కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీలు 16-17
  • జంతువుల మగత నిద్రలోని రహస్యాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జంతువుల మగత నిద్రలోని రహస్యాలు
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిద్ర చాంపియన్‌లు
  • ‘ఎగురుతూ’ నిద్రపోవడమా?
  • నీటి అడుగున పగటినిద్ర
  • ఒక కన్ను తెరిచి ఉంచడం
  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం
    తేజరిల్లు!—1995
  • నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీలు 16-17

జంతువుల మగత నిద్రలోని రహస్యాలు

కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

నిద్ర—ఆ విశ్రమావస్థలో మనం మన జీవితకాలంలో మూడింట ఒక వంతు గడుపుతాం. నిద్ర అంటే సమయాన్ని వృధాపోనియ్యడం కాదు కానీ, అది అనేక ప్రాముఖ్యమైన శారీరక మానసిక అవసరాలను తీర్చుతుంది. కనుక నిద్ర దేవుడిచ్చిన విలువైన ఒక వరంగా దృష్టించవచ్చు.—కీర్తన 127:2 పోల్చండి.

జంతు ప్రపంచంలోనూ నిద్ర ముఖ్యమైన పాత్ర వహించడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి, అనేక జాతుల ప్రాణులు నిద్రపోయే విధానాలు ఆసక్తికరంగాను, ఒక్కోసారి తమాషాగాను, తరచూ అసాధారణంగానూ అనిపిస్తాయి. మనం కొన్ని ఉదాహణలను పరిశీలిద్దాం.

నిద్ర చాంపియన్‌లు

ఆఫ్రికాలో మిట్టమధ్యాహ్నం ఎండలో తన పంజాలను ఆకాశం వైపుకు ఎత్తి పెట్టి నిద్రపోతున్న సింహాన్ని చూసిన ఎవరైనా సరే, పిల్లిజాతికి చెందిన ఈ భయంకరమైన జంతువు పెంపుడు పిల్లిలా సాధువేనన్న నిర్ధారణకు రాగలరు. అయితే బాహ్య రూపం మోసపూరితమైనదే. 17వ శతాబ్దపు రచయితయైన థామస్‌ కాంపియన్‌ ఇలా వ్రాశాడు: “నిద్రిస్తున్న సింహాన్ని లేపగల ధైర్యస్థులెవరు?” అవును, బలమైన సింహానికి కూడా తన పరభక్షక జీవన విధానాన్ని కొనసాగించేందుకు రోజుకు దాదాపు 20 గంటల నిద్ర అవసరం.

బల్లిలా ఉండే నిద్రమత్తుగల జంతువైన ట్వాటారాను కూడా పరిశీలించండి. ఇది న్యూజీల్యాండ్‌లో కనిపించే జంతువు. ఇది దాదాపు ఆరు నెలలు మగత నిద్రలోనే ఉంటుంది. అది ఎంత సోమరిదంటే, అది ఆహారాన్ని నములుతూ నములుతూ నిద్రలోకి జూరుకుంటుంది కూడా! అయితే అంత నిద్రవల్ల దానికి కాస్త ప్రయోజనం ఉంది. కొన్ని ట్వాటారాలు 100 సంవత్సరాల వరకు కూడా జీవించగలవని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

రామాయణంలోని కుంభకర్ణునిలాగే ఇతర ప్రాణులు కూడా దీర్ఘకాలం నిద్రపోతాయి. మరనేక జంతువులు ఈ విధంగా చలికాలాన్ని తట్టుకుంటాయి. నిద్రకు సిద్ధపడుతూ, అది తన శరీరంలో పెద్ద పొరలుగా క్రొవ్వును కూడబెడుతుంది. అది దీర్ఘకాలం నిద్రపోతున్నప్పుడు ఆ క్రొవ్వు దానిని పోషిస్తుంది. అయితే, మగత నిద్రలో ఉండే జంతువు చలికి బిగుసుకుపోయి చనిపోవడాన్ని ఏది నివారిస్తుంది? ఇన్‌సైడ్‌ ది ఆనిమల్‌ వల్‌డ్‌ అనే పుస్తకం వివరిస్తున్నట్లు, చలికి బిగుసుకుపోవడాన్ని నివారించే సహజ పదార్థం జంతువు శరీరంలో తయారయ్యేలా దాని మెదడు రక్తంలో రసాయనిక మార్పులు కలిగేలా చూస్తుంది. ఈ ప్రాణి శరీరంలోని ఉష్ణోగ్రత చాలా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే, చివరికి దాని శరీర ఉష్ణోగ్రత చలికి బిగుసుకుపోయి చనిపోయే కనిష్ఠ ఉష్ణోగ్రతా స్థాయి కన్నా కొంచెమే ఎక్కువ ఉంటుంది. అలా దాని శరీర ఉష్ణోగ్రత తగ్గుతుండగా దాని గుండె కొట్టుకునే వేగం సాధారణ వేగం కన్నా తగ్గిపోతుంది. దాని శ్వాసప్రక్రియ మందగిస్తుంది. ఆ తర్వాత గాఢనిద్ర పడుతుంది. అలా ఆ నిద్ర అనేక వారాల వరకూ కొనసాగగలదు.

‘ఎగురుతూ’ నిద్రపోవడమా?

కొన్ని జంతువులు చాలా అసాధారణమైన రీతుల్లో నిద్రపోతాయి. సూటీటెర్న్‌ అని పిలువబడే సముద్ర పక్షినే తీసుకోండి. పిల్ల సూటీటెర్న్‌ తన గూటి నుండి బయలుదేరి సముద్రం వైపుకు ప్రయాణమై, తరువాత కొన్ని సంవత్సరాల వరకూ అలా ఎడతెగక ఎగురుతూనే ఉంటుంది! మిగతా సముద్రపక్షుల్లా తనకు వాటర్‌ప్రూఫ్‌ ఈకలూ, వ్రేళ్ళ మధ్య చర్మం గల పాదాలూ లేనందువల్ల సూటీ సముద్రపక్షి సముద్రంలో మునగదు. అది నీటి ఉపరితలంపై ఉన్న చిన్న చేపలను వేటాడి పట్టుకుంటుంది.

అయితే అది ఎప్పుడు నిద్రపోతుంది? “అవి సముద్రం మీదకు దిగితే వాటి ఈకలు తడిసి ముద్దయిపోతాయి కనుక, అవి సముద్రం మీద నిద్రపొయ్యే సాధ్యత లేదు. ఈ పక్షులు ఎగురుతున్నప్పుడే నిద్రపోతుండవచ్చని కొందరు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు” అని వాటర్‌, ప్రే, అండ్‌ గేమ్‌ బర్డ్స్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా అనే పుస్తకం చెబుతుంది.

నీటి అడుగున పగటినిద్ర

చేపలు నిద్రపోతాయా? ది వల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా అనే పుస్తకం ప్రకారం, సకశేరుక జీవుల్లో “సరీసృపాలూ, పక్షులూ, సస్తన జీవులూ మాత్రమే నిజంగా నిద్రపోతాయి, అలా నిద్రపోయేటప్పుడు వాటి మెదడులోని తరంగ నమూనాల్లో మార్పులు జరుగుతుంటాయి.” అలాగైనా కూడా చేపలు విశ్రాంతి తీసుకునే సమయాల్లో—అవి తమ కళ్ళను మూయలేకపోయినప్పటికీ కూడా—నిద్రపోగలుగుతాయి.

కొన్ని చేపలు ఒక ప్రక్కకు తిరిగి నిద్రపోతాయి; మరికొన్ని తలక్రిందులుగా లేదా నిటారుగా ఉండి నిద్రపోతాయి. ఫ్లౌండర్‌వంటి ఫ్లాట్‌చేపలు మేల్కొని ఉన్నప్పుడు సముద్రం అడుగుభాగాన ఉంటాయి. నిద్రపోయేటప్పుడు అవి అడుగుభాగానికి కొన్ని సెంటీమీటర్ల ఎత్తున తేలుతున్న భంగిమలో ఉంటాయి.

రంగుల పారట్‌ చేపకు అనుపమానమైన నిద్రపోయే అలవాటు ఉంది: ఇది “నైట్‌ గౌన్‌” వేసుకుంటుంది. అంటే విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినప్పుడు, అది శ్లేష్మద్రవాన్ని లేదా స్రావపు జిగటను స్రవిస్తుంది. అది దాని దేహాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. దాని ఉద్దేశమేమిటి? “పరభక్షకజీవులు [దాన్ని] కనుగొనకుండా ఉండాలన్నదే ఉద్దేశం అయ్యుండవచ్చు” అని ప్రకృతి రచయిత డగ్‌ స్టివార్ట్‌ చెబుతున్నాడు. అది మేల్కొన్నప్పుడు తన జిగట వస్త్రాన్ని తొలగించేసుకుంటుంది.

సీల్‌ల నిద్ర అలవాట్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అవి తమ గొంతును బెలూన్‌లలా గాలితో ఉబ్బిస్తాయి. అలా అవి ఒక రకం సహజ రక్షక కవచాలను సృష్టిస్తాయి. ఈ విధంగా అవి తేలుతూ ఉంటాయి. శ్వాసప్రక్రియ కొరకు తమ ముక్కును నీటి ఉపరితలం వైపుకు ఉంచి నీళ్ళలో నిటారుగా తేలుతూనే నిద్రపోగలుగుతాయి.

ఒక కన్ను తెరిచి ఉంచడం

నిజమే, అరణ్యంలో నిద్రపోయే జంతువులు పరభక్షక జీవులకు ఎరయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అనేక ప్రాణులు ఒక కన్ను తెరిచే ఉంచాయా అన్నట్లు నిద్రపోతాయి. అవి నిద్రపోయేటప్పుడు వాటి మెదళ్ళు కొంత మేరకు అప్రమత్తంగానే ఉంటూ అపాయాన్ని సూచించే శబ్దం ఏమైనా వినబడితే అవి ప్రతిచర్య తీసుకునేందుకు ఆస్కారమిస్తాయి. అయితే మరితర ప్రాణులు క్రమంగా అప్పుడప్పుడు భద్రతా పరిశీలనలు చేస్తూ అపాయాలను తప్పించుకుంటాయి. ఉదాహరణకు, ఒక గుంపుగా నిద్రించే పక్షులు అప్పుడప్పుడు ఒక కన్ను తెరిచి అపాయమేమైనా పొంచి ఉందా అని తొంగి చూస్తాయి.

ఆఫ్రికాలోని ఆన్‌టిలోప్‌ లేదా జీబ్రా వంటి వాటి గుంపులు విశ్రమ వేళల్లో ఒకదానికొకటి కాపలా ఉంటాయి. కొన్నిసార్లు గుంపంతా కూడా నేలమీద నిలబడి విశ్రాంతి తీసుకుంటూనే తమ తలలను పైకెత్తి ఉంచి అప్రమత్తంగా ఉంటాయి. గుంపులోని ఒక్కొక్కటీ నియత సమయాన, వంతుల ప్రకారం ప్రక్కకు ఒరిగి, నేల మీద విశ్రాంతిగా పడుకుని, గాఢ నిద్ర పోతాయి. కొన్ని నిమిషాల తర్వాత, మరొకటి తన వంతు తీసుకుంటుంది.

అలాగే ఏనుగులు కూడా ఒక గుంపుగా నిద్రపోతాయి. అయితే, పెద్ద ఏనుగులు సాధారణంగా నిలబడే కొద్దిగా నిద్రపోతూ, అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తూ, అపాయాన్ని సూచించే శబ్దాలను వినేందుకు తమ పెద్ద చెవులను రిక్కిస్తూ, విశాలంగా తెరుస్తూ ఉంటాయి. ఈ పెద్ద కాపలాదారుల నీడన చిన్న ఏనుగు పిల్లలు ప్రక్కన పడుకుని గాఢనిద్రలోకి జారుకుంటాయి. “మొదట పిల్ల ఏనుగులు, ఆ తర్వాత వాటి కన్నా పెద్ద ఏనుగులు, ఆ తర్వాత పెద్ద ఆడ ఏనుగులు పడుకుని గాఢంగా నిద్ర పోతాయి. వెన్నెలలో అవి పెద్దగా గుండ్రంగా ఉన్న బూడిద రంగు బండల్లా కనిపించాయి. అయితే వాటి దీర్ఘమైన, ప్రశాంతమైన గురక నేను అపార్థం చేసుకున్నానని తెలిపాయి” అని ఎలఫెంట్‌ మెమరీస్‌ అనే తన పుస్తకంలో ఏనుగుల గుంపంతా కూడా నిద్రపోవడాన్ని తాను చూసిన విషయాన్ని సిన్‌ధీయ మాస్‌ జ్ఞాపకం చేసుకుంటుంది.

జంతువుల నిద్ర అలవాట్లను గురించి మనం తెలుసుకోవలసినది చాలా ఉంది. కానీ, మనకు తెలిసిన కొద్దిపాటి సమాచారాన్ని గురించి ఆలోచించినప్పుడు, “సమస్తమును సృష్టించిన”వాని సంభ్రమాశ్చర్యాలను కలిగించే జ్ఞానాన్ని గురించి ఆలోచించేందుకు మీరు కదిలించబడడం లేదా?—ప్రకటన 4:11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి