ట్రూబడోర్‌లు—ప్రేమగీతాల గాయకులు మాత్రమేకాదు
ఫ్రాన్సులోని తేజరిల్లు! విలేఖరిద్వారా
ట్రూబడోర్‌లు, సంచార సంగీత విద్వాంసులు—ఆ మాటలు మీకు ఏమి జ్ఞాపకానికి తెస్తున్నాయి? బహుశా ఉదాత్తమైన ప్రణయ గీతాలను, స్త్రీ జనాదరణ గీతాలను. మీరు పొరబడలేదు, కానీ ట్రూబడోర్ల గురించి చెప్పుకోవడానికి అంతకంటే ఎక్కువే ఉంది. వాళ్లు బహుశా కాన్సో డామోర్ లేక ప్రేమ గీతానికి బాగా పేరుపొందినప్పటికీ—అందుకే వాళ్లు తరచూ చేతిలో వీణలాంటి వాయిద్యాన్ని పట్టుకుని ఒక స్త్రీ కోసం పాటపాడుతున్నట్లు చిత్రీకరించబడేవారు—వాళ్లు కేవలం ప్రేమ గురించి మాత్రమే పాడేవారని కాదు. ట్రూబడోర్‌లు తమ కాలంనాటి అనేక సామాజిక, రాజకీయ, మత సంబంధ అంశాల్లో నిమగ్నమై ఉండేవారు.
ట్రూబడోర్‌లు 12, 13 శతాబ్దాల్లో, ఇప్పుడు దక్షిణ ఫ్రాన్సుగా ఉన్న ప్రాంతమంతటిలో వర్ధిల్లారు. వాళ్లు ప్రాంతీయ రొమాన్స్ భాషల్లోకెల్లా అత్యంత సొగసైనదైన భాషలో రచించే వాగ్గేయకారులు. అది లాంగె డాక్a అని పిలువబడేది—అది లవార్ నదికి దక్షిణంగావున్న దాదాపు ఫ్రాన్సంతటిలోనూ ఇటలీ, స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రాంతీయ భాషగా ఉండేది.
“ట్రూబడోర్” అనే పదవ్యుత్పత్తిని గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి, కాని అది “స్వరకల్పన చేయు, కల్పించు, లేక కనుగొను” అనే భావాలుగల ఆక్సీటాన్ క్రియాపదమైన ట్రోబార్ నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. కాబట్టి ట్రూబడోర్‌లు తమ సొగసైన వాక్యానికి తగిన పదాన్ని లేక అంత్యప్రాసను కనుగొనగలిగే వారు. వారు తమ రచనలకు సంగీతాన్ని కూర్చి, వాటిని గానం చేసేవారు. తరచూ జంగ్లర్లని పిలువబడే ప్రదర్శకులతోపాటు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణిస్తూ, ట్రూబడోర్‌లు వీణ, ఫిడేలు, వేణువు, వీణలాంటి వాయిద్యం లేక గిటారు వంటి వాయిద్యాలతో తమ పాటలను పాడి వినిపించేవారు. ధనవంతుల భవనాల్లో, అలాగే సంత వీధులలో లేక క్రీడావేడుకల్లో, సంతల్లో, పండుగల్లో, లేక వేడుకల్లో, ఏ లాంఛనప్రాయమైన వినోదంలోనైనా సాధారణంగా సంగీత కచేరి ఒక భాగమై ఉండేది.
వేర్వేరు పూర్వచరిత్రలు
ట్రూబడోర్‌లు వివిధ పూర్వచరిత్రలు గలవాళ్లు. కొంతమంది ప్రముఖ కుటుంబాల్లో జన్మించారు; కొంతమంది రాజులు; మరితరులు సాధారణ తరగతులకు చెందినవారైవుండి ట్రూబడోర్ల స్థాయికి ఎదిగారు. కొంతమంది గొప్ప హోదాను పొందారు. అనేకులు ఉన్నత విద్యను అభ్యసించి, విస్తృతంగా ప్రయాణించారు. స్త్రీ జనాదరణ, సభ్యతా సంస్కారాలు, కవిత్వం, సంగీతం వంటివాటికి సంబంధించిన నియమాల్లో అందరూ విస్తృతంగా శిక్షణ పొందేవారు. ఒక మంచి ట్రూబడోర్ “తాజా వార్తలన్నీ కచ్చితంగా తెలుసుకుని ఉండాలి, విశ్వవిద్యాలయాల నుండి గమనార్హ సిద్ధాంతవ్యాసాలన్నీ పునరుచ్ఛరించగలగాలి, రాజాస్థానానికి సంబంధించిన పుకార్ల గురించి బాగా ఎరిగి ఉండాలి. . . . ప్రభువుగాని ప్రభువు భార్యగాని చెప్పిన మరుక్షణమే ఆశువుగా పద్యాలను కూర్చగలగాలి, రాజాస్థానంలో పేరు పొందిన కనీసం రెండు వాయిద్యాలైనా వాయించగలగాలి” అని అపేక్షించబడుతుందని ఒక మూలం తెలియజేస్తుంది.
12వ శతాబ్దపు వాణిజ్యాభివృద్ధి ఫ్రాన్సు యొక్క దక్షిణ ప్రాంతాలకు గొప్ప సిరిసంపదలను తెచ్చింది. సంపన్న స్థితి మూలంగా తీరిక సమయం, విద్యాభ్యాసం, కళల ఎడల చక్కని అభిరుచి, ఉత్తమమైన జీవన విధానం వచ్చాయి. లాంగెడాక్ మరియు ప్రొవాన్స్లకు చెందిన గొప్ప ప్రభువులు వారి భార్యలు ట్రూబడోర్లకు అత్యంత అంకితభావంగల కళాపోషకులుగా ఉండేవారు. కవులు ఉన్నతంగా ఎంచబడేవారు, వారు రాచరిక అభిరుచిపై, ఫ్యాషన్‌పై, మర్యాదలపై గొప్ప ప్రభావాన్ని చూపేవారు. వాళ్లు యూరప్ బాల్రూమ్ డాన్సుకు స్థాపకులయ్యారు. అయితే, “రాజాస్థానంలోని స్త్రీల సంబంధంగా వాళ్లు మునుపెన్నడూ లేనటువంటి సంస్కరింపబడిన ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని సృష్టించగలిగారు. అదే వాళ్లు సాధించిన గొప్ప ఘనకార్యం” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతుంది.
స్త్రీలకు ఒక క్రొత్త గౌరవం
ఒక పురుషుడు ఒక స్త్రీ కొరకు తలుపు తెరిచిపట్టుకున్నప్పుడు, ఆమె కోటు వేసుకోవడానికి సహాయం చేసినప్పుడు, లేక పశ్చిమ యూరప్‌లో శతాబ్దాలపాటు ఆచరించబడిన “లేడీస్ ఫస్ట్” వంటి ఏవిధమైన మర్యాదలు పాటించినా, అతడు బహుశ ట్రూబడోర్లతో ప్రారంభమైన ఒక ఆచారాన్ని కొనసాగిస్తున్నాడంతే.
స్త్రీజాతి పట్ల మధ్యయుగంనాటి దృక్పథాలు, చర్చి బోధలతో ఎక్కువగా ప్రభావితమైనాయి. ఆ బోధలు స్త్రీని, మానవుడు పాపంలో పడిపోవడానికి, పరదైసునుండి వెళ్లగొట్టబడడానికి బాధ్యురాలు అన్నట్లు దృష్టించేవి. స్త్రీ ప్రలోభ పెట్టేదానిగా, అపవాది ఉపకరణంగా, అనివార్య కీడుగా చూడబడేది. వివాహం తరచూ జీవితంలోని హీనమైన స్థితిగా పరిగణింపబడేది. స్త్రీల బాధలకు, అణిచివేతకు దోహదపడుతూ చర్చి చట్టం భార్యను కొట్టడాన్ని, భార్యను విడిచిపెట్టడాన్ని అనుమతించింది. దాదాపు అన్ని అంశాల్లోనూ, స్త్రీ పురుషునికన్నా తక్కువ స్థాయికి చెందినది అన్నట్లుగా పరిగణించబడేది. కాని ట్రూబడోర్ల ఆగమనంతో, పురుషుల మనస్సులు మారనారంభించాయి.
మొట్టమొదటి ప్రసిద్ధి గాంచిన ట్రూబడోర్ తొమ్మిదవ విలియం, ఆయన అక్వెటేన్ యొక్క డ్యూక్. ట్రూబడోర్ల విశేషమైన ప్రేమ భావనను సూచించే లక్షణాలు కల్గివుండడంలో ఆయన కవిత్వమే మొదటిది, ఆ ప్రేమ భావనే ఉదాత్తమైన ప్రణయమని పిలువబడింది. ప్రొవెన్సాల్ కవులు దాన్ని వరామోర్స్ (నిజమైన ప్రేమ) లేక ఫినామోర్స్ (శ్రేష్ఠమైన ప్రేమ) అని పిలిచారు. అది విప్లవాత్మకమైనది, ఎందుకంటే ఆ తర్వాత స్త్రీలు ఇక పురుషుని కంటే నికృష్ట హీనస్థితిలో ఉంచబడలేదు.
ట్రూబడోర్ల సాహిత్యం స్త్రీకి గొప్ప హుందాతనాన్నీ, ఘనతనూ, గౌరవాన్నీ ఆపాదించింది. ఆమె ఉన్నతమైన మంచి లక్షణాలకు ప్రతిరూపంగా తయారైంది. అభినందిస్తున్న గాయకుని పట్ల స్త్రీకున్న స్నేహరహితమైన ఉదాసీనత గురించి కొన్ని పాటల్లో దుఃఖం వ్యక్తపర్చబడేది. కనీసం సూత్రబద్ధంగానైనా, ట్రూబడోర్ల ప్రేమ స్వచ్ఛంగా మిగిలి ఉండవలసింది. ఆయన ప్రధాన లక్ష్యం ఆ స్త్రీని పొందడం కాదుగాని, ఆమె పట్ల ఆయనకున్న ప్రేమ ఆయనలో కలుగజేసే నైతిక శుద్ధీకరణే. ఆకాంక్షించే కవి తనను తాను అర్హునిగా చేసుకోవడానికి, నమ్రతను, ఆత్మనిగ్రహాన్ని, సహనాన్ని, యథార్థతను, ఆమెకున్న ఉన్నతమైన లక్షణాలన్నిటినీ అలవర్చుకోవడానికి పురికొల్పబడేవాడు. అలా, ఎంతో మోటు మనిషి కూడా ప్రేమ ద్వారా మార్పు చెందగల్గేవాడు.
ఉదాత్తమైన ప్రణయం సామాజిక నైతిక శుద్ధీకరణకు మూలమనీ, మర్యాదపూర్వకమైన చర్యలు ఉన్నతమైన కార్యాలు ప్రేమ నుండే ఉద్భవిస్తాయని ట్రూబడోర్‌లు విశ్వసించేవారు. ఈ తలంపు విస్తరించినప్పుడు, అది మొత్తం ప్రవర్తనా మాదిరికంతటికీ ఆధారమైంది, కొంతకాలానికి సమాజంలోని సామాన్య తరగతుల వారు దాన్ని స్వీకరించారు. అమానుష, క్రూర భూస్వామ్య సమాజానికి భిన్నంగా, ఒక క్రొత్త జీవన విధానం ప్రారంభమైంది. ఇప్పుడిక స్త్రీలు తమ పురుషులు స్వయంత్యాగపూరితంగా, దయగలవారిగా, కనికరంగలవారిగా ఉండాలని అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారై ఉండాలని ఆశించారు.
త్వరలోనే, యూరప్‌లోని చాలాభాగం ట్రూబడోర్ల కళను చేపట్టనారంభించింది. స్పెయిన్ మరియు పోర్చుగల్ వారి ఇతివృత్తాలను హత్తుకున్నాయి. ఉత్తర ఫ్రాన్సులో ట్రోవెర్స్లు, జర్మనీలో మిన్నెసింగర్లు, ఇటలీలో ట్రోవాటొరీలు ఉండేవారు. స్త్రీ జనాదరణ భావాలతో కలిసిన ట్రూబడోర్ల ఉదాత్తమైన ప్రణయ ఇతివృత్తం రొమాన్స్b అనే ఒక సాహిత్య విధానాన్ని ఉత్పన్నం చేసింది. ఉదాహరణకు, ఉదాత్తమైన ప్రణయ భావనను సెల్టిక్ బ్రిట్టాని పురాణాలతో కలపడం ద్వారా ట్రూబడోర్‌లు రాజైన ఆర్థర్ మరియు రౌండ్ టేబుల్ వద్ద కూర్చునే సేనాధిపతుల కథలలో ఉదారత, దీనజన రక్షణ వంటి మంచి లక్షణాలను ఆదర్శవంతమైనవిగా చేశారు.
వారి సామాజిక ప్రభావం
ట్రూబడోర్ల అనేక గీతాలు ఉదాత్తమైన ప్రణయంలోని మంచిని స్తుతించినప్పటికీ, ఇతర గీతాలు వారి కాలం నాటి సామాజిక రాజకీయ వివాదాలతో వ్యవహరించేవి. ట్రూబడోర్‌లు ‘తమ సమకాలీనుల నుండి తమను వేరు చేసిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని, ట్రూబడోర్‌లు తమ సంగీత కూర్పుల ద్వారా ఏదో ఒక వర్గం యొక్క విజయానికి దోహదపడ్డారనీ’ లా వ్యేయ్ ఏ లేపే (ఫిడేలు మరియు ఖడ్గం) అనే పుస్తకం వ్రాసిన ఫ్రెంచి రచయితైన మార్టన్ ఓరల్ వివరించాడు.
మధ్యయుగంనాటి సమాజంలో ట్రూబడోర్లకున్న విశేషమైన స్థానం గురించి వ్యాఖ్యానిస్తూ, రాబర్ట్ సబాట్యర్ ఇలా చెబుతున్నాడు: “కవులకు ఇంతకు ముందెప్పుడూ అంత గొప్ప ఘనత ఇవ్వబడలేదు; మునుపెన్నడూ ఎవ్వరికీ అంత వాక్స్వాతంత్ర్యం ఉండేది కాదు. వాళ్లు స్తుతించారు, విమర్శించారు, ప్రజల దృక్పథాలను వ్యక్తపర్చారు, రాజకీయ విజ్ఞతను ప్రభావితం చేశారు, క్రొత్త తలంపులకు జీవం పోశారు.”—లా పుయేజీ డ్యీ మ్యాయన్ ఆజ్.
వారి కాలంనాటి వార్తా మాధ్యమాలు
ముద్రణా యంత్రం కనిపెట్టబడడానికి చాలాకాలం ముందే ట్రూబడోర్‌లు ఇతర సంచార సంగీత విద్వాంసులు వారి కాలంనాటి వార్తా మాధ్యమాలుగా పనిచేశారని చెప్పవచ్చు. మధ్య యుగంనాటి సంగీత విద్వాంసులు దేశ యాత్రికులు. యూరప్ నందలి రాజాస్థానాలన్నిటిలో—సైప్రస్ నుండి స్కాట్లాండ్కు, పోర్చుగల్ నుండి ప్రాచ్య యూరప్‌కు, వాళ్లెక్కడికెళ్లినా అక్కడ—వాళ్లు వార్తలను సేకరించి కథలూ సంగీతాలూ పాటలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేవారు. జాంగ్లర్ నుండి జాంగ్లర్కు నోటి మాట ద్వారా త్వరితంగా వ్యాపిస్తున్న ట్రూబడోర్ల పాటల ఆకర్షణీయమైన రాగాలను ప్రజలు నేర్చుకునేవారు, అవి ప్రజాభిప్రాయాన్ని ఎంతో ప్రభావితం చేసి ఏదో ఒక ఉద్దేశానికి వారిని పురికొల్పేవి.
ట్రూబడోర్‌లు ఉపయోగించే అనేక రకాలైన కవిత్వ రూపాల్లో ఒకటి సర్వెన్టె అని పిలువబడుతుంది, అక్షరార్థంగా “సేవకుల పాట” అని దాని భావం. కొన్ని సర్వెన్టెలు పాలకులు చేసే అన్యాయాన్ని బహిర్గతం చేసేవి. వేరేవి వీరత్వంతో, స్వయంత్యాగంతో, ఉదారతతో, దయతో చేసే కార్యాలను ఘనపర్చి, అమానుష క్రూరత్వాన్ని, పిరికితనాన్ని, వేషధారణను, స్వీయాసక్తిని విమర్శించాయి. 13వ శతాబ్ద తొలి కాలానికి చెందిన సర్వెన్టెలు గొప్ప విప్లవం సమయంలో లాంగెడాక్లోని రాజకీయ మతసంబంధ వాతావరణాన్ని గురించిన వివరాలను తెలుసుకోవడానికి చరిత్రకారులకు అవకాశాన్నిచ్చాయి.
చర్చి విమర్శ
మతయుద్ధాల వైఫల్యంతో, అనేకులు కాథోలిక్ చర్చి యొక్క ఆధ్యాత్మిక మరియు లౌకిక అధికారాన్ని గురించి సందేహించనారంభించారు. మతనాయకులు తాము క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునేవారు, కాని వారి క్రియలు క్రీస్తు చేసిన క్రియలను పోలినవి కానేకావు. వారి వేషధారణ, అత్యాశ, అవినీతి అందరికీ తెలిసిపోయాయి. చర్చి బిషప్పులూ ప్రీస్టులూ ఎప్పుడూ మరింత సంపద, మరింత రాజకీయ అధికారం కొరకు ప్రాకులాడుతూ ధనవంతుల కోరికలు తీరుస్తుండేవారు. పేదవారి, మధ్య తరగతివారి ఆధ్యాత్మిక అవసరతలు తీర్చడాన్ని వారు నిర్లక్ష్యం చేయడం అనివార్యమైన విధంగా అసమ్మతిని రేకెత్తించింది.
లాంగెడాక్లో మధ్య తరగతికి అలాగే శ్రీమంతుల వర్గానికి చెందిన అనేకమంది ప్రజలు విద్యావంతులే. 12వ శతాబ్దపు చర్చి “తాను అనుకరిస్తున్నానని చెప్పుకున్న ప్రాచీన చర్చీల నుండి ఎంతో భిన్నంగా ఉన్నట్లు” మరింత విద్యావంతులైన సామాన్య ప్రజలు కనుగొన్నారని చరిత్రకారుడైన హెచ్. ఆర్. ట్రెవర్ రోపర్ పేర్కొన్నాడు. “కాన్స్టంటైన్కు మునుపున్న చర్చి, అపొస్తలుల చర్చి, . . . హింసలపాలైన చర్చి: పోప్ లేదా భూస్వామ్య బిషప్పులు లేదా గొప్ప ధర్మాదాయాలు లేదా అన్య సిద్ధాంతాలు లేక తన సంపదను అధికారాన్ని అధికం చేసుకోవడానికి రూపొందించబడిన క్రొత్త షరతులు లేని చర్చి . . . ఎంత భిన్నంగా ఉండేదో!” అని అనేకమంది వ్యక్తులు ఆలోచించనారంభించారని ఆయన జతచేస్తున్నాడు.
లాంగెడాక్ సహనంగల దేశం. టులూజ్ జమీందారులూ ఇతర దక్షిణ పాలకులూ ప్రజలకు మత స్వేచ్ఛనిచ్చారు. వాల్డెన్సులుc బైబిలును లాంగెడాక్లోకి అనువదించి, ఇద్దరిద్దరు వెళ్లి ఆ ప్రాంతమంతటిలో దాన్ని ఆసక్తితో ప్రకటించేవారు. కాథార్‌లు (ఆల్బిజెన్స్లు అని కూడా పిలువబడేవారు) కూడా తమ సిద్ధాంతాన్ని వ్యాపింపజేస్తూ, శ్రీమంతుల వర్గం నుండి అనేకులను తమ విశ్వాసంలోకి మార్చుకున్నారు.
ట్రూబడోర్ల సర్వెన్టెలలో అనేకం కాథోలిక్ మతనాయకుల పట్ల ప్రజలకున్న నిరాశాభావానికి, అగౌరవానికి, అసహ్యతకు అద్దంపట్టాయి. గీ డ కవయాన్ వ్రాసిన సర్వెంటె, మతనాయకులు లోకసంబంధమైన ఆసక్తుల కొరకు “తమ ప్రాథమిక బాధ్యతను విడిచిపెట్టినందుకు” వారిని ఖండిస్తోంది. ట్రూబడోర్ల గేయ కావ్యాలు నరకాగ్ని, సిలువ, పాపసంకీర్తన, “పవిత్ర జలం” మొదలైనవాటి విషయమై ఎగతాళి చేశాయి. అవి పాపపరిహార పత్రాలను, స్మృతి చిహ్నాలను పరిహసించి, అవినీతిపరులైన ప్రీస్టులను, దుర్నీతిపరులైన బిషప్పులను “ద్రోహులనీ, అబద్ధికులనీ, వేషధారులనీ” అవహేళన చేశాయి.
స్వేచ్ఛకు వ్యతిరేకంగా చర్చి పోరాటం
అయితే రోమన్ చర్చి తనను తాను ప్రతి సామ్రాజ్యం కంటే, ప్రతి రాజ్యం కంటే ఉన్నతమైనదిగా పరిగణించుకుంది. అధికారాన్ని పొందడానికి యుద్ధం దాని ఆయుధమైంది. రాజులను లొంగదీసుకుని, ఫ్రాన్సు యొక్క దక్షిణ రాజ్యాలలోని అసమ్మతివాదులను లోబరచుకోగల ఏ సైన్యానికైనా లాంగెడాక్లోని సమస్త సంపదను ఇస్తానని పోప్ ఇన్నోసెంట్ III వాగ్దానం చేశాడు. ఆ తర్వాత వచ్చిన కాలం ఫ్రెంచి చరిత్రలో అత్యధిక హింస చెలరేగిన, హత్యలు జరిగిన, రక్తపాతంతో కూడిన కాలాల్లో ఒకటి. అది ఆల్బిజెన్స్ల మతయుద్ధం (1209-29) అని పిలువబడింది.d
ట్రూబడోర్‌లు దాన్ని అబద్ధ మతయుద్ధం అని పిలిచారు. అసమ్మతివాదుల ఎడల చర్చి క్రూరంగా వ్యవహరించడం పట్లా, క్రైస్తవ వ్యతిరేకులుగా పరిగణింపబడిన ముస్లిమ్‌లను చంపినవారికి ఇచ్చినట్లుగానే ఫ్రెంచి అసమ్మతివాదులను చంపినవారికి కూడా పోప్ అవే పాపపరిహార పత్రాలను ఇవ్వడం పట్లా వారి పాటలు ఆగ్రహాన్ని వ్యక్తపర్చాయి. ఆల్బిజెన్స్ల మతయుద్ధం మరియు ఆ తర్వాత జరిగిన మత విచారణల సమయంలో చర్చి తనను తాను సుసంపన్నం చేసుకుంది. కుటుంబాలు వారసత్వాన్ని కోల్పోయాయి, వారి స్థలాలూ ఇళ్లూ జప్తు చేయబడ్డాయి.
కాథార్లైన చర్చివిరోధులని నిందించబడిన అనేకమంది ట్రూబడోర్‌లు ఎక్కువ వ్యతిరేకతలేని ప్రాంతాలకు పారిపోయారు. ఈ మతయుద్ధం ఆక్సీటన్ నాగరికతను, దాని జీవన విధానాన్ని, దాని కవిత్వాన్ని అంతం చేసింది. మతవిచారణ చట్టం, ట్రూబడోర్ల పాటను పాడడం లేక చివరికి కూనిరాగం తీయడం కూడా చట్టవ్యతిరేకమని నిర్ణయించింది. కాని వారి వారసత్వం కొనసాగింది. వాస్తవానికి, మతనాయకుల జోక్యాన్ని వ్యతిరేకించే వారి పాటలు పునరుజ్జీవనం కాగలదానికి మానసిక స్థితిని సిద్ధం చేశాయి. నిజంగా, ట్రూబడోర్లను వారి ప్రేమ గీతాలకంటే మరెక్కువైన వాటికోసం గుర్తు చేసుకోవచ్చు.
[అధస్సూచీలు]
a రోమన్ సైన్యాల నుండి తీసుకోబడిన, రోమన్ అని పిలువబడే భాష నుండి అనువంశికంగా వచ్చిన లాటిన్ ఆ సమయానికల్లా ఫ్రాన్సులో రెండు ప్రాంతీయ భాషలుగా వృద్ధి చెందింది: దక్షిణ ఫ్రాన్సులోని వాళ్లు లాంగె డాక్ భాషను (ఆక్సీటాన్ లేక ప్రొవెన్సాల్ అని కూడా పిలువబడుతుంది) మాట్లాడేవారు. ఉత్తర ఫ్రాన్సు ప్రజలు లాంగె డొయిల్ భాషను (కొన్నిసార్లు పాత ఫ్రెంచ్ అని పిలువబడే ఫ్రెంచ్ తొలి భాషారూపం) మాట్లాడేవారు. అవును అనే పదం కొరకు వారు ఉపయోగించే పదాన్ని బట్టి ఈ రెండు భాషలను ఒక దాని నుండి మరోదాన్ని వేరుగా గుర్తించడం సాధ్యమయ్యేది. దక్షిణంలో అది ఆక్ (లాటిన్ హాక్ నుండి); ఉత్తరంలో అది ఆల్ (లాటిన్ హాక్ ఆల్ నుండి), అదే ఆధునిక ఫ్రెంచిలో వీ అయ్యింది.
b ఉత్తర లేదా దక్షిణ ప్రాంతీయ భాషల్లో వ్రాయబడిన ఏ రచనయైనా రోమన్ అని పిలువబడేది. ఈ వీరగాథలు అనేకం ఉదాత్తమైన ప్రణయ భావనతో సంబంధం కల్గివుండేవి గనుక, రొమాన్స్ లేక రొమాంటిక్ అని పరిగణింపబడే వాటన్నిటికీ అవి ప్రమాణాలయ్యాయి.
c వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన కావలికోట ఆగస్టు 1, 1981 (ఆంగ్లం), 12-15 పేజీలను చూడండి.
d కావలికోట సెప్టెంబరు 1, 1995, 27-30 పేజీలను చూడండి.
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
ప్రింటర్స్ ఆర్నమెంట్స్/by Carol Belanger Grafton/Dover Publications, Inc.
Bibliothèque Nationale, Paris
[19వ పేజీలోని చిత్రం]
12వ శతాబ్దపు వ్రాతప్రతి నుండి తైలవర్ణచిత్రం
[క్రెడిట్ లైను]
Bibliothèque Nationale, Paris