నది ఒడ్డున రత్నాలు
స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
నది దగ్గరకు లేదా చెరువు దగ్గరకు నేను వాహ్యాళికి వెళ్ళినప్పుడెల్లా, నా అభిమాన రత్నాల కోసం ఎడతెగక వెదుకుతాను—అవి ఎరుపైనా, నీలి రంగువైనా లేదా ఆకుపచ్చ రంగువైనా కావచ్చు. ఒక రత్నం కొన్నిసార్లు కదలకుండా ఆకు మీద పడివుండడం నాకు కనిపిస్తుంది; మరొకటి నీటి చుట్టూ రెక్కలు రెపరెపలాడిస్తూ వెళ్ళడం లేదా నా ముందే దూసుకు వెళ్ళడం కనిపించవచ్చు. నేను వెదికే రత్నం తూనీగే—కీటక లోకంలోని ప్రకాశమానమైన “హెలికాప్టర్”.
చాలా సంవత్సరాల క్రితం, దట్టంగా పెరిగిన చెట్లు గల ప్రదేశంలో బద్దకంగా ప్రవహిస్తున్న నదివైపుకు నేను అనుకోకుండా వెళ్ళినప్పుడు ఎగురుతున్న ఈ రత్నాలు మొదటిసారిగా నా కంటబడ్డాయి. సూర్యకాంతిలోకి వస్తూ వెళ్తూ ఉన్న అనేక తూనీగలు—కొన్ని ప్రకాశమానమైన కాంతులీనుతున్న నీలి వర్ణంలో ఉన్నాయి, మిగిలినవి తళుక్కులీనే ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ కలగలిసిన వర్ణంలో ఉన్నాయి. అవి గాలిలో నాట్యం చేస్తుండగా వాటిని చూస్తూ గంట సేపు గడిపాను. ఆ నాట్యం అడవిలోని ఖాళీ ప్రదేశాన్ని చిన్ని నృత్తశాలగా మార్చింది. అప్పటి నుండి అవి నాకు ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి.
నేను తూనీగల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకున్నానో, వాటి అందాన్ని, సామర్థ్యాన్ని గూర్చి అంత ఎక్కువగా మెచ్చుకుంటున్నాను. తూనీగలకు డామ్‌సెల్ ఈగకు తేడా ఉందన్నది నేను కనుగొన్న మొదటి విషయం. తూనీగలు చాలా శక్తివంతంగా ఎగరగలుగుతాయి. సాధారణంగా పెద్దగా ఉంటాయి. అయితే డామ్‌సెల్ ఈగలు వాటి ఆంగ్ల పేరు సూచిస్తున్నట్లే అందంగా ఉండి చాలా నెమ్మదిగా ఎగురుతాయి. రెక్కలను ఎలా ఉంచుతాయి అన్నదానిలో పెద్ద తేడా ఉంది. విశ్రాంతి తీసుకునేటప్పుడు, తూనీగ రెండు జతల రెక్కలనూ చాచి ఉంచుతుంది. అయితే డామ్‌సెల్ ఈగ తన రెక్కలను తన దేహం మీద మడిచి పెట్టుకుంటుంది.a
తూనీగలు గాలిలోని దోమలను అంత సులభంగా ఎలా పట్టుకోగలుగుతాయి అని ఆశ్చర్యపడనారంభించాను. నా విషయానికొస్తే, వంటగదిలోని గోడ మీద ఉన్న పెద్ద ఈగను కొట్టడం నాకు దాదాపు అసాధ్యంగా ఉంటుందని తెలుసుకున్నాను. ‘నాకు లేనిది తూనీగకు ఏముంది?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. రెండు విషయాలు: గాలిమీద పూర్తిపట్టు. కావలికాసే వ్యక్తికి కూడా అసూయ కలిగించేటువంటి కళ్ళు.
తూనీగ ఎగరడం
తూనీగను హెలికాప్టర్ అనడం—స్పెయిన్‌లో దాని సామాన్యమైన ముద్దు పేరు—నిజానికి తక్కువదానితో పోల్చడమే. గాలిలో వాటి గారడీ విన్యాసాలు ఎంత వేగంగా ఉంటాయంటే, వాటిని చూడడం మన కళ్ళకు కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటుంది. అకస్మాత్తుగా కొద్దిపాటి తీవ్ర ప్రయత్నంతో కొన్ని జాతుల తూనీగలు గంటకు దాదాపు 55 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని చేరుకోగలవు. అలాగే అవి వెనక్కి, ముందుకు, లేదా ప్రక్కలకు ఎంతో వేగంగా రెక్కలాడిస్తూ లేదా ఎగురుతూ వెళ్ళగలవు. అంతేకాక, తూనీగ గాలిలో అకస్మాత్తుగా మలుపు తిరిగినప్పుడు 2.5 G’ల శక్తిని ఎదుర్కోవలసిందేనని శాస్త్రజ్ఞులు లెక్కలు వేస్తున్నారు.
సులభంగా వంగే లేసులాంటి రెండు జతల రెక్కలు తూనీగలకుంటాయి. ఈ రెక్కలు సున్నితంగా ఉంటాయి. కానీ అవి సెకండుకు 40 సార్లు తమ రెక్కలాడించగలవు. చిన్న దెబ్బలను తట్టుకోగలవు. రాబన్ జె. ఉటన్ అనే జీవశాస్త్రజ్ఞుడు ఆ రెక్కలు “తెలివైన రూపకల్పన యొక్క చిన్న సాధనలు” అని వర్ణిస్తున్నాడు.
“కీటకాల రెక్కలు పనిచేయడాన్ని గురించి మనమెంత అధికంగా అర్థం చేసుకుంటామో, వాటి రూపకల్పనలు అంత తెలివైనవిగా, అంత అందమైనవిగా కనిపిస్తాయి. . . . వాటికి సమానమైన సాంకేతికాలు ఏమైన ఉన్నా అవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి” అని ఆయన జతచేస్తున్నాడు. తూనీగ ఎగిరే టెక్నిక్‌లను వైమానిక ఇంజనీర్లు ఇప్పుడు అధ్యయనం చేయడంలో ఆశ్చర్యం లేదు.
తల నిండా కళ్ళు
తూనీగ ఎగిరే విధానం అసాధారణమనంటే, దాని కంటిచూపు కూడా అంతే అసాధారణమైనదని చెప్పగలం. పెద్ద సంయుక్త కళ్ళు తూనీగ తల మీద దాదాపు అంతా వ్యాపించి ఉంటాయి. ఒక్కో కన్నులో 30,000 మేరకు షడ్బుజాలుగల యూనిట్లు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి ప్రత్యేక ప్రతిబింబాన్ని మెదడుకు పంపిస్తాయి కనుక అవి ఒక కంటిలోనే ఉండే చిన్ని కళ్ళ వంటివి. అయితే దానర్థం, తూనీగ ఒకే సమయంలో వేలకొలది విభిన్న దృశ్యాలను చూస్తుందని కాదు. మనం చూస్తున్నట్లు పూర్ణ చిత్రాన్ని కాక, అది చలనాన్ని, మాదిరులను, తేడాలను, ఆకారాలను గుర్తిస్తుంది.
ఆ ప్రతిబింబాలకన్నింటికీ విశ్లేషణ అవసరం. కనుక, తూనీగ మెదడులోని 80 శాతం దృశ్య సమాచారాన్ని మదింపు చేసుకునేందుకు అంకితం చేయబడుతుంది. దాదాపు 20 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే దోమలను కనిపెట్టగలిగేందుకు తూనీగలకున్నంతటి గ్రహణశక్తి గల దృక్ వ్యవస్థలు చాలా అరుదుగా ఉన్నాయి. చీకటిలో కూడా, చిన్ని ఈగలను మానవులు చూడలేనంతటి మసక వెలుతురులో కూడా ఉష్ణమండల తూనీగలు దోమలను సులభంగా పట్టుకుంటాయి.
ఒక తూనీగ వేగంగా, మిస్సైల్ వేగంతో నది ప్రక్కనున్న మొక్కల గుండా వెళ్ళేందుకు రెప్పపాటులో వందల కొలది తీర్మానాలు తీసుకోవలసిన అవసరముంటుంది. అది ప్రతి సెకండుకు మనం చూసేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువ ప్రతిబింబాలను అంటే వంద మేరకు విభిన్న ప్రతిబింబాలను చూడగలదు కనుకనే ఆశ్చర్యకరంగా క్షణాల్లో అన్ని తీర్మానాలను తీసుకోగలుగుతుంది. అలా, సెకండుకు 24 ప్రతిబింబాలను ప్రొజెక్ట్ చేసే ఒక చలనచిత్రం తూనీగకు ఫోటోల పరంపరలా కనిపిస్తుంది.
జీవనరీతిలో తేడా
తూనీగ తన జీవితాన్ని ఆరంభించినప్పుడు, అది చివరకు ఆకర్షణీయమైన విజయవంతమైన వైమానికునిగా మారుతుందన్న ఏ సూచనా ఉండదు. గ్రుడ్లు పొదగబడిన తర్వాత నీళ్ళలో ఉండే డింభకం తను అందుకోగల్గే దూరంలోకి ఏ ఆహార పదార్థం వచ్చినా లాగించేందుకు చెరువులో లేదా ఏటిలో దాదాపు కదలకుండా వేచి ఉంటుంది. అనేక నెలల తర్వాత లేదా కొన్ని జాతుల తూనీగల విషయంలో అయితే అనేక సంవత్సరాల తర్వాత చర్మంలో అనేక మార్పులు వచ్చిన డింభకం జమ్ము మీదకు ఎక్కుతుంది. అక్కడ అసాధారణమైన రీతిలో అది పరిణామం చెందుతుంది.
దాని ఉదరం మీదుగా ఉన్న చర్మం చీలిపోయి, పూర్తిగా రూపొందిన తూనీగ బయటకు పాకుతుంది. సీతాకోక చిలుక లాగే, క్రొత్తగా బయటికి వచ్చిన పరిపక్వత చెందిన తూనీగ తన రెక్కలు గట్టిపడే వరకు, క్రొత్త జీవితం ఆరంభమయ్యే వరకు కొన్ని గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అది విజయవంతంగా వేటాడేందుకూ ఎగిరేటప్పుడు కలిగే ఆటంకాలను అధిగమించేందుకు దానికి గల సహజ జ్ఞానం తోడ్పడుతుంది.
ఎగురుతున్న ఈగలను దోమలను పట్టుకోవడంలో యువ తూనీగ త్వరలోనే నిపుణురాలవుతుంది. తనంత బరువే ఉన్న కీటకాలను ప్రతిరోజు మింగుతూ, వెలకట్టలేనంత సేవను అందిస్తుంది. నమ్మదగిన ఆహార సరఫరాను నిశ్చయపరచుకునేందుకు అనేక మగ తూనీగలు చిన్న చిన్న ప్రదేశాలను వాటి సరిహద్దులను ఏర్పరచుకుని అప్రమత్తతో వాటికి కావలికాస్తాయి.
కొన్ని జాతుల తూనీగలు యాఫిడ్‌లను లేదా కుమ్మరి పురుగులను వేటాడుతాయి, మరి కొన్ని జాతుల తూనీగలు చిన్ని చిన్ని కప్పలను పట్టుకుంటాయి, ఉష్ణమండల డామ్‌సెల్ ఈగ సాలెపురుగులను కూడా తింటుంది. అది పెద్ద ఆర్బ్‌సాలెపురుగు గూడు చుట్టూ తిరుగుతూ, ఆ సాలెగూటి యజమానియైన సాలెపురుగు వదిలి పెట్టిన ఆహార పదార్థాలను భుజించేందుకు వచ్చే చిన్న సాలెపురుగులను పట్టుకుంటుంది.
పరిణామ విరుద్ధ రుజువు
తూనీగలు ఎగిరే కీటకాల్లో మొదటివని చాలా మంది పరిణామవాద శాస్త్రజ్ఞులు పరిగణిస్తున్నారు. ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు 75 సెంటీమీటర్ల నిడివిగల తూనీగ యొక్క ముద్రే ఫ్రాన్స్‌లో కనుగొనబడిన శిలాజం! ఇది తెలిసిన కీటకాలన్నింటిలోకెల్లా అతి పెద్దది. జీవిస్తున్న ఏ తూనీగ కన్నా మూడు రెట్ల పెద్ద పరిమాణం గలది.
‘మానవునికి తెలిసిన అత్యంత సంకీర్ణమైన ఎగిరే యంత్ర వ్యవస్థల్లో ఒకటి దానంతట అదే అస్తిత్వంలోకి రావడం ఎలా సాధ్యమౌతుంది, అదీ సంపూర్ణ ఎదుగుదలతో?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. “రెక్కలు గల కీటకాలు లేదా రెక్కలు లేని కీటకాలు కాక మధ్య రకం కీటకాల శిలాజాలు లేవు” అని ఏలియన్ ఎంపైర్—ఆన్ ఎక్స్‌ప్లొరేషన్ ఆఫ్ ది లైవ్స్ ఆఫ్ ఇన్‌సెక్ట్స్ అనే పుస్తకం ఒప్పుకుంటుంది. తూనీగలు అనేవి తెలివైన నిపుణుడైన రూపనిర్ణేత చేతిపని అన్నది స్పష్టమౌతుంది.
తూనీగలు భూగోళంలో దాదాపు ప్రతిచోటా విజయవంతంగా కాలనీలను ఏర్పరచుకున్నాయి. ఆల్పైన్ చెరువు ప్రక్కన, భూమధ్యరేఖా ప్రాంతంలోని బురద నేలల ప్రక్కన, లేదా నగర శివార్లలోని స్విమ్మింగ్ పూల్ ప్రక్కన కూడా అవి నివాస స్థలాలను ఏర్పరచుకుంటాయి.
ఆఫ్రికాలోని ఉష్ణమండల బీచ్‌లలోని తూనీగల సమూహాలను, అలాగే, చక్రవర్తి తూనీగలు ఒంటరిగా అవిరామంగా తమకిష్టమైన యూరప్ చెరువు చుట్టూ పహారా చేస్తూ ఉండడాన్ని చూశాను. ఫిలిప్పైన్స్‌లో ఆకులతో నిండిన లోయ వాగులో గుండా ఒక పడవలో నేను ప్రయాణిస్తుండగా, ప్రకాశవంతమైన డామ్‌సెల్ ఈగలు కాపలాగా వస్తున్నాయా అన్నట్లు నా వెంట వచ్చాయి. నగ్నమైన నా బాహువులపైన వాలాయి కూడా.
భూమిమీది అత్యంత సంకీర్ణమైన ఎగిరే యంత్రాల జాబితాలో తూనీగలు ఉండవచ్చేమో గానీ, ఎగిరే వాటి సామర్థ్యాల కన్నా, వాటి హుందాతనం, మరియు అందం వల్లే నేనెక్కువగా ఆకర్షితుడనయ్యాను. వాటి సాన్నిధ్యం మన చెరువులకు, నది ఒడ్డులకు ప్రత్యేక కాంతిని ఇస్తాయి. అవి ఆదర్శ రత్నాలు—వాటిని చూసి ఆనందించేందుకు అవి ఎల్లప్పుడూ అక్కడ ఉంటాయి.
[అధస్సూచి]
a అప్పుడప్పుడు, తూనీగలు తమ రెక్కలను క్రిందివైపుకు చాచి, తమ శరీర పైభాగాన్ని సూర్యునివైపుకు ఉంచుతాయి. రెక్కలను అలా క్రిందివైపుకు చాచి ఉంచడం వల్ల శరీరానికి ఎక్కువ ఎండ తగలదు. ఈ పద్ధతిలో తూనీగలు శరీరాన్ని చల్లబరచుకుంటాయి.
[16, 17వ పేజీలోని చిత్రాలు]
తూనీగలు తమ రెక్కలను చాచి ఉంచుతాయి. సాధారణంగా తమ రెక్కలను తమ శరీరాలపైన మడిచి పెట్టుకునే డామ్‌సెల్ ఈగల కన్నా పెద్దగా ఉంటాయి