బైబిలు ఉద్దేశము
జ్ఞానానికి సన్యాసమే కీలకమా?
“ఇనుప సంకెళ్లు, గొలుసులు, ఇనుప తీగెలు, మెడ చుట్టూ ఇనుప ముళ్లున్న చట్రపు పట్టీలు ధరించి ఉన్న సన్యాసులు . . . ముళ్లలోను, దురదగొండి మొక్కలపైనా దొర్లుతూ, కావాలనే కీటకాలతో తమను తాము కుట్టించుకుంటూ, మంటల్లో తమను తాము కాల్చుకుంటూ తమ గాయాల్ని చీము కారుతూ ఉండేలా రేపుకుంటూ ఉన్న మరితరులు. ఆకలితో నకనకలాడుతుండేందుకు తిండి తినకపోవడం వారికి సర్వసాధారణం. కొంతమందైతే మరో అడుగు ముందుకు వెళ్లారు, వీరు కుళ్లిపోయిన ఆహారాన్ని లేకపోతే ఏదో రకంగా ఏహ్యంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటుంటారు.”—ద సెయింట్స్, ఈడిత్ సైమన్ రచించినది.
వీరు సన్యాసులు. వీళ్లు తమను తాము ఎందుకంతలా బాధించుకుంటారు? ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్—ద స్పిరిట్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ క్రిస్టియన్ మోనాస్టిసిజమ్ అనే పుస్తకంలో, దాని రచయితలు, “సోక్రేట్స్ (సా.శ.పూ. ఐదవ శతాబ్దం) కాలం మొదలుకొని, అత్యంత నిరాడంబర జీవితం, ఇంద్రియ సంబంధంగా, వస్తు సంబంధంగా విలాసవస్తువుల బంధనాల్లో లేని జీవితం నిజమైన జ్ఞానానికి అత్యావశ్యకం అన్న తలంపు బహుళవ్యాప్తంగా ఉంది” అని వివరిస్తున్నారు. శరీరావసరతల్ని త్యజించడం తమ ఆధ్యాత్మిక గ్రహింపును అభివృద్ధిచేసి నిజమైన అపారమైన జ్ఞానమునకు నడిపించగలదని సన్యాసులు తలంచారు.
సన్యాసాన్ని కచ్చితంగా నిర్వచించడం కష్టం. కొంతమందికైతే అది కేవలం స్వయంక్రమశిక్షణ లేక స్వయం-ఉపేక్ష అయివుంది. తొలి క్రైస్తవులు అటువంటి సద్గుణాలకు విలువనిచ్చారు. (గలతీయులు 5:22, 23; కొలొస్సయులు 3:5) యేసుక్రీస్తు ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించమని తానే సిఫారసు చేశాడు, ఒక భౌతికవాద జీవనశైలి చింతలను తీసుకురాగలదు. (మత్తయి 6:19-33) అయితే, సన్యాసం అనేది సామాన్యంగా ఎంతో కఠోరనియమాలతోనూ, తరచుగా పైన వర్ణించబడినటువంటి విపరీత చర్యలతోనూ జతచేయబడుతుంది. ఈ సన్యాసానికి సంబంధించిన అభ్యాసాలు, ప్రాముఖ్యంగా అవి విపరీతమైనవిగా ఉన్నవైతే, అవి నిజంగా జ్ఞానానికి కీలకమా?
తప్పుడు భావనలపై ఆధారపడివున్నాయి
వస్తు సంబంధ విషయాలు, శారీరక సుఖానుభూతులు వాటికవే చెడ్డవని, అందుకని ఆధ్యాత్మిక ప్రగతికి అవి అవరోధాలన్న తలంపు సన్యాసవాదానికి దారితీసిన తత్వజ్ఞానాల్లో ఒకటిగా ఉంది. సన్యాసవాదానికి నడిపించే మరొక భావన ఏమిటంటే, మానవుడు ఒక శరీరమూ, ఒక జీవాత్మ ఈ రెండింటి కలయికతో చేయబడ్డాడన్న బహుళవ్యాప్తమైన నమ్మకమే. భౌతిక శరీరం జీవాత్మకు కారాగారం వంటిదనీ, రక్తమాంసాలు దాని శత్రువు అని సన్యాసులు నమ్ముతారు.
బైబిలు ఏమి చెబుతుంది? దేవుడు తాను భూమిని సృష్టించడం ముగించిన తర్వాత, ఆయన తాను చేసినది యావత్తు—ప్రకృతి సంబంధమైన, భౌతిక సంబంధమైన సృష్టి అంతా—“చాలమంచిదిగ” ఉందని ప్రకటించాడని లేఖనాలు చూపిస్తున్నాయి. (ఆదికాండము 1:31) ఏదెను వనంలో స్త్రీపురుషులు భౌతిక విషయాల్ని అనుభవించాలని దేవుడు ఉద్దేశించాడు. ఏదెను అన్న పేరుకే “ఆహ్లాదం” లేక “ఆనందం” అని అర్థం. (ఆదికాండము 2:8, 9) ఆదాము, హవ్వలు పరిపూర్ణులుగా ఉన్నారు, తాము పాపం చేసేంత వరకు వారు దేవునితో చక్కని సంబంధాన్ని అనుభవించారు. పాపం చేసిన కాలం మొదలుకొని అపరిపూర్ణత దేవునికి మానవునికి మధ్య ఒక అడ్డంకు అయ్యింది. అయినప్పటికీ, దేవుని నైతిక చట్టాలకు అనుగుణ్యంగా ఉన్నంతవరకు న్యాయసమ్మతమైన మానవ కోరికలను తీర్చుకోవడం లేక దేవుడిచ్చిన భౌతిక సుఖాల్ని అనుభవించడం అనేవి దేవునికి ఆయన ఆరాధికులకు మధ్య సంబంధానికి ఎన్నడూ అడ్డంకును ఏర్పర్చవు!—కీర్తన 145:16.
దానికితోడు, మట్టి నుండి మాంసంగా చేయబడిన మానవుడే ఒక జీవాత్మ అయివున్నాడని బైబిలు స్పష్టంగా చెబుతుంది. జీవాత్మ భౌతిక శరీరంలో కట్టివేయబడిన ఏదో అభౌతికమైన లేక అమర్త్యమైన వస్తువో అన్న తలంపును గాని, శరీరం ఏదో ఒక విధంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండడాన్ని నివారిస్తుందన్న తలంపునో గాని లేఖనాలు బలపర్చడంలేదు.—ఆదికాండము 2:7.
స్పష్టంగా సన్యాసవాదం అన్న భావన దేవునితో మానవుని సంబంధాల గురించిన ఒక వక్రీకృత భావం ఇస్తుంది. నామకార్థ క్రైస్తవులు కొంతమంది ప్రాథమిక బైబిలు సత్యాలను కాదుగానీ మోసకరమైన మానవ తత్త్వజ్ఞానాన్ని ఎంపిక చేసుకుంటారని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 తిమోతి 4:1-5) ఇటువంటి అభిప్రాయం కలిగివున్న కొంతమందిని గురించి ఒక మత చరిత్రకారుడు ఇలా చెబుతున్నాడు: “పదార్థం హానికరం అన్న నమ్మకమూ, . . . మనుష్యుని జీవాత్మ భౌతిక పదార్థం యొక్క చెర నుండి విడిపించబడాలన్న నమ్మకమూ మాంసాహారాన్నీ, లైంగిక సంబంధాల్నీ మరితరమైన వాటినీ నిషేధిస్తూ తీవ్రమైన సన్యాసవాదాన్ని పురికొల్పింది. కేవలం ప్రత్యేక దీక్షలో కూర్చుని సభ్యులుగా అయినటువంటి ప్రతిష్ఠాత్మకమైన పర్ఫెక్టీ మాత్రమే అంటే ‘పరిపూర్ణ వ్యక్తులు’ మాత్రమే వీటిని ఆచరించగలరన్న నమ్మకాన్నీ పురికొల్పింది.” ఈ తరహా ఆలోచనా సరళికి బైబిలు మద్దతు ఏమాత్రం లేదు, మరి ఇది తొలి క్రైస్తవుల నమ్మకమూ కాదు.—సామెతలు 5:15-19; 1 కొరింథీయులు 7:4, 5; హెబ్రీయులు 13:4.
సన్యాసవాదం అవసరం లేదు
యేసు, ఆయన శిష్యులు సన్యాసులు కారు. వారు అనేకమైన పరీక్షలను, శ్రమలను సహించారు, కానీ ఈ శ్రమల్లో ఏవీ కూడా తమకు తామే కొనితెచ్చుకున్నవి కావు. క్రైస్తవులను జాగ్రత్తగా ఉండమని, లేకపోయినట్లైతే మోసపూరితమైన మానవ తత్త్వజ్ఞానం వారిని దేవుని వాక్య సత్యం నుండి మరలిపోయేలా ప్రలోభపెట్టి, వారిని అసహేతుకమైన ఆచారాలకు, తీవ్రమైన ఆచారాలకు నడిపిస్తుందని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను హెచ్చరించాడు. పౌలు ప్రత్యేకంగా ఒక రకమైన “దేహశిక్ష”ను గురించి ప్రస్తావించాడు. ఆయనిలా అన్నాడు: “అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.” (కొలొస్సయులు 2:8, 23) సన్యాసవాదం అనేది ఏ ప్రత్యేక రకమైన పవిత్రతకూ లేక ఏ నిజమైన అపార జ్ఞానానికి నడిపించదు.
నిజమే, క్రైస్తవ విధేయతా మార్గంలో కొనసాగాలంటే తీవ్రమైన పోరాటమూ, స్వయంక్రమశిక్షణా అవసరం అన్నది అంతర్నిహితం. (లూకా 13:24; 1 కొరింథీయులు 9:27) దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి ఒకడు కష్టించి పనిచేయాలి. (సామెతలు 2:1-6) “దురాశలకును భోగములకును” దాసులు కావడానికీ, “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారి”గా ఉండడానికీ విరుద్ధంగా గట్టి హెచ్చరిక బైబిలులో ఉంది. (తీతుకు 3:3; 2 తిమోతి 3:4, 5) అయితే, ఈ లేఖన భాగాలు సన్యాసాన్ని ఆచరించడాన్ని ఆమోదించడం లేదు. ఆహారపానీయాలూ, సంగీతనృత్యాలూ వంటివి ఉన్న ఆహ్లాదకరమైన సందర్భాలను పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు అనుభవించాడు.—లూకా 5:29; యోహాను 2:1-10.
నిజమైన జ్ఞానము సహేతుకమైనది, అది శృతి మించదు. (యాకోబు 3:17, NW) యెహోవా దేవుడు జీవితంలోని అనేక సుఖానుభూతులను అనుభవించే సామర్థ్యంతో మన భౌతిక శరీరాల్ని సృష్టించాడు. మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం ఇలా చెబుతుంది: “సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.”—ప్రసంగి 3:12, 13.
[28వ పేజీలోని చిత్రసౌజన్యం]
బిలంలో సెయింట్ జెరోమ్ /The Complete Woodcuts of Albrecht Dürer/Dover Publications, Inc.