది ఎముకలు కొరికే చలి ఉండేటువంటి 32 డిగ్రీల ఫారన్‌హీట్ నుండి, దాదాపు గడ్డకట్టుకుపోయేంత -110 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతగల వాతావరణంలో ఆపరేట్ చేసినప్పటికీ ఇంత సమాచారం లభించింది. ఈ రోదసీ యాత్ర ఏమి వెల్లడి చేసింది?
కెమెరాలూ ఇతర ఉపకరణాలూ వివిధ రసాయనిక మేళవింపులతో, వర్ణాలతో, సమ్మేళనాలతో ఉన్న రాళ్లూ, వివిధ తరహా మట్టీ, గాలికి కొట్టుకొచ్చిన ధూళీ వంటివాటిని కనుగొన్నాయి. అవి అంగారకుని మీద సంక్లిష్టమైన భౌగోళిక ప్రక్రియలు జరిగివుంటాయని సూచిస్తున్నాయి. ఈశాన్య గాలులు తీసుకువచ్చిన వదులుగా ఉన్న ఇసుక పేరుకుపోయిందనేదానికి చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న చిన్న ఇసుక దిబ్బలు నిదర్శనంగా ఉన్నాయి. ఘనీభవించిన నీటి బిందువులతో ఏర్పడిన సూర్యోదయానికి ముందటి మేఘాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. మేఘాలు చెదిరిపోయి, సూర్యోదయమయ్యే సరికి, వాయుమండలంలోని మెత్తని ధూళి మూలాన ఆకాశం అరుణవర్ణం దాల్చింది. అప్పుడప్పుడు సుడి గాలి వీచి అంతరిక్ష నౌక మీదుగా వెళ్ళింది.
అంగారక పాత్‌ఫైండర్ మాకు నిజంగానే అనిర్వచనీయమైన అనుభవాన్నిచ్చింది. రాబోయే దశాబ్దంలో అమెరికా జపాన్ దేశాలు అంగారకం మీదకు మరిన్ని రోదసీయాత్రలను కొనసాగించాలని పథకాలు వేస్తున్నాయి. మార్స్ గ్లోబల్ సర్వేయర్ అనే ఉపగ్రహం అంగారకం చేరుకున్నది మొదలుకొని ఇతర వైజ్ఞానిక పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి, రోబోట్ యొక్క అంతరిక్ష నౌక యొక్క కెమెరాల సహాయంతో మనం ఎర్రని గ్రహమైన అంగారకంలో విహరించడం ద్వారా, అంగారకం మనకు మరింత పరిచితమైన స్థలమౌతుంది.—ఉచితవ్యాసం.
[24వ పేజీలోని చిత్రాలు]
పైకి లేవడం
దిగడం
అంగారకం మీద
[క్రెడిట్ లైను]
చిత్రాలన్నీ: NASA/JPL