మా పాఠకుల నుండి
ట్రూబడోర్‌లు “ట్రూబడోర్‌లు—ప్రేమగీతాల గాయకులు మాత్రమేకాదు” (మార్చి 8, 1998) శీర్షిక, మధ్యయుగాలనాటి సమాజంలో ఈ వాగ్గేయకారులు నిర్వహించిన పాత్రను నైపుణ్యవంతంగా విశ్లేషించింది. సాహిత్యాన్ని బోధించే టీచరుగా, నేను పోర్చుగీసు ట్రూబడోర్‌లను గురించి అధ్యయనం చేశాను. ఆ కళాత్మక ఉద్యమ పూర్వాపరాలను అర్థం చేసుకోవడానికి మీ శీర్షిక నాకు సహాయపడింది. ఇంతటి నాణ్యతతో కూడిన శీర్షికలు మీ పత్రికకు విశ్వసనీయతను చేకూరుస్తాయి.
ఆర్. ఎన్. ఎ., బ్రెజిల్
ఈ శీర్షికను చదవడానికి ప్రయత్నం అవసరమైందన్న విషయాన్ని నేను ఒప్పుకోవాల్సిందే, కానీ ఒక్కసారి మొదలెట్టగానే, అది నా ఆసక్తిని వెంటనే చూరగొంది. “లేడీస్ ఫస్ట్” అన్న ఆచారాన్ని బహుశా ఎవరు పరిచయం చేసివుంటారో అన్న విషయాన్ని తెలుసుకోగల్గినందుకు ముఖ్యంగా నేను సంతోషించాను. “లేడీస్ ఫస్ట్” అన్న ఆచారం జపాన్‌లో లేదుగానీ, తన చిన్ననాటనుండీ యెహోవాసాక్షుల్లో ఒకరిగా పెరిగిన మా ఆయన, మా ప్రదానం జరిగిననాట నుండీ ఏనాడూ తప్పిపోకుండా ఆ ఆచారాన్ని అనుసరించారు. (మా వైవాహిక జీవితంలో ఐదో వసంతం జరుగుతోంది) నేనెంతో సంతోషంగా ఉన్నాను.
వై. ఎన్., జపాన్
తల్లీ బిడ్డల పునఃకలయిక “ఒక విశేషమైన పునఃకలయిక” అన్న శీర్షిక నన్ను ఎంతగానో కదిలించివేసింది. (మార్చి 8, 1998) నా వంశ మూలాల్ని గురించి తెలుసుకోవడం, భావోద్రేకపరంగా నాలో ఒక పెద్ద మార్పును తెచ్చింది. మా అమ్మా నాన్నలు అస్సలు పెళ్లే చేసుకోలేదు. నేను తరచూ మా నాన్న గురించి ఆలోచించేదాన్ని, కానీ నా ప్రశ్నలకు జవాబులు అంతంత మాత్రంగా దొరికేవి. కొన్ని రోజుల క్రిందట మా నాన్న పూర్తి పేరు ఏమిటని మా అమ్మను అడిగాను. టెలిఫోన్ డైరక్టరీని ఉపయోగించి, ఆయన చెల్లెల్ని పట్టుకోగలిగాను. ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరన్న విషయాన్ని తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను! పెళ్లంటూ చేసుకోకుండానే మా నాన్న 1980లో చనిపోయారని ఆమె చెప్పింది. అయినప్పటికీ, నా అవసరతలో మా అమ్మా మేనత్తలు నిజమైన ఓదార్పుగా ఉన్నారు. నా గాయం మానిపోయే ప్రక్రియలో మీ శీర్షిక కూడా ఒక భాగమైంది.
ఎల్. డి., అమెరికా
జాత్యాభిమానం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . . జాత్యాభిమానం విషయమేమిటి?” (మార్చి 8, 1998) శీర్షికను చదివి ఆనందించాను. “నీదే జాతి?” అని చాలాసార్లు నన్ను అడగడం జరిగింది. నా కుటుంబ వంశావళికి సంబంధించిన వివరాలను పట్టుకోలేక, “సంకరజాతి !” అని జోక్‌చేస్తూ జవాబిచ్చేదాన్ని. ఒక ప్రయాణ పరిచారకుడు “నీ జాతేంటని ఎవరైనా నిన్ను అడిగినప్పుడు, ‘నేను యెహోవాసాక్షిని’ అని చెప్పు” అన్నాడు. అన్ని జాతుల్నీ సమానమైనవిగా దృష్టించే సంస్థలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.
డి. హెచ్., అమెరికా
నాకు 14 ఏళ్ల వయస్సు, ఆ శీర్షికను ప్రచురించినందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నా జాతి గర్వం జాతివాదంగా మారింది. యెహోవా దృష్టిలో మనమంతా సమానమని నేను అర్థంచేసుకునేలా ఆ శీర్షిక చేసింది.
ఐ. పి., ఇటలీ
నా చిన్నప్పుడు, నా తోటి విద్యార్థుల్లో అనేకమంది మాలో స్పానిష్ రక్తం ప్రవహిస్తోందని చెప్పుకుంటూ తమ జాతినిబట్టీ, వర్ణాన్నిబట్టీ గర్వించేవాళ్లు, నేనొక అల్పసంఖ్యాక వర్గానికి చెందినదాన్ని. నాలో న్యూనతా భావం పెరిగిపోయి, ఆత్మాభిమానం కొరవడింది. ‘నా శరీరపు రంగంటే నాకు ద్వేషం’ అని కొన్నిసార్లు నేను అనుకునేదాన్ని. ఆ శీర్షికలో ఉన్న సలహా నేను నా ఆత్మాభిమానాన్ని తిరిగిపొందేలా, యెహోవా నాకు ఇచ్చినదానితో సంతృప్తిచెందేలా నాకు సహాయపడింది.
ఎ. జి., పిలిప్పైన్స్
ధనిక దేశాల్లో పుట్టిన ప్రజలు ఉన్నతులనే వక్రీకరించబడిన అభిప్రాయం నాలో నిజంగా ఉండేది. నిజానికి ఉన్నదొక్కటే జాతనీ—అదే మానవజాతనీ గ్రహించేలా మీ శీర్షిక నాకు సహాయపడింది.
ఎల్. జి., బ్రెజిల్