“అంధకార యుగంలో ఒక కాంతికిరణం”
జర్మనీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
నాజీ యుగంలోని యెహోవాసాక్షుల చరిత్రను గురించి ఒక చరిత్రకారుడు చేసిన వర్ణన అది. జర్మనీలోని రావన్స్‌బ్రూక్ మెమోరియల్‌లో జెహోవాస్ విట్‌నెసెస్ స్టాండ్ ఫర్మ్ అగైన్‌స్ట్ నాజీ అస్సాల్ట్ అనే వివరణాత్మక వీడియో లోకానికి మొదటిసారిగా ప్రదర్శించిన సందర్భమది. నాజీ యుగానికి చెందిన ఇప్పటికీ జీవించివున్న 24 మందితో పాటు చరిత్రలోనూ మతసంబంధ విషయాల్లోనూ విద్వాంసులైన 10 మంది చెప్పినటువంటి ధైర్యమూ మరియు విశ్వాసములను గూర్చి కదిలించేటటువంటి వృత్తాంతాన్ని ఈ వీడియో వివరిస్తుంది.
రావన్స్‌బ్రూక్ కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపులో ఒకప్పుడు వందలాది యెహోవాసాక్షులు ఉంచబడ్డారు. 50 సంవత్సరాల కన్నా పూర్వం నాజీలచేత చెరసాలలో వేయబడిన సాక్షుల్లో ఇప్పటికీ బ్రతికివున్న కొందరు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. వాళ్ళూ, అలాగే చరిత్రకారులూ ప్రభుత్వాధికారులూ భయం రాజ్యమేలిన యుగాన్ని, నాజీ పరిపాలన యూరోప్ అంతా వ్యాపించిన అంధకార యుగాన్ని గుర్తుచేసుకున్నారు. తమ విశ్వాసాన్ని త్యజించే బదులు మరణించేందుకే ధైర్యాన్ని చూపిన వందలాది మంది సాక్షుల క్రైస్తవ యథార్థతను గూర్చిన ప్రేరణాత్మక వృత్తాంతాలను దాదాపు 350 మంది ప్రేక్షకులు విన్నారు.
వార్తా మాధ్యమాలు నోట్ చేసుకున్నాయి
ప్రదర్శన జరిగిన రోజున, అంటే 1996 నవంబర్ 6 ఉదయాన బెర్లిన్ హోటల్‌లో పత్రికా సమావేశం జరిగింది. పత్రికా విలేఖరులు ఆ వీడియో ఫిలిమ్ చూశారు. అంతగా ఎవరికీ తెలియనిదైన, అయితే చరిత్రలో ప్రాముఖ్యమైనదైన దశను తెలియజేసే క్రొత్త వివరణాత్మక వీడియో ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానిస్తూ విద్వాంసులు చేసిన ప్రసంగాలను విన్నారు. “మనం—యెహోవాసాక్షులు మరియు యెహోవాసాక్షులు కానివారు—వంగవన్నె త్రికోణము [సాక్షులైన ఖైదీలు ధరించిన చిహ్నం] గల ఖైదీల చరిత్రను మరవడానికి అనుమతించకూడదు. అది అంధకారయుగంలో ఒక కాంతి కిరణం” అని నూన్‌గామ్ మెమోరియల్ డైరెక్టరైన డా. డట్‌లెఫ్ గార్బ్ వివరించాడు.
నాజీ హింసను అధిగమించిన, స్టాండ్ ఫర్మ్ వీడియోలో కనిపించిన అనేక మంది సాక్షులు తమ అనుభవాలను చెప్పడానికి అక్కడ ఉన్నారు. వారు తాము పడ్డ కష్టాలను బట్టి ద్వేషంతో ఉన్నారా? అలాంటిదేమీ లేదని వాళ్ళ ప్రశాంతమైన కాంతివంతమైన ముఖాలు సూచిస్తున్నాయి.
ప్రశ్నాజవాబుల సమయం తర్వాత, దాదాపు 64 కిలోమీటర్ల దూరానున్న రావన్స్‌బ్రూక్ మెమోరియల్‌లో స్టాండ్ ఫర్మ్ అనే వివరణాత్మక వీడియో ప్రదర్శనను చూసేందుకు ఆ విలేఖరులు ఆహ్వానించబడ్డారు. దాదాపు అందరూ ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు.
తొలిప్రదర్శన
చల్లని శరదృతువులో బయట ఆకాశం మబ్బు మబ్బుగా ఉండి, బాగా చినుకులు పడుతుండగా, రావన్స్‌బ్రూక్ మెమోరియల్ ప్రక్కనే క్రొత్తగా నిర్మించబడిన హాల్ లోపలి వాతావరణం ఉత్తేజకరంగా ఉంది. ఆ సమయంలో రావన్స్‌బ్రూక్, సాక్సెన్‌హాసన్, బ్రాండెన్‌బర్గ్ మెమోరియల్‌ల ఫౌండేషన్ డైరెక్టరైన ప్రొఫెసర్ జూర్‌గన్ డిట్‌బర్నర్ ఇలా చెప్పాడు: “జాతీయ సామ్యవాదం క్రింద యెహోవాసాక్షులు చూపించిన నైతిక ధైర్యాన్ని గౌరవించవలసిందే. . . . తమ విశ్వాసాన్ని త్యజించక, దాని కొరకు బాధలననుభవించిన లేక మరణించవలసి వచ్చిన ఈ ప్రజలను గూర్చి ఎంతో గౌరవంతో స్మరించుకుందాం.”
జర్మనీలోని బ్రాన్‌డెన్‌బర్గ్ విద్యా, యువత, క్రీడా విషయాల మంత్రి అయిన ఆన్‌జేలీకా పేటర్ పంపిన ఒక సందేశం చదవబడింది. ఆ సందేశం ఇలా ఉంది: “యెహోవాసాక్షుల మాదిరికరమైన స్థయిర్యాన్ని నేడు మనం గుర్తు చేసుకోవడం ప్రాముఖ్యం.” “ఈ తొలి ప్రదర్శన కొరకు నేను ఆతురతతోనూ ఆనందంతోనూ ఎదురు చూస్తున్నాను. ఇది విశేష దినం. మనందరికీ ఇది విశేష దినం అని నేను నమ్ముతున్నాను” అని రావన్స్‌బ్రూక్ మెమోరియల్ డైరెక్టరైన డా. సీగ్రిట్ యాకోబైట్ అన్నాడు.
వీడియో ఆరంభించేందుకు లైట్లు డిమ్ చేయబడ్డాయి. నాజీ హింసను అధిగమించిన ఎనిమిది దేశాల నుండి వచ్చిన వారేకాక, ప్రేక్షకులందరూ కూడా జర్మన్ చరిత్రలోని ఆ అధ్యాయంలోని దుఃఖగాథను, విజయగాథను 78 నిమిషాలపాటు మనో నేత్రాలతో మళ్ళీ చూశారు. అత్యంత భయానకమైన పరిస్థితుల్లోనూ ప్రేమా విశ్వాసాలను కనబరచిన అసాధారణ క్రియలను గురించి ఈ సామాన్య ప్రజలు చెప్పినప్పుడు చాలా మంది కన్నీళ్ళు ఆపుకోలేకపోయారు.
కరతాళధ్వనులు సద్దుమణిగిన తర్వాత, బ్రాన్‌డెన్‌బర్గ్‌లో చంపబడిన ఒక సాక్షి వ్రాసిన చివరి మాటలను చరిత్రకారుడైన యోయాకీమ్ గోర్‌లిట్స్ చదివాడు. బ్రాన్‌డెన్‌బర్గ్ మెమోరియల్ అండ్ ఆర్కైవ్‌లో రెండువారాల క్రితం పరిశోధన చేస్తుండగా గోర్‌లిట్స్‌కు ఆ నోట్ కనిపించింది. గోర్‌లిట్స్ ఆ మెమోరియల్ డైరెక్టర్. తమ ప్రభువు ఎడల నమ్మకమైనవారిగా ఉండాలని తన తోటి విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఈ యథార్థవంతుడైన క్రైస్తవుడు వ్రాసిన మాటలను చదివేటప్పుడు భావోద్వేగంతో ఆయన తడబడ్డాడు. “మహిళల్లారా, సజ్జనులారా, యెహోవాసాక్షులను గూర్చిన ఫిలిమ్ మన విద్యాభ్యాస పనికి ముఖ్యమైన తోడ్పాటునిస్తుందనీ నేను నమ్ముతున్నాను” అని అంటూ గోర్‌లిట్స్ తన మాటలను ముగించాడు.
“ఈ ఫిలిమ్ ద్వారా ఒక ప్రాముఖ్యమైన క్రొత్త నిక్షేపం—మనం చాలా అరుదుగా విన్న నాజీ హింసను అధిగమించినవారి మాటలు . . . అధిగమించనివారి మాటలు—చేర్చబడింది” అని చరిత్రకారుడైన వుల్ఫ్ బ్రేబక్ ప్రకటించాడు. డా. గార్బ్ ఇలా జతచేశాడు: “దేవునిలో విశ్వాసమూ, బైబిలు వాగ్దానాల్లో నమ్మకమూ ఆ భయంకరమైన సమయంలో ఎదిరించేందుకు ఎవరికైతే శక్తినిచ్చాయో వారి ప్రాముఖ్యమైన అనుభవాలివి.”
ఆ కార్యక్రమానికి సముచితమైన ముగింపుగా, బ్రతికి ఉన్న ఆ సాక్షులనేకులు ప్రేక్షకులతో మరోసారి మాట్లాడారు. ధైర్యశాలులైన ఆ క్రైస్తవులకు అనేక శ్రమల కాలంలో శక్తినిచ్చిన ఆ దృఢ విశ్వాసం ఇప్పటికీ ఉందన్నది అందరికీ స్పష్టమైంది.
ఆ తొలి ప్రదర్శన మొదలుకొని ఇప్పటి వరకు, యెహోవాసాక్షుల గురించీ, స్టాండ్ ఫర్మ్ అనే వీడియో గురించి జర్మనీలోని వార్తాపత్రికల్లో 340 కన్నా ఎక్కువ వ్యాసాలు వ్రాయబడ్డాయి. అనేక రేడియో ప్రోగ్రామ్‌లూ, ఒక నేషనల్ రేండియో స్టేషన్ నుండి ప్రసారం చేయబడిన ఒక ప్రోగ్రామూ మంచి రిపోర్టులనిచ్చాయి.
స్టాండ్ ఫర్మ్ వివరణాత్మక వీడియో చివరకు కనీసం 24 భాషల్లో లభ్యం కానుంది. కాలక్రమేణా ఈ వీడియో తరగతి గదుల్లో ఉపయోగించే భాషాంతరంలో కూడా లభ్యమవుతుంది. స్టాండ్ ఫర్మ్ వివరణాత్మక వీడియోను అది విడుదలైనది మొదలుకొని, నిర్హేతుకమైన అభిప్రాయాలు, తోటివారి ఒత్తిళ్ళు, అంతర్వాణి వంటి ప్రాముఖ్యమైన విషయాలను పరిగణించేందుకు యౌవనస్థులకు సహాయపడే కోర్సుల్లో భాగంగా చాలా మంది విద్యావేత్తలు ఉపయోగించనారంభించారు.
విద్వేషం వల్ల, వంచన వల్ల విభజించబడిన ఈ లోకంలో, యథార్థతను గూర్చిన ఈ చరిత్రను ప్రజలకు తెలియజేయడం ఎంత సమయోచితమో! నిజంగా ఈ నమ్మకస్థులైన క్రైస్తవుల కష్టాలు వ్యర్థం కాలేదు.—హెబ్రీయులు 6:10.
[15వ పేజీలోని చిత్రం]
బెర్లిన్ పత్రికా సమావేశం. ఎడమ నుండి: డా. డట్‌లెఫ్ గార్బ్, మారణహోమాన్ని తప్పించుకున్న సిమోన్ లైబ్‌స్టర్, ఫ్రాన్స్ వోల్‌ఫార్ట్, చరిత్రకారుడైన వూల్ఫ్ బ్రేబెక్