యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
ఎప్పుడూ నేనే నిందించబడ్డాన్ని నేనెలా ఆపగలను?
“అన్నిటికీ నన్నే నిందిస్తారు. ఇంటికి తాళం వేయకపోయినా, స్టవ్వు ఆన్ మీదే ఉండిపోయినా, ఏదైనా దాని స్థలంలో లేకపోయినా, జరగాల్సిన పని జరక్కపోయినా అది రామన్ తప్పే అవుతుంది!”—రామన్.
మీరు కౌమార దశలో ఉన్నప్పుడు, ఎక్కడ కాస్త తప్పు జరిగినా అందుకు మీకే తిట్లు పడుతున్నాయని అనిపించవచ్చు. మునుపటి శీర్షికలో, తలిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లలను మరీ వెంటనే నిందిస్తారనే విషయాన్ని అంగీకరించడం జరిగింది.a దీనికిగల కారణాలు తలిదండ్రులకు తమ పిల్లల ఎడల సహజంగా ఉండే చింత మొదలుకొని తీవ్రమైన మానసిక వ్యధ వరకూ వ్యాపించవచ్చు. కారణం ఏమైనప్పటికీ, తప్పు మీది కానప్పుడు నిందించబడటం దుఃఖకరంగానూ అవమానకరంగానూ ఉండవచ్చు.
అయితే అసంపూర్ణ మానవునిగా, మీరు అప్పుడప్పుడూ తప్పులు చేస్తారు. (రోమీయులు 3:23) దానికి తోడు, మీరు ఇంకా యౌవనంలోనే ఉన్నారు గనుక మీకు సాపేక్షికంగా అనుభవం తక్కువే. (సామెతలు 1:4) మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో అప్పుడప్పుడూ పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు, దానికి మీరు బాధ్యత వహించాలని వారు కోరడం సరైనదే కాకుండా సహేతుకమైనది కూడా.—ప్రసంగి 11:9.
కాబట్టి, మీరు నిజంగా చేసిన తప్పు విషయంలో మిమ్మల్ని నిందించినప్పుడు మీరెలా ప్రతిస్పందించాలి? కొందరు యౌవనులు తమకేదో మహా అన్యాయం జరిగిపోతోందన్నట్లు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. తమ తలిదండ్రులు తమను ప్రతి దానికీ నిందిస్తున్నారని వారు అరిచి మొత్తుకుంటుంటారు. దాని ఫలితం? విసుగు చెందిన తలిదండ్రులు తాము చెప్పవలసిన విషయాన్ని పిల్లలు అర్థం చేసుకునేందుకు మరింత తీవ్రమైన క్రమశిక్షణను అమలు చేస్తారు. బైబిలు ఈ సలహా ఇస్తోంది: “మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామెతలు 1:7, 8) మీరు మీ తప్పిదాన్ని అంగీకరించి, అవసరమైన మార్పులు చేసుకున్నప్పుడు, మీరు మీ తప్పిదాల నుండి నేర్చుకోగలరు.—హెబ్రీయులు 12:11.
తలిదండ్రులతో “సమాలోచన” చేయడం
మీ తప్పులు కాని వాటి విషయంలో మీరు నిందించబడుతుంటే లేక మీరు ఎడతెగకుండా నిందించబడుతుంటే గనుక అది పూర్తిగా వేరే విషయం. మీకు కోపం రావడం లేక విసుగు కలగడం అనేది అర్థం చేసుకోగల విషయమే. ఎలాగైనా నాకు నిందలు తప్పవని భావించి మీరు తప్పుగా ప్రవర్తించేందుకు శోధించబడవచ్చు. (ప్రసంగి 7:7) అయితే, ద్వేషపూరిత క్రియలు ప్రతి ఒక్కరినీ గాయపర్చుతాయి. (యోబు 36:18 పోల్చండి.) సామెతలు 15:22, NW “సమాలోచన లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును” అని చెబుతూ, విషయాలతో వ్యవహరించ వలసిన చక్కని మార్గాన్ని సూచిస్తుంది. అవును, మీ ఎడల మీ తలిదండ్రులు ప్రవర్తిస్తున్న విధానాన్ని మార్చగల ఒక మార్గం, మీరు ఎలా భావిస్తున్నారనే విషయాన్ని వారికి తెలియజేయడమే.
మొదట, ‘ఉచితమైన సమయమని’ బైబిలు చెబుతున్న దాని కొరకు వేచి ఉండండి. (సామెతలు 15:23) క్లేటన్ బార్‌బ్యూ అనే రచయిత ఇలా సలహా ఇస్తున్నాడు: “మీరు ఇరువురూ ప్రశాంతంగా ఉన్న సమయాన్నీ స్థలాన్నీ ఎంపిక చేసుకోండి. మీరు హాయిగా ఉన్నప్పుడు.” అంతే కాకుండా, బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) కాబట్టి మీరు సమీపించేటప్పుడు మర్యాదపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి కానీ తిరుగుబాటుగా ఉండవద్దు. మీకు కోపం రానిచ్చుకోకుండా ఉండండి. (సామెతలు 29:11) మీ తలిదండ్రులపై దాడి చేసే బదులు (‘ప్రతి దానికీ మీరు నన్నే ఎప్పుడూ నిందిస్తున్నారు!’), వారు ఎడతెగక నిందించడం మూలంగా మీరెలా భావిస్తున్నారో (‘నా తప్పులు కాని వాటికి కూడా నన్ను నిందించినప్పుడు నాపైన నాకే విసుగు వస్తుంది’) వారికి వివరించేందుకు ప్రయత్నించండి.—ఆదికాండము 30:1, 2 పోల్చండి.
కొన్ని అపార్థాల మూలాన మీ తలిదండ్రులు కోపంగా ఉన్న సమయాల్లో కూడా ఇదే విషయం అన్వయిస్తుంది. యౌవనుడైన యేసు కనిపించకుండా పోయినప్పుడు ఆయన తలిదండ్రులు కలత చెందారు. అయితే, యేసు గొడవ చేయలేదు లేక ఫిర్యాదు చేయలేదు. ఆయన ప్రశాంతంగా విషయాన్ని వారికి స్పష్టం చేశాడు. (లూకా 2:49) మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీ స్వంత తలిదండ్రులతో మరింత పెద్దరికంగా ఎందుకు ప్రవర్తించకూడదు? వారు మీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నారు గనుకనే వారు చింతిస్తారని గుర్తించండి! మర్యాదపూర్వకంగా వినండి. (సామెతలు 4:1) విషయాన్ని మీ వైపునుండి చెప్పే ముందు, వారి కోపం తగ్గిపోయేంత వరకూ ఆగండి.
‘మీ స్వంత పని ఏమిటో నిరూపించుకోవడం’
అసలు కొందరు తలిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎందుకు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారు? వాస్తవానికి, కొన్నిసార్లు యౌవనస్థులు తమను అనుమానించేందుకు తమ తలిదండ్రులకు అవకాశమిస్తారు. “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును” అని సామెతలు 20:11 చెబుతోంది. మీ తలిదండ్రుల ముందు మీకు ఎలాంటి పేరు ఉంది? మీ ‘చేష్టలు’ మీ నడవడి ‘యథార్థమైనదీ’ గంభీరమైనదీ అనే విషయాన్ని తెలియజేశాయా లేక మీరు శ్రద్ధలేని మరియు బాధ్యతారహితమైన వ్యక్తి అనే విషయాన్ని వ్యక్తం చేశాయా? మరి మీ విషయంలో రెండవది వాస్తవమైతే, మీ గురించి వారు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటే ఆశ్చర్యపోకండి. ముందు ప్రస్తావించబడిన యౌవనస్థుడైన రామన్ తన తలిదండ్రుల విమర్శల విషయంలో “నా ఎడల నేను యథార్థంగా ఉండాలి కొన్నిసార్లు వాళ్ల అనుమానాల్లో రవ్వంత వాస్తవం ఉండేది” అని చెబుతున్నాడు.
మీ విషయంలో కూడా అదే వాస్తవమైతే, మీరు చేయగల ఏకైక పని మీ గతాన్ని వారు మరిచిపోయేంతగా మీరు మారి మంచిగా కావడమే. నమ్మదగిన మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనను మీరు అలవరచుకోవడం ద్వారా, మీరు మీ జీవితంలో మార్పులు చేసుకున్నారనీ మిమ్మల్ని ఇప్పుడు నమ్మవచ్చనీ మీరు మీ తలిదండ్రులను ఒప్పించగలరు.
రామన్ యొక్క అనుభవం ఈ విషయాన్ని ఉదాహరిస్తుంది. రామన్‌కి మతిమరుపు ఎక్కువ గనుక అతని స్నేహితులూ తలిదండ్రులు అతనికి ముద్దుగా ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అనే పేరు పెట్టారు. మీ తలిదండ్రులు మీకు “పరిణతి లేని వ్యక్తి” లేదా “బాధ్యతలేని వ్యక్తి” వంటి ప్రతికూలమైన పేర్లు పెట్టారా? కాథలీన్ మకాయ్ అనే రచయిత పేర్కొంటున్నట్లు, అలాంటి పేర్లు “యౌవనస్థులు అసలు తప్పును గుర్తించేందుకు” సహాయం చేస్తాయని, “అలా వారు దాన్ని గమనించి మార్పులు చేసుకోగల్గేందుకు సహాయం చేస్తాయని” తలిదండ్రులు భావించవచ్చు. అయితే, వాస్తవానికి, అలాంటి పేర్లు వారికి తీవ్రమైన కలత కలిగిస్తాయి. అయినప్పటికీ, రామన్ ఆ పేరు వెనుకగల యుక్తమైన విషయాన్ని గుర్తించగలిగాడు. “నా మనస్సు ఎప్పుడూ ఒక విషయంపై కేంద్రీకరించబడి ఉండేది, అంచేత నేను నా తాళపు చెవులనో లేక నా హోమ్‌వర్క్ పుస్తకాలనో పోగొట్టుకునే వాణ్ణి లేక నాకు అప్పగింపబడిన పనులను మర్చిపోయేవాణ్ణి” అని అతను అంగీకరిస్తున్నాడు.
అందుకని రామన్ మార్పులు చేసుకోవడం ప్రారంభించాడు. “నేను బాధ్యతలనూ ప్రాధాన్యతలనూ గురించి నేర్చుకోవడం ప్రారంభించాను” అని అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “నేను పట్టిక వేసుకుని నా వ్యక్తిగత బైబిలు పఠనాన్ని మరింత గంభీరంగా తీసుకోవడం ప్రారంభించాను. యెహోవా చిన్న విషయాలకూ అలాగే పెద్ద విషయాలకూ కూడా ప్రాధాన్యతనిస్తాడని నేను నేర్చుకున్నాను.” (లూకా 16:10) బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా, మతిమరుపు విషయంలో రామన్‌కు ముందున్న పేరు పోయింది. మీరూ అదే చేసేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు? మరి ఒక పేరు లేక ముద్దుపేరు మీకు నిజంగా చికాకు కలిగిస్తే, మీ తలిదండ్రులతో దాన్ని గురించి చర్చించండి. బహుశా వాళ్లు విషయాలను మీ వైపు నుండి చూడవచ్చు.
పక్షపాతం చూపుతున్నట్లు అనిపిస్తే
కొన్నిసార్లు నింద వెనుకగల కారణం పక్షపాత వైఖరి కావచ్చు. రామన్ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నా అన్నలు లేక అక్కలు ఇంటికి ఆలస్యంగా వచ్చినా వాళ్లకు తిట్లుపడవు. నేను గనక ఆలస్యంగా వచ్చానంటే నాకు తప్పకుండా తిట్లుపడతాయ్.” ఆల్బర్ట్ అనే పేరుగల ఒక గుయనీస్ వ్యక్తి తాను పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు అదే విధమైన భావాలను కలిగివున్నట్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తల్లి తన సహోదరుని కంటే తనకే ఎక్కువ కఠినమైన క్రమశిక్షణ ఇచ్చేదని అతనికి అనిపించేది.
అయితే, విషయాలు ఎల్లప్పుడూ మనకు కనిపించిన విధంగానే ఉండవు. తలిదండ్రులు తరచూ పెద్ద పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంటారు, అయితే అది పక్షపాతం మూలంగా కాదుగానీ పెద్దపిల్లలు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని వారు భావించినందు మూలానే. లేక కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల మూలంగా అలా జరుగవచ్చు. తన సహోదరుడు “చిన్నగానూ దుర్బలంగానూ” ఉండేవాడు గనుక అతనికి ఎక్కువ దెబ్బలుపడేవి కాదని ఆల్బర్ట్ అంగీకరిస్తున్నాడు. ఒక పిల్లవానికి ఉండే ప్రత్యేక అవసరతలనూ లేక పరిమితులనూ గుర్తించడం తలిదండ్రులు పక్షపాత వైఖరిని చూపడం అవుతుందా?
అయితే, తలిదండ్రులు తమ పిల్లల్లో కొందరిని బాగా ఇష్టపడటమన్నది కొన్నిసార్లు సహజమే. (ఆదికాండము 37:3 పోల్చండి.) ఆల్బర్ట్ దుర్బలుడైన తన సహోదరుని గురించి ఇలా చెబుతున్నాడు: “అమ్మకి వాడంటె ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.” క్రైస్తవ ప్రేమ విస్తృతమైనదనే విషయం ఎంతో సంతోషకరమైనది. (2 కొరింథీయులు 6:11-13) కనుక మీ తలిదండ్రులకు మీ తోబుట్టువుల్లో ఒకరి ఎడల “ప్రత్యేకమైన ప్రేమ” ఉన్నప్పటికీ, మీ కొరకు ఇక ప్రేమ మిగిలి లేదని దాని భావం కాదు. వాస్తవమైన వివాదం ఏమిటంటే, వారు మీ ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారా, ఒక తోబుట్టువు ఎడలవున్న గుడ్డి ప్రేమ మూలంగా మిమ్మల్ని నిందిస్తున్నారా? అన్నదే. అదే వాస్తవమైతే, మీరెలా భావిస్తున్నారో వారికి తెలియనివ్వండి. వారు పక్షపాత వైఖరిని చూపించారని మీరు ఎందుకు భావిస్తున్నారో దానికి విశదమైన ఉదాహరణలను ప్రశాంతమైన, సహేతుకమైన పద్ధతిలో వివరించండి. బహుశా వాళ్లు వినవచ్చు.
సమస్యలుగల కుటుంబాలు
అన్ని పరిస్థితులనూ సులభంగా మార్చలేమనే విషయాన్ని అంగీకరించాల్సిందే. అవమానించడం మరియు నిందించడమనేవి కొందరు తలిదండ్రుల్లో పాతుకుపోయిన అలవాట్లు. భావోద్రేకపరమైన సమస్యలు ఉన్న లేక దురలవాట్లకు బానిసలైన తలిదండ్రుల విషయంలో ఇది ప్రత్యేకంగా అలా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, విషయాలను చర్చించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉండకపోవచ్చు. మీ విషయంలో అదే వాస్తవమని మీకు అనిపిస్తే, మీ తలిదండ్రుల సమస్యలు మీరు అదుపు చేయలేనంత పెద్దవనీ వాటిని బయటి సహాయంతో మాత్రమే పరిష్కరించవచ్చనీ గుర్తించండి. మీరు చేయగల అతి శ్రేష్ఠమైన పని వారికి తగినంత ఘనతనూ గౌరవాన్నీ ఇచ్చి అనవసరమైన ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నించడమే. (ఎఫెసీయులు 6:1, 2) “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని సామెతలు 22:3 చెబుతోంది.b
అదే సమయంలో, బయటి వారి నుండి కొంత మద్దతును కూడా పొందండి. పరిణతిగల ఒక పెద్దవయస్సుగల వ్యక్తితో, బహుశా ఒక క్రైస్తవ పెద్దతో మాట్లాడండి. అలాంటి వ్యక్తి నుండి ప్రేమపూర్వక శ్రద్ధ లభిస్తే, అది ఎప్పుడూ మీదే తప్పు అనే భావాలకు విరుద్ధంగా పోరాడేందుకు సహాయపడగలదు. అదే సమయంలో, “దేవునియొద్దకు రండి.” (యాకోబు 4:8) ఇతరులు మిమ్మల్ని అన్యాయంగా నిందిస్తున్నప్పటికీ, “[దేవుడు] ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. . . . మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు.” (కీర్తన 103:9, 14) మీరు దేవుని దృష్టిలో అమూల్యమైన వారనే విషయాన్ని తెలుసుకోవడం మీరు అన్యాయమైన నిందలను సహించేందుకు మీకు సహాయం చేయగలదు.
[అధస్సూచీలు]
a 1997 ఆగష్టు 8 నాటి మా సంచికలోని “ప్రతీసారీ తప్పు నాదే ఎందుకు అవుతుంది?” అనే శీర్షికను చూడండి.
b 1989 జూన్ 8 నాటి మా (ఆంగ్లం) సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . మౌఖిక దురుపయోగాన్ని నేనెలా తట్టుకోగలను” అనే శీర్షికను చూడండి. 1996 నవంబరు 8 తేజరిల్లు! నందలి “గాయపర్చే మాటలకు బదులు స్వస్థపర్చే మాటలు” అనే శీర్షికల పరంపరను కూడా చూడండి.
[17వ పేజీలోని చిత్రం]
మన తప్పిదాలను అంగీకరించడం మన తప్పులనుండి నేర్చుకునేందుకు మనకు సహాయం చేస్తుంది