యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
ప్రతీసారీ తప్పు నాదే ఎందుకు అవుతుంది?
“మా డాడీకి ఎలర్జీ ఉంది, ఆయన పొగత్రాగేవారితో కలిసి పనిచేయాల్సివస్తుంది. ఆయన ఇంటికి తిరిగొచ్చినప్పుడు, కొన్నిసార్లు చాలా చిరాకుగా ఉంటారు. ఆయన తన వస్తువుల్ని పోగొట్టుకుని అందుకు నన్ను తిడతారు. పోగొట్టుకున్నది మీరే అని నేను చెప్పానంటే ఇక అంతే, నామీద విరుచుకుపడతారు, నేను తనను సరిచేయకుండా ఉండాల్సిందంటారు.”—ఒక టీనేజ్ అమ్మాయి.
మీరు మీ కుటుంబంలోని బలిపశువు అన్నట్లు ఎప్పుడైనా భావించారా? పొరపాటు ఎక్కడ జరిగినా నింద మీపైనే పడుతుందని అనిపిస్తుందా? 14 ఏండ్ల జయకు అలాగే అనిపిస్తుంది. ఆమెకు తండ్రి మాత్రమే ఉన్నాడు, తరచూ ఆమె తన చెల్లినీ తమ్ముడ్నీ చూసుకోవాల్సి వస్తుంది. “వాళ్లిద్దరూ పైన పోట్లాడుకోవడం మొదలుబెట్టినప్పుడు నేనేమో క్రింద ఉంటాను” అని ఫిర్యాదు చేస్తుంది జయ. “వాళ్లెంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు, కానీ డాడీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆయన నామీద అరుస్తారు ఎందుకంటే వారిని ఆపడానికి నేనక్కడ లేను మరి” అని అంటుందామె.
సరిదిద్దడానికి వీల్లేనంతగా చెడిపోయిన వారనిపించే బిరుదులు పెట్టి పిలుస్తూవుంటే, అంటే మీ తలిదండ్రులు మిమ్మల్ని ఒకవేళ అతి గారాబంవల్ల పాడైపోయిన పిల్లవాడనీ, సోమరి అనీ, లేక బాధ్యత లేనివాడనీ లేకపోతే ఇలాంటి ఇతర బిరుదులు పెట్టి పిలుస్తూవుంటే, కొన్నిసార్లు మీరు పొరపాటు చేస్తారని వారు ఎదురుచూస్తున్నట్లు కూడా అనిపించవచ్చు. రామన్ కుటుంబం ఆయన్ని ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని పిలుస్తుంది—ఈ పేరు ఆయనకి మహా కోపాన్ని తెప్పిస్తుంది. మీకు కూడా అదే విధంగా ఏదైనా మారుపేరో లేక మీ లోపాల్ని ఎత్తిచూపుతుండే బిరుదో మీకు కోపం తెప్పించవచ్చు, అది అనురాగపూరితంగా చెప్పబడినప్పటికీ కూడా. మెరుగుపర్చుకునేలా మిమ్మల్ని ప్రేరేపించడానికి బదులు, ఎప్పుడు చూసినా నింద మీపైనే పడుతుందనే భావనని ఆ చెడ్డ బిరుదు మరింత బలపర్చవచ్చు.
మీపైన పడిన నింద పక్షపాతంతోకూడిన అభిమానం మూలంగా వచ్చిందని అనిపించినప్పుడు ప్రాముఖ్యంగా మరింత బాధాకరంగా ఉండవచ్చు. “నేను మధ్యలోని వాడిని, ఎప్పుడు చూసినా నింద నాపైనే పడుతుంది” అని ఫ్రాంకీ అనే ఒక టీనేజ్ అబ్బాయి అంటున్నాడు. మీ తోబుట్టువులమీద ఎప్పుడూ అనుమానమే రాదన్నట్లుగా కనిపించవచ్చు, గానీ సమస్య ఎప్పుడు ప్రారంభమైనా మొదట మీరే నిందితులని నిర్ధారించబడుతున్నట్లు మీకు అనిపించవచ్చు.
తలిదండ్రులు నిందించడానికిగల కారణాలు
తమ పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దడం తలిదండ్రులకు సహజం. చెప్పాలంటే, దైవభయంగల తలిదండ్రులు ఆరోగ్యకరమైన రీతిలోనూ, నిర్మాణాత్మకమైన రీతిలోనూ పిల్లల్ని సరిదిద్దడం అనేది “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” వారిని పెంచడానికైన ఒక మార్గం. (ఎఫెసీయులు 6:4) అయితే, కొన్నిసార్లు అత్యంత ఆదర్శవంతమైన తలిదండ్రులు కూడా అతిగా ప్రతిస్పందించవచ్చు లేక తప్పుడు నిర్ధారణలకు రావచ్చు. యేసు చిన్నవానిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఈ సందర్భంలో యేసు కన్పించడంలేదు. చివరికి తెలిసిందేమంటే ఆయన దేవుని ఆలయంలో బైబిలు చర్చలను చేస్తున్నాడు. అయినప్పటికీ, ఆయన తలిదండ్రులు ఆయనను కనుగొన్నప్పుడు ఆయన తల్లి ఇలా అడిగింది: “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటి[మి.]”—లూకా 2:48.
యేసు పరిపూర్ణుడు గనుక, ఆయన ఏదైనా అపరాధ ప్రవర్తనలో పాల్గొంటాడని భయపడడానికి ఏ కారణమూ లేదు. కానీ ప్రేమామయులైన అందరు తలిదండ్రులకు మల్లేనే ఆయన తల్లి తన బిడ్డకు తాను బాధ్యురాలని భావించి, బహుశ ఆయనకు కీడు వాటిల్లుతుందేమోనని భయపడుతూ తీవ్రంగా ప్రతిస్పందించింది. అదేవిధంగా, మీ తలిదండ్రులు కూడా అప్పుడప్పుడు, మిమ్మల్ని ఇబ్బందుల పాలుచేయడానికో లేక మీపట్ల క్రూరంగా ప్రవర్తించాలనో కాదుగానీ కేవలం మీపట్ల నిజంగా శ్రద్ధవహిస్తున్నందుకే అలా తీవ్రంగా ప్రతిస్పందించవచ్చు.
అంతేగాక, మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నామని కూడా గ్రహించండి. (2 తిమోతి 3:1) ఉద్యోగం చేస్తూ మీ ఇంటిని చూసుకుంటూ, మీ తలిదండ్రులు చెప్పుకోదగినంత ఒత్తిడికి లోనైవుంటారు, ఇది వారు మీతో ఎలా వ్యవహరిస్తారన్నదాన్ని ప్రభావితం చేయవచ్చు. (ప్రసంగి 7:7 పోల్చండి.) ఒక మానసిక ఆరోగ్య కార్యకర్త ఒకామె ఇలా అంటుంది: “కొన్ని కుటుంబాల్లో, తలిదండ్రులు సాధారణంగా మంచివారైనప్పటికీ, ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు తమ సహనం కోల్పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు.”
తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లో, నిస్సహాయత మూలంగా ఉత్పన్నమయ్యే తమ కోపాన్ని తమ పిల్లలపై వెళ్లగ్రక్కేందుకు ఎక్కువగా లోనవ్వవచ్చు, దీనికి కారణం చాలా స్పష్టం—అదేమిటంటే, విషయాల్ని చర్చించేందుకు వారికి ఒక వివాహజత లేదు మరి. అయితే, తలిదండ్రులు తమ వ్యకిగత కోపం మూలాన తమపైన విరుచుకుపడడాన్ని సహించడం సరదా విషయం ఏమీ కాదు. 17 ఏండ్ల లూసీ ఇలా అంటుంది: “నేనేదైనా తప్పు చేస్తే, అందుమూలాన శిక్షకు అర్హురాలినైతే అది సరే. కానీ మా అమ్మకు మూడ్ బాలేనప్పుడు నేను శిక్షను అనుభవించాల్సివస్తే, అది చాలా అన్యాయం.”
పక్షపాతంతోకూడిన అభిమానం మరొక కారకము. ఒక తండ్రి సాధారణంగా తన పిల్లల్నందర్నీ ప్రేమిస్తాడు, అయినా ఏదో ఒక్క బిడ్డపట్ల ఆయన ఆకర్షితుడు అవ్వడం అసాధారణమేమీ కాదు.a (ఆదికాండము 37:3 పోల్చండి.) మీరు తక్కువగా ప్రేమింపబడే బిడ్డ అన్న భావనే మీకు బాధాకరమైనదిగా ఉంటుంది. కానీ ఒకవేళ మీ అవసరతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో లేక మీ తోబుట్టువులు చేసేవాటికి తరచూ మిమ్మల్ని నిందిస్తున్నారనో మీకు అనిపిస్తే ఆగ్రహం తప్పకుండా కలుగుతుంది. “నాకొక తమ్ముడున్నాడు, డారెన్. వాడసలు తప్పే చేయడని అమ్మ అనుకుంటుంది. . . . ఆమె ఎప్పుడూ నన్నే నిందిస్తుంది, డారెన్ను ఎప్పుడూ ఏమీ అనదు” అని యౌవనురాలైన రాక్సన్ అంటుంది.
కల్లోలభరిత కుటుంబాలు
ఆరోగ్యకరమైన కుటుంబాల్లో అన్యాయంగా నిందారోపణ చేయడం అప్పుడప్పుడు సంభవించవచ్చు. కానీ కల్లోలభరిత కుటుంబాల్లో తలిదండ్రులు పిల్లల్ని నిందించడం, సిగ్గుపర్చడం, అవమానించడం వంటివి ఎప్పుడూ జరిగే విషయాలుగా ఉండవచ్చు. కొన్నిసార్లు చివరికి నిందారోపణతోపాటు, “ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ” వంటివి తోడవ్వవచ్చు.—ఎఫెసీయులు 4:31.
తలిదండ్రులు ఆ విధంగా విరుచుకుపడడానికి కారణం పిల్లవాడేనని చెబుతూ నింద మోపవచ్చా? అవిధేయుడైన కొడుకు లేక కూతురు ఒక తల్లికి లేక తండ్రికి “దుఃఖము” తెప్పించవచ్చన్నది నిజమే. (సామెతలు 17:25) అయినా, బైబిలు ఇలా చెప్పేది తలిదండ్రులకే: ‘మీ పిల్లలకు కోపము రేపకండి [అక్షరార్థంగా, “క్రోధము రేపకండి.”]’ (ఎఫెసీయులు 6:4) క్రైస్తవులందరికి లాగానే తల్లి లేక తండ్రి ఆత్మనిగ్రహాన్ని పాటిస్తూ, ‘కీడును సహించువారిగా’ ఉండాలి. (2 తిమోతి 2:24-26) కాబట్టి తండ్రి ఆత్మనిగ్రహాన్ని కోల్పోయినప్పుడు, దానికి కారణం పిల్లలు చేసే పొరపాట్లేనని నిందించకూడదు.
మాటలద్వారా చేసే దాడులు ఒక తండ్రి భావోద్రేక దుర్దశను, క్రుంగుదలను, న్యూనతాభావాన్నీ అనుభవిస్తున్నాడన్న దానికి రుజువుగా ఉండవచ్చు. వైవాహిక సంక్షోభమూ లేక త్రాగుబోతుతనమూ వంటి సమస్యలు ఉన్నాయని కూడా అవి సూచించవచ్చు. ఒక అధికారిక మూలం ప్రకారం, వ్యసనభరితులైనవారి పిల్లలు తరచూ బలిపశువులు కావచ్చు. “వారు చేసేదేదీ సరైందిగా ఉండదు. ‘మూర్ఖుడు’ అనీ, ‘పనికిమాలినవాడు’ అనీ, ‘స్వార్థపరుడు’ అనీ, ఇంకా ఎన్నెన్నో మాటలతో పిలుస్తుండవచ్చు. కుటుంబ సభ్యులు ఆ పిల్లవాడిని (లేక పిల్లల్ని) ‘సమస్య’గా నిర్ధారించి తమ స్వంత అసౌకర్యవంతమైన భావనలనుండీ, సమస్యలనుండీ అవధానాన్ని మళ్లిస్తారు.”
అన్యాయంగా మోపబడిన నిందతో వ్యవహరించడం
డా. కాథ్లీన్ మెకోయ్ ఇలా అంటుంది: “మారుపేర్లు పెట్టడం, చులకన చేస్తూ ఒక చిన్నపిల్లవాని వ్యక్తిత్వాన్ని విమర్శించడం అనేది . . . టీనేజ్లో ఉన్న ఒక పిల్లవానికుండే ఆత్మన్యూనతా భావానికీ, క్రుంగుదలకూ, సంభాషించడం నిలిపివేయడానికీ కారణం కాగలదు.” లేదా బైబిలే చెబుతున్నట్లుగా, కఠోరంగా వ్యవహరించడం పిల్లలకి ‘కోపం పుట్టేలా’ చేయగలదు, తద్వారా వారి ‘మనస్సు క్రుంగుతుంది.’ (కొలొస్సయులు 3:21) విలువలేనివారమని మీ గురించి మీరు తలంచడం ప్రారంభించవచ్చు. మీ తలిదండ్రులపట్ల వ్యతిరేక భావాల్ని కూడా మీరు పెంపొందించుకోవచ్చు. వారిని తృప్తిపర్చడానికి మీరు చేయగల్గేది ఏమీ లేదనీ, కాబట్టి అందుకు ప్రయత్నించడం కూడా వ్యర్థమనీ ఒక ముగింపుకు మీరు రావచ్చు. కోపము, ఆగ్రహము మీలో నెలకొని మీరు ఎటువంటి క్రమశిక్షణనైనా—చివరికి నిర్మాణాత్మకమైన విమర్శను కూడా తిరస్కరించేలా చేయవచ్చు.—సామెతలు 5:12 పోల్చండి.
మీరెలా ఎదుర్కోగలరు? చాలామట్టుకు మీరున్న పరిస్థితిపైన ఆధారపడివుంటుంది. మీరు కొంచెం ఆగి, దాన్ని వాస్తవికంగా ఎందుకు మదింపు చేయకూడదు? ఉదాహరణకు, నింద ఎల్లప్పుడు మీమీదే పడుతుందన్నది నిజంగా వాస్తవమేనా? లేక కేవలం మీ తలిదండ్రులు కొన్నిసార్లు కాస్త ఎక్కువ విమర్శనాత్మకంగా ఉండి ఏదో తప్పుగా మాట్లాడేస్తారా? “అనేకవిషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని బైబిలు అంటుంది, మరి ఆ అందర్లో తలిదండ్రులు కూడా ఉన్నారు. (యాకోబు 3:2) అందుకని మీ తలిదండ్రులు అప్పుడప్పుడు తీవ్రంగా ప్రతిస్పందించినా, మీరు కూడా అతిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందా? కొలొస్సయులు 3:13 నందలి సలహాను చక్కగా అన్వయించుకోవచ్చు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”
మీ తలిదండ్రులపట్ల సహానుభూతి, మీరిలా చేయడంలో సహాయపడగలదు. సామెతలు 19:11 ఇలా అంటోంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” ఉద్యోగం నుండి ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఒకవేళ మీ నాన్నగారు అసాధారణమైన రీతిలో చిరాకుతో ఉండి, మీరు చేయని పనికి మిమ్మల్ని నిందిస్తే, దానికి మీరు పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? ఆయన బహుశ ఉద్విగ్నంతో ఉన్నారని మీరు గ్రహించడం ఆయన ‘తప్పును క్షమించడానికి’ మీకు సహాయం చేయగలదు.
అయితే, అన్యాయంగా నిందారోపణ చేయడం కేవలం అప్పుడప్పుడు మాత్రమే జరిగేది కాక ఎల్లప్పుడూ నిర్విరామంగా జరుగుతున్నట్లైతే అప్పుడేమిటి? భవిష్యత్తులో రాబోయే శీర్షిక మీ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికైన మార్గాల్ని చర్చిస్తుంది.
[అధస్సూచి]
a మా 1987, జూలై 22 (ఆంగ్లం) సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా తోబుట్టువులతో సర్దుకుపోవడం ఎందుకు ఇంత కష్టంగా ఉంది?” అనే శీర్షికను చూడండి.
[15వ పేజీలోని చిత్రం]
అవసరమైనప్పుడు తలిదండ్రులు దిద్దుబాటు చర్యగా సలహా ఇవ్వడం అన్యాయమేమీ కాదు