అద్భుతమైన వేపచెట్టు
నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
“గ్రామీణ ఔషధశాల”—భారత దేశంలోని ప్రజలు వేపచెట్టును అలా పిలుస్తారు. ఆ దేశంలోని ప్రజలు శతాబ్దాలుగా నొప్పి, జ్వరం, అంటురోగాలు వంటివాటి నుండి ఉపశమనం పొందేందుకు వేపనే ఆశ్రయించారు. తమ రక్తాన్ని శుద్ధిచేయడానికి వేప దోహదపడుతుందన్న నమ్మకంతో అనేకమంది హిందువులు కొన్ని వేపాకులను తినడంతో ప్రతి క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ప్రజలు వేపపుల్లలతో తమ పళ్లు కూడా శుభ్రంచేసుకుంటారు, చర్మ వ్యాధులకు వేపాకు రసాన్ని వాడతారు, వేప కషాయాన్ని బలవర్థక ఔషధంగా త్రాగుతారు.
ఇటీవలి సంవత్సరాల్లో, శాస్త్రవేత్తలు వేపచెట్టు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వేపచెట్టు—విశ్వ సమస్యల పరిష్కారానికి ఒక చెట్టు అనే పేరుగల ఒక వైజ్ఞానిక నివేదిక ఇలా హెచ్చరిస్తోంది: “లెక్కలేనన్ని సాధ్యతలున్నట్లు అనిపిస్తున్నప్పటికీ, వేప గురించి ఇంకా ఏదీ కచ్చితం కాదు. ఆ మొక్క గురించి దాని సంభావ్య శక్తి గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్న శాస్త్రవేత్తలు, తమ అంచనాలకు మద్దతునిచ్చే రుజువు ఈ స్థాయిలో అనిశ్చయంగా ఉందని అంగీకరిస్తున్నారు.” అయినప్పటికీ, ఆ నివేదిక ఇంకా ఇలా చెబుతుంది: “పేద దేశాలకూ ధనిక దేశాలకూ కూడా ఈ అప్రసిద్ధ జాతి అనేకానేక రంగాల్లో ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చగలదని రెండు దశాబ్దాల పరిశోధన వెల్లడిస్తోంది. ‘వేప చెట్టుకు అద్భుతమైన చెట్టు అని పిలువబడే అర్హత ఉందని’ ఎంతో జాగరూకతగల కొంతమంది పరిశోధకులు కూడా చెబుతున్నారు.”
చెట్టుగా దాని పాత్ర
ఉష్ణమండల ప్రాంతాల్లో కనుగొనబడే వేప చెట్టు మహోగనీ చెట్ల కుటుంబానికి చెందినది. అది 30 మీటర్లకంటే ఎక్కువ ఎత్తువరకు పెరిగి, 2.5 మీటర్ల చుట్టుకొలత కలిగివుండగలదు. అది ఎప్పుడోగానీ ఆకులు లేకుండా ఉండదు గనుక, అది సంవత్సరమంతా నీడనిస్తుంది. అది త్వరగా పెరుగుతుంది, దాని బాగోగులు చూసుకోవడం కూడా సులభమే, అది చవిటి నేలల్లోనూ బాగా పెరుగుతుంది.
నీడకోసం, సహారా ఎడారి దక్షిణదిశగా విస్తరించడాన్ని ఆపడం కోసం ఈ శతాబ్ద తొలిభాగంలో వేపచెట్టు పశ్చిమాఫ్రికాలో ప్రవేశపెట్టబడింది. అటవీ పర్యవేక్షకులు ఆ చెట్టును ఫిజీ, మారిషస్, సౌదీ అరేబియా, మధ్య మరియు దక్షిణ అమెరికాలు, కరేబియన్ దీవులలో కూడా నాటారు. అమెరికాలోని దక్షిణ ప్రాంతాలైన అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ప్రయోగాత్మక భూభాగాలు ఉన్నాయి.
వేడిగా ఉండే వాతావరణాల్లో వేపచెట్టు సంవత్సరమంతా నీడనివ్వడమే కాకుండా అది వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది. అంతేగాక, చెదలను నిరోధించే శక్తిగల దీని కలప నిర్మాణ పనుల్లోనూ, వడ్రంగి పనుల్లోనూ ఉపయోగపడుతుంది. కాబట్టి, కేవలం చెట్టుగా దాని ఉపయోగం ఆధారంగా పరిశీలిస్తే వేపచెట్టు, ఎంతో ప్రయోజనకరమైనది. అయితే దానివల్ల ఇంకా ఎన్నో ప్రయోజనకరమైన లక్షణాలున్నాయి.
కీటకాలకు అదంటే మహాకోపం
వేధించే కీటకాలను వేపాకులు తరిమివేస్తాయని భారతీయ ప్రజలకు ఎంతోకాలంగా తెలుసు గనుక, వాళ్లు ఆ ఆకులను పరుపుల్లోనూ, పుస్తకాల్లోనూ, ధాన్యపు గాదెల్లోనూ, అలమారాల్లోనూ, సామాన్లుండే గదుల్లోనూ పెడతారు. 1959లో ఒక జర్మను కీటకవిజ్ఞాన శాస్త్రవేత్తా, ఆయన విద్యార్థులూ సూడాన్‌లో ఒక పెద్ద మిడతల తెగులును చూసిన తర్వాత వేపచెట్టు గురించి పరిశోధన చేయడంలో నిమగ్నమయ్యారు. ఆ తెగులు సమయంలో కోటానుకోట్ల మిడతలు వేపాకులను తప్ప మిగిలిన అన్ని చెట్ల ఆకులను తినేశాయి.
అప్పటి నుండి, వేపచెట్టు యొక్క సంక్లిష్టమైన రసాయన ఆయుధాగారం 200 కంటే ఎక్కువ రకాల కీటకాలను అలాగే వివిధ రకాల తవిటి పురుగులు, నెమాటోడ్‌లు, ఫంగీ, సూక్ష్మక్రిములు, చివరికి అనేక వైరస్‌లను కూడా ప్రభావవంతంగా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఒక ప్రయోగంలో, పరిశోధకులు జపాన్ పేడపురుగులతోపాటు ఒక డబ్బాలో సోయాబీన్ ఆకులను ఉంచారు. ప్రతి ఆకు యొక్క సగభాగం మీద వేపరసం చిలకరించారు. ఆ పేడపురుగులు ఆకుల మీద వేపరసం చిలకరించబడని భాగాన్ని తినేసి, ఆ రసం చిలకరించబడిన మిగతా భాగాలను అసలు ముట్టుకోలేదు. వాస్తవానికి, అవి ఆకలితో చనిపోయాయి గాని, ఆ రసం చిలకరించబడిన భాగాల్లో రవ్వంత కూడా తినలేదు.
అలాంటి ప్రయోగాలు, తక్కువ ఖరీదులో, విషపూరితంకాని, సులభంగా తయారు చేయగల కొన్ని ప్రత్యామ్నాయ కీటక సంహారకమందులను వృద్ధి చేసే సాధ్యతను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, నికరాగువాలో, రైతులు లీటరు నీటికి 80 గ్రాములు చొప్పున దంచిన వేప విత్తనాలను కలిపి, ఆ మిశ్రమాన్ని 12 గంటలపాటు ఉంచుతారు. తర్వాత నీటిని వడగట్టి, ఆ నీటిని పంటల మీద పిచికారీ చేస్తారు.
వేప ఉత్పత్తులు అనేక కీటకాలను వెంటనే చంపవు. వేప చిలకరింపులు కీటకం యొక్క జీవన గతిని మారుస్తాయి, దానితో చివరికి అవి ఇక తినలేవు, గర్భం ధరించలేవు, రూపాంతరం చెందలేవు. అయితే వేప ఉత్పత్తులు కీటకాలకు హానికరమైనవే అయినా, అవి పక్షులకు, క్షీరద జంతువులకు, లేక మానవులకు హాని కలిగించవని అనిపిస్తుంది.
“గ్రామీణ ఔషధశాల”
ఆ తర్వాత, మానవులకు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విత్తనాల్లోనూ, ఆకుల్లోనూ యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ క్రియను జరిగించే రసాయనిక మిశ్రిత పదార్థాలుంటాయి. మంటలను, హైపర్‌టెన్షన్‌ను, కురుపులను వేప తగ్గించగలదనే సూచనలు కూడా ఉన్నాయి. వేపతో తయారు చేయబడిన ఔషధాలు మధుమేహ వ్యాధికి, మలేరియాకు వ్యతిరేకంగా పోరాడుతాయని చెప్పబడుతోంది. ఇంకా ఈ క్రింది ప్రయోజనాలు కూడా ఉండే సాధ్యత ఉంది:
కీటక వికర్షకాలు. సాలానిన్ అని పిలువబడే ఒక వేప పదార్థం కొన్ని రకాల కుట్టే కీటకాలను శక్తివంతంగా వికర్షిస్తుంది. వేపనూనె నుండి తయారు చేయబడిన ఒక ఈగల మరియు దోమల వికర్షిణి ఇప్పటికే బజారులో లభిస్తోంది.
దంత పారిశుద్ధ్యం. కోట్లాదిమంది భారతీయులు ప్రతి ఉదయాన్నే ఒక వేప పుల్ల తుంచుకుని, ఒక చివర నమిలి మెత్తగా చేసి తమ పళ్లను, చిగుళ్లను రుద్దుకోవడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఆ బెరడులో ఉన్న మూల పదార్థాలు శక్తివంతమైన యాంటీసెప్టిక్ లక్షణాలు గలవి గనుక అది ఎంతో ప్రయోజనకరమైనదని పరిశోధన తెలియజేసింది.
సంతాన నిరోధక గుణాలు. వేపనూనె శక్తివంతమైన వీర్యనివారిణి, ప్రయోగశాల జంతువుల్లో జనన రేటును తగ్గించడంలో అది ఎంతో ప్రభావవంతమైనదిగా నిరూపించబడింది. వేప పదార్థాలు పురుషులు ఉపయోగించగల సంతాన నిరోధక మాత్రలను తయారు చేయడాన్ని కూడా సాధ్యం చేస్తాయని కోతులతో చేసిన ప్రయోగాలు సూచిస్తున్నాయి.
స్పష్టంగా, వేపచెట్టు మామూలు చెట్టుకాదు. వేపచెట్టు గురించి పూర్తిగా తెలియకపోయినా, అది తెగుళ్ల నివారణను మెరుగుపర్చేదిగా, ఆరోగ్యాన్ని వృద్ధి చేసేదిగా, పునర్ అటవీకరణలో సహాయకారిగా, బహుశా జనాభా పెరుగుదలను అరికట్టేదిగా ఉండగలదని నిరీక్షించడానికి గొప్ప అవకాశాన్నిస్తోంది. ఇంత అద్భుతమైన వేపచెట్టును ప్రజలు, “మానవజాతికి దేవుడిచ్చిన కానుక” అని పిలువడంలో ఆశ్చర్యం లేదు!
[23వ పేజీలోని చిత్రం]
వేపచెట్టు, ఇన్‌సెట్‌లో వేపాకు