దీపస్తంభం కావలివాళ్లు—అంతరించిపోతున్న ఒక వృత్తి
కెనడాలోని తేజరిల్లు! విలేఖరిద్వారా
“నాకింతకంటే ఇష్టమైన పని మరొకటి లేదు.” అలాగని దీపస్తంభం కావలివాళ్లు పదే పదే చెప్పారు. 106 సంవత్సరాల పురాతన దీపస్తంభానికి కావలివానిగా పనిచేయడానికని, కెనడా నందలి టోరంటోలోవున్న ఒక ప్లాస్టిక్ కర్మాగారంలో నిర్వహణాధికారిగా తన ఉద్యోగాన్ని వదులుకున్న ఒక వ్యక్తి, ఈ పని తన వయస్సు “10 సంవత్సరాలు” తగ్గిన అనుభూతి నిచ్చిందని చెబుతున్నాడు.
నావికులకు స్పష్టమైన కాంతి కనిపించేలా చూడడమే దీపస్తంభం కావలివాని ప్రాథమిక బాధ్యత. అతడు పొగమంచులో ఓడలకు హెచ్చరికనిస్తూ ధ్వనించే పరికరాల నిర్వహణను వాటి బాగోగులను చూడడమే కాకుండా, చేపలు పట్టేవారికి, అటుగా వెళుతున్న ఓడలకు రేడియో ద్వారా వాతావరణ సమాచారాన్ని అందజేయవలసి ఉంటుంది.
గత కాలాల్లో, దీపస్తంభం దీపాల్లో కావలివాళ్లు నూనె నింపి, వత్తులు వెలిగించి, దీపాలకున్న అద్దాల మసి తుడుస్తూ ఉండవలసి ఉండేది. దీపస్తంభాల దీపాలను వెంటనే మరమ్మత్తు చేయడం సాధ్యం కానప్పుడు ఓడలను సురక్షిత ప్రాంతాలవైపుకు మళ్లించడానికి కావలివాళ్లు మొత్తం రాత్రంతా సంకేత దీపాన్ని చేతితో త్రిప్పుతూ ఉండడం లేక పొగమంచులో ఓడలకు హెచ్చరికనిస్తూ ధ్వనించే పరికరం పాడైనప్పుడు దాన్ని సుత్తితో మోదుతూ రాత్రంతా గడపడం అసాధారణమేమీకాదు!
తుపానులను తట్టుకోవడం
ప్రచండమైన తుపానులు గంభీరమైన శ్రద్ధ చూపించవలసిన విషయాలు. ఒకసారి, ఒక దీపస్తంభం కావలివాడు తాను చూసినది “దట్టమైన తెల్లని మేఘం” అనుకున్నాడు, కాని అది ఢీ కొంటున్న ఒక పెద్ద అల అని తర్వాత తెలిసింది! ఆ అల కావలివాడు నివసిస్తున్న ఇంటిని చేరుతూ 15 మీటర్ల ఎత్తైన కొండ వరకు ఎగసింది. ఒక తుపాను కలుగజేసేంత నష్టాన్ని ఈ ఒక్క అల కలుగజేసింది.
మరో సందర్భంలో, భయంకరమైన గాలి వాన నోవా స్కోటియా నందలి పెబ్నికో తీరం దగ్గరున్న దీపస్తంభం పైకి రాత్రంతా అలలు ఎగసేలా చేసింది. ఆ కావలివాడూ అతని కుటుంబమూ చేయగలిగిందల్లా కేవలం వేచివుండి, నిరీక్షించడమే. ఉదయానికల్లా ఆ తుపాను తగ్గుముఖం పట్టింది. కాని కావలివాడు బయటికెళ్లి, దీపస్తంభం చుట్టూ ఉన్న నేలంతా కొట్టుకుపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దీపస్తంభం చుట్టూ నీళ్లే!
ఒంటరితనమూ విసుగూ
ఒంటరితనం గురించి అడిగినప్పుడు ఒక కావలివాడు తనలోతాను నవ్వుకుని ఇలా అన్నాడు: “‘అంత ఒంటరితనాన్ని మీరెలా భరిస్తారు?’ అని ప్రజలు మాతో అంటారు. మేము తిరిగి వారినిలా ప్రశ్నిస్తాము, ‘నగరంలో అంత రణగొణ ధ్వనిని, అంత అల్లకల్లోలాన్ని భరిస్తూ మీరెలా జీవించగలుగుతున్నారు?’”
గత కాలాల్లో, అమెరికాలోని మరీ సుదూర ప్రాంతాల్లో ఉన్న దీపస్తంభాలలో కొన్ని రకాల పుస్తకాలను ఉంచారు. ఫలితంగా, 1885 కల్లా 420 గ్రంథాలయాలు ఉపయోగంలో ఉన్నాయి. దీపస్తంభం కావలివాళ్లు మంచి చదువరులయ్యారని స్పష్టమౌతుంది.
అంతరించిపోతున్న ఒక వృత్తి
ఇటీవలి సంవత్సరాల్లో, మనుష్యులు నడిపే దీపస్తంభాల స్థానాన్ని, యంత్రాలతో నడిచే శక్తివంతమైన ప్రకాశమానమైన దీపాలున్న ఉక్కు రేకులతో చేసిన బురుజులు ఆక్రమించుకున్నాయి. అస్పష్టమైన దీపాల కోసం లేక మిణుకు మిణుకుమంటున్న కాంతి కోసం నావికులు ఇక అంధకారంలోకి దృష్టి సారించి చూడాల్సిన అవసరం లేదు. నేడు, శక్తివంతమైన టంగ్స్టన్ హెలోజిన్ దీపాలు, బిగ్గరగా స్పష్టంగా వినిపించే పొగమంచు సంకేతాలు సముద్ర ప్రమాదాల గురించి నావికులను హెచ్చరిస్తాయి.
దీపస్తంభాల నుండి సూచనలను అందుకునేందుకు ఆయత్తం చేయబడిన ఓడలకు ఇప్పుడు, మంచు ఎంత దట్టంగా కురిసినా తాము ఎక్కడున్నదీ తెలుస్తుంది. అపాయకరమైన ఇసుక తిన్నెలను, ప్రమాదకరమైన గులకరాళ్ల గట్టులను, తీరం దగ్గర అపాయం దాగివుండే మోసకరమైన శిలలను తప్పించుకోగలనన్న నమ్మకంతో నావికుడు ఒక తీరం నుండి మరో తీరానికి ప్రయాణించడాన్ని ఆధునిక సాంకేతికత అనుమతిస్తోంది.
ఆధునిక సాంకేతికత మూలంగా, దీపస్తంభం కావలివాళ్లు ప్రపంచ దృశ్యం నుండి త్వరితంగా కనుమరుగై పోతున్నారు. తన జీవితంలోని ఒక భాగం ఇక లేకుండా పోయిందన్న అనుభూతితో, ఒక దీపస్తంభం కావలివాడు 25 సంవత్సరాలుగా నివసించిన తన ద్వీప గృహాన్ని విడిచి వెళ్లడం గురించి ఇలా దుఃఖాన్ని వ్యక్తం చేశాడు: “మాకిక్కడ జీవితం సంతోషకరంగా ఉంది. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని నిజంగా మేమెన్నడూ కోరుకోలేదు.”
ఇప్పటికీ, రివాల్వింగ్ దీపాలు, అనుబంధ దీపాలు, ఎమర్జెన్సీ దీపాలు, శబ్ద సూచనలు, రాడార్ దీపాలు వీటన్నిటికీ మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది, దీపస్తంభాలను చూసుకునే వారూ ఉండాలి. ఇప్పుడు దీప బురుజుల బాగోగులను ప్రయాణించే సాంకేతిక నిపుణులు చూసుకుంటున్నారు.
దీపస్తంభం కావలివాళ్లు సంవత్సరాలుగా అందజేసిన సేవలను మెచ్చుకునేవారు, మైనే నందలి అగస్టాలోని ఒక వ్యక్తి వ్యక్తపర్చిన భావాలను పంచుకుంటారు, ఆయనిలా అన్నాడు: “దీపస్తంభం వైపు చూసి ఇప్పుడు దీపాలు వెలుగుతున్నది కంప్యూటర్ ద్వారానని, ఇక అక్కడ మనుష్యులు లేరని తెలుసుకోవడం మునుపుటి భావనను ఇక ఎన్నడూ కలిగించదు.”
[17వ పేజీలోని బాక్సు]
మొట్టమొదటి దీపస్తంభం
లిఖిత చరిత్రలో మొట్టమొదటి దీపస్తంభ నిర్మాణం ఐగుప్తుకు చెందిన రెండవ టాలమీ పరిపాలన కాలంలో ముగిసింది. అది ఇంచుమించు సా.శ.పూ. 300 ఆ ప్రాంతంలో, ఫారోస్ ద్వీపంపైన, ఇప్పుడు అలెగ్జాండ్రియా తీరం అని పిలువబడుతున్న దాని ముఖ ద్వారానికి కొంచెం దూరంలో నిర్మించబడింది. దాన్ని నిర్మించడానికి 20 సంవత్సరాలు పట్టింది, 25 లక్షల అమెరికా డాలర్లు ఖర్చయ్యాయి.
అది 90 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండేదని చారిత్రక వ్రాతలు సూచిస్తున్నాయి. దాని పై అంతస్థులోని కిటికీలు సముద్రం వైపుకు ఉండేవి, వాటి వెనుక బహుశా కట్టెల మంటలు లేక కాగడాలు ఉండేవని, అవి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వరకు కనిపించేవని జోసీఫస్ తెలియజేస్తున్నాడు.
ఈ అతిపెద్ద రాతి కట్టడం ఏడు ప్రపంచ వింతల్లో ఒకటిగా పరిగణించబడేది. దాని ప్రకాశమానమైన మంట 1,600 సంవత్సరాలపాటు హెచ్చరిక కాంతిగా పని చేసింది, అది ఆ తర్వాత బహుశా భూకంపం మూలంగా నాశనమయ్యింది.
శతాబ్దాలు గడుస్తుండగా, వివిధ పరిమాణాల, ఆకారాల వేలాది దీపస్తంభాలు ప్రపంచమంతటా ఓడరేవుల్లో నిర్మింపబడ్డాయి. మనుష్యులచే నడపబడిన పాత దీపస్తంభాలు నేడు వస్తు ప్రదర్శనశాలలుగా, జాతీయ, రాష్ట్ర, గ్రామ మరియు నగర పార్కుల్లో పర్యాటక ఆకర్షణలుగా ఉనికిలో ఉన్నాయి, వాటిని లక్షలాదిమంది సందర్శిస్తున్నారు.
[16వ పేజీలోని చిత్రం]
కేప్ స్పియర్ దీపస్తంభం, న్యూఫౌండ్లాండ్, కెనడా