ఆఫ్రికా డోళ్లు నిజంగా మాట్లాడతాయా?
ఆఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
1876-77లలో కాంగోనది దిగువ ప్రాంతంవైపుకు సాగించే తన ప్రయాణంలో హెన్రీ స్టాన్‌లీ అనే అన్వేషకునికి తాను స్థానిక డోళ్ల చప్పుళ్ల వల్ల వచ్చే ప్రయోజనాలను గురించి ఆలోచించే అవకాశం కొంత దొరికింది. ఆయనకూ ఆయన తోటి ప్రయాణికులకూ తెలియజేసిన ఆ డోళ్ల సందేశాన్ని ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పవచ్చు: యుద్ధం. ఈటెలను ధరించిన క్రూరులైన యుద్ధశూరుల దాడికి వాళ్లిక గురికాబోతున్నారని వారు వినిన మంద్రస్థాయిలో మ్రోగుతున్న డోళ్ల చప్పుళ్లకు అర్థం.
అటు తర్వాత, మరింత శాంతియుతమైన కాలంలో డోళ్లు యుద్ధానికి సన్నద్ధం చేయడంతోపాటూ మరితర విషయాల్ని కూడా వ్యక్తపర్చగలవని స్టాన్‌లీ తెల్సుకున్నాడు. కాంగో తీర ప్రాంతంలో జీవించిన ఓ జాతికి చెందిన గుంపును వర్ణిస్తూ స్టాన్‌లీ ఇలా రాశాడు: “[వాళ్లు] ఎలక్ట్రిక్ సంకేతాల్ని ఇంకా అనుసరించకపోయినా, దానికి దీటైన ఓ వార్తా పంపిణీ విధానాన్ని కల్గివున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో మ్రోగించబడే వారి పెద్దపెద్ద డోళ్లు నోటి భాష అర్థమైనంత స్పష్టంగా అర్థమయ్యేలా ఆ భాషను తెలియజేస్తాయి.” బాకా సంకేతం కన్నా లేక సైరన్ కన్నా ఎంతో దూరం వాయిద్యగాళ్లు పంపించారని స్టాన్‌లీ గ్రహించాడు; డోళ్లు నిర్దిష్టమైన సందేశాల్ని తెలియజేయగలవు.
అలాంటి సందేశాలు గ్రామం నుండి గ్రామానికి ప్రసారం చేయబడగలవు. కొన్ని డోళ్ల చప్పుళ్లు—విశేషంగా వాటిని కదులుతున్న పడవలో నుండో లేక ఓ కొండ శిఖరంపై నుండో రాత్రివేళల్లో వాయించినప్పుడు—ఎనిమిది నుండి పదకొండు కిలోమీటర్ల దూరం వరకూ వినబడ్డాయి. దూరానవున్న డోలు-వాయిద్యకారులు వాటిని విని, అర్థం చేసుకొని, ఆ సందేశాల్ని ఇతరులకు అందజేసేవారు. ఆంగ్లేయుడైన ఎ.బి. లొయడ్ అనే ఓ ప్రయాణికుడు 1899లో ఇలా రాశాడు: “ఓ గ్రామం నుండి 160 కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరంలో ఉన్న మరో గ్రామానికి 2 గంటలకన్నా తక్కువ సమయంలో ఓ సందేశాన్ని పంపించవచ్చని నాకు చెప్పబడింది, అంతకన్నా తక్కువ సమయంలో ఓ సందేశాన్ని పంపించడం సాధ్యమౌతుందని నేను నమ్ముతున్నాను.”
ఈ 20వ శతాబ్దం వరకూ, డోళ్లు సమాచారాన్ని వ్యక్తపర్చడంలో ఓ ప్రాముఖ్యమైన పాత్రను ఎడతెగకుండా నిర్వహించాయి. 1965లో ప్రచురించబడిన ఆఫ్రికా సంగీత సాధనాలు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా తెలియజేసింది: “మాట్లాడే డోళ్లు టెలిఫోన్లవలే, టెలిగ్రాఫ్‌లవలే ఉపయోగించబడ్డాయి. అన్నిరకాలైన సందేశాల్నీ పంపించాయి అంటే జనన మరణాల్నీ, వివాహాల్నీ, క్రీడా సంఘటనల్నీ, నాట్యాల్నీ, ఆచారకర్మల్నీ ప్రభుత్వ సందేశాల్నీ, యుద్ధాన్నీ ప్రకటించడానికి పంపించాయి. కొన్నిసార్లు డోళ్లు పుకార్లనూ లేక హాస్యోక్తులను చేరవేస్తాయి.”
అయితే డోళ్లు ఎలా భాషించగలిగాయి? యూరప్‌లోనూ ఇతరత్రా ప్రదేశాల్లోనూ, సందేశాలు టెలిగ్రాఫిక్ లైన్లద్వారా ఎలక్ట్రిక్ ప్రచోదనాలచే పంపించబడేవి. అక్షరమాలలోని ప్రతీ అక్షరానికీ ఓ సంకేతం ఇవ్వబడింది గనుక, పదాలూ వాక్యాలూ ఒక్కోసారి ఒక్కొక్క అక్షరంగా రూపొందించబడేవి. అయితే, మధ్య ఆఫ్రికాలోని ప్రజలకు లిఖిత భాషలేదు గనుక, డోళ్లు పదాల్ని రూపొందించలేవు. ఆఫ్రికాలోని డోలు-వాయిద్యగాళ్లు ఓ విభిన్నమైన పద్ధతిని ఉపయోగించేవారు.
డోళ్ల భాష
డోళ్ల పరస్పరసంభాషణను అర్థంచేసుకోవడానికి కీలకం, ఆఫ్రికా భాషల్ని తెల్సుకోవడంపైనే ఆధారపడివుంది. మధ్య ఆఫ్రికాలోని, పశ్చిమ ఆఫ్రికాలోని అనేక భాషలు ద్విస్వరంగల భాషలు అంటే మాట్లాడే ప్రతీ పదంలో ఉన్న ప్రతీ పదాంశమూ రెండు ప్రాథమిక స్వరాల్ని—ఎగువస్థాయి స్వరాన్నైనా లేక దిగువస్థాయి స్వరాన్నైనా కల్గివుంది. స్వరమార్పిడి పదాన్ని మారుస్తుంది. ఉదాహరణకు, జైరీ దేశపు భాషయైన కలిలో లీషాకా అనే పదాన్ని పరిశీలించండి. ఆ పదంలో ఉన్న మూడు అక్షరాల్నీ దిగువస్థాయి స్వరంలో ఉచ్ఛరించినప్పుడు దాని భావం “బురదగుంట లేక చిత్తడినేల” అని అర్థం; ఆ అక్షరాల్ని వరుసగా దిగువ-దిగువ-ఎగువ స్థాయిల్లో ఉచ్ఛరిస్తే ఆ పదభావం “వాగ్దానం”; దిగువ-ఎగువ-ఎగువ స్థాయిల్లో ఉచ్ఛరిస్తే దాని భావం “విషం.”
ఆఫ్రికా స్లిట్-డోళ్లు అందజేసే సందేశాలు కూడా రెండు స్వరాల్ని అంటే ఎగువస్థాయి, దిగువస్థాయి స్వరాల్ని కల్గివున్నాయి. అదే విధంగా, పై భాగం తోలుతో అంటించబడిన డోళ్లు సందేశాన్ని పంపించినప్పుడు అవి జతలుగా ఉపయోగించబడేవి. అంటే ఎగువస్థాయీ స్వరాన్ని కల్గివున్న డోలూ, దిగువస్థాయీ స్వరాన్ని కల్గివున్న మరో డోలుల సమ్మేళనంతో కూడిన జతడోళ్లు ఉపయోగించబడేవి. ఆ విధంగా, డోలు వాయించడంలో నైపుణ్యంగలవాడు, మాట్లాడు భాషను రూపొందించే పదాల స్వర నమూనాను అనుసరించడం ద్వారా భాషిస్తాడు. ఆఫ్రికాలోని మాట్లాడే డోళ్లు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “డోళ్ల భాషని పిలువబడే ఈ భాష, తెగలు మాట్లాడే భాషను పోలి ఉంటుంది.”
ద్విస్వర భాష, సమరూపంగల స్వరాలతోనూ, అక్షరాలతోనూ ఉన్న అనేక పదాల్ని సాధారణంగా కల్గివుంటుంది. ఉదాహరణకు, కలి భాషలో, దాదాపు 130 నామవాచకాలు—షాన్‌గో (తండ్రి) అనే నామవాచకం కల్గివున్నట్టుగానే—ఒకే విధమైన స్వర నమూనాను (ఎగువ-ఎగువ) కల్గివున్నాయి. 200 కన్నా ఎక్కువ నామవాచకాలు—న్యాన్‌గో (తల్లి) అనే నామవాచకం కల్గివున్నట్లుగానే—ఒకే విధమైన స్వర నమూనాను (దిగువ-ఎగువ) కల్గివున్నాయి. గందరగోళం లేకుండా జాగ్రత్తపడేందుకు, చెప్పబడిన దాన్ని వినేవాళ్లు అర్థంచేసుకొనగల్గేలా తగినంత స్వరబేధాన్ని కల్గివున్న సుపరిచితమైన క్లుప్తంగా ఉండే పదబంధంలో వాటిని పొందుపరుస్తూ డోళ్లు వాయించేవాళ్లు అలాంటి పదాలకు సందర్భాన్ని తెలియజేస్తారు.
స్లిట్ డోళ్లతో మాట్లాడడం
ఒక రకమైన మాట్లాడే డోలే, కర్రతోచేసిన స్లిట్ డోలు. (19వ పేజీలోవున్న చిత్రాన్ని చూడండి.) అలాంటి డోళ్లు ఎండిపోయిన చెట్టు మొద్దును తొలవడం ద్వారా రూపొందించబడ్డాయి. డోలు ఇరుప్రక్కలా చర్మపు అంటింపులేదు. చిత్రంలోవున్న ఈ డోలుకు రెండు స్లిట్‌లు ఉన్నప్పటికీ, అనేకమైన డోళ్లకు ఒకే ఒక పొడవైన స్లిట్ ఉంటుంది. స్లిట్ అంచుపై ఒక్కసారి వాయిస్తే ఎగువస్థాయీ స్వరం వెలువడుతుంది; మరో అంచుపై వాయిస్తే దిగువస్థాయీ స్వరం వస్తుంది. స్లిట్ డోళ్లు సాధారణంగా ఓ మీటరు పొడవుంటాయి. అయితే, అవి అర మీటరంత పొట్టిగానూ ఉండొచ్చు లేక రెండు మీటర్లంత పొడవుగానూ ఉండొచ్చు. వాటి వ్యాసం 20 సెంటీమీటర్ల నుండి దాదాపు ఓ మీటరువరకూ వ్యాపించి ఉండవచ్చు.
స్లిట్ డోళ్లు కేవలం గ్రామగ్రామానికీ సందేశాల్ని పంపించడానికేగాక ఇతరత్రా కూడా ఉపయోగించబడేవి. కామెరూన్‌కి చెందిన రచయితయైన ఫ్రాన్సిస్ బెబా, కుస్తీపోటీల్లో ఈ డోళ్లు నిర్వహించే పాత్రను గురించి వర్ణించాడు. గ్రామ కూడలిలో కల్సుకునేందుకు పోటీపడే రెండు జట్లు సన్నద్ధమైనప్పుడు, స్లిట్ డోళ్లు యోధుల్నిగూర్చి కీర్తిస్తుండగా అవి చేసే చప్పుళ్లకు లయబద్ధంగా ఆ యోధులు నాట్యంచేసేవాళ్లు. ఓ పక్షానికి చెందిన డోలు ఇలా ప్రకటించవచ్చు: “యోధుడా నీకు సాటియైన వాడెప్పుడైనా నీకు తారసపడ్డాడా? నీతో పోటీకి రాగల వాడెవడు, వాడెవడో మాకు చెప్పు? ఈ బక్క ప్రాణులు . . . తాము యోధుడని పిలిచే ఈ బక్క [ప్రాణి]తో నిన్ను ఓడించగలమని అనుకుంటున్నారు . . . , నిన్నెవ్వరూ ఎన్నటికీ జయించలేరు.” ప్రత్యర్థి శిబిరంలోని వాయిద్యకారులు ఈ సముచిత ఎద్దేవాలను గ్రహించి, వెంటనే సామెతల రూపంలో ఈ ప్రత్యుత్తరాన్ని వాయిస్తారు: “చిన్నకోతీ . . . చిన్నకోతీ . . . వాడు చెట్టును ఎక్కాలనుకుంటున్నాడు కానీ వాడు పడిపోతాడని ప్రతిఒక్కరూ అనుకుంటారు. అయితే ఆ చిన్న కోతి మొండి ఘటం, వాడు చెట్టుమీదనుండి పడడు, చెట్టు చివరకంటూ ఎక్కుతాడు, ఈ చిన్న కోతి.” ఆ డోళ్లు, కుస్తీపోటీ ముగిసేంతవరకూ వినోదపరుస్తాయి.
అందరి శ్రేయస్సు కొరకూ మాట్లాడే డోళ్లు
ఒత్తిడి డోళ్లు ఓ అడుగు ముందున్నాయి. కుడివైపునున్న చిత్రంలో మీరు చూసే డోలు, డున్‌డున్ అని పిలువబడుతుంది; ఇది నైజీరియాలోని, ప్రసిద్ధిగాంచిన యరూబా మాట్లాడే డోలు. ఇసుక గడియారపు ఆకృతిని పోలిన ఈ డోలు రెండు వైపుల చివరన చర్మపుపొరను కల్గివుంది. అది కమిలిన పల్చని మేకలచర్మాన్నుండి చేయబడింది. ఆ చర్మపుపొరలు తోలుపట్టీలచే కలుపబడ్డాయి. ఆ తోలుపట్టీలు నొక్కబడినప్పుడు, ద్విగుణీకృతమైన స్థాయితో లేక అంతకన్నా ఎక్కువ స్థాయితో స్వరాల్ని ఉత్పన్నం చేయగల్గేలా చర్మపుపొరలపై ఒత్తిడి పెరుగుతుంది. వంపుతిరిగిన వాయిద్యపుకర్రను ఉపయోగించడం ద్వారానూ, ధ్వనుల స్థాయినీ, తాళగతుల్నీ మార్చడం ద్వారానూ నిపుణుడైన డోలు వాయిద్యకారుడు మానవ స్వరంలోని తారాస్థాయినీ మంద్రస్థాయినీ అనుకరించగలడు. ఆ విధంగా, డోలు వాయిద్యకారులు డోళ్ల భాషకు అర్థం తెల్సుకుని తిరిగి వాయించే ఇతర వాయిద్యకారులతో “సంభాషణల”ను నిర్వహించగలరు.
ఒక యరూబా నాయకుని యొక్క సంగీతకారుల దర్బారు, 1976 మే నెలలో డోళ్లను ఉపయోగిస్తూ పరస్పర సంభాషణను కొనసాగించడంలో వాయిద్యకారుల విశిష్టమైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ప్రేక్షకుల్లో నుండి కొందరు స్వచ్ఛందంగా, ముఖ్య వాయిద్యగానికి ఉపదేశాల పరంపరను అందిస్తారు. తిరిగి అతడు వాటిని ఆ దర్బారుకు దూరంగావున్న మరో వాయిద్యకారునికి డోలు వాయించడంద్వారా అందిస్తాడు. డోళ్లు వాయించడం ద్వారా ఇవ్వబడిన ఉపదేశాలకు ప్రతిస్పందిస్తూ, వాయిద్యకారుడు ఒకచోట నుండి మరోచోటుకి వెళ్లాడు. అలాగే తాను వేటిని చేయాలని కోరబడతాడో వాటిని నెరవేర్చాడు.
వాయించబడిన సందేశాన్ని పంపించడమెలాగో నేర్చుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. పరిశీలకుడైన రచయితయగు ఐ. లొయే ఇలా చెబుతున్నాడు: “యరూబా డోలును వాయించడం సంక్లిష్టమైన కష్టమైన ఓ కళ. దానికి అనేక సంవత్సరాలపాటు అధ్యయనం అవసరమవుతుంది. వాయిద్యగానికి వేళ్ళతో నొక్కి వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కల్గివుండడమూ, లయబద్ధతను గ్రహించడమూ మాత్రమేగాక తాను డోలు వాయించే పట్టణాన్ని గూర్చిన పద్యాల్నీ, చరిత్రనూ బాగా జ్ఞాపకం ఉంచుకోవడం కూడా అవసరం.”
ఆఫ్రికాలోని డోళ్లు సంగీతంలో ఇంకా ఓ ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తున్నప్పటికీ, అవి ఇంతకు మునుపున్నంత విస్తృతంగా ఇటీవలి దశాబ్దాల్లో మాట్లాడడంలేదు. ఆఫ్రికాలోని సంగీత సాధనాలు అనే పుస్తకం ఇలా చెబుతోంది: “డోళ్లపై సందేశాల్ని వాయించడాన్ని నేర్చుకోవడం ఎంతో కష్టం; కాబట్టి, ఆఫ్రికానుండి ఈ కళ త్వరగా గతించిపోతోంది.” ప్రకటనా మాధ్యమాల నిపుణుడైన రాబర్ట్ నికోలస్ ఇలా చెబుతున్నాడు: “వేటి స్వరాలు మైళ్లకొద్దీ ప్రయాణించేవో, వేటి ప్రధాన ధ్యేయం సందేశాల్ని పంపించడంగా ఉండేదో ఆ మునుపటి పెద్దపెద్ద డోళ్లు కాలగర్భంలో కల్సిపోవాల్సివచ్చింది.” ఈ రోజుల్లో అనేకమంది టెలిఫోన్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉన్నట్టు కనుగొంటారు.
[19వ పేజీలోని చిత్రాలు]
స్లిట్-డోలు
[19వ పేజీలోని చిత్రాలు]
యరూబా మాట్లాడే డోలు