కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీలు 7-9
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మూడు రకాల ఒత్తిళ్లు
  • ఒత్తిడికి తీవ్రంగా ప్రతిస్పందించడం
  • ఒత్తిడి అంటే ఏంటి?
    తేజరిల్లు!—2020
  • మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
    తేజరిల్లు!—2020
  • ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?
    తేజరిల్లు!—2020
  • ఒత్తిడిని ఎదుర్కోవచ్చు!
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీలు 7-9

ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి

“ఏ అవసరతకైనా శరీరం చూపించే అనిర్దిష్టమైన ప్రతిస్పందనే ఒత్తిడి గనుక, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఎంతో కొంత ఒత్తిడికి లోనౌతారు.”—డాక్టర్‌ హాన్స్‌ సెల్య.

వయోలిన్‌ వాయించే వ్యక్తి సంగీతాన్ని సృష్టించాలంటే, ఆయన వాయిద్యానికుండే తీగలు బిగువుగా ఉండాలి—అయితే ఒక స్థాయి వరకే అలా బిగువుగా ఉండాల్సి ఉంటుంది. తీగలు మరీ బిగువుగా ఉంటే తెగిపోతాయి. కానీ ఒకవేళ తీగలు మరీ వదులుగా ఉంటే, అవి అసలు ధ్వనినే ఉత్పన్నం చేయవు. అయితే సమమైన బిగువు, రెండు స్థాయిలకు మధ్య ఎక్కడో ఉంటుంది.

ఒత్తిడి విషయం కూడా అంతే. మనం ఇప్పటికే చూసినట్లుగా, మరీ ఎక్కువైతే హానికరం కాగలదు. అయితే మరి, అసలు ఒత్తిడే లేకపోవడం విషయమేమిటి? అది చాలా ఆహ్లాదకరమైన విషయంలా అనిపించినప్పటికీ, వాస్తవమేమిటంటే మీకు ఒత్తిడి అవసరం—కనీసం కొంతమేరకు. ఉదాహరణకు, మీరు వీధి దాటుతుండగా, ఒక కారు మీవైపు వేగంగా రావడాన్ని మీరు హఠాత్తుగా గమనించారనుకోండి. వెంటనే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీకు తోడ్పడేది ఒత్తిడే!

అయితే ఒత్తిడి కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే ప్రయోజనకరమైనది కాదు. అనుదిన కార్యకలాపాలను నిర్వర్తించడానికి కూడా మీకు ఒత్తిడి అవసరం. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కొంత ఒత్తిడికి లోనౌతారు. ‘మరణించినప్పుడే ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది’ అని డాక్టర్‌ హాన్స్‌ సెల్య అంటున్నాడు. “ఆయన ఒత్తిడికి లోనౌతున్నాడు” అనే మాటలు “ఆయన ఒళ్లు వెచ్చబడింది” అనే మాటల్లా అర్థం లేనివని కూడా ఆయన అంటున్నాడు. “అలాంటి మాటల ద్వారా అసలు మనం చెప్పదల్చుకున్నది ఏమిటంటే, ఒత్తిడి అధికంగా ఉందని లేక శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని” అని సెల్య అంటున్నాడు. ఈ విధంగా, వినోద కార్యకలాపాల్లోనూ నిద్రలోనూ కూడ ఒత్తిడి కల్గుతుంది, ఎందుకంటే అప్పుడు కూడా మీ గుండె కొట్టుకుంటూనే ఉండాలి, మీ ఉపిరితిత్తులు ఊపిరి పీల్చుకుంటూనే ఉండాలి.

మూడు రకాల ఒత్తిళ్లు

ఒత్తిడిలో వివిధ మోతాదులు ఉన్నట్లుగానే, వివిధ రకాలు కూడా ఉన్నాయి.

అనుదిన జీవిత ప్రయాసల మూలంగా తీవ్రమైన ఒత్తిడి కల్గుతుంది. తరచూ, సర్దుబాట్లు చేయవలసిన అప్రీతికరమైన పరిస్థితులు అందులో ఇమిడి ఉంటాయి. అవి అనుకోకుండా జరిగేవీ, కేవలం తాత్కాలికమైనవీ గనుక, సాధారణంగా ఆ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అయితే, ఒక సంక్షోభంలో నుండి వెంటనే మరో సంక్షోభంలో పడిపోయేవారు కూడా ఉంటారు—వాస్తవానికి, గందరగోళ పరిస్థితి వారి వ్యక్తిత్వంలోనే ఒక భాగమన్నట్లు అనిపిస్తుంది. ఈ స్థాయిలోని తీవ్రమైన ఒత్తిడిని కూడా అదుపు చేయవచ్చు. అయితే, బాధపడుతున్న వ్యక్తి తన సంక్షోభ భరితమైన జీవన విధానం, తనపైనా అలాగే తన చుట్టూ ఉన్నవారిపైనా కలుగజేస్తున్న ప్రభావాన్ని గుర్తించే వరకు తన జీవనగతిలో మార్పు చేసుకోవడానికి నిరాకరించవచ్చు.

తీవ్రమైన ఒత్తిడి తాత్కాలికమైనదే, కానీ దీర్ఘకాలిక ఒత్తిడి చాలాకాలం ఉంటుంది. బాధపడుతున్న వ్యక్తికి ఆ వేదనభరితమైన పరిస్థితి నుండి, అవి పేదరికపు వేదనలైనప్పటికీ లేక తక్కువ రకమైన ఉద్యోగపు బాధయైనప్పటికీ లేదా అసలు ఉద్యోగమే లేకపోవడమనే బాధయైనప్పటికీ, దాని నుండి తప్పించుకోవడానికి ఏ దారీ కనిపించదు. ఎడతెగక కొనసాగుతుండే కుటుంబ సమస్యల మూలంగా కూడా దీర్ఘకాలిక ఒత్తిడి కలుగవచ్చు. అనారోగ్యులైన బంధువుల గురించి శ్రద్ధ వహించడం కూడా ఒత్తిడిని కల్గిస్తుంది. కారణం ఏదైనప్పటికీ, దీర్ఘకాలిక ఒత్తిడి ఆ బాధితుడ్ని దినం తర్వాత దినం, వారం తర్వాత వారం, నెల తర్వాత నెల మరింత కృంగదీస్తూ ఉంటుంది. “దీర్ఘకాలిక ఒత్తిడిలోని ఘోరమైన విషయం ఏమిటంటే, ప్రజలు దానికి అలవాటు పడిపోతారన్నదే” అని ఆ విషయంపై వ్రాయబడిన ఒక పుస్తకం తెలియజేస్తుంది. “తీవ్రమైన ఒత్తిడి క్రొత్తగా కల్గుతుంది కాబట్టి ప్రజలు దాన్ని వెంటనే గుర్తిస్తారు; కాని దీర్ఘకాలిక ఒత్తిడి ఎంతోకాలంగా ఉంటూ వచ్చింది గనుకా, అది సుపరిచితమైనది గనుకా, కొన్నిసార్లు అది దాదాపు సహించదగినదిగా ఉంటుంది గనుకా ప్రజలు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు.”

మానభంగం, దుర్ఘటన, లేక ప్రకృతి వైపరీత్యం వంటి విపరీతమైన దుఃఖాల ఫలితంగా ఉద్వేగాఘాత ఒత్తిడి కల్గుతుంది. అనేకమంది మాజీ సైనికులూ, కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో ఉండి సజీవంగా బయటికి వచ్చిన వారూ ఈ రకమైన ఒత్తిడికి లోనౌతారు. ఉద్వేగాఘాత ఒత్తిడి లక్షణాల్లో, వేదనకు సంబంధించిన స్పష్టమైన జ్ఞాపకాలూ, చివరికి సంవత్సరాల తర్వాత కూడా చిన్న చిన్న విషయాలకు సహితం అతిగా ప్రతిస్పందించడం వంటివి చేరి ఉండవచ్చు. కొన్నిసార్లు బాధితుడు పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిసార్డర్‌ (పిటిఎస్‌డి) (ఉద్వేగాఘాతం తర్వాత కల్గే ఒత్తిడి సంబంధిత రుగ్మత) స్థితిలో ఉన్నట్లు నిర్ధారించబడవచ్చు.—పైనున్న బాక్సు చూడండి.

ఒత్తిడికి తీవ్రంగా ప్రతిస్పందించడం

ప్రస్తుతం మనం ఒత్తిడికి ఎలా ప్రతిస్పందిస్తామన్నది, గతంలో మనం ఎంతమేరకు ఒత్తిడికి గురయ్యాము, ఏ విధమైన ఒత్తిడిని ఎదుర్కున్నాము అనేవాటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని కొందరంటారు. ఉద్వేగాఘాత సంఘటనలు వాస్తవానికి మెదడులోని రసాయనిక “వ్యవస్థ”లో మార్పు కలుగజేసి, ఒక వ్యక్తి భవిష్యత్తులో ఒత్తిడికి మరింత తీవ్రంగా ప్రతిస్పందించేలా చేయవచ్చు అని వారంటారు. ఉదాహరణకు, యుద్ధ ఖైదీలుగా ఉండని వారికంటే యుద్ధ ఖైదీలుగా ఉన్నవారిలో స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఎనిమిది రెట్లు ఎక్కువుందనీ, చివరికి ఉద్వేగాఘాతం అనుభవించిన 50 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంటుందనీ, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల్లోని 556 మందిపై జరిపిన అధ్యయనం ద్వారా డాక్టర్‌ లారెన్స్‌ బ్రాస్‌ కనుగొన్నాడు. “యుద్ధ ఖైదీగా ఉన్నప్పటి ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉండేదంటే, వీళ్లు ఆ తర్వాత భవిష్యత్తులో ఒత్తిడికి ప్రతిస్పందించే విధానాన్నే అది మార్చివేసింది, అంటే అది వారిని ఒత్తిడికి తీవ్రంగా ప్రతిస్పందించే వారినిగా చేసింది.”

బాల్యంలో అనుభవించిన ఒత్తిడితో కూడిన సంఘటనలను తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే అవి చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపించగలవు అని నిపుణులు చెబుతున్నారు. “ఉద్వేగాఘాతాన్ని అనుభవించే చాలామంది పిల్లలను వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లడం జరగదు” అని డాక్టర్‌ జీన్‌ కింగ్‌ చెబుతుంది. “వాళ్లు సమస్యను అధిగమించి, తమ జీవితాలను కొనసాగిస్తూ, సంవత్సరాల తర్వాత మన కార్యాలయాల్లో కృంగుదలకు గురౌతూనో లేక హృద్రోగాలతో బాధపడుతూనో కనిపిస్తారు.” ఉదాహరణకు, తల్లిని లేక తండ్రిని కోల్పోవడం వల్ల ఏర్పడే ఉద్వేగాఘాతాన్ని పరిశీలించండి. “మీరు లేత ప్రాయంలో ఉన్నప్పుడు అంత ఎక్కువ మోతాదులో ఒత్తిడి కల్గడం మెదడులో రసాయన సంబంధమైన, నాడీమండల సంబంధమైన శాశ్వత మార్పులను కలుగజేసి సాధారణ, అనుదిన ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు” అని డాక్టర్‌ కింగ్‌ అంటుంది.

నిజమే, ఒక వ్యక్తి ఒత్తిడికి ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది ఇతర అనేక కారకాలపై ఆధారపడి ఉండవచ్చు, వాటిలో ఆయన శారీరక నిర్మాణం, ఒత్తిడితో కూడిన సంఘటనలను ఎదుర్కోవడానికి ఆయనకు సహాయం చేసేందుకు అందుబాటులో ఉన్న సాధనాలు చేరి ఉండవచ్చు. అయితే, కారకాలు ఏవైనప్పటికీ, ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఇదంత సులభం కాదని అంగీకరించవలసిందే. డాక్టర్‌ రేచెల్‌ యెహూదా ఇలా పేర్కొంటుంది: “ఒత్తిడికి తీవ్రంగా ప్రతిస్పందించే వారెవరికైనా విశ్రాంతి తీసుకోమని చెప్పడం, నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తికి నిద్రపొమ్మని చెప్పడంలా ఉంటుంది.” అయితే, తర్వాతి శీర్షిక చూపిస్తున్నట్లుగా, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక వ్యక్తి చేయగలిగినది ఎంతో ఉంది.

[7వ పేజీలోని బాక్సు]

ఉద్యోగ ఒత్తిడి—“విశ్వవ్యాప్త సమస్య”

ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక నివేదిక ఇలా చెబుతుంది: “ఒత్తిడి 20వ శతాబ్దపు అత్యంత గంభీరమైన ఆరోగ్య సంబంధ సమస్యల్లో ఒకటిగా తయారయ్యింది.” పని స్థలంలో దాని ఉనికి సుస్పష్టంగా తెలుస్తోంది.

• ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ పనివారు ఒత్తిడి సంబంధిత రుగ్మతల కారణంగా తీసుకున్న సెలవుల సంఖ్య కేవలం మూడేళ్ల కాలంలోనే 90 శాతం పెరిగింది.

• 64 శాతం మంది నర్సులు, 61 శాతం మంది ఉపాధ్యాయులు తాము పని చేస్తున్న ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని గురించి ఆందోళన చెందుతున్నామని చెప్పినట్లు ఫ్రాన్సులో చేయబడిన ఒక సర్వే వెల్లడి చేసింది.

• అమెరికాలో సాలీనా, ఒత్తిడి సంబంధిత రుగ్మతల కొరకు 200 బిలియన్ల అమెరికా డాలర్లు ఖర్చవుతున్నట్లు అంచనా వేయబడింది. పారిశ్రామిక దుర్ఘటనల్లో 75 నుండి 85 శాతం వరకు ఒత్తిడి వల్లే సంభవించినట్లుగా పరిగణించబడ్డాయి.

• అనేక దేశాల్లో స్త్రీలు పురుషులకన్నా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు కనుగొనడం జరిగింది, బహుశా వాళ్లు గృహంలోనూ, పనిస్థలంలోనూ ఒకే సమయంలో అనేక పనులను నిర్వర్తించడమే దానికి కారణం కావచ్చు.

ఉద్యోగ స్థలంలో నిజంగానే ఒత్తిడి ఉంటుంది, ఐక్యరాజ్య సమితి దాన్ని “విశ్వవ్యాప్త సమస్య” అని పిలుస్తోంది.

[8వ పేజీలోని బాక్సు]

పిటిఎస్‌డి—అసాధారణ అనుభవానికి సాధారణ ప్రతిస్పందన

‘మా కారు దుర్ఘటన జరిగిన మూణ్నెల్ల తర్వాత కూడా నేను ఏడుపు ఆపుకోలేకపోయేదాన్ని, రాత్రి నిశ్చింతగా నిద్రపోలేకపోయేదాన్ని. ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టాలంటేనే వణుకుపుట్టేది.’—లెవీజ్‌.

లెవీజ్‌ పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిసార్డర్‌ (పిటిఎస్‌డి) (ఉద్వేగాఘాతం తర్వాత కల్గే ఒత్తిడి సంబంధిత రుగ్మత) బాధితురాలు. అది బలహీనపర్చే జబ్బు, బలవంతంగా పదే పదే గుర్తువచ్చే జ్ఞాపకాలు లేక ఒక ఉద్వేగాఘాత సంఘటనకు సంబంధించిన కలలు దాని రోగ లక్షణాలు. పిటిఎస్‌డి ఉన్న వ్యక్తి విపరీతంగా ఉలికిపడుతూ బెదురుతూ ఉంటాడు. ఉదాహరణకు, మానసికారోగ్య నిపుణుడైన మైఖేల్‌ డేవిస్‌ వియత్నామ్‌కు చెందిన ఒక మాజీ సైనికుని గురించి చెబుతున్నాడు, ఈ సైనికుడు తన వివాహ వేడుక దినాన కారు పొగగొట్టంలో నుండి ఢాం అని పెద్ద శబ్దం వినిపించడంతో పొదల్లో దాక్కోవడానికి పరుగెత్తాడు. “చుట్టు ప్రక్కల పరిసరాల్లో అంతా బాగానే ఉందని ఆయనకు తెలియజేసే అన్ని రకాలైన సూచనలు ఉండేవుంటాయి” అని డేవిస్‌ అంటున్నాడు. “అప్పటికి 25 సంవత్సరాలు గడిచిపోయాయి; ఆయన వియత్నామ్‌లో కాదు, అమెరికాలో ఉన్నాడు; . . . ఆయన సైనిక వస్త్రాలు కాదుగానీ తెల్ల కోటు వేసుకుని ఉన్నాడు. కానీ ఆ మౌలికమైన ప్రేరణ కలిగినప్పుడు ఆయన దాపు కోసం పరుగెత్తాడు.”

యుద్ధ క్షేత్రానికి సంబంధించిన ఉద్వేగాఘాతం పిటిఎస్‌డికి ఒక కారకం మాత్రమే. ది హార్వర్డ్‌ మెంటల్‌ హెల్త్‌ లెటర్‌ ప్రకారం, ఈ రుగ్మత “మరణించడం లేక మరణం సంభవిస్తుందనే భయం లేక ప్రమాదకరమైన గాయం లేక శారీరక గాయం అవుతుందనే భయం వంటివి ఇమిడివున్న” ఏదైనా “సంఘటన లేక సంఘటనల పరంపర” ఫలితంగా ఏర్పడవచ్చు. “అది ప్రకృతి వైపరీత్యం, దుర్ఘటన, లేక మానవ చర్యయై ఉండవచ్చు: వరద, అగ్ని, భూకంపం, కారు దుర్ఘటన, బాంబు దాడి, కాల్పులు, హింస, కిడ్నాపింగ్‌, దాడి చేయడం, మానభంగం, లేక బాలలపై అత్యాచారం.” కేవలం ఉద్వేగాఘాత సంఘటనను చూడడం లేక దాని గురించి—బహుశా అసాధారణమైన సాక్ష్యం ద్వారా లేక ఫోటోల ద్వారా—తెలుసుకోవడం పిటిఎస్‌డి లక్షణాలను ప్రేరేపించవచ్చు, ప్రాముఖ్యంగా అందులో ఇమిడివున్న వారు కుటుంబ సభ్యులు లేక సన్నిహిత స్నేహితులు అయినప్పుడు అలా జరుగవచ్చు.

నిజమే, ప్రజలు ఉద్వేగాఘాతానికి విభిన్న రీతుల్లో ప్రతిస్పందిస్తారు. “ఉద్వేగాఘాత అనుభవాన్ని పొందేవారిలో అనేకులు గంభీరమైన మానసిక వ్యాధి లక్షణాలను పెంపొందించుకోకపోవచ్చు, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా, అవి తప్పకుండా పిటిఎస్‌డి రూపాన్ని తీసుకోకపోవచ్చు,” అని ది హార్వర్డ్‌ మెంటల్‌ హెల్త్‌ లెటర్‌ వివరిస్తోంది. అయితే తమ ఒత్తిడి పిటిఎస్‌డికి దారి తీసే వారి విషయమేమిటి? కొంతకాలానికి, ఉద్వేగాఘాతానికి సంబంధించిన భావాలను కొంతమంది అదుపు చేసుకుని ఉపశమనం పొందగల్గారు. ఇతరులు ఉద్వేగాఘాత సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కూడా వాటితో పోరాడుతూనే ఉంటారు.

ఏ విధంగానైనప్పటికీ, పిటిఎస్‌డితో బాధపడేవారు—మరియు వారికి సహాయం చేయాలనుకునేవారు—కోలుకోవడానికి సహనం అవసరమని గుర్తుంచుకోవాలి. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి,” మరియు “అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి” అని బైబిలు క్రైస్తవులకు ఉద్బోధిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:14) ప్రారంభంలో ప్రస్తావించబడిన లెవీజ్‌కు మళ్లీ కారు నడపడాన్ని ప్రారంభించడానికి ఐదు నెలలు పట్టింది. “నేను ఎంత పురోగతి సాధించినప్పటికీ, డ్రైవింగ్‌ ఇక నాకు ఒకప్పటిలా ఆహ్లాదకరమైన విషయంగా ఉండట్లేదు. అది నేను చేయక తప్పదు గనుక చేస్తున్నాను. ఆ దుర్ఘటన తర్వాతి నిస్సహాయ సమయం నుండి ఇప్పటికి ఎంతో మెరుగుపడ్డాను” అని ఆమె దుర్ఘటన జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత చెప్పింది.

[9వ పేజీలోని చిత్రం]

కార్యాలయాల్లో పనిచేసే ఎంతోమంది ఒత్తిడికి లోనౌతున్నారు

[9వ పేజీలోని చిత్రం]

అన్ని రకాల ఒత్తిళ్ళూ మీకు హానికరమైనవి కావు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి