కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 6/8 పేజీలు 17-19
  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిద్రయొక్క పాత్ర
  • ఎంత నిద్ర?
  • నిద్ర తక్కువ కావడంవల్ల వచ్చే అపాయాలు
  • రాత్రిపూట బాగా రావడం
  • నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • జంతువుల మగత నిద్రలోని రహస్యాలు
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1995
g95 6/8 పేజీలు 17-19

మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం

“రాత్రిపూట సుఖనిద్రవస్తే దానికి బదులు నేనేమివ్వాలి!” ఆ ఫిర్యాదు ఈనాడు సర్వసాధారణమే. అనేకులు నిరంతరం అలా బాధపడుతున్నారు, రోజూ కలిగే ఒత్తిడి, ఆధునిక జీవితపు వ్యాకులత హాని కల్గిస్తుంది.

వైద్యులు, పోలీస్‌ అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది, ట్రక్‌ డ్రైవర్లు, షిఫ్ట్‌ డ్యూటీలున్నవారు, పసిపిల్లలున్న తల్లులు, మరనేకమంది ఇతరులు, తమ శరీరాలకు అవసరమైన నిద్రలేక బాధపడేవారిలో ఉన్నారు. నిద్రలేక పోవడంవల్ల కలిగే నిరాశా నిస్పృహలను అనుభవించే లక్షలాదిమంది ప్రజలు, ఆహ్లాదకరమైన సుఖ నిద్రను పొందేదెలాగో తెలుసుకోవాలని చాలా ఆసక్తికల్గివున్నారు.

నిద్రయొక్క పాత్ర

జీవించే ప్రాణుల్లో నిద్ర, లేక కొంచెం విశ్రాంతి యనేది సర్వసాధారణంగా కనబడుతోంది. మీకు పిల్లులు, కుక్కలు, లేక పక్షులు వంటి పెంపుడు ప్రాణులు ఉంటే, చీకటిపడగానే పిల్లులు కుక్కలు ముడుచుకొని క్రమంగా నిద్రపోవడం, పక్షులు మౌనంవహించి నిద్రించడం మీరు తప్పకుండ గమనించే ఉంటారు. అన్ని జంతువులు, పక్షులు, మరియు కీటకాలకు నిద్రావసరత లేక పనినుండి కొంత విరామావసరత ఉంది. మానవులకైతే నిద్ర తప్పనిసరిగా అవసరమై యున్నది.

నిద్ర అంటే కొంత విశ్రాంతేనని కొందరనుకుంటారు. గానీ అది అంతకంటే ఎక్కువే. “నిజానికి, నిద్ర అనేది కండరాలు వ్యాకోచసంకోచాలు చెందడం, నాడీ, రక్త ప్రసరణలలో హెచ్చుతగ్గులు మరియు మనస్సు దాని స్వంత చిత్రాలను తయారు చేసుకోవడం వంటి క్లిష్టమైన పనులు నిర్వహించే పద్ధతైవుందని,” ది టొరంటొ స్టార్‌ అనే పత్రిక అంటుంది. “ఓ వ్యక్తి నిద్రపోయేటప్పుడు పనంతా తగ్గి కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. గుండెకొట్టుకోవడం, శ్వాసనిశ్వాసల వేగం తగ్గుతుందని,” ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా తెల్పుతోంది.

నిద్రనుగూర్చి విజ్ఞానశాస్త్రజ్ఞులు, వైద్యులు మరియు పరిశోధకులు దశాబ్దాల తరబడి అధ్యయనాలు జరిపినప్పటికీ, నిద్రయొక్క ముఖ్యపాత్రకు సంబంధించిన మూల రహస్యాలు మర్మంగానే ఉన్నాయి. అసలు నిద్ర అంటే ఏమిటి లేక మనమెందుకు నిద్రపోతామనే విషయాల్ని ఈ పరిశోధకులు కనిపెట్టలేదు కూడా. టొరంటొలోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రిలో ఉన్న నిద్ర పరిశోధనా లెబొరేటరీ డైరెక్టర్‌ డాక్టర్‌. ఎలియట్‌ ఫిలిప్సన్‌ ఇలా అంటున్నాడు: “నిద్రలో మనల్ని పునర్నిర్మించే సంక్లిష్టమైన జీవరసాయన మార్పుల సంఘటనలేవి జరుగుతాయో మనకు తెలియదు.”

నిద్రపోయేటప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మార్పులు శరీరంలో జరుగుతాయి. పగలుచేసే పనివల్ల కోల్పోయిన శక్తిని పునరుద్ధరించేలాగున మన శరీరావయవాలు విశ్రమించి, సేద తీర్చుకుంటాయి. రక్తప్రసరణ అమోఘంగా జరగడంద్వారా శుభ్రపర్చే సాధారణ పని నిర్వహించబడుతుంది, మరియు రసాయనిక సమతుల్యత పునరుద్ధరించ బడుతుంది. కాబట్టి నిద్రను, రాత్రిపూటవచ్చి అన్నింటిని బాగుచేసి, శుభ్రపరచి మరునాటికొరకు సిద్ధంచేసే సిబ్బందికి పోల్చవచ్చు.

నిద్రయొక్క పనులలో అతిప్రాముఖ్యమైనదేమంటే పగటిపూట పనిచేసిన నాడీవ్యవస్థ మరల శక్తిని పుంజుకునేలాగున అనుమతించడమే. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “నిద్ర శరీరానికి, ముఖ్యంగా మెదడుకు, నాడీమండల వ్యవస్థకు శక్తిని పునరుద్ధరిస్తుంది.”

ఎంత నిద్ర?

ప్రతిరాత్రి పెద్దవారికి ఏడు లేక ఎనిమిది గంటల నిద్ర అవసరం. కొందరికి అంతకంటె తక్కువ మరికొందరికి ఎక్కువ అవసరం. మాకు నాలుగు లేక ఐదుగంటల నిద్ర చాలని కొందరు అంటారు, కాని అలాంటివారు పగటిపూట కునుకుపెడుతుంటారు. పిల్లలకు పెద్దలకంటె ఎక్కువ నిద్రకావాలి.

ముఖ్యంగా వృద్ధులైనపుడు ప్రజలు తాము రాత్రిపూట ఎన్నోసార్లు మేలుకుంటున్నట్లు గమనిస్తారు. ఇది తీవ్రమైన నిద్రసమస్యలకు ఒక సూచనయని కొందరభిప్రాయం. అయినా, వృద్ధులు తాము యౌవనులుగా ఉన్నప్పటివలె నిద్రపోకపోయినప్పటికీ, రాత్రిపూట కొన్నిసార్లు మేలుకోవడం విషయంలో దిగులుపడ నవసరంలేదని పరిశోధనలు తెల్పుతున్నాయి. సాధారణంగా అలా మేలుకునే వారికిది స్వల్పసమయమే, బహుశ కొన్ని నిముషాలే, ఆ వెంటనే వారు మరల నిద్రకుపక్రమిస్తారు.

మరి ఒకరి వయస్సెంతైనాగానీ, రాత్రంతా ఒకే విధంగా నిద్రవస్తుందని అనుకోకూడదు. నిద్రలో గాఢనిద్ర, మగతనిద్ర అనేవి ఉంటాయి. ఒకవ్యక్తి రాత్రిపూట ఇలాంటి ఎన్నో మార్పులను అనుభవించవచ్చు.

నిద్ర తక్కువ కావడంవల్ల వచ్చే అపాయాలు

“చాలా తక్కువ నిద్రపోయే అనేకమంది విషయంలో పరిశోధకులెంతో ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలంగా తక్కువగా నిద్రపోవడం వల్ల మనకు మనచుట్టూన్న వారికి దుష్ఫలితాలు కలుగుతాయని,” ది టొరంటొ స్టార్‌ తెల్పుతోంది.

“తక్కువ నిద్రపోయేవారు శక్తినికోల్పోతారు, బహు కోపిష్టులౌతారు. ఒక వ్యక్తి రెండు రోజులు నిద్ర పోకుండావుంటే ఆ తర్వాత చాలాసేపు అవధానాన్ని నిలుపలేడు. . . . ముఖ్యంగా రోజూచేసే పనుల్లో చాలా తప్పులు చేస్తాడు, కొన్నిసార్లు సరియైన అవధానం నిలుపలేడు. . . . మూడు కంటె ఎక్కువ రోజులు నిద్రపోనివారు ఆలోచించడానికి, చూడటానికి మరియు స్పష్టంగా వినడానికి కష్టపడతారు. కొందరు నిజంగా లేనివాటిని చూస్తున్నట్లు అప్పుడప్పుడూ భ్రమపడుతూ ఉంటారు,” అని ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా తెల్పుతోంది.

నాలుగు రోజులు నిద్రలేకుండా పోయిన తర్వాత, పరీక్షింపబడిన వ్యక్తి మామూలుగా చేసే కొన్ని పనులుమాత్రమే చేయగలిగాడని పరీక్షలద్వారా తేలింది. మామూలు అవధానం లేక కొంచెం మనస్సు నిలిపి చేయవలసిన పనులుకూడ భరించరానివయ్యాయి. అవధానాన్ని, మానసిక శక్తిని కోల్పోవడం మరీ దుష్ఫలితాలేమీ కావు. నాలుగున్నర రోజులు నిద్రలేకపోయిన అనంతరం, ఒకనిలో పిచ్చిపట్టిన లక్షణాలు కనబడ్డాయి, తనచుట్టున్నవి అతనికి ఎంతో వింతగా కన్పించాయి.

తక్కువ నిద్ర పెద్ద సమస్యలకు దారితీయగలదు. కారును నడిపిస్తూ నిద్రమత్తులోనున్న అనేకులు స్టీరింగ్‌మీద వాలిపోయి, ప్రాణాంతకమైన పెద్ద దుర్ఘటనకు గురయ్యారు. నిద్రలేక పోవడం కుటుంబం మరియు వివాహ సంబంధమైన సమస్యలకు కూడ నడపగలదు, ఎందుకంటే క్రమంగా నిద్రలేకపోవడంవల్ల కోపం ఎక్కువై ఇతరులతో సర్దుకొని పోవడానికి ఆ వ్యక్తికి కష్టమౌతుంది. రాత్రిపూట బాగా నిద్రపోవడమనేది కొందరనుకునే దానికన్న చాలా ప్రాముఖ్యమైనది.

రాత్రిపూట బాగా రావడం

స్లీప్‌ డిసార్డర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ మెట్రొపోలిటన్‌ టోరంటోలోని నిద్రా నిపుణుడు డాక్టర్‌. జెఫ్రి జె. లిప్సిట్స్‌ రాత్రిపూట మంచి నిద్రరావడానికి ఈ క్రింది సలహాలను ఇస్తున్నాడు. సురక్షితంగా, ప్రశాంతంగా, చీకటిగానున్న ప్రదేశాల్లో మరియు మంచి పడకమీద నిద్రపోండి. క్రితం రాత్రి సరిగ్గా నిద్ర పోకపోయినప్పటికీ, మధ్యాహ్నం నిద్ర పోకండి; పగలు మేలుకొనేవుంటూ, మామూలుగా పడుకునే సమయంలోనే నిద్రపోవడానికి ప్రయత్నించండి. పడుకునేముందు కాఫీ త్రాగకండి. చదవడానికి, టి.వి. చూడ్డానికి పడకను ఉపయోగించకండి. పడుకునే ముందు అధిక వ్యాయామం చేయకండి, ఎక్కువ భోజనం చేయకండి. క్రమంగా నిద్రించే అలవాటు చేసుకోండి, నిద్రించి-మేల్కొనే స్థిరమైన పద్ధతిని శరీరం అలవర్చుకోవడానికి అది సహాయపడుతుంది.

పడకకు చేరకముందు విశ్రాంతి తీసుకోవడానికి అలవాటుచేసుకోండి. మిమ్మల్ని ఆవేశపరచి, ఎక్కువ మేలుకునేలా చేసే పనులు చేయకండి. ఉదాహరణకు, ఆవేశపరచే సినిమాలను, టి.వి. కార్యక్రమాలను చూడడం లేక పుస్తకాలను చదవడంవంటి వాటిని మానుకోండి. నిద్రపోవడానికి ముందు చేసే ఉత్తేజపూరిత చర్చలుకూడ మిమ్మల్ని మేలుకునేలా చేయవచ్చు.

కొంతమందికి నులివెచ్చని (వేడిగా లేని) నీళ్లలో స్నానంచేయడం లేదా ఉత్తేజపూరితంకాని తేలికైన పుస్తకాలు చదవడం సహాయకరంగా ఉంటుంది. గనుక నిద్ర కల్గించేవి, అంటే గోరువెచ్చనిపాలు, మజ్జిగ, కొంచెం ద్రాక్షారసం, లేదా సీమచేమంతిచెట్టు లేక మింట్‌, మూలికలవల్లవచ్చే కషాయము వంటివాటిని సేవించవచ్చు—కాని కెఫీన్‌ ఉండే టీ త్రాగకూడదు.

అయినా, పడకకు వెళ్ళే ముందు మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోదన్నది అందరూ ఒప్పుకునేదే. సమతుల్యతగల జీవితం, రోజూ వ్యాయామం, మరియు పేరాశ, ఈర్ష్య, వైరం, అత్యాశలవల్ల కలిగే చీకుచింతాలేని జీవితం రాత్రివేళ సుఖనిద్రను సుగమం చేస్తుంది. అలాగే, అతిగా తినడం తాగడం వంటి దురలవాట్లులేని జీవితం, మరియు అవినీతి వల్ల కలిగే అసంతోషంలేని జీవితం కూడ మంచి నిద్రకు దోహదపడుతుంది.

మన ఆత్మీయావసరతను తీర్చుకోవడం సుఖప్రదమైన మంచినిద్ర రావడానికి ప్రముఖపాత్ర వహించగలదు. అది మనచుట్టూ ఉన్న క్లిష్టమైన లోకాన్ని అర్థంచేసుకుని సమతుల్యమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి మనకు సహాయపడుతుంది. వివేచనాభివృద్ధి చేసికొని, యెహోవా జ్ఞానానికి హత్తుకొని యుండేలాగున మనల్ని జ్ఞానియైన దేవుని సేవకుడు ప్రోత్సహిస్తాడు, ఎందుకంటే ఇది “సంతోషకరమైన, సుఖజీవానికి,” నడుపగలదు. ఇంకా ఆయన ఇలా అంటున్నాడు: “పడుకొనేటప్పుడు నీవు భయపడవు, రాత్రివేళ నీవు సుఖంగా నిద్రిస్తావు.”—సామెతలు 3:21-24, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

[18వ పేజీలోని చిత్రం]

చాలామంది పెద్దలకు ప్రతిరాత్రి ఏడు లేక ఎనిమిది గంటల నిద్ర అవసరం

[18వ పేజీలోని చిత్రం]

దీర్ఘకాలంగా తక్కువ నిద్రపోవడం వలన దుష్ఫలితాలు కలుగుతాయి

[18వ పేజీలోని చిత్రం]

అనేకులు నిద్రపోవడానికి చాలా కష్టపడతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి