కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీలు 12-15
  • డౌన్‌ అండర్‌ జీవితం భిన్నంగా ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డౌన్‌ అండర్‌ జీవితం భిన్నంగా ఉంది
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యూరప్‌వారు నివాసాల్ని స్థాపించడం
  • ప్రజలు కూడా భిన్నంగా ఉన్నారు
  • డ్రైవింగ్‌—ఓ పెద్ద తేడా
  • వాతావరణ సరళిలో తేడాలు
  • ఇతర తేడాలు
  • విస్తారమైన బహిరంగ స్థలాలు
  • ముచ్చటైన కోలా ముగ్ధులను చేస్తుంది
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీలు 12-15

డౌన్‌ అండర్‌ జీవితం భిన్నంగా ఉంది

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

“డౌన్‌ అండర్‌” అనేది ఇటీవలి సంవత్సరాల్లో చాలామందికి పరిచయమైన ఒక ఇంగ్లీషు మాట. కానీ దేనికి అండర్‌? అది భూమధ్య రేఖకు దిగువన అంటే దాని క్రిందనున్న దేశాలను సూచిస్తుంది. పారిభాషిక భావంలో దక్షిణార్ధగోళంలోని దేశాలన్నింటినీ “డౌన్‌ అండర్‌” అనే మాటతో పిలువవచ్చు. అయితే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ దేశాలు మాత్రమే సాధారణంగా ఆ విధంగా పిలువబడతాయి. ఈ శీర్షిక ప్రధానంగా ఆస్ట్రేలియాపైన దృష్టి నిలుపుతుంది. ఆస్ట్రేలియా అనే ఈ పేరు, “దక్షిణ” అని అర్థం ఇచ్చే ఆస్ట్రేలిస్‌ అనే లాటిన్‌ పదం నుండి వచ్చింది.

ఆస్ట్రేలియాలోని జీవితం ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లోని జీవితంకంటే భిన్నంగా ఉంటుంది. దాని భౌగోళిక స్థానం మాత్రమే దాన్ని భిన్నమైందిగా చేయడం లేదు. సందర్శకులు అక్కడ ఇంకా అనేక భిన్నవిషయాలను గమనిస్తారు.

యూరప్‌వారు నివాసాల్ని స్థాపించడం

1788లో, సూర్యతాపం అధికంగా ఉండే ఈ విశాల దేశంలో యూరప్‌వారు నివాసాల్ని స్థాపించడం ప్రారంభించారు. ఫస్ట్‌ ఫ్లీట్‌ అనే పేరుగల ఓడల సముదాయం ఒకటి సిడ్నీ కోవ్‌లోనికి ప్రవేశించింది. వాటిలోని ప్రయాణికుల్లో అనేకమంది ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్‌లాండ్‌ దేశాల నేరస్థులే, వీరు తమతోపాటు ఇంగ్లీషు భాషను ఇక్కడకు తెచ్చారు. ఆ తర్వాత 150 సంవత్సరాల వరకు వలస వచ్చినవారిలో అనేకమంది బ్రిటీష్‌ దేశస్థులే.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, వలస సరళి మారింది. నేడు, వివిధ దేశాల్లోనుండి వచ్చిన వేలాదిమంది “క్రొత్త ఆస్ట్రేలియన్లు” ఉన్నారు, వీరిలో అత్యధికులు ఇటలీ గ్రీసు దేశాలనుండి వచ్చారు. వలసదారులు ఆస్ట్రేలియా జీవిత విధానానికి మరింత వైవిధ్యాన్ని చేకూర్చి, తమ స్వంత భాషలను, విలక్షణమైన ఇంగ్లీషు ఉచ్ఛారణను, తమ వంటల్నీ సంస్కృతుల్నీ తమతోపాటు తెచ్చారు.

ఇక్కడ వినబడే వైవిధ్యమైన యాసలకు ఇది కారకమైంది. కానీ ఎన్నో తరాలపాటు ఇక్కడ నివసించిన కుటుంబాల్లోని వారు మాట్లాడే ఇంగ్లీషు భాషలో కూడా ఒక విలక్షణమైన యాస ఉంది. ఇంగ్లీషు అచ్చులైన ఎ, ఇ, ఐ, ఓ, యులు ఆస్ట్రేలియా ఉచ్ఛారణకు వచ్చేసరికి సాగదీసినట్లు, తరచు అస్పష్టంగాను ధ్వనిస్తాయి, అందుకని భేదాల్ని కచ్చితంగా గుర్తించడానికి కాస్త సమయం పట్టవచ్చు. అంతేకాదు, ఆస్ట్రేలియాకు మాత్రమే స్వంతమైన మాటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, రాత్రైనా లేక పగలైనా రోజులో అది ఏ సమయమైనా, “గుడ్‌ మార్నింగ్‌” అనో లేక “గుడ్‌ ఈవెనింగ్‌” అనో అనడానికి బదులుగా స్నేహపూర్వకంగా “గుడ్డేయ్‌, మేట్‌” అని పలకరించడం ఇక్కడ అంగీకారయుక్తమైన అభివాదం! తరచు దీని తర్వాత అవతలి వ్యక్తి ఆరోగ్యం గురించి మర్యాదపూర్వకంగా అడిగి, తర్వాత సందర్శకుడిని “హౌ యర్‌ గోయ్‌న్‌, మేట్‌, ఓర్రైట్‌?” అని పలకరిస్తారు.

ప్రజలు కూడా భిన్నంగా ఉన్నారు

ఎత్తుపల్లాలుగల ఈ దేశంలో మనుగడ సాగించాలంటే పరిస్థితులకు అనుకూలంగా మారడమూ బలమైన వ్యక్తిత్వమూ అవసరమౌతాయి. ఇది అనేకమంది ఆస్ట్రేలియావాసులకు ఉన్న ఆశావాదానికి కారణం ఏమిటో వివరించవచ్చు, ఈ ఆశావాదంలో నుండే “షి’ల్‌ బి రైట్‌, మేట్‌!” అన్న మాట ఉత్పన్నమౌతుంది. దీనర్థం పరిస్థితులు ఘోరంగా తయరైనప్పుడు ఆ వ్యక్తి అంతగా చింతించాల్సిన పనిలేదని, చివరికి అంతా సక్రమంగానే జరుగుతుందని భావం.

ది ఆస్ట్రేలియన్స్‌ అనే ప్రచురణకు ముందుమాట ఇలా అంటుంది: “సంకెళ్లలో తన జీవాన్ని ప్రారంభించి, రెండు వందల సంవత్సరాలకల్లా అత్యంత శక్తివంతమైన, అత్యంత సమృద్ధమైన చిన్న దేశాల్లో ఒకటిగా తయారైన దేశం కాస్త ఆకర్షణీయమైన, వైవిధ్యంగల లక్షణాల్ని ఉత్పత్తి చేయాలన్నది సహేతుకమే. ఈ విలక్షణాల కలయిక ఫలితమే . . . ది ఆస్ట్రేలియన్స్‌.”

వివాహబంధాల్లోని దృఢత్వం అనేది, గత రెండు శతాబ్దాల్లో మనుగడ సాగించడానికి సంబంధించి అభివృద్ధిచెందిన ఒక బలమైన అంతర్బుద్ధి మూలానే ఏర్పడిందని అనేకమంది ఆస్ట్రేలియన్లు తలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియన్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలవైపుకి అవధానాన్ని మళ్లించడానికి వారు ఇష్టపడతారు. న్యూజీలాండ్‌ సైన్యంతోపాటు, ఈ బలిష్ఠమైన సైనిక దళాలు ఆన్‌జాక్‌లు అని పిలువబడ్డాయి, ఇది ఆస్ట్రేలియా అండ్‌ న్యూజీలాండ్‌ ఆర్మీ కార్ప్స్‌ యొక్క సంయుక్త సైన్యానికి సంక్షిప్తనామం. వీరు “డిగ్గర్స్‌” (త్రవ్వేవారు) అనే పేరుతో కూడా ప్రసిద్ధిగాంచారు, కానీ ఇది వారు యుద్ధభూమిలో కందకాలను త్రవ్వడాన్ని సూచిస్తుందో లేకపోతే అనేకమంది 1800లలో ఆస్ట్రేలియాలోని బంగారు గనులను త్రవ్వడాన్ని సూచిస్తుందో అనిశ్చితంగా ఉంది.

డ్రైవింగ్‌—ఓ పెద్ద తేడా

వాహనాలు రోడ్డుకు కుడివైపున ప్రయాణించే దేశాల నుండి వచ్చిన సందర్శకులకు ఆస్ట్రేలియాలోని డ్రైవింగ్‌ చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేశమంతటా, వాహనాలు రోడ్డుకు ఎడమవైపున ప్రయాణిస్తాయి.

అందుకని మీరు సాధారణంగా రైట్‌-హాండ్‌ డ్రైవింగ్‌ ఉన్న దేశం నుండి ఆస్ట్రేలియా సందర్శించడానికి వెళ్లినప్పుడు, రద్దీగావున్న రోడ్డును దాటడానికి మీరు వేసే తొలి అడుగులు మీకు ప్రమాదాన్ని తీసుకురావచ్చు. మీ మనస్సుల్లో లోతుగా పాతుకుపోయి ఉన్న: ‘ఎడమకు చూడు, తర్వాత కుడికి చూడు, అటుతర్వాత మళ్లీ ఎడమకు చూడు’ అన్న రోడ్డు దాటే పద్ధతి ప్రమాదానికి దారితీయవచ్చు. ఇప్పుడైతే మీరు రోడ్డు దాటడానికి ముందు, ‘కుడికి చూడు, తర్వాత ఎడమకు చూడు, అటుతర్వాత మళ్లీ కుడికి చూడు’ అని ఆలోచించాలి. అరె, బాగానే చేశారే! మీరు చాలా త్వరగా నేర్చుకుంటున్నారు. అయ్యయ్యో! మీరు కారుకి అవతలివైపు నుండి ఎక్కేశారు. ఈ దేశంలో డ్రైవరు కారుకి కుడివైపున కూర్చుంటాడన్న విషయం మీరు మర్చేపోయారు!

వాతావరణ సరళిలో తేడాలు

ఉత్తరార్ధగోళంతో పోల్చుకుంటే డౌన్‌ అండర్‌లో ఋతువులు ముందువెనుకలౌతాయి. వెచ్చని పొడిగాలులు ఉత్తరదిశనుండి, వాయవ్యదిశనుండి వీస్తాయి, అయితే శీతల మార్పులన్నీ దక్షిణం నుండే వస్తాయి. శీతలాన్ని తీసుకువచ్చే ఉత్తర గాలుల ప్రస్తావన ఇక్కడ అసలు వినబడదు, కానీ వణుకుపుట్టించే దక్షిణదిశగా వచ్చే ఆకస్మిక పెనుగాలుల విషయంలోనూ అవి తెచ్చే చల్లదనమూ, బహుశ మంచు లేక మంచు తుఫానుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి.

భూమ్మీద అత్యంత పొడియైన, అత్యధిక ఉష్ణోగ్రతగల ఖండం ఆస్ట్రేలియా, ఈ ఖండం అంతర్భాగ పొడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. నమోదు చేయబడిన అత్యధిక ఉష్ణోగ్రత 53.1 డిగ్రీల సెల్సియస్‌. ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన, స్నోయీ పర్వతాల ప్రాంతంలోని మౌంట్‌ కోసియోస్కోవద్ద అత్యల్ప ఉష్ణోగ్రత -22 డిగ్రీలుగా నమోదు చేయబడింది.

ఉత్తరార్ధగోళ ప్రమాణాలను బట్టి చూస్తే ఇక్కడ అంత చలి ఉండదు. ఉదాహరణకు, విక్టోరియా రాష్ట్రానికి రాజధానియైన మెల్‌బోర్న్‌నే తీసుకోండి. ఈ నగరం పూర్తిగా దక్షిణంగా ఉన్నప్పటికీ, జూలై నెలలోని సగటు పగటి ఉష్ణోగ్రత 6 నుండి 13 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. దీన్ని జనవరి నెలలో, చైనాలోని బీజింగ్‌లో ఉండే -10 నుండి +1 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతతోనూ, లేక న్యూయార్క్‌లో ఉండే -4 నుండి +3 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతతోనూ పోల్చండి. మెల్‌బోర్న్‌ భూమధ్య రేఖకు ఎంత దూరంలో ఉందో ఈ రెండు నగరాలు కూడ భూమధ్య రేఖకు దాదాపు అంతే దూరంలో ఉన్నాయి. డౌన్‌ అండర్‌ ఎందుకు అంత వేడిగా ఉంటుంది, అది కూడా భూమ్మీద అతి శీతల ప్రాంతమైన అంటార్కిటికాకు అంత దగ్గరగా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఎందుకంత వేడిగా ఉంటుంది?

తేడా ఏమిటంటే ఉత్తరార్ధగోళంలో భూభాగాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ దక్షిణార్ధగోళంలో సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల చుట్టూ వేలాది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో సముద్రం ఉంది, ఇది శీతల అంటార్కిటిక్‌ గాలులను నిరోధిస్తూ వెచ్చని గాలులతో కూడిన ఒక పొరను సృష్టిస్తుంది, ఆ విధంగా వాతావరణం వేడిగా ఉంటుంది.

ఆస్ట్రేలియా ఖండం పరిమాణంలో పెద్దది కావడం మూలాన వివిధ ప్రాంతాల్లో ఉండే వాతావరణ మార్పులు గమనార్హంగానే ఉంటాయి. మరీ దక్షిణంగా ఉన్న రాష్ట్రాల్లో ఋతువులు ప్రస్ఫుటముగా ఉంటాయి, చలికాలంలో నిర్మలమైన, చల్లని, లేదా అతి శీతలమైన రాత్రిళ్లు, తర్వాత ఆహ్లాదకరమైన వెచ్చని పగటి సమయాలు ఉంటాయి. చలికాలంలోని ఆహ్లాదకరమైన ఈ పగటి సమయాలు తరచు ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లో ఉండే వేసవి తాపాన్ని పోలివుంటాయి. అయితే, ఆస్ట్రేలియాలోని ఉత్తర రాష్ట్రాల్లో మాత్రం సంవత్సరంలో కేవలం రెండు ఋతువులే ఉంటాయి—ఒకటి సుదీర్ఘమైన పొడి ఋతువు, మరొకటి ఋతుపవనాలతో వచ్చే వర్ష ఋతువు. నార్ద్రన్‌ టెరిటరీ రాజధానియైన డార్విన్‌లోని ఉష్ణోగ్రత సంవత్సరం పొడవునా దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌కు అటుఇటుగా ఉంటుంది.

ఇతర తేడాలు

ఈ ఖండంలోని అధిక భాగంలో ఎక్కువగా వేడి వాతావరణం ఉండడం వలన ఆస్ట్రేలియా ప్రజలు సాధారణ దుస్తులే ఎక్కువగా ధరిస్తారు. కానీ వెడల్పైన అంచు ఉన్న టోపీ ధరించడం ప్రాముఖ్యం. సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం కావడం మూలాన చర్మ క్యాన్సరు వచ్చే ప్రమాదం, ఉష్ణమండల దేశాల్లోకన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది.

ఆస్ట్రేలియాలో ఇంకా విస్తారమైన బహిరంగ ప్రదేశాలు ఉండడం మూలాన అవుట్‌డోర్‌ బార్‌బెక్యూ సౌకర్యాలతో చాలా పిక్‌నిక్‌ ప్రాంతాలు వెలిశాయి. మాంసం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చౌకగానే ఉంటుంది, అందుకని సాసేజ్‌లు, స్టేక్‌లు ఇక్కడి బార్‌బెక్యూలలో తప్పక ఉంటాయి. కానీ అదేమిటి ఆ అవుట్‌డోర్‌ బార్‌బెక్యూ చుట్టూ నిలబడి ఉన్న ప్రజలు ఒకరినొకరు చేతులతో రహస్య సైగలు చేసుకుంటున్నారా? లేదు, వాళ్లు తమ చేతులతో ఈగల్ని తోలుకుంటున్నారు అంతే! ఈగలు, దోమలు ఈ అవుట్‌డోర్‌ భోజనాలకు సమస్యను సృష్టిస్తుంటాయి, ప్రాముఖ్యంగా వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు.

అందుకని డౌన్‌ అండర్‌లో జీవించడం అంటే అర్థం ఈగలు, దోమలతో కలిసి జీవించడాన్ని నేర్చుకోవడం అన్నమాట, చాలా ఇళ్లలో ముందూ వెనుకా తెరల తలుపులు ఉంటాయి. పూర్వం, ఈగల్ని తోలే సాధనాలుగా పనిచేయడానికి టోపీల అంచుల నుండి ముఖాల చుట్టూ బెరడు ముక్కలు వ్రేలాడుతుండేవి. కీటక నిరోధకాలు రావడంతో అటువంటి టోపీలు ఇక అంతగా కన్పించడంలేదు.

మరొక తేడా ఏమిటంటే, అద్భుతమైన రంగురంగుల పూలకూ, పూపొదలకూ, చెట్లకూ సంబంధించినదే. ఉత్తరార్ధగోళంలో సాధారణంగా ఉండే ఘాటైన పరిమళం ఇక్కడ ఉండదు. ఇక్కడ, తోటలంటే మక్కువ చూపించేవారు పువ్వుల పరిమళాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు తమ ముక్కులను వాటికి దగ్గరగా పెట్టి ఆఘ్రాణించాలి. అయితే ఇది ఆస్ట్రేలియాలోని అన్ని పూల విషయంలో వాస్తవం కాదు. ఉదాహరణకు డాఫ్నే పూపొదలు, మల్లెలు మీ నాసికలకు అద్భుతమైన రీతిలో పరిమళాలు వెదజల్లుతాయి. కానీ సాధారణంగా చూస్తే ఇక్కడి పువ్వులు చల్లని వాతావరణంలో ఉండే వాటికన్నా తక్కువ పరిమళాల్ని వెదజల్లుతుంటాయి.

విస్తారమైన బహిరంగ స్థలాలు

స్థలం అనేది డౌన్‌ అండర్‌లోని జీవితాన్ని నిజంగానే భిన్నమైందిగా చేస్తుంది. ఉత్తరంలోని చాలా దేశాల్లో ఫలానా ప్రాంతం దగ్గరగా ఉంది లేక చాలా దూరంగా ఉంది అన్న భావన ఇక్కడ చాలా తేడాలతో ఉంటుంది. కొన్ని పట్టణాల మధ్య దూరాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే, కొన్నిసార్లు ఒక పట్టణం నుండి మరొక పట్టణం చేరుకోవడానికి అనేక గంటలు ప్రయాణించవల్సి వస్తుంది. ఇది ప్రాముఖ్యంగా వలససీమలు అని అనురాగంగా పిలుచుకునే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సువిశాలమైన స్థలాల్లో, అవధుల్లేని ప్రశాంతతను అనుభవించవచ్చు, కాలుష్యరహిత తాజా గాలిని తమ గుండెల నిండా పీల్చుకోవచ్చు. దగ్గర్లోనే ఒక యూకలిప్టస్‌ వృక్షం ఉంది, దీన్ని సాధారణంగా జిగురు చెట్టు అని పిలుస్తారు. జిగురు చెట్లు, వాటిల్‌ లేదా అకేసియా చెట్లు ఈ ఖండంలోని లోపలి భాగాల్లో ఎక్కువగా ఉంటాయి.

సాయం సమయం సమీపిస్తుండగా, అద్భుతమైన సూర్యాస్తమయం మీ నయనాలను రంజింపజేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా చీకటి అకస్మాత్తుగా ఆవరిస్తుంది, ఎందుకంటే డౌన్‌ అండర్‌లో సంధ్యవెలుగు చాలా తక్కువగా ఉంటుంది. వెంటనే, దక్షిణార్ధగోళం నుండి కనబడే రాత్రి సమయపు ప్రకాశమానమైన స్పష్టమైన ఆకాశం అసంఖ్యాకమైన నక్షత్రాల్ని బయల్పరుస్తుంది, వీటిలో సదరన్‌ క్రాస్‌ అని పిలువబడే ప్రసిద్ధమైన నక్షత్ర సమూహం కూడా ఉంటుంది. జిగురు చెట్ల ఆకారాల్ని ఎవరో నేపథ్యంలోని ఆకాశంపై చెక్కినట్లుగా అనిపిస్తుండగా, వన్యప్రాణులు విశ్రాంతి తీసుకోనారంభిస్తాయి, అప్పుడు అంతటా ఆవరించిన స్తబ్దత ఎంతో విశాలమైన ఆ బయలు ప్రాంతాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నట్లు అనిపిస్తుంది.

మీ స్లీపింగ్‌ బ్యాగ్‌లోనికి ఒదిగిపోయే ముందు మీరు చలికాచుకున్న మంటను జాగ్రత్తగా ఆర్పేయండి. ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఆస్ట్రేలియా పొదల్లో అగ్ని అదుపు తప్పిందంటే చాలు, అది త్వరలోనే దేన్నీ మిగల్చక సర్వనాశనం చేస్తుంది. జిగురు చెట్ల పత్రసముదాయాల చివర్లు తీవ్రమైన వేడికి విస్ఫోటనం చెందుతాయి, దీంతో అగ్ని భయంకరమైన వేగంతో విస్తరిస్తుంది. వేడిగా ఉండే, పొడి వేసవి నెలల్లో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పొదమంటల భయంతో జీవిస్తుంటారు. బయలు ప్రాంతాల్లో మంట రాజేయడంపై ఉన్న అగ్ని నిషేధాలు, నియమాలు కచ్చితంగా పాటించాలి.

త్వరలోనే అరుణోదయం అవుతుంది, రాత్రంతా దగ్గర్లోని జిగురు చెట్టుమీద గడిపి తెల్లవారగానే సంతోష గానాలతో నిద్రలేచిన కూకబుర్రల గుంపు ఒకటి గడబిడగా నవ్వుతుండగా ఆ శబ్దాలకు మీరు నిద్ర లేస్తారు. సంభ్రమంతో, మీ టెంటులో నుండి మీరు తల బయటికి పెట్టి అందమైన రంగురంగుల్లోని పిట్టలతో ఇతర చెట్లు నిండివుండడాన్ని మీరు చూస్తారు. ఇప్పటికే మీరు వాటిలో చాలావాటిని కలిసే ఉంటారు, అంతేగాక మరితర ప్రాణులైన కంగారూల్ని, కోవాలాల్ని, ఈమూల్ని, బహుశ ఒక వోంబట్‌ను కూడా చూసే ఉంటారు. పాముల్ని, సాలెపురుగుల్ని మాత్రం మీరు కలవడానికి ఇష్టపడక పోవచ్చు. అవును, ఈ ఖండంలో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు, సాలెపురుగులు కొన్ని ఉన్నాయి. కానీ మీరు వాటిని డిస్టర్బ్‌ చేయనంతవరకు వీటిలో చాలామట్టుకు మీకు ప్రమాదకరం ఏమీ కావు.

చలిమంట చుట్టూరా మీరు అల్పాహారాన్ని తీసుకోవడానికి ఇప్పుడు సమయమైంది—సామాన్యంగా బేకన్‌, గ్రుడ్లు, బాగా కాల్చిన రొట్టె ముక్కలు ఉంటాయి. తాజాగాలి మీ ఆకలెక్కుయ్యేలా చేసింది. తర్వాత, ఈగల మధ్య మీరు అల్పాహారాన్ని తీసుకుంటుండగా ఈ అటవీ ప్రాంతాల్లోని మీ అనుభవాల్ని నెమరు వేసుకుంటుంటారు, ఆస్ట్రేలియా ఖండం ఎంత విస్తారమైందన్న విషయం మీకు ఈ అనుభవం తెలియపర్చింది.

ఇక ఈ సువిశాలమైన దేశంలో మీ ప్రయాణం ముగిసింది, మీరు ఇంటిదారి పడుతున్నారు. స్నేహపూర్వకమైన ఆస్ట్రేలియావాసులను గూర్చి తెలుసుకోవడంలో మీ అనుభవం, నిష్కల్మషమైన వారి జీవిత విధానం మీ జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమై ఉంటాయనడంలో సందేహం లేదు. చాలామంది సందర్శకుల్లానే, మీరూ బహుశ ఎప్పుడైనా తిరిగి రావాలని కోరుకుంటుండవచ్చు. కానీ మీరు ఒక్క ముగింపుకు మాత్రం నిస్సందేహంగా చేరుకుని ఉండవచ్చు: డౌన్‌ అండర్‌ జీవితం భిన్నంగా ఉంది!

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

పారాకీట్‌, పింక్‌ కొకట్టూ: By courtesy of Australian International Public Relations; స్త్రీ: By courtesy of West Australian Tourist Commission

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి