కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీలు 18-19
  • పాదాల నొప్పికి నివారణోపాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాదాల నొప్పికి నివారణోపాయం
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమరిక, ఫ్యాషను, పాదాలు
  • షాపింగ్‌ చిట్కాలు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీలు 18-19

పాదాల నొప్పికి నివారణోపాయం

“నా పాదాలు నన్ను చంపేస్తున్నాయి!” స్పష్టంగా ఆ మాట అతిశయోక్తిగా ఉంది. అయినప్పటికీ, పాదాల నొప్పి అనే సమస్య అమెరికాలో ఎంత గంభీరమైనదో, అక్కడ వేలాదిమంది పాదాలనిపుణులు చక్కని వ్యాపారం చేయడాన్ని చూస్తే అర్థమౌతుంది.

14 సంవత్సరాల కాలంలో తాను చేసిన 2,000కుపైగా పాదాల ఆపరేషన్లను పునరావలోకనం చేసిన తర్వాత ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అయిన డా. మైకేల్‌ కాలిన్‌ సంభ్రమపర్చే ఒక విషయాన్ని కనుగొన్నాడు. “అసంభవం అన్పించే రీతిలో దాదాపు నేను చేసిన ఆపరేషన్లన్నీ స్త్రీలకు చేసినవేనని నేను కనుగొన్నాను” అన్నాడాయన. ప్రాముఖ్యంగా స్త్రీలే పాదాల సమస్యలకు ఎందుకు లోనౌతుంటారు?

అమరిక, ఫ్యాషను, పాదాలు

356 మంది స్త్రీలపై జరిపిన ఒక సర్వేలో, 10 మంది స్త్రీలలో దాదాపు 9 మంది సగటున తమ పాదాల పరిమాణంకన్నా మరీ సన్నగా ఉన్న సైజు షూలను వేసుకుంటున్నట్లు తెలిసింది! సమస్యలో కొంతభాగం స్త్రీల షూల తయారీలో ఉంది. “షూ తయారీదార్లు సన్నని మడిమెను, వెడల్పైన ముందరిపాదాన్ని తయారు చేయగల లాస్ట్‌లను ఇక ఎంతమాత్రం ఉపయోగించడం లేదు” అని ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అయిన ఫ్రాన్సెస్కా థాంప్సన్‌ వివరిస్తుంది.a

ఆ విధంగా, దుకాణంలో షూలను వేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు చాలామంది స్త్రీలు ముందరి భాగం బాగానే అమరుతుండగా, మడిమె వదులుగా ఉంటున్నట్లు కనుగొంటారు; కానీ మడిమె సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ముందరిభాగం బిగుతుగా ఉంటుంది. ఇతరులు ముందరిభాగం బిగుతుగా ఉండి మడిమె సౌకర్యంగా ఉన్న షూలను ఎంపిక చేసుకుంటారు, లేకపోతే అడుగడుక్కీ తమ మడిమె బయటికి వచ్చేయడం తప్పనిసరి అవుతుంది.

పాదం ముందరిభాగాన్ని షూలోని సన్నని ప్రాంతంలోనికి బలవంతంగా దూర్చడం అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ డిజైనర్లు షూ మడిమెను కొన్ని సెంటీమీటర్లు ఎత్తు చేయడంతో సమస్య ఇంకా ఘోరంగా తయారౌతుంది. ఇదొక ఫ్యాషన్‌గా పరిగణించబడినా, మడిమె ఎత్తుగా ఉంటే అప్పుడు ఒత్తిడి అంతా బొటనవ్రేలి క్రిందిభాగంపైన పడుతుంది, అంతేగాక ఇది పాదాన్ని అప్పటికే బహుశ చాలా సన్నగా ఉన్న కాలివ్రేళ్ల ప్రాంతంలోనికి బలవంతంగా దూర్చుతుంది. “ఆరోగ్యకరమైన, ఎత్తు-మడిమె షూ అంటూ ఏమీ లేదు” అని పోడియాట్రిస్ట్‌ అయిన డా, డేవిడ్‌ గేరట్‌ అంటున్నాడు. ఎత్తు-మడిమె షూలు చివరికి వాటిని వేసుకునేవారి పాదాలకు, చీలమండలకు, మోకాళ్ల వెనుకభాగాలకు, వీపుకు నష్టాన్ని కలుగజేస్తాయని కొంతమంది అంటారు. అవి కాళ్ల కండరాలను, స్నాయుబంధనాలను కురచ చేయగలవు కూడా, ఇది ప్రాముఖ్యంగా పరుగుపందేల్లో పాల్గొనేవారు తీవ్రమైన గాయాలకు లోనయ్యేలా చేస్తుంది.

స్త్రీల పాదం దానికి తగిలే దెబ్బలకు అనుగుణంగా మారదు. నిజానికి, సంవత్సరాలు గడిచేకొలది పాదం ముందరి భాగం మాత్రమే వెడల్పు అవుతుంది—చివరికి ఒక వ్యక్తి యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాత కూడా. కానీ మడిమె విషయంలో అలా జరగదు. “మడిమెలో ఒకే ఎముక ఉంటుంది, అది 14 ఏళ్ల వయస్సులో ఎంత సన్నగా ఉందో 84 ఏళ్ల వయస్సులో కూడా అంతే సన్నగా ఉంటుంది” అని డా. థాంప్సన్‌ అంటుంది. ఇది ఒక స్త్రీ తన మడిమె నుండి కాలివ్రేళ్ల వరకు సౌకర్యవంతంగా అమిరే షూను కనుగొనడం మరింత కష్టతరం అయ్యేలా చేస్తుంది.

షాపింగ్‌ చిట్కాలు

తమ షూల అమరిక, ఫ్యాషను తమకే విరుద్ధంగా పనిచేస్తుండగా, స్త్రీలు పాదాల నొప్పిని ఎలా నివారించగలరు? జవాబు షూ దుకాణంతో ప్రారంభమౌతుంది. కొంతమంది నిపుణులు ఈ క్రిందివాటిని సిఫారసు చేస్తారు:

• సాయంత్రాల్లో కొనుగోలు చేయండి, అప్పుడు మీ పాదాలు కాస్త పెద్దవౌతాయి.

• రెండు షూలనూ వేసుకుని ప్రయత్నించండి—ఒక్కదాన్ని మాత్రమే కాదు.

• మడిమె సరిగ్గా కూర్చుందనీ, కాలివ్రేళ్ల ప్రాంతం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు సరిపడినంత ఉందనీ నిశ్చయపర్చుకోండి.

• దుకాణంలో పరుపులాంటి తివాచీ ఉన్నట్లైతే, సరిగ్గా అమరని షూలు కూడా కాస్సేపు సౌకర్యవంతంగానే ఉన్నట్లు అనిపిస్తాయి.

• పేటెంట్‌ లెదర్‌తో, లేక సింథటిక్‌ పదార్థాలతో తయారైన షూలను తీసుకోకండి. అటువంటి పదార్థాలు, సున్నితమైన తోలు లేక స్యూడ్‌కు వలె మీ నడకకు అనువుగా మారవు.

• మీరు ఎత్తు-మడిమె ఉన్న షూలను కొనుక్కుంటే, మరింత మెత్తగా ఉండడానికి లెదర్‌ అట్టలు పెట్టి ప్రయత్నించండి. ఎత్తు-మడిమె ఉన్న షూలను రోజులో కొంత సమయం మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి, అప్పుడప్పుడు తక్కువఎత్తు-మడిమె ఉన్న షూలను వేసుకుంటూ ఉండండి.

పైనున్నవాటికి తోడు, షూలను కొనుక్కునేటప్పుడు అవి సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోండి. చాలామంది నమ్మేదానికి విరుద్ధంగా, కరుకుదనం తగ్గే సమయం అంటూ ఏమీ లేదు. “షూ కొరుకుతున్నట్లు అనిపిస్తుంటే మీరు కాస్త వాడిన తర్వాత ఆ కరుకుదనం పోతుంది అని దుకాణదారుడు మిమ్మల్ని నమ్మించేందుకు ఎన్నడూ అనుమతించవద్దు” అని డా. కాలిన్‌ హెచ్చరిస్తున్నాడు. “చివరికి హానికలిగేది మీ పాదానికే.”

కానీ బిగుతైన ముందరిభాగము, సౌకర్యవంతమైన మడిమె లేదా సౌకర్యవంతమైన ముందరిభాగము, వదులైన మడిమె ఈ రెండూ తప్పించి వేరుదారి లేనప్పుడు ఏమి చేయాలి? పోడియాట్రిస్ట్‌ అయిన డా. అన్నూ గోయెల్‌, సరిచేయడానికి ఏది సులభంగా ఉంటుందో మీరు నిర్ణయించుకోవాలని అంటుంది. “ఇది చేయడానికి రెండు మార్గాలున్నాయి” అంటుందామె. “మొదటిగా, మీరు ముందరిభాగం సరిపడినంత వెడల్పుగా ఉన్న షూలను కొనుక్కుని, మడిమె సరిగ్గా కూర్చోవడానికి మెత్తని అట్టలను చొప్పించాలి. . . . రెండవ ఉపాయం ఏమంటే మడిమె సరిగ్గా ఉన్న షూలను కొనుక్కుని ముందరిభాగం వెడల్పు ఎక్కువ చేయించుకోవాలి. కానీ ఇది సాధారణంగా లెదర్‌తో చేసిన షూల విషయంలోనే పనిచేస్తుంది.”

చాలామంది స్త్రీలు రోజుకి దాదాపు 15 కిలోమీటర్లు నడుస్తారని అంచనా వేయబడుతుంది, గనుక వారు తమ పాదరక్షలను పరీక్ష చేయడం మంచిది. అమెరికన్‌ హెల్త్‌ పత్రిక చెబుతున్నట్లుగా, “పాదాలపట్ల మరింత మర్యాదకరంగా ప్రవర్తిస్తే—ప్రత్యేకంగా సరిగ్గా అమరే షూలను వేసుకోవడం ద్వారా—మీరు పాదాలకు వచ్చే సమస్యలలో చాలామట్టుకు అసలు రాకుండానే నివారించవచ్చు.”

[అధస్సూచీలు]

a “లాస్ట్‌” అనేది షూలను తీర్చిదిద్దేందుకు ఉపయోగించే పాదం ఆకారంలో ఉన్న వస్తువు.

[18వ పేజీలోని బాక్సు]

పాదాలకు సంబంధించి నాలుగు సాధారణ సమస్యలు

మడిమెశూలలు. మడిమెశూల కాలి బొటనవ్రేలి క్రింద కలిగే వాపు. ఇది వంశానుగతం కానప్పుడు మడిమెశూలలు బిగుతైన లేదా ఎత్తు-మడిమె షూలు వేసుకోవడం ఫలితంగా వచ్చివుండవచ్చు. వేడి పెట్టడం లేక ఐసు పెట్టడం నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలదు, కానీ మడిమెశూలను శాశ్వతంగా తీసివేయడానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

హేమర్‌టోలు. క్రిందివైపుకి వంపు తిరిగి ఉన్న కాలివ్రేళ్లు, బహుశ పాదం ముందరిభాగంపై ఎక్కువ ఒత్తిడి పెట్టే షూల మూలంగా ఏర్పడుతుండవచ్చు. ఈ అనాకారాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరమౌతుండవచ్చు.

ఆనెలు. రాపిడివల్లా, ఒత్తిడివల్లా కాలివ్రేళ్లపై శంకువు ఆకారంలోని వాపులు, వస్తాయి, కొన్నిసార్లు మరీ సన్నగా ఉన్న షూలను వేసుకోవడం వలన ఏర్పడతాయి. గృహచిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వవచ్చు, కానీ రాపిడిని కలిగించే ఆకారాన్ని కోల్పోయిన వ్రేళ్లను సరిచేయడానికి సాధారణంగా శస్త్రచికిత్స అవసరమౌతుంది.

కేలస్‌లు. దళసరియైన చచ్చిపోయిన చర్మపు పొరలు పాదాన్ని మళ్లీ మళ్లీ ఏర్పడే రాపిడి నుండి కాపాడుతాయి. ఎప్సమ్‌ లవణం కలిపిన వెచ్చని నీటిలో నానబెట్టడం వాటిని మెత్తబర్చగలదు. కానీ వాటిని కోసివేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్‌ను ఆహ్వానించవచ్చు.

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

The Complete Encyclopedia of Illustration/ జె. జి. హెక్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి