ఒత్తిడి—“స్లో పాయిజన్”
“‘మరీ ఎక్కువ ఒత్తిడికి లోనవ్వవద్దు, మీరు అనారోగ్యానికి గురికావచ్చు’ అని ప్రజలు ఎప్పుడూ చెబుతుండడాన్ని మనం వింటాము. దానికి వాస్తవంగా జీవశాస్త్ర ఆధారం ఉందని బహుశా వాళ్లు గుర్తించక పోవచ్చు.”—డాక్టర్ డేవిడ్ ఫెల్టన్.
యౌవనస్థుడైన కుమారుడూ, తరిగిపోతున్న బ్యాంక్ అక్కౌంటూ, తన తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడమూ వీటన్నిటితో, ఒంటరి తల్లియైన జిల్‌కు ఒత్తిడికి లోనవ్వడానికి అప్పటికే కావలసినన్ని కారణాలున్నాయి. తర్వాత, అనుకోకుండా, ఆమె చేతి మీద విపరీతమైన దురద, మంట కలుగజేస్తున్న దద్దురు ఏర్పడింది. ఆమె దానికి మందులు, కార్టిజోన్ క్రీమ్‌లు, యాంటి హిస్టమైన్‌లు వాడి చూసింది, కాని ఫలితం శూన్యం. బదులుగా, ఆ దద్దుర్లు జిల్ ముఖంతో సహా ఆమె శరీరమంతటా వ్యాపించాయి. ఒత్తిడి అక్షరార్థంగా ఆమె చర్మాన్ని ప్రభావితం చేసింది.
రోగుల మానసిక స్థితిని పరీక్షించే చర్మ సంబంధ క్లినిక్‌కు వెళ్లమని జిల్‌కు సిఫారసు చేయబడింది. “వారి జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము,” అని ఆ క్లినిక్ సహ సంస్థాపకుడైన డాక్టర్ థామస్ గ్రాగ్ చెప్తున్నాడు. చర్మ సంబంధ మొండి వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సంబంధ శ్రద్ధనే కాకుండా, ఒత్తిడిని అదుపు చేసుకోవడానికి సహాయం అవసరమని ఆయన తరచూ కనుగొన్నాడు. “ఒకరు అనుభూతిని పొందే లేక ప్రవర్తించే విధానమే చర్మ వ్యాధిని కలిగించగలదని చెప్పడం అంత సరికాదు,” అని డాక్టర్ గ్రాగ్ అంగీకరిస్తున్నాడు. “కాని చర్మ సంబంధ రుగ్మతల్లో ఒకరి మానసిక స్థితి ప్రముఖ పాత్ర వహించగలదనీ, ఒక వ్యక్తికి ఆమె జీవితంలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయం చేయకుండా స్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉండకూడదనీ మాత్రం మనం తప్పక చెప్పవచ్చు.”
తన ఒత్తిడిని అదుపు చేసుకోవడాన్ని నేర్చుకోవడం అక్షరార్థంగా తన చర్మాన్ని కాపాడిందని జిల్ భావిస్తోంది. “ఇప్పటికీ నాకు దద్దుర్లు వస్తుంటాయి, కానీ నా చర్మస్థితి మునుపున్నంత ఘోరంగా లేదు” అని ఆమె చెప్తోంది. అది అసాధారణమైన విషయమా? ఎంతమాత్రం కాదు. హైవ్స్, సోరియాసిస్, ఏక్నీ, ఎక్జిమా వంటివాటితో సహా అనేక చర్మ వ్యాధులకు ఒత్తిడి తరచూ ఒక కారకమౌతుందని అనేకమంది వైద్యులు విశ్వసిస్తున్నారు. కానీ ఒత్తిడి ప్రభావం చూపగల్గేది కేవలం మీ చర్మంపైనే కాదు.
ఒత్తిడి మరియు మీ రోగనిరోధక వ్యవస్థ
ఒత్తిడి బహుశా మిమ్మల్ని అనేక సాంక్రమిక వ్యాధులకు గురిచేస్తూ మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేయగలదని ప్రస్తుత పరిశోధన చూపిస్తుంది. “ఒత్తిడి మిమ్మల్ని రోగానికి గురిచేయదు, కాని అది మీ రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసేదాన్ని బట్టి, మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది” అని వైరాలజిస్ట్ రొనాల్డ్ గ్లేసర్ చెప్తున్నాడు. జలుబు, ఫ్లూ, హెర్పిస్‌లను ఒత్తిడితో ముడిపెట్టడానికి ప్రాముఖ్యంగా ఒప్పింపజేసే రుజువుంది. మనం ఎడతెగకుండా అలాంటి వైరస్‌లకు గురౌతున్నప్పటికీ, సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతుంది. కానీ ఒక వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఈ రోగనిరోధకాలు విఫలం కాగలవని కొంతమంది నిపుణులు అంటారు.
దానిలో ఇమిడివున్న శరీర ప్రక్రియలను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగలేదు, కాని మీరు ఒత్తిడికి గురైనప్పుడు చర్య తీసుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేసే హార్మోన్లు రక్తప్రవాహం గుండా వెళ్తున్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు ప్రతిబంధకం కల్గించగలవని కొంతమంది సిద్ధాంతీకరిస్తున్నారు. సాధారణంగా, ఇది చింతించవలసిన విషయం కాదు, ఎందుకంటే ఈ హార్మోన్లు తాత్కాలికంగానే అలా పని చేస్తాయి. అయినప్పటికీ, ఒక వ్యక్తి ఎడతెగని, తీవ్రమైన ఒత్తిడికి లోనౌతూ ఉన్నట్లయితే, ఆయన రోగనిరోధక వ్యవస్థ ప్రభావం—ఆయన అనారోగ్యానికి సులభంగా గురయ్యేంతగా తగ్గిపోతుంది.
కెనడాకు చెందిన డాక్టర్లు, తమ వద్దకు వచ్చేవారిలో దాదాపు 50 నుండి 70 శాతం మంది రోగులు ఒత్తిడి-సంబంధిత బాధలను అనుభవిస్తున్నట్లు ఎందుకు అంచనా వేస్తున్నారో వివరించడానికి ఇది సహాయపడవచ్చు, సాధారణంగా వారిలో తలనొప్పులు, నిద్రలేమి, అలసట, గ్యాస్ట్రో-ఇంటస్టైనల్ సమస్యలు వంటివి ఉన్నాయి. అమెరికాలో, ఇలాంటివారి సంఖ్య 75 నుండి 90 శాతం మధ్య ఉన్నట్లు అంచనా వేయబడుతుంది. “దీర్ఘకాలిక ఒత్తిడి స్లో పాయిజన్ వంటిదని” చెప్పినప్పుడు తాను అతిశయోక్తిగా చెప్పడం లేదని డాక్టర్ జీన్ కింగ్ భావిస్తుంది.
ఏకైక కారకమూ కాదు, ఏకైక పరిష్కారమూ కాదు
విషయం అదైనప్పటికీ, ఒత్తిడి మాత్రమే వైద్యపరంగా తేడా కనిపించేంతగా రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయగలదనే విషయంలో శాస్త్రజ్ఞులు అంత నిశ్చయంతో లేరు. కాబట్టి, ఒత్తిడిని ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ, చివరికి అది దీర్ఘకాలికమైనదైనప్పటికీ, వ్యాధికి లోనౌతారని నిర్ద్వందంగా చెప్పడం సాధ్యంకాదు. దానికి భిన్నంగా, ఒత్తిడి లేకపోవడం మంచి ఆరోగ్యానికి హామీనివ్వగలదని చెప్పడమూ సాధ్యం కాదు, అంతేగాక ఆశాభావం మరియు అనుకూల ధృక్పథం కల్గివుండడం ద్వారా అనారోగ్యాన్ని తరిమివేయవచ్చనే తప్పు అభిప్రాయంతో వైద్య సహాయాన్ని నిరాకరించడం కూడా జ్ఞానయుక్తం కాదు. డాక్టర్ డాన్యల్ గోల్‌మన్ ఇలా హెచ్చరిస్తున్నాడు: “దృక్పథం-అన్నింటినీ-మాన్పుతుంది అనే అలంకారిక అతిశయోక్తి, అనారోగ్యం మనస్సును ఎంతమేరకు ప్రభావితం చేయగలదు అనే విషయంలో విస్తృతమైన గందరగోళాన్నీ అపోహనూ సృష్టించింది. బహుశా మరీ ఘోరంగా, ఏదైనా జబ్బు వచ్చిందంటే అది వారి నైతిక పతనానికి లేక ఆధ్యాత్మిక అయోగ్యతకు సూచన అని ప్రజలు కొన్నిసార్లు భావించేలా చేసింది.”
కాబట్టి, అనారోగ్యానికి గల కారణం ప్రతీసారి కేవలం ఒక కారకమే అయ్యుండదని గుర్తించాలి. అయినప్పటికీ, ఒత్తిడికీ అనారోగ్యానికీ మధ్యనున్న సంబంధం, ఈ “స్లో పాయిజన్”ను సాధ్యమైనప్పుడల్లా ఎలా తగ్గించాలనేదాన్ని గురించి తెలుసుకోవడంలో ఉన్న విజ్ఞతను నొక్కిచెబుతుంది.
దీన్నెలా చేయవచ్చనేదాన్ని పరిశీలించే ముందు, ఒత్తిడి యొక్క లక్షణాల్నీ, కొన్నిసార్లు అది మీకు ఎలా ప్రయోజనకరమై ఉండగలదనే విషయాన్నీ కొంత నిశితంగా పరిశీలిద్దాం.
[5వ పేజీలోని బాక్సు]
ఒత్తిడితో ముడిపెట్టబడిన కొన్ని రుగ్మతలు
• ఎలర్జీలు
• పార్శ్వ నొప్పి
• ఉబ్బసం
• వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి
• జలుబు
• డిప్రెషన్
• విరేచనాలు
• ఫ్లూ
• గ్యాస్ట్రో-ఇంటస్టెనల్ సమస్యలు
• తలనొప్పులు
• గుండె సంబంధ సమస్యలు
• నిద్రలేమి
• కీళ్ళవాతం
• జీర్ణాశయంలో కలిగే పుండ్లు
• లైంగిక వైకల్యత
• చర్మసంబంధ సమస్యలు
[6వ పేజీలోని చిత్రం]
వైద్యుని దగ్గరికి వెళ్లడానికి ఎక్కువశాతం కారణం ఒత్తిడే