కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీలు 25-27
  • మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్ళెందుకు పక్షపాతం చూపిస్తారంటే
  • సమానంగా వ్యవహరించకపోవడం—అన్యాయమా?
  • వివేచించేవారై ఉండేందుకు నేర్చుకోండి
  • పక్షపాతం యెడల నేనెలా వ్యవహరించగలను?
    తేజరిల్లు!—1997
  • తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?
    తేజరిల్లు!—2004
  • ప్రతీసారీ తప్పు నాదే ఎందుకు అవుతుంది?
    తేజరిల్లు!—1997
  • నా తలిదండ్రులు నాపై ఎక్కువ శ్రద్ధను ఎందుకు చూపించరు?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీలు 25-27

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?

“నన్ను కలతపరచేదేమంటే, మా అన్నయ్యలూ అక్కయ్యలూ అనుచితంగా ప్రవర్తించినా వాళ్లు ఎంతో శ్రద్ధను—ప్రతికూలమైనదైనా అనుకూలమైనదైనా సరే—పొందుతారు. కాని నేను విధేయురాలిగా ఉండేందుకే మొగ్గు చూపుతాను కనుక నాకు పెద్ద విలువివ్వరు.”—18 ఏండ్ల కే.a

“మా అన్నయ్యలకూ అక్కయ్యలకే ఎక్కువ శ్రద్ధ ఇవ్వబడుతుంది, వాళ్ళను బాగా చూసుకోవడం జరుగుతుంది. నామీద చూపే శ్రద్ధ చాలా మట్టుకు గద్దింపు రూపేణానే ఉంటుంది. వాళ్ళను కూడాగద్దించడం జరిగిందని తెలిస్తే నాకు కాస్త ఊరటగా ఉండేది.”—15 ఏండ్ల రూత్‌.

“నా అక్కయ్యలకూ అన్నయ్యలకూ మరిన్ని ఆధిక్యతలూ, మరెక్కువ అవధానమూ లభిస్తున్నట్లు నాకనిపిస్తుంది.”—13 ఏండ్ల బిల్‌.

మనం జన్మించిన రోజు నుండే మనకందరికీ మన తల్లిదండ్రుల శ్రద్ధ అవసరముంది. మీకు తల్లిదండ్రుల నుండి న్యాయంగా దక్కవలసినంత శ్రద్ధ దక్కట్లేదని మీరు భావిస్తే మీరు బాధపడవచ్చు, కోప్పడవచ్చు. అది అర్థం చేసుకోగల విషయమే. ముఖ్యంగా మీ తోబుట్టువు—మీ కన్నా పెద్దైనా, చిన్నే అయినా, సత్ప్రవర్తనగలవారైనా, లేదా పూర్తిగా అవిధేయులైనా—సదా వాళ్ళే కేంద్రబిందువవుతున్నట్లయితే అలాగే అనిపిస్తుంది. “మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని” అని వ్రాసినప్పుడు దావీదు భావించినట్లే మీరు కూడా భావించవచ్చు.—కీర్తన 31:12.

మీరు పొందాలనుకున్నటువంటి శ్రద్ధ మీ తోబుట్టువుపై చూపించడాన్ని మీరు చూస్తే అది మరింత వేదనకరంగా ఉండగలదు. అయితే మీరు ప్రేమించబడడం లేదని దాని భావమా? కానే కాదు. కొంతమంది యౌవనస్థులకు అరుదైన సామర్థ్యాలూ లేదా కలివిడిగా ఉండే వ్యక్తిత్వాలూ ఉండడం వల్లే వాళ్ళు అదనపు శ్రద్ధను పొందుతుండవచ్చు. లభిస్తుండవచ్చు. “నా తమ్ముడు ఆర్థర్‌ మూడవ తరగతి చదువుతున్నాడు. కానీ ఐదవ తరగతి పిల్లల జట్టుతో ఆడతాడు. వాడు ఆటల్లోనూ, లెక్కల్లోనూ అగ్రగణ్యుడే. నిజానికి వాడికి స్కూల్లో అన్ని సబ్జెక్ట్‌లలోనూ A గ్రేడే లభిస్తుంది. ఇతరులకు నా కన్నా వాడంటేనే ఎక్కువ ఇష్టమనుకుంటా. కానీ నాకు వాడి మీద అసూయ లేదు. ఏదో కాస్త ఉండవచ్చేమో” అని 11 ఏండ్ల కెనెత్‌ అంటున్నాడు.

మొదటి సంతానమో చివరి సంతానమో అయినందు వల్లే తమ తల్లిదండ్రుల సమయంలో అధిక భాగాన్ని పంచుకుంటున్న యౌవనస్థులు కూడా ఉన్నారు. చిన్నవాడైన యోసేపును గురించి బైబిలు ఇలా చెబుతుంది: “యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించాడు.” (ఆదికాండము 37:3, 4) అందుకు భిన్నంగా, తన అన్న పెద్దవాడైనందున ఆయన మీద ఎక్కువ మమకారం చూపబడుతుంది అని 18 ఏండ్ల టాడ్‌ భావించాడు. “స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం మీ కిష్టమైన పాప/బాబు చిత్రాన్ని తీసుకురండని మాతో చెప్పారు. నా ఫోటోలు చాలా తక్కువ ఉన్నాయనీ కనుగొన్నాను. మా అన్నయ్య ఫోటోలైతే చాలా ఉన్నాయని గ్రహించాను. ఎందుకలా అని ఆశ్చర్యపోయాను” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు.

అయితే, తరచూ, తోబుట్టువుకు కొన్ని సమస్యలు—బహుశా మీకు తెలియని సమస్యలు—ఉన్నందువల్లే కాస్త ఎక్కువ అవధానం ఇవ్వబడుతుంది. ఇప్పుడు 22 ఏండ్లున్న కసాండ్రా ఇలా వివరిస్తుంది: “నాకు 16 ఏండ్లున్నప్పుడు, మా అన్నయ్య కష్ట కాలాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన నిజానికి యెహోవాకు సేవ చేయాలనుకుంటున్నాడా లేదా అని తను నిశ్చయపరచుకోలేని పరిస్థితి అది. మా తల్లిదండ్రులు వారి అవధానాన్నంతా దాదాపుగా ఆయన మీదే ఉంచారు. అలా ఎందుకు జరుగుతుందో అప్పట్లో అర్థం చేసుకోలేక పోయాను. వాళ్ళకు నా మీద శ్రద్ధే లేదని నేను భావించాను. అది నాకు విచారం కలిగించింది. నన్ను నిర్లక్ష్యం చేసినట్లు అనిపించింది—పిచ్చి కోపం కూడా వచ్చింది.”

వాళ్ళెందుకు పక్షపాతం చూపిస్తారంటే

అయితే, పూర్తిగా పక్షపాతం చూపించడంలో తల్లిదండ్రులు కొన్నిసార్లు అపరాధులే. ఒక తల్లి ఇలా ఒప్పుకుంది: “మేము మా కుమార్తెనుబట్టి బాగా గర్వించడాన్ని నా కుమారుడు పాల్‌ ఎంతో బాధతో గుర్తించిన విషయం నాకు తెలుసు. ‘లిజ్‌ ఏమైనా చెబితే నువ్వూ నాన్నా ఎప్పుడూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు’ అని మాతో వాడు నేరుగానే చెప్పేశాడు. వాడు ఏమి చెబుతున్నాడో మొదట మాకు అర్థం కాలేదు. ‘అమ్మాయి భలే చలాకీదే’ కదా అన్నట్లు మేము ఎడతెగక చూపులు కలుపుకుంటున్నామన్న విషయం తర్వాత గ్రహించాం. వాడు మాకు ఆ విషయం చెప్పినప్పటి నుండి ఇంకెన్నడూ అలా చేయకుండా ఉండేందుకు మేము నిజంగా చాలా ప్రయత్నం చేశాం.”

అసలు తల్లిదండ్రులు పక్షపాతం ఎందుకు చూపిస్తారు? వాళ్ళ పెంపకమే ఒక కారకమై ఉండవచ్చు. ఉదాహరణకు, మీ అమ్మ వాళ్ళింట్లో అందరికన్నా చిన్నదైతే, ఆమె తన చిన్న బిడ్డలో తనను చూసుకుంటుండవచ్చు. ఆమెకు తెలియకుండానే ఆ బిడ్డ పక్షాన ఉండడానికి మొగ్గు చూపుతుండవచ్చు. తల్లిగానీ తండ్రికానీ తనకున్నటువంటి అదే అభిరుచిని లేదా ఆసక్తిని కలిగివున్న బిడ్డతో మరింత సన్నిహిత అనుబంధం కలిగి ఉండవచ్చు. తమ కవల పిల్లలైన యాకోబు ఏశావులతో ఇస్సాకు మరియు రిబ్కాలకున్నటువంటి అనుబంధాన్ని గురించి బైబిలు ఏమి చెబుతుందో గమనించండి: “ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను.”—ఆదికాండము 25:27, 28.

మీ తల్లిదండ్రులు మీ తోబుట్టువుల్లో ఒకరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే మీరేమి చేయాలి?b మీరు మీ తల్లిదండ్రులను నిందించక, వారితో ఆ విషయాన్ని గురించి ప్రశాంతంగా మాట్లాడడానికి మీరు తప్పక ప్రయత్నించవచ్చు. (సామెతలు 15:22) గౌరవపూర్వకంగా వారు చెప్పేది విని, వాళ్ళ వైపు నుండి విషయాలను గురించి ఆలోచించేందుకు మీరు ప్రయత్నించవచ్చు. ఇది మీ నిరాశను తగ్గించవచ్చు. (సామెతలు 19:11) కౌమార ప్రాయంలోని ఒక అమ్మాయి ఇలా చెబుతుంది: “మా అమ్మకు నా మీద కన్నా తమ్ముడు మీదే శ్రద్ధ ఎక్కువ అన్న విషయం నన్ను నిజంగా బాగా బాధపెట్టింది. నేను దానిని గురించి అడిగినప్పుడు, వాడికి నాన్న పోలికలే ఎక్కువ కనుక తను వాడితో సన్నిహితంగా ఉంటుందనీ, నాకు ఆమె పోలికలే ఎక్కువ కనుక నాన్న నాతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటాడని ఆమె వివరించింది. అలాగే నేనూ అమ్మా ఒకేలా ఉంటాం కనుక, ఒకరినొకరం విసిగించుకుంటాం. మా నాన్నా మా తమ్ముడూ ఒకేలా ఉంటారు కనుక వాళ్ళు ఒకరినొకరు కలతపరచుకుంటారు. ఒకసారి మా అమ్మ ఆ విషయమే వివరించింది—ఆ విషయాన్ని బట్టి ఉప్పొంగిపోలేదు గానీ—ఆ విషయంతో ఏకీభవించగలిగిగాను.”

సమానంగా వ్యవహరించకపోవడం—అన్యాయమా?

అయితే, తల్లిదండ్రులు పిల్లల్నందరినీ కచ్చితంగా ఒకేలా ఎందుకు చూడలేరు? ఇప్పుడు 18 ఏండ్లున్న బెత్‌ ఇలా అంటుంది: “నాకు 13 ఏండ్లున్నప్పుడు, నా తమ్ముడ్నీ నన్నూ సమానంగా—కచ్చితంగా ఒకేలా చూడాలి అని భావించాను. ఎప్పుడూ నన్నే గద్దించడం జరిగేది. నా తమ్ముడ్ననైతే ఏమీ అనేవారు కాదు. కారు మీద ఏదో ఒక పని చేస్తూ వాడు నాన్నతో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. అది ఎంతో అన్యాయంగా అనిపించేది.”

కానీ సమానంగా వ్యవహరించకపోవడం కచ్చితంగా అన్యాయమేమీ కాదు. యేసుక్రీస్తు తన అపొస్తలులతో ఎలా వ్యవహరించాడో ఆలోచించండి. నిస్సందేహంగా ఆ 12 మందినీ ఆయన ప్రేమించాడు. అయినప్పటికీ ఆయన యాయీరు కుమార్తె పునరుత్థానమూ, తన రూపాంతరముతో సహా కొన్ని ప్రత్యేక సంఘటనలను చూసేందుకు వారిలో ముగ్గురిని మాత్రమే ఆహ్వానించాడు. (మత్తయి 17:1; మార్కు 5:37) అంతేకాక, ముఖ్యంగా అపొస్తలుడైన యోహానుతో యేసుకు సన్నిహిత స్నేహబంధం ఉండేది. (యోహాను 13:23; 19:26; 20:2; 21:7, 20) అది అసమానతేనా? కచ్చితంగా. మరి అది అన్యాయం కాదా? కానే కాదు. ఆయన కొందరితో మరింత సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఆయన మిగతా అపొస్తలుల అవసరాలను నిర్లక్ష్యం చేయలేదు.—మార్కు 6:31-34.

అలాగే, కొన్ని ప్రతిభలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, అవసరాలను బట్టి మీ తోబుట్టువు ప్రత్యేక శ్రద్ధను పొందుతుండవచ్చు. సహజంగానే, అలా జరగడాన్ని చూసినప్పుడు బాధగానే ఉంటుంది. అయితే ప్రశ్న ఏమిటంటే, మీ అవసరాలు నిజంగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయా? మీకు మీ తల్లిదండ్రుల సలహా, సహాయం, లేదా మద్దతు అవసరమైనప్పుడు మీకు సహాయం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అలాగైతే, మీకు అన్యాయం జరుగుతుందని నిజంగా చెప్పగలరా? ఇతరుల “అవసరముల”ను బట్టి వారితో వ్యహరించమని బైబిలు మనలను ప్రోత్సాహిస్తుంది. (రోమీయులు 12:13) మీరూ మీ తోబుట్టువులూ విభిన్న అవసరాలు గల వ్యక్తులు కనుక మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సమానంగా చూడాలన్నది అసాధ్యమైన విషయం.

అలా సమానంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ న్యాయం కాదనీ, న్యాయంగా వ్యవహరించడమనేది ఎల్లప్పుడూ సమానంగా వ్యవహరించడమూ కాదనీ ముందు పేర్కొనబడిన బెత్‌ గ్రహించింది. “నేనూ తమ్ముడూ భిన్నమైన ఇద్దరు వ్యక్తులమనీ, మాతో భిన్నమైన విధాల్లోనే వ్యవహరించవలసిన అవసరం ఉందనీ నేను గ్రహించాను. వెనక్కి తిరిగి చూస్తే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయానన్నది నమ్మలేకపోతున్నాను. ఆ వయస్సులో నేను విషయాలను దృష్టించిన విధానమే అందుకు కారణం అనుకుంటా” అని ఆమె అంటోంది.

వివేచించేవారై ఉండేందుకు నేర్చుకోండి

అవును, “మీరు విషయాలను దృష్టించే విధానం” మీరు మీ పరిస్థితికి ఎలా ప్రతిస్పందిస్తారనేదానికి ఎంతో సంబంధం ఉంది. రంగు కళ్ళద్దాలతో చూస్తే అన్నీ రంగురంగులుగా కనిపించినట్టే, మీ భావోద్వేగాలు మీకు కనిపించే విషయాలకు లేని రంగులను పులుముతాయి. భావోద్వేగ సంబంధంగా తల్లిదండ్రుల శ్రద్ధా మరియు ఆమోదాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. స్టీవన్‌ బాంక్‌, మైకల్‌ కాన్‌ అనే పరిశోధకులు గమనించిన విషయం ఏమిటంటే: “భిన్నమైన అభిప్రాయాలున్న తమ పిల్లల్నందరినీ సమానంగా చూడాలనే అసాధ్యమైన స్వప్నాన్ని నిజం చేయగలిగినప్పటికీ, తమ తల్లిదండ్రులు తమ తోబుట్టువుల్లో ఎవరో ఒకరిని ఎక్కువగా ఇష్టపపడుతున్నారన్న విషయం ప్రతి బిడ్డా గ్రహిస్తుంది.”

ఉదాహరణకు, మొదట్లో పేర్కొనబడిన ముగ్గురు యౌవనస్థులు చెప్పిన విషయాన్ని మరోసారి పరిశీలిద్దాం. వాళ్ళు తమ తోబుట్టువులన్న వాస్తవం మినహాయించి వారి పరిస్థితి నిరాశాజనకంగానే కనిపిస్తుంది! అవును, మిగతా వాళ్ళే ఎక్కువ అవధానాన్ని పొందుతున్నారనీ తాను నిర్లక్ష్యం చేయుబడుతుందనీ ప్రతి బిడ్డా భావిస్తుంది! తరచూ మనం విషయాలను గురించి కొంత అపార్థం చేసుకోవడం జరుగుతుంది. “శాంతగుణముగలవాడు వివేకముగలవాడు” అని సామెతలు 17:27 చెబుతుంది. వివేకముగలవారై ఉండేందుకు, మీరు విషయాలను గురించి ఉద్వేగంతో గాక, వాస్తవికంగాను, నిష్పక్షపాతంగానూ ఆలోచించాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్నందరినీ సమానంగా చూడకపోయినప్పటికీ, మీ అందరి శ్రేయస్సు విషయమై వారికి శ్రద్ధ ఉందని మీరు గ్రహించేందుకు వివేచన మీకు తోడ్పడుతుంది! దీన్ని గ్రహించడం మీరు కోపాన్నీ ద్వేషాన్నీ నివారించేందుకు మీకు తోడ్పడుతుంది.

న్యాయంగా చెందవలసిన అవధానాన్ని ఉద్దేశపూర్వకంగా చూపించనట్లు అనిపిస్తే అప్పుడేమిటి? మీరేమి చేయగలరు? ఈ విషయం తేజరిల్లు! భవిష్యత్తు సంచికలో పరిశీలించబడుతుంది.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b పక్షపాతంగా వ్యవహరించడాన్ని గురించి భవిష్యత్తులో ఒక శీర్షిక మరింత విపులంగా చర్చిస్తుంది.

[26వ పేజీలోని చిత్రం]

సమానంగా చూడకపోవడమనేది అన్యాయంగా కనిపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి