ఇంటర్‌నెట్ ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?
ఇంటర్‌నెట్, విద్యాపరంగా ఉపయోగించుకోడానికీ, అనుదిన సంభాషణ జరుపుకోడానికీ తగిన సామర్ధ్యాన్ని కచ్చితంగా కల్గివుంది. కానీ, దాని ఉన్నతమైన సాంకేతిక ఆకర్షణను తొలగించి చూస్తే టీవీ, టెలిఫోన్, వార్తాపత్రికలనూ, అలాగే గ్రంథాలయాలనూ దీర్ఘకాలంనుండి పట్టిపీడిస్తున్న సమస్యలలో కొన్ని దీనినీ పట్టిపీడిస్తున్నాయి. అందుకే, ‘ఇంటర్‌నెట్‌పై లభ్యమయ్యేవి నాకూ నా కుటుంబానికీ తగినవేనా?’ అని ప్రశ్నించుకోవడం సముచితమైన విషయం కావొచ్చు.
ఇంటర్‌నెట్‌పై లభ్యమవుతున్న అశ్లీల సమాచారాన్ని గూర్చి అనేక నివేదికలు వ్యాఖ్యానించాయి. అయితే, ఇంటర్‌నెట్ పూర్తిగా లైంగికపరంగా అసభ్యమైన రీతిలో ప్రవర్తించేవారితో నిండిన మురికి కూపం మాత్రమేనని ఇది తెలియజేస్తుందా? దీన్ని గోరంతల్ని కొండతలుగా చేసి చెప్పడమేనని కొంతమంది వాదిస్తారు. ఆక్షేపణీయమైన విషయాలను కనుగొనాలంటే ఒకడు బుద్ధిపూర్వకంగానూ, కావాలనీ ప్రయత్నించాల్సి ఉంటుందని వాళ్లు వాదిస్తారు.
ఆరోగ్యకరంకాని విషయాల్ని కనుక్కోడానికి ఒకడు ఉద్దేశపూర్వక ప్రయత్నం చేయాలనే విషయం వాస్తవమే, కానీ దాన్ని మరెక్కడోకన్నా ఇంటర్‌నెట్‌పై మరీ సులభంగా కనుగొనవచ్చని ఇతరులు వాదిస్తారు. కొన్ని అక్షరాల్ని టైప్ చేయడంతోనే ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే వ్యక్తి ఆడియో వీడియో క్లిప్పింగ్‌లతోపాటూ లైంగిక విచ్చలవిడితనం నిండివుండే ఫొటోలవంటి శృంగార విషయిక సమాచారాన్ని కనుగొనగలడు.
ఇంటర్‌నెట్‌పై అశ్లీలత ఎంతగా లభ్యమవుతుంది అనేదే ఇటీవల ఘాటుఘాటుగా జరుగుతున్న చర్చనీయాంశం. రిపోర్టులు సూచిస్తున్న విశృంఖలత్వ సమస్య గోరంతల్ని కొండంతలు చేసి చెప్పడమే అయి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే, మీ పెరడులో 100 విష నాగులు కాదుగానీ కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయని మీరు తెల్సుకుంటే, అప్పుడు మీరు మీ కుటుంబ రక్షణ విషయంలో ఏమైనా తక్కువ శ్రద్ధను చూపుతారా? ఇంటర్‌నెట్ ప్రవేశార్హత ఉన్న వారెవరైనా అప్రమత్తంగా ఉండడం జ్ఞానయుక్తమవుతుంది.
పిల్లల్ని దోచుకునే వారిని గురించి జాగ్రత్తవహించండి!
ఆన్-లైన్ ఇంటరాక్టివ్ చాట్ చర్చలలో యువతతో కొంతమంది శిశుకాముకులు చేరారని ఇటీవల వార్తా మాధ్యమాలు తెలియజేశాయి. వీళ్లు యౌవనస్థుల్లా నటిస్తూ అమాయకులైన యౌవనస్థులనుండి వారి పేర్లనూ, చిరునామాలనూ తెలివిగా రాబట్టారు.
ది నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సిఎమ్‌ఇసి) అనే సంస్థ ఈ కార్యకలాపాల్లో కొన్నింటిని ఆధారాలతో రుజువుచేసింది. ఉదాహరణకు, 1996లో అమెరికాలోని దక్షిణ కరొలినాకు చెందిన 13, 15 ఏళ్ల వయస్సుగల ఇద్దరు అమ్మాయిలు ఓ వారంపాటు కనబడకుండా పోయారు. వారిని పోలీసులు కనుగొన్నారు. వాళ్లు తాము ఇంటర్‌నెట్‌పై కల్సుకున్న 18 ఏళ్లవయస్సుగల పురుషునితో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లారు. 35 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి, 14 ఏళ్ల బాలున్ని, అతని తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో అక్రమ లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడానికి మరులుకొల్పాడని ఆరోపించబడ్డాడు. ఈ రెండు కేసులూ ఇంటర్‌నెట్ చాట్ రూమ్‌లో చర్చలతోనే మొదలయ్యాయి. 1995లో మరో వ్యక్తి, ఆన్-లైన్ ఇంటరాక్టివ్ చర్చలో 15 ఏళ్ల వయస్సున్న ఓ బాలునితో మాట్లాడి, ఆ బాలున్ని కల్సుకోవడానికి నిర్భయంగా అతని స్కూలుకే వెళ్లాడు. ఇంకొక వ్యక్తి తాను ఓ 14 ఏళ్ల వయస్సున్న బాలికతో లైంగిక సంబంధాన్ని కల్గివున్నానని ఒప్పుకున్నాడు. ఆ బాలిక ఆన్-లైన్ బులెటిన్ బోర్డుల ద్వారా యౌవనస్థులతో సంభాషించడానికి తనతండ్రి కంప్యూటర్‌ను ఉపయోగించేది. ఆమె కూడా ఈ వ్యక్తిని ఆన్-లైన్‌లో కల్సుకొంది. ఈ యౌవనస్థులందరూ తమ అసలు చిరునామాల్ని బయల్పర్చేలా చివరకు ఒత్తిడిచేయబడ్డారు.
తల్లిదండ్రుల నడిపింపు అవసరం
పైన ప్రస్తావించబడిన కేసుల వంటి కేసులు సాపేక్షికంగా అరుదైనవే అయినా, తల్లిదండ్రులు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. నేరానికీ మోసానికీ గురికాకుండా తమ పిల్లల్ని కాపాడేందుకు తల్లిదండ్రులకు ఏ సమాచారాలు లభ్యమౌతున్నాయి?
చలనచిత్రాల్ని వర్గీకరించినట్లుగానే వర్గీకరించే సిస్టమ్‌ల (విధానాల) నుండి కోరదగని విషయాలున్న లొకేషన్లలో (ప్రదేశాల్లో) ప్రవేశాన్ని నిరోధించే వర్డ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌కూ, ఫలానా విషయాలున్న లొకేషన్లలో ప్రవేశించడానికి తగినంత వయస్సు తనకుందని ఇంటర్‌నెట్ ఉపయోగించే వ్యక్తి రుజువుచేసుకోవాల్సిన సిస్టమ్‌లకూ విస్తృతపర్చే టూల్స్‌ను కంపెనీలు ఇవ్వడం ఆరంభిస్తున్నాయి. కుటుంబం యొక్క కంప్యూటర్‌ను ఆ విషయాలు చేరుకోకముందే వాటిని కొన్ని సిస్టమ్‌లు ఆటంకపరుస్తున్నాయి. అయితే, ఈ సిస్టమ్‌లలో అనేకం, పొరపాట్లు జరగడానికి ఆస్కారంలేని సిస్టమ్‌లేమీకావు. విభిన్నమైన పద్ధతుల ద్వారా మోసగించబడవచ్చు. ఇంటర్‌నెట్ ఆది నమూనా అంతరాయాలను అరికట్టేందుకే రూపొందిచబడింది, గనుక సెన్సారు చేయడం కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోండి.
తేజరిల్లు!కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాలిఫోర్నియాలో మోసానికి గురైన పిల్లలను గూర్చిన పరిశోధక గుంపును పర్యవేక్షిస్తున్న ఓ పోలీస్ అధికారి ఈ సలహాను ఇచ్చాడు: “తల్లిదండ్రులు ఇచ్చే నడిపింపుకు ప్రత్యామ్నాయమైనదేదీ లేదు. నాకు 12 ఏళ్లవయస్సున్న పిల్లవాడు ఉన్నాడు. నేనూ నా భార్యా ఇంటర్‌నెట్ ఉపయోగించుకోవడానికి వాన్ని అనుమతించినా దాన్ని మేము కుటుంబపరంగా ఉపయోగించుకునే వ్యవహారంగా చేసుకున్నాం, మరి మేము వెచ్చించే మొత్తం సమయంపై జాగ్రత్తగా నిఘావేసుకున్నాం.” ఈ తండ్రి చాట్ రూమ్‌ల విషయంలో విశేషంగా జాగ్రత్తను తీసుకుంటాడు, మరి ఆయన తాము దాన్ని ఉపయోగించడం విషయంలో కచ్చితమైన నిర్బంధాల్ని పెట్టాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “పర్సనల్ కంప్యూటర్ నా కుమారుని గదిలో గాక మా ఇంట్లో అందరూ మెసిలే స్థలంలో ఉంది.”
ఇంటర్‌నెట్ ఉపయోగాన్ని నిర్ధారించడంలో తల్లిదండ్రులు చురుకైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది. ఏదైనా ఉపయోగం ఉందనుకుంటే వాళ్లు తమ పిల్లల్ని అనుమతిస్తారు. ఏయే ఆచరణాత్మకమైన, సహేతుకమైన ముందు జాగ్రత్తల్ని పరిశీలించాల్సివుంది?
ఇంట్లో ఇంటర్‌నెట్‌ని కల్గివుండాలని నిశ్చయించుకునే తల్లిదండ్రులకు కొన్ని ఉపయోగకరమైన సలహాల్ని శాన్ జోస్ మెర్సీ న్యూస్ అనే వార్తాపత్రిక సిబ్బంది రచయితయైన డేవిడ్ ఫ్లోట్నకోప్ ఇస్తున్నాడు.
• మీ పిల్లలు మీ తీర్మాన నడిపింపుల విలువను తెల్సుకుంటుండగా, వాళ్లు మీతో కలిసి ఇంటర్‌నెట్‌పై పనిచేసేటప్పుడు వారి అనుభవం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ నడిపింపు లేకపోతే “[ఇంటర్]నెట్‌పైవున్న సమాచారమంతా గ్లాసులేని నీరులా ఉంటుంది” అని ఆయన హెచ్చరిస్తున్నాడు. మీరు విధించే నియమాలు “మీరు మీ పిల్లలకు ఎప్పుడూ చెప్పే ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయాల పొడిగింపే.” మీరు వారికి బోధించిన వాటికో ఉదాహరణ, అపరిచయస్థులతో మాట్లాడ్డాన్ని గూర్చి మీరు పెట్టిన నియమాలై ఉండాలి.
• ఇంటర్‌నెట్ ఓ బహిరంగ స్థలం, మరి దాన్ని పిల్లలను సాకే సర్వీసుగా ఉపయోగించకూడదు. “ఓ పెద్ద నగరంలో పదేళ్లవయస్సున్న మీ పిల్లవాన్ని మీరు ఒంటరిగా విడిచిపెట్టి, వెళ్లి కాస్సేపు ఆడుకొని రమ్మని చెప్పరు, అవునా?”
• ఇంటర్‌నెట్‌పై ఆటలు ఆడుకొనే లేక ముచ్చట్లాడుకొనే లొకేషన్ల్‌కూ (ప్రదేశాలకూ), హోమ్‌వర్క్ చేసుకోడానికి సహాయపడే స్థలాలకీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం నేర్చుకోండి.
చైల్డ్ సేఫ్టీ ఆన్ ది ఇన్‌ఫర్మేషన్ హైవే అనే ఎన్‌సిఎమ్‌ఇసి వారి కరపత్రం యువతకు అనేకమైన నడిపింపు సూత్రాల్ని ఇస్తోంది:
• మీ చిరునామా, మీ ఇంటి టెలిఫోన్ నంబర్ లేక పేరు, మీ పాఠశాల ఉండే చోటు వంటి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడిచేయకండి. మీ తల్లిదండ్రుల అనుమతిలేకుండా ఫోటోలను పంపించకండి.
• మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే సమాచారాన్ని మీరు పొందితే మీ తల్లిదండ్రులకు వెనువెంటనే తెలియజేయండి. నిర్దయగానూ లేక దాడిచేసేవిగానూ ఉండే మెస్సేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వకండి. మీ తల్లిదండ్రులు ఈ విషయంలో ఇంటర్‌నెట్ ఆన్-లైన్ సర్వీసు వారితో మాట్లాడ్డానికి వీలుగా, దీన్ని గురించి వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పండి.
• ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడానికి సంబంధించి నియమాల్ని పెట్టడంలో మీ తల్లిదండ్రులతో సహకరించండి. ఆ నియమాల్లో ఇంటర్‌నెట్‌ను రోజులో ఏయే వేళల్లో, ఎంతసేపు ఉపయోగించుకోవచ్చు, ఏయే ప్రదేశాల్లోకి వెళ్లడం మంచిది వంటి వాటిని చేర్చవచ్చు; మీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండండి.
ముందు జాగ్రత్తలు తీసుకోవడం వయోజనులకూ ప్రయోజనకరమేనని గుర్తుంచుకోండి. ఇప్పటికే కొంతమంది వయోజనులు తమ అజాగ్రత్త మూలంగా కోరదగని సంబంధాల్లోనూ తీవ్రమైన సమస్యల్లోనూ చిక్కుకున్నారు. చాట్ రూమ్‌ల మర్మమూ, అవతల వ్యక్తిని ప్రత్యక్షంగా చూసే వీలులేకపోవడమూ, మారుపేర్లను ఉపయోగించే అజ్ఞాత వ్యక్తులతో సంబంధమూ కొన్ని నిషేధాల్ని తగ్గించివేసి, భద్రతను గూర్చి తప్పుడు భావాన్ని సృష్టించాయి. వయోజనులారా, జాగ్రత్త వహించండి!
సమతూకమైన దృష్టిని ఉంచుకోవడం
ఇంటర్‌నెట్‌పై లభించే సమాచారాల్లో కొన్నీ, అది అందించే సర్వీసుల్లో అనేకమూ విద్యాపరమైన విలువల్ని కల్గినవిగా కనుగొనబడ్డాయి. మరి అవి ప్రయోజనకరమైన ఉద్దేశాన్ని నెరవేర్చగలవు. పెరుగుతున్న అనేకమైన కార్పొరేషన్‌లు, తమ ఇంటర్‌నల్ నెట్‌వర్క్‌లపై లేక ఇంట్రానెట్‌లపై ఆంతరంగిక డాక్యుమెంట్లను భద్రపర్చుకుంటూ ఉన్నాయి. ఇంట్రానెట్ ఆధారిత వీడియో ఆడియో సమావేశ నిర్వహణ దూసుకురావడం మన ప్రయాణ పద్ధతుల్నీ, వ్యాపార సమావేశ పద్ధతుల్నీ శాశ్వతంగా మార్చేసే సంభావ్యతవుంది. కంపెనీలు తమ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లను పంపిణీ చేసేందుకు ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నాయి, ఆ విధంగా ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే వ్యక్తులు తమ స్వంత వ్యవహారాల్లో కొన్నిటినిగానీ లేక మొత్తం అన్నిటినిగానీ చక్కబెట్టుకోగలిగే శక్తిని సంపాదిస్తున్నందున, వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి ప్రస్తుతం సిబ్బందిని ఉపయోగించుకుంటున్న స్టాక్ బ్రోకరేజ్ సర్వీసు కంపెనీల వంటి అనేక ప్రయాణ సర్వీసు కంపెనీలు ప్రభావితం చెందుతాయి. అవును, ఇంటర్‌నెట్ చూపించే ప్రభావం అపారమైనది. ఇది సమాచారాన్ని పంచుకోవడంలో, వ్యాపారాన్ని నిర్వహించడంలో, వార్తాసౌకర్యాల విషయంలో ఓ ప్రాముఖ్యమైన మాధ్యమంగా కొనసాగుతుంది.
అనేకమైన ఉపకరణాలవలె, ఇంటర్‌నెట్ ప్రయోజనకరమైన ఉపయోగాన్ని కల్గివుంది. కానీ, దాన్ని దుర్వినియోగపర్చే సంభావ్యతవుంది. కొంతమంది ఇంటర్‌నెట్‌లోని మరిన్ని అనుకూలమైన సంగతుల్ని పరిశీలించడానికి ఎంపికచేసుకోగా ఇతరులు అలా చేసుకోకపోవొచ్చు. వ్యక్తిగత విషయాలపై మరొకరి నిర్ణయాల్ని తీర్పుతీర్చేందుకు ఓ క్రైస్తవునికి అధికారంలేదు.—రోమీయులు 14:4.
ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడం, చూడ్డానికీ వినడానికీ ఎన్నెన్నో క్రొత్త సంగతులున్న ఓ క్రొత్త దేశానికి ప్రయాణించడంలా ఉండగలదు. మీరు మంచి అలవాట్లను చూపించడమూ, సూక్ష్మమైన ముందుజాగ్రత్తల్ని తీసుకోవడమూ ప్రయాణానికి అవసరమౌతుంది. ఇన్ఫర్మేషన్ సూపర్‌హైవే అయిన ఇంటర్‌నెట్‌పైకి మీరు వెళ్లాలని నిశ్చయించుకుంటే కావాల్సిందదే.
[12వ పేజీలోని చిత్రం]
“పర్సనల్ కంప్యూటర్ నా కుమారుని గదిలోగాక మా ఇంట్లో అందరూ మెసిలే స్థలంలో ఉంది”
[13వ పేజీలోని చిత్రం]
ఇంటర్‌నెట్ ఓ బహిరంగ స్థలం, మరి దాన్ని పిల్లలను సాకే సర్వీసుగా ఉపయోగించరాదు
[11వ పేజీలోని బాక్సు/చిత్రం]
మర్యాద, జాగ్రత్తల కొరకైన అవసరం
మర్యాద
మర్యాద సూత్రాల్నీ మౌలిక (ప్రొటోకాల్) సూత్రాల్నీ నేర్చుకోండి. ఇంటర్‌నెట్ సర్వీస్‌ను అందించే కంపెనీలలో అనేకం, ప్రవర్తనకు సంబంధించిన వివేకయుక్తమైన, అంగీకృతమైన నడిపింపు సూత్రాల్ని ప్రచురించారు. మీ విజ్ఞతనూ, మీ మంచి అలవాట్లనూ ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులు మెచ్చుకుంటారు.
జాగ్రత్త
కొన్ని చర్చా గ్రూపులు మతపరమైన విషయాలపై లేక వివాదాస్పదమైన విషయాలపై చర్చిస్తాయి. అలాంటి చర్చల్లో వ్యాఖ్యానాలు చేయడం విషయంలో జాగ్రత్తగా ఉండండి; మీ ఈ-మెయిల్ చిరునామా, పేరూ ఆ గ్రూపులో ఉన్నవారందరికీ ప్రచారం చేయబడుతుంది. ఇది తరచూ సమయాన్ని వ్యయపర్చే, కోరదగని ఉత్తరప్రత్యుత్తరాలకు దారితీస్తుంది. నిశ్చయంగా, చదవడానికి పనికిరానివైన కొన్ని న్యూస్ గ్రూపులు ఉన్నాయి, వాటితో ఎప్పుడూ ఇంటరాక్ట్ చేయవద్దు.
తోటి క్రైస్తవుల కొరకు చర్చా గ్రూపును లేక న్యూస్ గ్రూపును సృష్టించుకోవడం విషయమేమిటి? ఇది మొట్టమొదట ఎదురుచూడని గొప్ప సమస్యల్నీ, అపాయాల్నీ తీసుకురావొచ్చు. ఉదాహరణకు నిగూఢమైన దృక్పథాలున్న వ్యక్తులు, ఇంటర్‌నెట్‌పై తమను తాము తామెవరై ఉన్నారో ఆ విధంగా చిత్రీకరించుకొనని వ్యక్తులుగా ప్రసిద్ధిగాంచారు. ప్రస్తుతం, ఇంటర్‌నెట్ దానిపై కన్పించే వ్యక్తులు తమను తాము ఎవరిగా చెప్పుకుంటున్నారో, ఆ వ్యక్తులేనని గుర్తించే సామర్థ్యాన్ని కల్గిలేదు. అంతేగాక, ఎడతెగకసాగే ఓ పెద్ద సామాజిక సభకు అంటే దానికి కావాల్సిన, బాధ్యాతాయుతమైన పర్యవేక్షణను ఇచ్చేందుకు దాని దాత సమయాన్నీ, సామర్థ్యాన్నీ పీల్చివేస్తున్న సామాజిక సభకు కొన్ని రీతుల్లో అలాంటి గ్రూపును పోల్చవచ్చు.—సామెతలు 27:12 పోల్చండి.
[13వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీ సమయమెంత విలువైనది?
ఈ 20వ శతాబ్దంలో, జీవితం అంతకంతకూ మరింత సంక్లిష్టమౌతోంది. కొంతమంది ప్రయోజనార్థమై కనిపెట్టబడిన ఆవిష్కరణలు, తరచుగా అనేకమంది సమయాన్ని వృథాచేసేవిగా తయారయ్యాయి. అంతేగాక, దుర్నీతికరమైన, దౌర్జన్యపూరితమైన టీవీ కార్యక్రమాలూ, అశ్లీలభరితమైన పుస్తకాలూ, నీచమైన సంగీత రికార్డింగ్‌లూ, మరి అలాంటివీ దుర్వినియోగపర్చబడిన సాంకేతిక విషయాలకు ఉదాహరణలు. అవి అమూల్యమైన సమయాన్ని హరించివేయడమేగాక ప్రజల్ని ఆత్మీయంగా పాడుచేస్తాయి కూడా.
ఓ క్రైస్తవుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన వాటిలో మొదటివి ఏమిటంటే అనుదినమూ బైబిల్ని చదవడమూ, కావలికోట, తేజరిల్లు!ల్లోనూ వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన ఇతర ప్రచురణల్లోనూ చర్చించబడిన అమూల్యమైన లేఖన సత్యాలతో బాగా పరిచయాన్ని కల్గివుండడమూ వంటి ఆత్మీయ విషయాలే. నిత్యాశీర్వాదాలు, ఇంటర్‌నెట్ సర్ఫింగ్ నుండిగాక అద్వితీయ సత్య దేవుని గూర్చిన, ఆయన కుమారున్ని గూర్చిన జ్ఞానాన్ని గైకొనేందుకూ, దాన్ని అన్వయించుకునేందుకూ మీ సమయాన్ని ఉపయోగించడం నుండే వస్తాయి.—యోహాను 17:3; ఎఫెసీయులు 5:15-17 కూడా చూడండి.