యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
డబ్బు సంపాదించడంలో తప్పేమిటి?
“ప్రపంచంలో నిజానికి అత్యంత ప్రాముఖ్యమైనది డబ్బే.” బ్రిటీష్ నాటక రచయితయైన జార్జ్ బెర్నార్డ్ షా అలా అన్నాడు. మీరు ఆయనతో ఏకీభవిస్తారా? “నేను ధనవంతురాల్ని కావాలని అనుకోవడం లేదుగానీ, ఆర్థిక భద్రతవుంటే చాలు” అని చెబుతున్న 17 ఏళ్ల టాన్యా లాగే బహుశా మీరూ భావిస్తారు. అదే విధంగా, యౌవనుడైన ఏవ్యాన్ డబ్బును ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన దానిగా గాక నిర్దిష్టమైన లక్ష్యాల్ని సాధించేందుకు ఉపయోగకరమైన దానిగా పరిగణిస్తాడు. అతడిలా చెబుతున్నాడు: “బట్టలూ, ప్రయాణ ఖర్చులూ వంటి నా అవసరాలకు డబ్బు అవసరం.”
బైబిలు కూడా అదే విధమైన ఉద్దేశాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా? “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని అది ప్రసంగి 7:12లో చెబుతోంది. బీదరికం “మానవ సంతోషానికి పెద్ద శత్రువు”గా వర్ణించబడింది. తగినంత డబ్బును కల్గివుండడం, బీదరికం తరచూ తెచ్చే సమస్యల నుండి—కనీసం కొంత మేరకు—మిమ్మల్ని కాపాడుతుంది. ఎదురు చూడని విపత్పరిణామాల తీవ్రతను కూడా డబ్బు తగ్గించగలదు. “‘ఇవన్నియు కాలవశము చేతనే, అనూహ్యంగానే అందరికి కలుగుచున్నవి’ అని బైబిలు చెబుతోంది. కష్టాలు చెప్పిరావు గనుక మనం డబ్బును దాచుకోవాల్సివుంది” అని యౌవనస్థురాలైన ఫిలాస్ అంటుంది. (ప్రసంగి 9:11) బహుశా మీకిప్పుడు డబ్బు ప్రాముఖ్యమైందిగా కన్పించినా, అది మీ భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యమైన పాత్రను కూడా నిర్వహించవచ్చు.
“భౌతికవాదం యొక్క ఆటుపోట్ల తరంగం”
అయితే తగినంత డబ్బును కల్గివుండడం సాధారణమేననీ, సరియైనదేననీ కొందరు తలంచగా, మరి కొంతమంది యౌవనులకైతే డబ్బే సర్వస్వమన్నట్లు ఉంటుంది. “జీవితంలో మీకు అత్యంత అవసరమైనదేది?” అని 1,60,000 కన్నా ఎక్కువ మంది యౌవనుల్ని అడిగినప్పుడు, “ధనవంతులు కావడం” అని అందులో 22 శాతం మంది తెలియజేశారు.
ప్రపంచాన్ని కుదిపివేసిన “భౌతివాదం యొక్క ఆటుపోట్ల తరంగం” అని న్యూస్‌వీక్ పత్రిక పిలిచిన ఈ తరంగం, రూకల కొరకైన తృష్ణను వృద్ధిచేసింది. “నేను మరీ భౌతికవాదిని, ప్రసిద్ధిగాంచిన కంపెనీ వస్తువులంటే మక్కువ ఉన్నవాణ్ణి” అని 18 ఏళ్ల మార్టిన్ చెబుతున్నాడు. “మీరు చెల్లించినదానికి తగ్గదాన్నే మీరు పొందుతారనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకే నాకు కావాలనుకున్న వాటి కోసం డబ్బును ఎక్కువగా వెచ్చిస్తాను.” ‘డబ్బును ఎక్కువగా వెచ్చించే’ది మార్టిన్ ఒక్కడే కాదు. యు.ఎస్. న్యూస్ & వరల్డ్ రిపోర్టు ఇలా నివేదిస్తోంది: “గత సంవత్సరం, [అమెరికాలో] 12 నుండి 19 సంవత్సరాల వయస్సున్న యువత మొత్తంమీద 10,900 కోట్ల డాలర్లను కొనుగోళ్లపై వెచ్చిస్తూ, షాపింగ్ చేయడంలో మునుపెన్నటికన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చుచేసింది. ఇది 1990నాటి కన్నా 38 శాతం అధికం.”
అయితే, కొత్త బట్టలు, కాంపాక్ట్ డిస్క్‌లు, కంప్యూటర్ డివైస్‌లు వంటి వాటన్నిటికీ కావాల్సిన డబ్బు యువతకు ఎక్కడ నుండి వస్తుంది? యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ ప్రకారంగా: “16 నుండి 19 సంవత్సరాల వయస్సు మధ్యనున్న వారిలో దాదాపు సగం మందికి పార్ట్ టైమ్ ఉద్యోగాలున్నాయి.” సమతుల్యం గనుక పాటిస్తే, స్కూలు వేళలు అయిపోయిన తర్వాత చేసే ఉద్యోగం, ఒక యౌవనుడికి బాధ్యతను బోధించడం వంటి ప్రయోజనాల్ని కల్గివుండగలదు. అయితే, ఈ విషయంలో కొంతమంది యౌవనులు స్పష్టంగా హద్దుల్ని అధిగమించారు. న్యూస్‌వీక్ పత్రిక ఇలా అభిప్రాయపడింది: “[పనిచేసే] విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని మానసిక నిపుణులూ, ఉపాధ్యాయులూ గమనించారు. హోమ్‌వర్క్ చేసుకోడానికి వాళ్లకి దాదాపుగా తీరికవుండదు. జోగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్న అలసిపోయిన విద్యార్థులే విచారకరంగా తరచూ అనుకున్న ర్యాంకులను సాధించలేకపోయినట్లు ఉపాధ్యాయులు గమనించారు.”
అయినప్పటికీ, పనిచేసే ఏ యౌవనస్థుడూ తమ ఆదాయ వనరులను విడిచిపెట్టడానికి ఇష్టపడడంలేదు. “స్కూలు ప్రాముఖ్యం, కానీ డబ్బు కూడా ప్రాముఖ్యమే. హోమ్‌వర్క్ కనకవర్షాన్నేమీ కురిపించదు గదా” అని యౌవనురాలు వనెసా చెబుతోంది. డబ్బు సంపాదించడం మీకెంత ప్రాముఖ్యం? డబ్బు కట్టలు కట్టలుగా సంపాదించడమే జీవితంలో మీ ప్రధాన లక్ష్యమా?
‘ధనవంతులగుటకు అపేక్షించడం’
ఈ ప్రశ్నలను కూడా బైబిలు వివరిస్తోంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:9, 10.
తాను మాట్లాడిన వాటిని గురించి పౌలుకు కచ్చితంగా తెల్సు. క్రైస్తవుడుకాక మునుపు, “ధనాపేక్షగల”వారని బైబిలు వర్ణించిన “పరిసయ్యులు”గా సుపరిచితులైన మతనాయకుల్లో ఆయన ఒకడు. (లూకా 16:14) అయినప్పటికీ, డబ్బు సంపాదించే విషయాన్ని ఆ అపొస్తలుడు ఖండించలేదు. బదులుగా, ఆయన ‘ధనవంతులగుటకు అపేక్షించే’ వారిని లేక మరొక అనువాదం అనువదించినట్లుగా “ఐశ్వర్యవంతులుగా ఉండడంపై తమ హృదయాల్ని నిలిపే” ప్రజలను గూర్చి హెచ్చరించాడు. (ఫిలిప్స్) కానీ అలా చేయడంలో ఉన్న హాని ఏమిటి?
పౌలు వివరించినట్లుగానే, అలాంటి వారు “శోధనలోను, ఉరిలోను . . . పడుదురు.” “ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు” అని సామెతలు 28:20 చెబుతున్నప్పుడు, అది అలాంటి విషయాన్నే తెలియజేస్తోంది. కొంతమంది యౌవనులు తమకు కావలసినంత లేదని తలస్తూ, దొంగతనం చేయడానికి పూనుకున్నారు.
నిజమే, అనేకమంది యౌవనులకు దొంగిలించే తలంపే ఉండదు. అయితే, కొంతమంది దానికి సమానమైన ప్రమాదకరమైన ప్రవర్తనలో మునిగి ఉండొచ్చు. క్రిష్టియానిటీ టుడే ఇలా నివేదిస్తోంది: “హద్దుమీరిన జూదం యువత మధ్య అతివేగంగా పెరుగుతున్న వ్యసనంగా మారిందని కొంతమంది నిపుణులు విశ్వసిస్తున్నారు.” అమెరికాలోని ఓ ప్రదేశంలో “యౌవనుల్లో దాదాపు 90 శాతం మంది తాము హైస్కూల్లో చివరి సంవత్సరానికి చేరుకునేటప్పటికి, లాటరీ టికెట్లను చట్టవిరుద్ధంగా కొన్నారు.” కొంతమంది యౌవనులు మరింత తెగిస్తున్నారు. “డీసెంట్ ఉద్యోగాల్ని సంపాదించడం కష్టం. కాబట్టి వస్తువుల్ని చేసి అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాను . . . అప్పుడప్పుడూ నేను [మాదక ద్రవ్యాల్ని] అమ్మే[వాడినని]” 16 ఏళ్ల మాథ్యూ చెబుతున్నాడు.
‘నాశనంలోనికి మునిగిపోవడం’
నిజమే, డబ్బును కల్గివుండడం ఒకనికి స్వేచ్ఛా భావాన్ని ఇవ్వవొచ్చు. కానీ పౌలు వివరిస్తున్నట్లుగా, తుదకు డబ్బును వెంబడించడమనేది నిజానికి ఒకనిని “అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశల”కు బానిసగా చేయగలదు. అవును, ఒక్కసారి ధనాపేక్ష మీలోనికి తన కోరల్ని గనుక దించితే దురాశా, హత్యకు పాల్పడేలా చేసే అసూయా మరితర హానికరమైన కోరికలూ లోబర్చుకోగలవు. (కొలొస్సయులు 3:5 పోల్చండి.) “తాము చింతాక్రాంతులయ్యేలా” ఇతర యౌవనులు కల్గివుండే కార్లూ, బట్టల విషయంలో కొంతమంది యౌవనులు ఎంతో ఈర్ష్యాపరులు కాగలరని టీన్ పత్రికలో ఓ శీర్షిక అభిప్రాయపడింది. అలాంటి ఈర్ష్య కొన్నిసార్లు “తనను తానే ఏవగించుకునేంత లోతుగా పాతుకుపోయి, ఒక టీనేజర్ తనకు లేని దాని గురించి తప్ప మరి దేని గురించీ ఆలోచించలేద[డ]ని” ఆ శీర్షిక జోడించింది.
అయితే, ఐశ్వర్యం కొరకైన కోరిక ఒకడ్ని ‘శోధనలో . . . పడవేయడం’ మాత్రమే గాక ‘నష్టములోను నాశనములోను ముంచివేయగలదు.’ బైబిలు వ్యాఖ్యానకర్తయైన ఆల్బర్ట్ బాన్స్ ఇలా అభిప్రాయపడుతున్నాడు: “ఒక ఓడ బద్దలైపోయి, ఓడా, ఓడలో ఉన్నవన్నీ మునిగిపోవడాన్ని గూర్చి ఊహించండి. నాశనం జరిగింది. అక్కడ సంతోష, సద్గుణాలూ, ఖ్యాతీ స్ఫూర్తులూ అన్నీ సంపూర్ణంగా నాశనమౌతున్నాయి.”—1 తిమోతి 1:19 పోల్చండి.
అయితే, అన్నింటినీ హరించివేసే “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము” అని తగినరీతిగానే పౌలు చెబుతున్నాడు. దాని ఫలితంగా, అనేకమంది “విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” ఉదాహరణకు, ఒక యౌవనస్థుని సంగతే తీసుకోండి. మనం ఇతన్ని రోరె అని పిలుద్దాం. అతడు తన 12వ ఏట జూదమాడడం ప్రారంభించాడు. “కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు అదొక సులువైన మార్గం” అని అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంతోకాలం గడవక మునుపే, అతడు వందలాది డాలర్ల అప్పులో కూరుకుపోయి, స్నేహితుల్నీ కుటుంబాన్నీ, స్కూలు వర్కునీ నిర్లక్ష్యంచేశాడు. “నేను మానుకోవాలని ప్రయత్నించాను” అని అతడు ఒప్పుకుంటున్నాడు, కానీ అతడు అనేకసార్లు విఫలుడయ్యాడు. అతడు తనకు 19వ ఏట సహాయం లభ్యమయ్యేంత వరకూ ‘నానాబాధలతో తనను తానే పొడుచుకుంటూ’ ఉండేవాడు. చేసింగ్ మమ్మూన్ అనే తన పుస్తకంలో రచయితయైన డగ్లస్ కెనడీ “ఉద్వేగాఘాతక అనుభవం” అని ధనాన్వేషణను పిల్చినప్పుడు ఆయన దాన్ని గోరంతలను కొండంతలుగా చేసి చెప్పడంలేదు.
సమతుల్యాన్ని కనుగొనడం
సొలొమోను సలహా శతాబ్దాల క్రిందట ఎంత తగినదో ఇప్పుడూ అంతే తగినదైవుంది: “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.” (సామెతలు 23:4, 5) వస్తుదాయ ఐశ్వర్యం తాత్కాలికం, కాబట్టి ఐశ్వర్యాన్ని అన్వేషించడాన్ని జీవితంలో ముఖ్యమైన లక్ష్యంగా చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. “పూర్తిగా వస్తుసంపదను కూర్చుకునే లక్ష్యాలలో చిక్కుకోవాలని నేననుకోవడం లేదు” అని మోరేన్ అనే పేరుగల క్రైస్తవ యువతి చెబుతోంది. “కేవలం డబ్బు సంపాదనలోనే నేను చిక్కుకుపోతే నేను చెల్లించాల్సిన మూల్యం నా ఆధ్యాత్మికతయేనని నాకు తెలుసు” అని ఆమె చెబుతోంది.
నిజమే, డబ్బు అవసరమే. తగినంత ఆదాయాన్ని కల్గివుండడం, మీ స్వంత అవసరాల్ని తీర్చుకోడానికి—మరి బహుశా అప్పుడప్పుడూ ఇతరులకు వస్తుదాయకంగా సహాయపడ్డానికి కూడా వీలు కల్గిస్తుంది. (ఎఫెసీయులు 4:28) నిజాయితీగా డబ్బును సంపాదించేలా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. అంతేగాక, జ్ఞానయుక్తంగా మీ డబ్బునెలా పొదుపు చేసుకోవాలో, ఎలా బడ్జెట్ వేసుకోవాలో, ఎలా ఖర్చు చేయాలో నేర్చుకోండి. కానీ జీవితంలో డబ్బునే అతి ప్రధానమైనదిగా ఎన్నడూ చేసుకోకండి. సామెతలు 30:8లో గ్రంథకర్త వ్యక్తపర్చిన సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండేందుకు ప్రయత్నించండి. ఆయన ఇలా ప్రార్థించాడు: “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము.” ఆధ్యాత్మిక ఆసక్తుల్ని ముందుంచుకోవడం ద్వారా, శ్రేష్ఠమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకోగల్గుతారు. సామెతలు 10:22 చెబుతున్నట్లుగా “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.”
[13వ పేజీలోని చిత్రం]
తమ తోటివారు కల్గివున్న హోదానే తామూ కల్గివుండడానికి అనేకమంది యౌవనులకు డబ్బు కావాలి