కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీలు 10-13
  • ఒత్తిడిని ఎదుర్కోవచ్చు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిని ఎదుర్కోవచ్చు!
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి
  • మంచి సంబంధాలను కాపాడుకోండి
  • మీ జీవితంలో సమతుల్యతను సృష్టించుకోండి
  • ఒత్తిడిని సహేతుకంగా దృష్టించండి
  • ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి
  • కచ్చితమైన నిరీక్షణ
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?
    తేజరిల్లు!—2020
  • ఒత్తిడి అంటే ఏంటి?
    తేజరిల్లు!—2020
  • మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
    తేజరిల్లు!—2020
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీలు 10-13

ఒత్తిడిని ఎదుర్కోవచ్చు!

“జీవితంలో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది, అయితే ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించే బదులు దానికి మనమెలా ప్రతిస్పందిస్తామన్నదాన్ని మనం నిజంగా పరిశీలించుకోవాలి.” లీయాన్‌ చైటోఫ్‌, ప్రముఖ ఆరోగ్య విషయక రచయిత.

“అంత్య దినములలో అపాయకరమైన కాలములు” ఉంటాయని బైబిలు ముందే తెలియజేసింది. మనం ఆ కాలంలోనే జీవిస్తున్నామని రుజువులు స్పష్టంగా చూపిస్తున్నాయి, ఎందుకంటే ప్రజలు—ప్రవచనం చెబుతున్నట్లుగానే—“బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు” అయ్యున్నారు.—2 తిమోతి 3:1-5.

ఒక మోస్తరు ప్రశాంతతను కల్గివుండడం కూడా కష్టంగానే ఉండడంలో ఆశ్చర్యం లేదు! ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించే వారు కూడా ఒత్తిడికి గురౌతారు. కీర్తనకర్తయైన దావీదు ఇలా వ్రాశాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.” (కీర్తన 34:19; పోల్చండి 2 తిమోతి 3:12.) అయినప్పటికీ, ఒత్తిడి మిమ్మల్ని ముంచెత్తకుండా ఉండేలా దాన్ని తగ్గించుకోవడానికి మీరు చేయగలిగింది ఎంతో ఉంది. ఈ క్రింది సూచనలను పరిశీలించండి.

మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి

మీరేమి తింటున్నారో గమనించండి. ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రొటీన్లు, పండ్లు, కూరగాయలు, సీరియల్లు, ఇతర దినుసులు, పాల ఉత్పత్తులు చేరి ఉన్నాయి. మైదా, సాచురేటెడ్‌ క్రొవ్వుల ఉపయోగం విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు తీసుకునే ఉప్పు, చక్కెర, మత్తుపానీయాలు, కాఫీ వంటి వాటి గురించి జాగ్రత్త వహించండి. సరైన ఆహారం తీసుకోండి, అప్పుడు మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

వ్యాయామం. ‘శరీర సంబంధమైన వ్యాయామం ప్రయోజనకరమైనదని’ బైబిలు ఉపదేశిస్తుంది. (1 తిమోతి 4:8) వాస్తవానికి, తగుమాత్రమైనదే అయినా క్రమంగా చేసే వ్యాయామం—కొంతమంది వారానికి మూడుసార్లు చేయాలని సిఫారసు చేస్తారు—గుండెను బలపరుస్తుంది, రక్తప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది, కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంతేగాక, వ్యాయామం బాగున్నామన్న భావనను పెంపొందింపజేస్తుంది, దానికి కారణం బహుశా శ్రమతోకూడిన పని వల్ల ఎండోర్ఫిన్స్‌ విడుదలవ్వడం కావచ్చు.

తగినంతగా నిద్రపోండి. నిద్రలేమి అలసటను కలిగించి, ఒత్తిడి నెదుర్కొనే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మీకు నిద్రపట్టడం కష్టంగా ఉంటే, నిద్రకు ఉపక్రమించడానికీ నిద్రలేవడానికీ క్రమమైన సమయాలను పెట్టుకోండి. మధ్యలో ఎప్పుడైనా పడుకుంటే ఆ సమయాలను కేవలం 30 నిమిషాలకు పరిమితం చేసుకోవడం మంచిదని, అలాగైతేనే రాత్రి సుఖనిద్ర పడుతుందని కొందరు సిఫారసు చేస్తున్నారు.

చక్కగా వ్యవస్థీకరించుకోండి. తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారు ఒత్తిడిని మరింత బేషుగ్గా ఎదుర్కోగల్గుతారు. చక్కగా వ్యవస్థీకరించుకోవడానికి, ఏ బాధ్యతలు ప్రాధాన్యత ఇవ్వదగినవో మొదట నిర్ధారించుకోండి. తర్వాత, అవి నిర్లక్ష్యం చేయబడకుండేలా ఒక పట్టిక వేసుకోండి.—పోల్చండి 1 కొరింథీయులు 14:33, 40 మరియు ఫిలిప్పీయులు 1:10.

మంచి సంబంధాలను కాపాడుకోండి

సహాయం తీసుకోండి. ఎక్కువమంది స్నేహితులూ పరిచయస్థులూ ఉన్నవారికి, ఒత్తిడి సమయాల్లో, ఒత్తిడిలో పూర్తిగా మునిగిపోకుండా కనీసం కొంత రక్షణ అయినా లభిస్తుంది. మనం నమ్మదగిన విశ్వసనీయుడైన ఒక్క నేస్తాన్నైనా సంపాదించుకోగల్గితే అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.

విభేదాలను పరిష్కరించుకోండి. “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 4:26) కోపాన్ని ఉంచుకునే బదులు వెంటనే విభేదాలను పరిష్కరించుకోవడంలోని విజ్ఞత, గుండె పోటును తప్పించుకుని బ్రదికిన 929 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి గుండెపోటు వచ్చిన పది సంవత్సరాల్లోపలే రెండవసారి గుండెపోటు రావడం మూలంగా మరణించే అవకాశం, తమ తోటి శాంతమూర్తుల్లోకన్నా కోపోద్రేకుల్లో మూడింతలు ఎక్కువగా ఉంది. కోపమే అతి శక్తివంతమైన కారకంగా కనిపిస్తున్నప్పటికీ, శరీరంలో బలమైన ఒత్తిడి హార్మోనులు ప్రవహించేలా చేసే ఏ తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలైనా అదే ప్రభావాన్ని చూపించగలవని, అధ్యయనం చేసిన రచయితలు తెలియజేస్తున్నారు. “మత్సరము ఎముకలకు కుళ్లు” అని సామెతలు 14:30 చెప్తుంది.

కుటుంబం కొరకు సమయాన్ని వెచ్చించండి. తమ పిల్లల హృదయాల్లో సరైన సూత్రాలను నాటుతూ, వారితో సమయం గడపాలని ఇశ్రాయేలీయులైన తల్లిదండ్రులకు ఆజ్ఞాపించబడింది. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) తత్ఫలితంగా ఏర్పడే బంధం కుటుంబ ఏకతను పెంపొందింపజేస్తుంది—దుఃఖకరంగా నేడది కొరవడింది. ఉద్యోగస్థులైన కొంతమంది దంపతులు తమ పిల్లలతో ఆడుకోవడంలో సగటున ప్రతి రోజు కేవలం 3.5 నిమిషాలు మాత్రమే గడుపుతారని ఒక అధ్యయనం బయల్పర్చింది. అయితే, మీరు ఒత్తిడిని ఎదుర్కుంటున్నప్పుడు మీ కుటుంబం మీకు అద్భుతమైన శక్తి దాయనిగా ఉండగలదు. “కుటుంబమన్నది, నిజంగా మీరేమిటో తెలిసిన, ఏదేమైనప్పటికీ మిమ్మల్ని ఇష్టపడే, మానసిక మద్దతు గుంపులో మీకు షరతుల్లేని సభ్యత్వాన్ని ఇస్తుంది,” అని ఒత్తిడికి సంబంధించిన ఒక పుస్తకం చెబుతుంది. “ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి కుటుంబం సంఘటితంగా పనిచేయడమే.”

మీ జీవితంలో సమతుల్యతను సృష్టించుకోండి

సహేతుకంగా ఉండండి. శారీరకంగానూ మానసికంగానూ తనను తాను ఎడతెగకుండా పూర్తిగా శ్రమపెట్టుకునే వ్యక్తి బాగా అలిసిపోయి, బహుశా కృంగుదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమతుల్యతే కీలకం. “పైనుండి వచ్చు జ్ఞానము . . . మృదువైనది [“సహేతుకమైనది,” NW]” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 3:17; పోల్చండి ప్రసంగి 7:16, 17 మరియు ఫిలిప్పీయులు 4:5.) మీరు సహేతుకంగా నిర్వర్తించగలిగినదాని కంటే ఎక్కువ చేయడానికి వచ్చే డిమాండ్లను నిరాకరించడం నేర్చుకోండి.

మరొకరితో మిమ్మల్ని పోల్చుకోకండి. గలతీయులు 6:4 ఇలా చెబుతుంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” అవును, ఆరాధన విషయాల్లో కూడా, దేవుడు మన వ్యక్తిగత పరిస్థితులు అనుమతించే దానికన్నా ఎక్కువగా కోరుతూ ప్రతికూలంగా పోల్చడు. ‘శక్తికి మించి కాదు గాని కలిమి కొలది’ మనమిచ్చే అర్పణలను, మనం చేసే త్యాగాలను ఆయన అంగీకరిస్తాడు.—2 కొరింథీయులు 8:12.

విశ్రాంతి కొరకు సమయాన్ని కేటాయించండి. యేసు ఎంతో కష్టపడి పనిచేసే వాడైనప్పటికీ, తానూ తన అనుచరులూ విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని కేటాయించాడు. (మార్కు 6:30-32) ఆరోగ్యకరమైన విశ్రాంతి ప్రయోజనకరమైనదని ప్రేరేపిత ప్రసంగి పుస్తక రచయిత భావించాడు. ఆయనిలా వ్రాశాడు: “అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైన దొకటియులేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికితోడుగానున్నది.” (ప్రసంగి 8:15) సమతుల్యతగల వినోదాలు శరీరాన్ని ఉత్తేజపర్చి, ఒత్తిడిని పోగొట్టుకోవడానికి సహాయపడతాయి.

ఒత్తిడిని సహేతుకంగా దృష్టించండి

ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు:

దేవుడు మిమ్మల్ని నిరాకరించాడనే నిర్ధారణకు రాకండి. విశ్వాసురాలైన స్త్రీయైన హన్నా అనేక సంవత్సరాల పాటు “బహుదుఃఖాక్రాంతురాలై,” (“ఒత్తిడికి లోనై,” రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వెర్షన్‌) ఉండెనని బైబిలు చెప్తుంది. (1 సమూయేలు 1:4-11) మాసిదోనియలో, పౌలు “ప్రతి క్షణం ఒత్తిడికి గురయ్యాడు.” (2 కొరింథీయులు 7:5, బైయింగ్‌టన్‌) యేసు తన మరణానికి ముందు, “వేదన” పడ్డాడు, ఆయన ఎంత ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కున్నాడంటే, “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.”a (లూకా 22:44) వీరంతా దేవుని నమ్మకమైన సేవకులు. కాబట్టి, మీరు ఒత్తిడిని ఎదుర్కుంటున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడనే నిర్ధారణకు రావడం సహేతుకం కాదు.

ఒత్తిడితో కూడిన మీ పరిస్థితుల నుండి నేర్చుకోండి. తనకు “శరీరములో ఒక ముల్లు” ఉందనీ, తాను దాన్ని సహించవలసి ఉందనీ పౌలు వ్రాశాడు, అది నిస్సందేహంగా ఆయనకు ఎంతో ఒత్తిడిని కలుగజేసిన ఆరోగ్య సమస్య అయ్యుండవచ్చు. (2 కొరింథీయులు 12:7) అయితే, దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, ఆయనిలా చెప్పగలిగాడు: “దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:12, 13) పౌలు తన “శరీరములో ఒక ముల్లు” ఉండడాన్ని బట్టి ఆనందించలేదు, కానీ దాన్ని సహించడం ద్వారా, బలం కొరకు దేవుని మీద మరింత ఎక్కువగా ఎలా ఆధారపడాలో ఆయన నేర్చుకున్నాడు.—కీర్తన 55:22.

ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి

దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించండి. “తమ ఆధ్యాత్మిక అవసరత విషయమై శ్రద్ధగలవారు ధన్యులు” అని చెప్పాడు యేసు. (మత్తయి 5:3, NW) దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం అత్యంతావశ్యకం. తరచూ, లేఖనాలను శ్రద్ధగా పరిశోధించడం ద్వారా ఆరోజుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించే సరైన పదాన్ని మనం కనుగొంటాము. (సామెతలు 2:1-6) కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ [దేవుని] గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.”—కీర్తన 94:19.

క్రమం తప్పకుండా ప్రార్థించండి. పౌలు ఇలా వ్రాశాడు: “మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అవును, “బలాధిక్యము” అవసరమైనప్పుడు కూడా “దేవుని సమాధానము” మనల్ని బాధిస్తున్న మన భావోద్వేగాలను మించిపోయి, వాటిని శాంతపర్చగలదు.—2 కొరింథీయులు 4:7.

క్రైస్తవ కూటాలకు హాజరవ్వండి. క్రైస్తవ సంఘం విలువైన మద్దతు వ్యవస్థను అందజేస్తుంది, ఎందుకంటే “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని” దానిలో ఉన్న వారికి ఉద్బోధించబడింది. మంచి కారణంతోనే పౌలు మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులకు, ‘సమాజముగా కూడుకొనుట మానుకొనకుడి’ అని చెప్పాడు.—హెబ్రీయులు 10:24, 25.

కచ్చితమైన నిరీక్షణ

ఒత్తిడిని తగ్గించుకోవడమంటే సాధారణంగా ఒక సులభమైన ఫార్ములాను అనుసరించడం కంటే ఎక్కువేనని అంగీకరించవలసిందే. ఆలోచనా విధానంలో ప్రధానమైన మార్పు తరచూ అవసరం. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన పరిస్థితులు తనను ముంచెత్తివేయకుండేలా వాటికి క్రొత్త క్రొత్త రీతుల్లో ప్రతిస్పందించడాన్ని నేర్చుకోవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఒత్తిడి పదే పదే కల్గడాన్ని బట్టి లేక దాని తీవ్రతను బట్టి తగిన వైద్య సహాయాన్ని పొందడం అవసరం కావచ్చు.

అయితే, నేడు ఎవ్వరూ కూడా హానికరమైన ఒత్తిడి లేని జీవితాన్ని కల్గివుండలేరు. అయితే, దేవుడు త్వరలోనే తన అవధానాన్ని మానవుల వైపు త్రిప్పి, వారికి ఎంతో హానికరమైన ఒత్తిడిని కలుగజేస్తున్న పరిస్థితులను నిర్మూలిస్తాడని బైబిలు మనకు హామీ ఇస్తోంది. దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని మనం ప్రకటన 21:4 నందు చదువుతాము. ఆ తర్వాత, నమ్మకమైన మానవజాతి సురక్షితంగా నివసిస్తుంది. ప్రవక్తయైన మీకా ఇలా ప్రవచించాడు: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.”—మీకా 4:4.

[అధస్సూచి]

a విపరీతమైన మానసిక ఒత్తిడి కల్గిన కొన్ని కేసుల్లో రక్తంతో కూడిన చెమట వచ్చినట్లు నివేదించబడింది. ఉదాహరణకు, స్వేదరక్తంలో, రక్తంతో మిళితమైన చెమట లేక రక్త పిగ్‌మెంట్‌లు లేక రక్తం మిళితమైన శరీర ద్రవం వెలువడుతుంది. అయితే, యేసు విషయంలో ఏది జరిగిందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు.

[12వ పేజీలోని బాక్సు]

ఒత్తిడి మరియు శస్త్రచికిత్స

కొంతమంది వైద్యులు తమ రోగులను ఆపరేషన్‌ గదిలోకి తీసుకువెళ్లే ముందు వారి ఒత్తిడి స్థాయిని పరిశీలిస్తారు. ఉదాహరణకు, శస్త్రవైద్యుడైన డాక్టర్‌ కామ్‌రాన్‌ నేజాత్‌ ఇలా చెప్తున్నాడు:

“నిర్ణీత రోజున శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉన్న ఎవరైనా తాను ఆ రోజున ఆందోళనగా ఉన్నాననీ, ఆ రోజు శస్త్రచికిత్స చేయించుకోననీ చెబితే, నేను ఆ రోజు శస్త్రచికిత్స చేయను.” ఎందుకు? నేజాత్‌ ఇలా వివరిస్తున్నాడు: “విపరీతంగా భయపడేవారు శస్త్రచికిత్స వల్ల ఎక్కువ బాధపడ్తారని ప్రతి శస్త్రవైద్యునికీ తెలుసు. వారికి ఎక్కువ రక్తం పోతుంది, వారికి ఎక్కువ వ్యాధులు సోకుతాయి, ఎక్కువ సమస్యలు ఉత్పన్నమౌతాయి. కోలుకోవడానికి వారికి ఎక్కువ కష్టమౌతుంది. వారు ప్రశాంతంగా ఉంటే ఎంతో మంచిది.”

[10వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం ప్రశాంతంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది

[11వ పేజీలోని చిత్రం]

మీ ఆరోగ్యం గురించి శ్రద్ధతీసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది

విశ్రాంతి

మంచి ఆహారం

వ్యాయామం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి