చీతా—శరవేగంతో పరిగెత్తే పిల్లి
కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ఉష్ణమండల మైదానంపై వేడి తగ్గకుండా అలాగే ఉంది. థామ్సన్ గజల్లాల మందపై మా బైనాక్యులర్లు కేంద్రీకరించాం, అస్తమించే సూర్య కిరణాల్లో బంగారువన్నె చారలుగల వాటి నడుములు మిలమిలా మెరుస్తున్నాయి. మాకు దగ్గర్లోనే, మరో పరిశీలకురాలు చెదపుట్టపై కూర్చొని థామ్సన్ గజెల్లాల మంద దిశగా తేరిచూస్తోంది. అది పిల్లిజాతికి చెందిన మచ్చలుగల ఓ మృగం, దానితోపాటూ దాని పిల్లలు కూడా ఉన్నాయి. పసుపు గోధుమ వర్ణంలో ఉన్న దాని కళ్లు ఆ దృశ్యాన్ని నిశితంగా అధ్యయనం చేశాయి. ఉన్నట్లుండి, దాని కండరాలు బిగుసుకొన్నాయి, మరి అది నెమ్మదిగా లేచి, మందవున్న దిశగా కదిలింది. దాని రాకకోసం వేచివుండాలని దాని పిల్లలకు తెల్సినట్లు కనబడింది.
అది ఎంతో జాగ్రత్తగా, చిన్న పొదలమాటునా పొడవైన గడ్డి గుబుర్ల మాటునా నక్కుతూ ముందుకు కదిలింది. దాని కదలికలు స్వేచ్ఛగానూ, దృఢంగానూ ఉన్నాయి. ఎరవున్న చోటుకి 200 మీటర్ల లోపు చేరుకునేటప్పటికి, అది ఆకస్మికంగా బిగిసుకు పోయింది. ఒక థామ్సన్ గజల్లా (ఏన్టీలోప్) తలపైకెత్తి, అది వచ్చే దిశను తేరిపార చూసింది; తర్వాత మరలా తన తిండి ధ్యాసలో పడిపోయింది. మరొకసారి అది తన ఎరవైపుగా కదలడం పునరారంభించింది. తాను దాడిచేయడానికి పరిగెట్టాలని నిర్ణయించుకోడానికి మునుపే ప్రమాదాన్ని ఊహించని ఆ జంతువులున్న చోటుకి 50 మీటర్ల దూరం లోపుకు చేరుకుంది. నొక్కిపెట్టి వదిలిన ఒక స్ప్రింగ్‌లా, అది సంధ్యవెలుగులో ముందుకు దూకింది. గజెల్లాల మంద తలొక దిశకు చెదిరిపోయినా తానెన్నుకున్న ఎరనుండి తన కళ్లను మరల్చలేదు. వేగంగా పరిగెత్తుతున్న గజెల్లాను పట్టుకోడానికి మైదానానికి అడ్డంగా పరుగెత్తింది.
తనను వెంబడిస్తున్న మృగం యొక్క ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయడానికి భయపడిన ఆ జంతువు అడ్డదిడ్డంగా పరిగెట్టినా, దాని అనిర్ణయిత యుక్తులు పిల్లిజాతికి చెందిన ఆ మృగం యొక్క మెరుపులాంటి వేగం ముందు పనికిరాకుండా పోయాయి. తన ఎరకు దాదాపు ఓ మీటరు దూరంలో ఉన్నప్పుడు, అది తాను ఉద్దేశించిన ఎరను పడగొట్టేందుకు తన ముందు పంజాను విసిరింది. ఆ క్షణంలో, అది కొద్దిగా తొట్రుపడింది. అంతే క్షణ కాలంలో, గజెల్లా కనుమరుగై పోయింది.
ఎగశ్వాస తీసుకుంటూ, ఆగి కూర్చోడానికని చీతా తన వేగాన్ని తగ్గించి ఆకలితో ఉన్న తన పిల్లలున్న దిశవైపు చూసింది. నేను ఆశ్చర్యంతో నా భార్యవైపు చూశాను. అద్భుతమైన చీతా యొక్క శక్తివంతమైన వేగాన్ని మేం కళ్లారా చూశాం.
వేగంగా పరిగెత్తే పిల్లి
చీతా నిజంగా వాయు వేగంతో దూసుకుపోగలదు. ఆశ్చర్యకరంగా, కేవలం రెండు సెకన్లలో అది ఉన్నపళంగా గంటకు దాదాపు 65 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలదు. అది గంటకు 110 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు. భూమిపైనున్న జంతువుల్లో వేగంగా పరిగెట్టే జంతువిదే. పోల్చిచూస్తే, పందెపు గుఱ్ఱం కొంచెం అటూఇటూగా గంటకు 72 కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగాన్ని చేరుకోగలదు. వేటకుక్క గంటకు దాదాపు 65 కిలోమీటర్ల వరకూ పరిగెట్టగలదు. అయితే, చీతా తక్కువ దూరాలలో మాత్రమే దాని అద్భుతమైన వేగాన్ని నిలబెట్టుకోగలదు.
చీతా పొడవుగా సొగసైన కాళ్లతో, ఎటుపడితే అటు వంగే వంపుతిరిగిన నడుముతో నాజూకైన శరీరంతో రూపొందించబడింది. చీతా వేగంగా దూకుతూ మలుపులు తిరుగుతుండగా మచ్చలున్న పొడవైన దాని తోక దాన్ని సమతూకంలో ఉంచుతుంది. అత్యధిక వేగంతో పరిగెడుతున్నప్పుడు, అది ఆరు మీటర్ల దూరానికి పైగా దుముక గలదు. అలాంటి వేగానికి ఓ సహాయకం ఏమిటంటే దాని అసమానమైన పాదాలే; అవి పిల్లిపాదాల్లాగాక ఇంచుమించు కుక్క పాదాల్లా ఉంటాయి. పెరిగిన కండర సంకోచాన్నిబట్టి నేలపై జారిపోకుండా పట్టుకునేందుకు దాని గోళ్లను అది ఉపయోగిస్తుంది.
మచ్చల సౌందర్యం
చీతా ముఖం నిస్సందేహంగా అసమానమైది, అందమైనది. దీనంగా దాదాపు విచార వదనంలా కన్పించేటట్టు చేస్తున్న రెండు అందమైన నల్లటి చారలు దాని కళ్లదగ్గర నుండి నోటి చివరల వరకూ దిగి ఉన్నాయి. చిన్నచిన్న దట్టమైన మచ్చలతో ఉన్న దాని బొచ్చు కురచగా ఉండి, పొట్టపై శ్వేతవర్ణంవున్నా, దేహంపై మాత్రం తరచూ లేత ఎరుపు గోధుమ వర్ణం ఉంటుంది. చీతా పిల్లలు పుట్టినప్పుడు బాగా ముదురు వర్ణంలో ఉండి, వాటి మెడలపై నుండి తోకల వరకూ నీలి బూడిద వర్ణంలో పొడవుగావున్న దట్టమైన జూలు ఉంటుంది.
చీతా కీచుమనే ధ్వనితోనో లేక పక్షిలా కిలకిలమనే ధ్వనితోనో అరుస్తుంది. ఈ ధ్వని రెండు కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది, మరి తన పిల్లలతోనూ ఇతర చీతాలతోనూ సంభాషించడానికి ఈ ధ్వనిని ఉపయోగిస్తుంది.
పిల్లిజాతికి చెందిన దాని సహ జంతువులైన సింహంతోనూ, చిఱుతపులితోనూ పోల్చిచూస్తే చీతా స్వభావం సాత్వికంగానూ, సాధువుగానూ ఉంటుంది. తృప్తి చెందినప్పుడు, అది ఇంట్లో పెంచుకునే ఓ పెద్ద పిల్లిలా అరుస్తుంది. అది మనిషి సన్నిధానానికి సులభంగా అలవాటుపడుతుంది, మచ్చిక అవుతుంది కూడా. చీతా పెంపుడు పిల్లేమీ కాదనుకోండి. పూర్తిగా ఎదిగిన చీతా 45 కిలో గ్రాములు లేక అంతకన్నా ఎక్కువ బరువు ఉంటుంది. వాడియైన కోరలూ, గోళ్లూ దాన్ని ప్రమాదకరమైన జంతువుగా చేస్తాయి—దానితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వేటాడే సామర్థ్యంతో చీతా జన్మించదు, వేటాడ్డానికి తన తల్లి దానికి విస్తృతంగా తర్ఫీదును ఇవ్వాలి. ఓ చీతా పిల్లని బంధించి పెంచితే, అది దాని ఎరవైపుకు దుముకుతూ పరిగెట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంది. తల్లీ పిల్లలు కలిసి తింటున్నప్పుడు, ఆహారాన్ని తినే సింహాల మధ్య సర్వసామాన్యంగా ఉండే కలహాలూ, పోరాటాలూ లేకుండా అవి సమాధానంగా తింటాయి. పుచ్చకాయల్ని తినేవిగా కూడా చీతాలు ప్రసిద్ధిగాంచాయి.
ఆఫ్రికా వన్య సంరక్షణ పార్కులకు వచ్చిన సందర్శకులు, పిల్లిజాతికి చెందిన సాధుజంతువులైన ఈ చీతాలు నిర్భయంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎదిగిన చీతా టూరిస్ట్ వ్యాన్ నీడలో పడుకోవడంగానీ కారు ముందు భాగంపై దూకి, ఆశ్చర్యచకితులైన తరచూ భయకంపితులైన ప్రయాణికుల్ని అద్దాల్లోనుండి తేరి చూడ్డంగానీ అసాధారణమైన విషయమేమీ కాదు.
తల్లిచీతా కాపుదల
ఆడ చీతా కాన్పుకి ఐదారు పిల్లల్ని కంటుంది. అవి పుట్టిన మొదటి కొన్ని నెలల్లో వాటిని తరచూ ఒక చోట నుండి మరో చోటుకి మారుస్తూ, వాటిని ధైర్యంగా సంరక్షించి, వాటిని మరుగున ఉంచుతుంది. అయినప్పటికీ, తమ పిల్లల్ని కాపాడేందుకు తల్లి చీతాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాటిలో మూడోవంతు మాత్రమే పెద్దవవుతున్నట్టు కనబడుతుంది.
చీతా పిల్లల కుటుంబాన్ని సంరక్షించడం, తల్లి చీతాకు అంత సులభమైన పనేమీకాదు. అవి ఎంతో చైతన్యవంతంగా ఉండి, విపరీతమైన చిలిపితనాన్ని కల్గివుంటాయి. విశ్రాంతి తీసుకుంటున్న తమ తల్లి, విలక్షణమైన పిల్లిశైలిలో తన తోకను వయ్యారంగా తిప్పుతుండగా చీతాపిల్లలు తరచూ మాటువేసి, ఆకస్మికంగా దాని పైనబడి పట్టుకుంటాయి. పెనుగులాడడం, కరుచుకోడం, ఒకదాన్ని మరొకటి తరమడం ద్వారా అవి సదా పరభక్షకజీవుల మూలంగా కలిగే అపాయాన్ని తరచూ మర్చిపోతాయి.
వేటగాడు వేటాడబడ్డాడు
సింహాలూ, చిఱుతపులులూ, హైనాలతోపాటూ అడవిలో ఎన్నో శత్రువులు చీతాకు ఉన్నాయి. అయితే, చీతాకున్న భయంకరమైన శత్రువు మానవుడే. దాని అందమైన మచ్చలున్న బొచ్చు దుస్తుల కొరకూ, రగ్గులు కొరకూ, అలంకార వస్తువుల కొరకూ ధర బాగా పలుకుతుంది. అతి వేగంగా పరిగెత్తగల్గే ఈ ప్రాణిని బంధించి, స్పోర్ట్ హంటింగ్ కోసం తర్ఫీదు ఇవ్వడం జరిగింది. నిర్బంధంలో ఉండి సంతానాన్ని కనడానికి అది సుముఖంగా లేనందున, ఈ అవసరాన్ని తీర్చడానికి కోనకోనల్లో చీతా కొరకు అన్వేషణ జరిగింది. సహజ నివాసాన్ని కోల్పోవడం కూడా చీతాపై మరింత ఒత్తిడి తెచ్చింది, గనుకనే తూర్పు ఆఫ్రికాలో అది ఇప్పుడు వన్య సంరక్షణ పార్కుల్లోనే ఎక్కువగా కనబడుతుంది.
44 దేశాల్లో 1,00,000 చీతాలు ఉన్నాయని 1990లో అంచనావేయబడింది. నేడు, 26 దేశాల్లో ప్రధానంగా ఆఫ్రికాలో బహుశా 12,000 చీతాలు మాత్రమే ఉన్నాయి. అందమైన మచ్చలుగల పిల్లిజాతికి చెందిన ఈ జంతువును కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నా దాని సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.
చీతా నాశనాన్నుండి రక్షించబడదేమోనని కొందరు భావిస్తారు. అయితే, దేవుడు తనకు అనుగ్రహించిన బాధ్యతను అంటే “భూమిమీద [చలించే] . . . ప్రతి జీవిని” పోషించే, కాపాడే, ‘ఏలే’ బాధ్యతను మానవుడు పూర్తిగా అంగీకరించే సమయం వస్తుందని తెల్సుకోవడం అభయాన్ని ఇస్తుంది. (ఆదికాండము 1:28) చీతా వంటి అందమైన పిల్లిజాతికి చెందిన జంతువులు భూ నివాసులందరికీ నిరంతరం సంతోషాన్నిస్తాయనే కచ్చితమైన అభయం అప్పుడు మాత్రమే ఉంటుంది.