బైబిలు ఉద్దేశము
సెలిబసీ క్రైస్తవ పరిచారకులకు తప్పనిసరైన అవసరతా?
ఖచ్చితమైన మాటల్లో చెప్పాలంటే, సెలిబసీ అంటే అవివాహిత దశ. అయితే, ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతున్నట్లుగా, ఆ పదం “మతాధికారి, మతం కొరకు ప్రత్యేకించుకున్న వ్యక్తిగా లేక భక్తునిగా ఆ అవివాహితుడు కలిగివుండే పాత్రకు సంబంధించి సాధారణంగా ఉపయోగించబడుతుంది.” “సెలిబేట్” అనే పదం, “ఒక పవిత్ర ప్రమాణం లేక త్యజించడం లేక తన మతపరమైన స్థానం లేక మతపరమైన విషయాల పట్ల తనకున్న గంభీరమైన దృక్పథం ఫలితంగా అవివాహిత దశను ఎంపిక చేసుకున్న వారిని” సూచిస్తుంది.
ఏదో ఒక సమయంలో, కొన్ని ప్రముఖ మతాలు సెలిబసీని తమ పరిచారకులు కలిగివుండవలసిన ఒక అవసరతగా స్వీకరించాయి. అయినప్పటికీ, మరే ఇతర మతానికన్నా క్యాథోలిక్ మతానికి అవివాహిత దశ ఒక గుర్తింపు చిహ్నంగా తయారయింది. నేడు, క్యాథోలిక్కుల సెలిబసీని గురించి ఎంతో తీవ్ర వివాదం చెలరేగుతోంది. “క్యాథోలిక్ ప్రీస్టులు కలిగి ఉండవలసిన అర్హతల్లో ఒకటైన తప్పనిసరి సెలిబసీ అనేది, 12వ శతాబ్దం నుండీ కూడా ప్రీస్టులను రిక్రూట్ చేయడంలోనూ, యథాస్థానంలో ఉంచడంలోనూ చర్చి ఎదుర్కున్న సమస్యలకు మూలకారణమని, ఇటీవలి దశాబ్దాల్లో నిర్వహించబడిన అధ్యయనాల్లో ఒకదాని తర్వాత ఒకటి నిరూపిస్తున్నాయి” అని ది విల్సన్ క్వార్టర్లీ పేర్కొన్నది. “చరిత్రలోని ఒప్పింపజేసే వాస్తవాలూ సామాజిక మార్పూ, క్యాథోలిక్ ప్రీస్టులుగా మగ సెలిబేట్లను మాత్రమే నియమించాలనే సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయని” రిచ్చర్డ్ ఏ. స్కోన్హర్ అనే సమాజశాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించాడు. సెలిబసీని గురించిన బైబిలు దృక్పథం ఏమిటి?
వివాహం చేసుకోవాలా లేక అవివాహితులుగా ఉండాలా?
చరిత్రంతటిలోనూ అనేక మతాలకు చెందిన దైవభక్తిగల స్త్రీపురుషులు అవివాహితులుగా ఉండడానికి ఎంపిక చేసుకున్నారు. ఎందుకని? అనేక సందర్భాల్లో, శారీరక, వస్తుపర సంగతులు “దుష్టత్వానికి మూలమని” వాళ్లు విశ్వసించినందుకే. ఆధ్యాత్మిక స్వచ్ఛత అనేది అన్ని విధాలైన లైంగిక కార్యకలాపాలకూ దూరంగా ఉండటం ద్వారానే సాధ్యమౌతుందనే వేధాంతాన్ని అది ప్రారంభించింది. అయితే, ఇది బైబిలు దృక్పథం కాదు. బైబిలులో, వివాహం అనేది దేవుని నుండి వచ్చిన స్వచ్ఛమైన, పవిత్రమైన బహుమానంగా చూపించబడింది. సృష్టిని గురించిన ఆదికాండము వృత్తాంతం, వివాహాన్ని దేవుని దృష్టిలో “మంచి” దానిగానే చిత్రించింది గానీ దేవునితో ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఒక అడ్డంకుగా కాదు.—ఆదికాండము 1:26-28, 31; 2:18, 22-24; సామెతలు 5:15-19 కూడా చూడండి.
అపొస్తలుడైన పేతురూ, తొలి క్రైస్తవ సంఘంలో అధికార స్థానాలను కలిగివున్న దేవుని ఇతర అంగీకృత సేవకులూ కూడా వివాహితులే. (మత్తయి 8:14; అపొస్తలుల కార్యములు 18:1, 2; 21:8, 9; 1 కొరింథీయులు 9:5) సంఘ పైవిచారణకర్తలనూ లేక “బిషప్”లనూ నియుక్తి చేసే విషయంలో తిమోతికి అపొస్తలుడైన పౌలు ఇచ్చిన నడిపింపు సూత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఒక బిషప్ నిందారహితుడై, ఏకపత్నీ పురుషుడై ఉండాలి.” (ఇటాలిక్కులు మావి; 1 తిమోతి 3:2, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, క్యాథోలిక్ వర్షన్) ఒక “బిషప్” వివాహితుడై ఉండటమనేది అయోగ్యమైన విషయమని ఏ విధంగానూ సూచించబడలేదని గమనించండి. పౌలు కేవలం ఒక “బిషప్” ఎక్కువమంది భార్యలు గలవాడై ఉండకూడదని సూచించాడు; వివాహితుడైతే మాత్రం ఒకే భార్య ఉండాలి. వాస్తవానికి, మెక్లింటాక్ మరియు స్ట్రాంగ్లు రచించిన సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్, అండ్ ఎక్లిసియాస్టికల్ లిటరేచర్ ఇలా ముగించి చెబుతోంది: “సువార్తను ప్రచారం చేస్తున్న మతనాయకులు వివాహం చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లుగా, క్రొత్త నిబంధనలోని ఏ వాక్య భాగాన్ని కూడా అర్థం చేసుకోకూడదు.”
వివాహాన్ని గురించి ఉన్నతంగా చెబుతున్నప్పటికీ, అవివాహిత దశను—ఒకవేళ అది స్వయంగా ఎంపిక చేసుకోబడితే—బైబిలు ఎంతమాత్రం ఖండించడం లేదు. అది కొందరికి ఎంతో కోరదగిన మార్గమని బైబిలు దాన్ని సిఫారసు చేస్తోంది. (1 కొరింథీయులు 7:6, 8) కొంతమంది స్త్రీపురుషులు స్వేచ్ఛానుసారంగా అవివాహిత దశను ఎంపిక చేసుకుంటారని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 19:12) ఎందుకు? వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అడ్డగించే సహజసిద్ధమైన అపరిశుద్ధత ఏదో వివాహంలో ఉందని కాదు. అత్యవసర సమయమని వారు గ్రహించిన ఈ సమయంలో దేవుని చిత్తాన్ని చేయడంపై తమ కృషినంతటినీ కేంద్రీకరించేందుకు వాళ్లా మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు.
తప్పనిసరి సెలిబసీకి దారితీసిన కారణాలు
అయితే, క్రీస్తు సమయం తర్వాతి శతాబ్దాల్లో పరిస్థితులు మారాయి. మన సామాన్య శకంలోని మొదటి మూడు శతాబ్దాల్లో, “అవివాహితులైన మరియు వివాహితులైన పరిచారకులు ఉన్నారు” అని ఒక డొమినికన్ అయిన డేవిడ్ రాస్ వివరిస్తున్నాడు. ఈయన వివాహం చేసుకునేందుకు ప్రీస్టుగా ఉండటాన్ని మానుకున్నాడు. తర్వాత, క్రైస్తవులమని చెప్పుకునే వారు, లైంగిక సంబంధాన్నీ, వివాహాన్నీ గురించి ఎంతో వక్రీకరించబడిన దృక్పథాన్ని ఉత్పత్తి చేసిన “గ్రీకు మరియు బైబిలు సంబంధ తలంపుల కలయిక” అని ఒక మతపర రచయిత వివరించిన దాని చేత ప్రభావితమవ్వడం ప్రారంభించారు.
కొందరు “దేవుని రాజ్య పనికి [తమనుతాము] అర్పించుకునేలా సంపూర్తిగా స్వేచ్ఛని పొందేందుకే” అవివాహిత స్థితిని చేపట్టారు. అయితే, ఇతరులు తాము ఆకళింపు చేసుకున్న అన్య సిద్ధాంతాల ద్వారా ప్రేరేపించబడ్డారు. “లైంగిక సంబంధం అనేది కలుషితపర్చుతుందీ అది పరిశుద్ధతకు తగినదిగా ఉండదనే విశ్వాసం సెలిబసీని ఆచరించేందుకు ప్రముఖ ప్రేరణగా మారి [నామకార్థ క్రైస్తవ చర్చిలోకి] ప్రవేశించింది” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతుంది.
నాల్గవ శతాబ్దంలో, “వివాహితుడైన ప్రీస్టు ప్రభురాత్రి భోజనం ఆచరించే ముందు రాత్రి లైంగిక సంభోగంలో పాల్గొనడాన్ని [చర్చి] నిషేధించిందని” రైస్ చెబుతున్నాడు. చర్చి అనుదినం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించడం ప్రారంభించినప్పుడు, ప్రీస్టులు లైంగిక సంభోగంలో శాశ్వతంగా పాల్పంచుకోకూడదన్నట్లయ్యింది. కొంతకాలానికి, ప్రీస్టులు వివాహం చేసుకోవడం పూర్తిగా నిషేధించబడింది. అలా, చర్చిలో పరిచారకులుగా ఉండే వాళ్లకు సెలిబసీ తప్పనిసరి అయ్యింది.
అపొస్తలుడైన పౌలు ఖచ్చితంగా అటువంటి విధమైన పోకడను గురించే హెచ్చరించాడు. ఆయనిలా వ్రాశాడు: “అయతే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించు[దురు.]”—1 తిమోతి 4:1-3.
“జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందు”నని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 11:19) దేవుని ప్రమాణాల నుండి వైదొలగడంలోని అవివేకత దాని క్రియల ద్వారా లేక పర్యవసానాల ద్వారా నిరూపించబడింది. తప్పనిసరి సెలిబసీని గురించి, రచయితయైన డేవిడ్ రైస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ప్రీస్టులను ఇంటర్వ్యూ చేశాడు. ఆయన మాట్లాడిన వారిలో కొందరు ఇలా చెప్పారు: “మీరు ప్రీస్టుగా ఉండండి, ఇతరులకు మీకు వీలైనంత సహాయం చేయండి, అదే సమయంలో మిమ్మల్ని మెచ్చుకుని మీతో లైంగిక సంబంధానికి సమ్మతించే భక్తిగల స్త్రీలతో లభించే అవకాశాలను కూడా మీరు గుట్టుచప్పుడు కాకుండా ఉపయోగించుకోండి.”
మత్తయి 7:20ను ఉదహరిస్తూ, “‘మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు’ అని యేసు చెప్పాడని” రైస్ పేర్కొంటున్నాడు. బలవంతంగా రుద్దబడిన సెలిబసీ ద్వారా వచ్చిన దుఃఖకరమైన పర్యవసానాలను గురించి ఆయన తర్వాత వ్యాఖ్యానించాడు: “తప్పనిసరి సెలిబసీ ద్వారా వచ్చిన ఫలాలు, ద్వంద జీవితాలను గడుపుతున్న వేలాదిమంది పురుషులూ వినాశనమైన జీవితాలను గడుపుతున్న వేలాదిమంది స్త్రీలూ ప్రీస్టులైన తమ తండ్రుల ద్వారా నిరాకరించబడిన వేలాదిమంది పిల్లలే, మరి అటువంటి పరిస్థితి మూలంగా మనస్సాక్షి దెబ్బతిన్న ప్రీస్టుల సంగతైతే ఇక చెప్పనక్కర లేదు.”
గౌరవప్రదమైన వివాహం దేవుని నుండి లభించే దీవెన. బలవంతంగా రుద్దబడిన సెలిబసీ ఆధ్యాత్మికంగా హానికరమైనదిగా నిరూపించబడింది. మరో వైపు, ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకోబడిన అవివాహదశ అనేది పరిశుద్ధతకూ లేక రక్షణకూ ఆవశ్యకం కాకపోయినప్పటికీ, కొంతమందికి ప్రతిఫలదాయకమైన, ఆధ్యాత్మికంగా సంతృప్తికరమైన జీవిత విధానంగా నిరూపించబడింది.—మత్తయి 19:12.
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
Life