సింగపూర్ కాంతివిహీనమైన ఆసియా రత్నం
దఢేలుమని శబ్దంచేసింది తలుపు! సింగపూర్‌లోని చంగీ స్త్రీల కారాగారం భారీ స్టీలు ద్వారాలు బలహీనంగా ఉన్న ఆ 71 ఏండ్ల క్రైస్తవురాలైన విధవరాలి వెనుకగా అశుభసూచకంగా దఢేలుమని మూసుకున్నాయి. ఆమె ఒక యెహోవాసాక్షి. అధ్యక్షత వహిస్తున్న జడ్జికి తన స్థానాన్ని గురించి వివరించాలని ప్రయత్నించింది: “నేను ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమాదకారిని కాను.”
తలుపు మళ్లీ దఢేలుమంది! ఆమె వెనకాలే మరో క్రైస్తవురాలైన 72 ఏండ్ల ఒక అమ్మమ్మ వచ్చింది. ఆమె నేరం? వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన నాలుగు బైబిలు ప్రచురణలు ఆమె దగ్గరున్నాయి, వాటిలో తన స్వంత పరిశుద్ధ బైబిలు కూడా ఉంది.
మొత్తం కలిపి, 16 నుండి 72 ఏండ్ల సంవత్సరాల మధ్యనున్న 64 మంది సింగపూర్ పౌరులు అరెస్టు చేయబడి, దోషులుగా నిర్ణయించబడ్డారు. వారిలో నలభై ఏడుగురు జరిమానా కట్టడానికి సిద్ధాంతపర కారణాలపై నిరాకరించారు. వీరిని ఒక వారం మొదలుకొని నాలుగు వారాలపాటు వేర్వేరు కాలాలపాటు జైల్లో ఉంచారు. జీవించడానికి ప్రపంచమంతటిలో అత్యంత శ్రేష్ఠమైన స్థలాల్లో ఒకటని వర్ణించబడే నగర-రాజ్యంలో ఇదెలా సంభవించగలదు? ప్రపంచవ్యాప్తంగా దాని ఆర్థిక స్థిరత్వానికీ, గమనార్హమైన అభివృద్ధికీ, ఆధునిక బిల్డింగులకీ, వీటితోబాటు మత సహనానికీ పేరొందిన నగర-రాజ్యమని చెప్పుకునే దేశంలో ఇది ఎలా సంభవించింది?
ఒక ఆధునిక నగర-రాజ్యం
ముందుగా, ఒక క్లుప్త చరిత్ర. బ్రిటన్‌కు చెందిన సర్ థామస్ స్టామ్‌ఫర్డ్ రాఫల్జ్ రాకతో సింగపూర్ ఆధునిక దిన చరిత్ర 1819లో మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధియైన రాఫల్జ్ తూర్పు దేశాల్లో కార్యకలాపాలు సాగించడానికి ఒక స్థావరం కొరకు చూస్తున్నాడు. ఆయన సింగపూర్‌ను పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా మొదలైంది తూర్పు ఆసియా అభివృద్ధిపై నేటి వరకూ కూడా గట్టి ప్రభావాన్ని చూపిన ఓ వాణిజ్య స్థావరం.
స్వాతంత్ర్యపూర్వ సింగపూర్ అపరిశుభ్రమైన నగరంగా అభివర్ణించబడింది. నేడు ఎవరూ కూడా సింగపూర్‌ను అపరిశుభ్రమైన నగరంగా వర్ణించరు. వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. గత 30 ఏండ్లలో, ఈ నగరం దాదాపు పూర్తిగా పునర్నిర్మించబడింది, పాత భవనాల ముందు భాగాల్ని అలాగే ఉంచేయడంద్వారా, లేకపోతే చారిత్రక కట్టడాల్ని పూర్తిగా ఆధునిక భవనాలుగా కలిపికట్టేయడంద్వారా సాధ్యమైన చోట్లలో పాత నగరపు వైభవాన్ని పోనీకుండా యథాతథంగా ఉంచారు. సింగపూర్ ప్రాచ్యంలో సముద్ర ట్రాఫిక్‌కు కేంద్రంగా తయారయ్యింది, కొన్నిసార్లు నౌకాశ్రయంలో ఒకేసారి దాదాపు 800 నౌకలుండేవి. ఒక భారీ కంటైనర్ నౌకను కొద్ది గంటల్లోనే సరుకుల్ని దించి మళ్లీ నింపడాన్ని ఆధునిక హై-టెక్ ఉపకరణాలు సాధ్యపరుస్తాయి. నగరపు ఆర్థిక కేంద్రంలో చదరపు అడుగు స్థలానికి 5,000 అమెరికా డాలర్ల రియల్ ఎస్టేట్ వెల డిమాండు చేయబడుతుంది, మరి ఈ మొత్తాన్ని చెల్లించడానికి ప్రజలు సిద్ధంగావుంటారు.
దాదాపు 34,00,000గా ఉన్న జనాభాలో చైనీయులూ, మలేవాసులూ, ఇండియన్లూ, యూరోపియన్లూ, మరితరులతో కూడిన వైవిధ్యంగల గుంపులు ఉన్నాయి. వీరు మాండరిన్, మలే, తమిళం, ఇంగ్లీషు వంటి భాషలను మాట్లాడుతారు.
రోడ్లనూ, భూమి క్రింద సబ్‌వేలలోనూ కలుపుకుంటే మొత్తం ఎనభైమూడు కిలోమీటర్ల శీఘ్రమైన రవాణావ్యవస్థతో, సింగపూర్‌లో ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన, ప్రభావవంతమైన రవాణా వ్యవస్థలు ఉన్నాయి. నగరమంతటా పచ్చని పార్కులు సమృద్ధిగా ఉన్నాయి, ఇవి ఆధునిక నిర్మాణాలైన ఆకాశాన్నంటే ఆకాశహర్మ్యాల మధ్య అక్కడక్కడా ఉన్నాయి. పూర్తిగా పునర్నిర్మాణం చేయబడిన రాఫల్జ్ హోటల్ మొదటిసారి సందర్శించేవారు “తప్పక చూడాల్సిన” స్థలం. అదిప్పుడు 1889లోని దాని ప్రారంభాల వలన జాతీయ స్మారక భవనంగా నిర్ధారించబడింది. రెండవది, 128 ఎకరాల స్థలంలోని వృక్షశాస్త్ర మరియు హార్టీకల్చరల్ కేంద్రం. ఇందులోని పది ఎకరాల స్థలం అభయారణ్యంగా ఉంది, ఇందులో ఒకప్పుడు పులులు తిరిగేవి.
మత స్వాతంత్ర్యం హమీ ఇవ్వబడింది
అసమానమైన దాని ఆర్థిక అభివృద్ధికితోడుగా సింగపూర్ తన నివాసులందరికీ మత స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేస్తుంది. విషాదకరంగా, సింగపూర్ ఈ వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ప్రాముఖ్యంగా యెహోవాసాక్షుల సంఘంతో సహవసించే ప్రజలు ఇది నిజమని కనుగొన్నారు.
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ యొక్క రాజ్యాంగం ఆర్టికిల్ 15(1)లో ఆరాధనా స్వాతంత్ర్యాన్ని ప్రాథమిక హామీగా ఇస్తుంది: “ప్రతివ్యక్తికి తన స్వంత మతాన్ని అవలంబించి, దాన్ని అభ్యసించి, దాన్ని ప్రచారం చేసే హక్కు ఉంది.”
రాజ్యాంగంలోని ఆర్టికిల్ 15(3) ఇలా హామీనిస్తుంది: “ప్రతి మత గుంపుకు—
(ఎ) తన స్వంత మత వ్యవహారాలు కలిగివుండే హక్కువుంది;
(బి) మత లేక ధార్మిక సంకల్పాల నిమిత్తం సంస్థలను స్థాపించి, వాటిని నిర్వహించే హక్కు ఉంది; మరియు
(సి) ఆస్తిని సంపాదించి, యాజమాన్యం కలిగివుండి, దాన్ని చట్టానుసారంగా వ్యవస్థీకరించే హక్కువుంది.”
1936లోనే యెహోవాసాక్షులు సింగపూర్ సమాజంలో ఉన్నారు. చాలా సంవత్సరాలపాటు వారు తమ స్వంత సంఘ కూటాలను, ఒక బిజీ మార్కెట్టుకు సరీగ్గా ఎదురుగా ఉన్న 8 ఎక్సటర్ రోడ్‌లోని తమ స్వంత రాజ్యమందిరంలో నడుపుకున్నారు. ఆ సంఘం వర్ధిల్లుతూవుంది, అదే సమయంలో సమాజ జీవిత స్థిరత్వానికి తన విశిష్టమైన తోడ్పాటును అందిస్తూవుంది.
యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు
ఇదంతా 1972, జనవరి 12న మారిపోయింది. ప్రభుత్వ నిషేధ ఆజ్ఞ, అధ్యాయం 109 క్రింద, సింగపూర్‌లో 23 సంవత్సరాలపాటు నివసించిన క్రైస్తవ మిషనరీయైన నార్మన్ డేవిడ్ బెలోటీను, ఆయన భార్యయైన గ్లాడిస్‌ని దేశాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ దేశ బహిష్కరణ ఆజ్ఞ జారీచేయబడింది. దీని తర్వాత యెహోవాసాక్షుల సింగపూర్ సంఘం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే మరొక ఆజ్ఞ వెంటనే ఇవ్వబడింది. కొద్ది గంటల్లోనే పోలీసులు రాజ్యమందిరం ముందు ద్వారాన్ని బద్దలుగొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానితర్వాత దాదాపు వెంటనే వాచ్ టవర్ సొసైటీ సాహిత్యాలన్నింటిపైనా అధికారిక నిషేధం అమల్లోకి వచ్చింది. అలా మొదలైంది యెహోవాసాక్షుల అణచివేత.
తర్వాత ప్రభుత్వం తన స్వచ్ఛంద చర్యలో భాగంగా రాజ్యమందిరాన్ని అమ్మివేసింది, ఇదంతా ఎటువంటి నోటిఫికేషను లేకుండానే జరిగింది—ఒక హియరింగు లేదు, ఒక విచారణ లేదు, ప్రతిస్పందించడానికి సాక్షులకు అవకాశమూ ఇవ్వలేదు.
పూర్తి నిషేధాన్ని సమర్థించుకోవడానికిగాను, యెహోవాసాక్షులు సైనిక సేవలో పాల్గొనకపోవడాన్ని సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఎత్తి చూపుతూ వచ్చింది. ఈ మధ్యే, 1995, డిశంబరు 29న జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కుల సహాయ సెక్రటరీ జనరల్ అయిన హిజ్ ఎక్సెలెన్సీ ఇబ్రాహీమ్ ఫాల్‌కు జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి సింగపూర్ యొక్క శాశ్వత ప్రతినిధియైన మిస్టర్ కేశవపనీ, వ్రాసిన ఉత్తరంలో ఈ క్రింది విధంగా నివేదించాడు:
“యెహోవాసాక్షుల కార్యకలాపాలపై మా ప్రభుత్వ నిషేధం జాతీయ భద్రతను పరిగణనలోనికి తీసుకోవడంనుండి ఉత్పన్నమౌతుంది. ఈ కార్యకలాపాలు కొనసాగడం ప్రజా సంక్షేమానికీ సింగపూర్‌లోని శాంతిభద్రతలకూ హానికరం కాగలదు. యెహోవాసాక్షుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన తర్వాత ఆవశ్యకమైన పర్యవసానంగా వారి ప్రచురణలన్నింటినీ నిషేధించాల్సివచ్చింది. ప్రచురణలపై ఈ నిషేధం వారి కార్యకలాపాలపై నిషేధాన్ని మరింత శక్తిమంతం చేయడానికీ, వారి నమ్మకాల ప్రచారాన్ని ఆపుచేయడానికీ సహాయం చేస్తుంది.”
సింగపూర్ జాతీయ భద్రతకు వాటిల్లబోయే ప్రమాదం దృష్ట్యా, సైనిక సేవను చేయడానికి నిరాకరించే యువకుల సంఖ్య సంవత్సరానికి కేవలం ఐదు మాత్రమేనన్నది గమనించాల్సిన విషయం. సింగపూర్ దాదాపు 3,00,000 మందితోకూడిన సైనిక బలగాన్ని పోషిస్తోంది. ఇందులో ఇమిడివున్న కొద్దిమంది ప్రజలు పౌర సంబంధ జాతీయ సేవ చేయడం గురించి చర్చించడానికి కూడా సింగపూర్ ప్రభుత్వం తిరస్కరించింది.
బాహాటంగా అణచివేత
ఎన్నో సంవత్సరాల ఇబ్బందికరమైన సహనం తర్వాత 1992లో బాహాటంగా మానవ హక్కుల అణచివేత అనే క్రొత్త అధ్యాయం ప్రారంభమైంది. అవాంఛనీయ ప్రచురణల చట్టం క్రింద నిషేధించబడిన సాహిత్యాన్ని కలిగివున్నారనే ఆరోపణపైన ఆ సంవత్సరంలో ఎంతోమంది అరెస్టు చేయబడ్డారు. 1994లో వాచ్ టవర్ సొసైటీ ఒక వకీలూ, తన జీవితం అంతా యెహోవాసాక్షీ అయిన 75 ఏండ్ల గ్లెన్ హవును సింగపూర్‌కు పంపించింది, ఈయన రాణి కొరకు నియమించబడిన బారిష్టరు. క్వీన్స్ కౌన్సిల్‌గా ఆయన హోదా ఆయనకు సింగపూర్ కోర్టుల్లో హాజరవ్వడానికి అనుమతించే గుర్తింపునిచ్చింది. రాజ్యాంగం ఇస్తున్న మత సంబంధ స్వాతంత్ర్య హామీని దృష్టిలో పెట్టుకుని సింగపూర్‌లోని సుప్రీమ్ కోర్టుకు ఒక అప్పీలు చేయబడింది, ఇందులో అరెస్టుల చట్టబద్ధతనూ, 1972లోని నిషేధం చట్టబద్ధతనూ సవాలుచేయడం ఇమిడివుంది. 1994, ఆగస్టు 8న సింగపూర్‌లోని సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టీస్ యోంగ్ పంగ్ హవు ఈ అప్పీలును కొట్టివేశాడు. ఈ నిర్ణయానికి విరుద్ధంగా అప్పీలు చేసుకోవడానికైన ఇతర ప్రయత్నాలు విఫలమయ్యాయి.
1995 తొలిభాగానికల్లా, సింగపూర్ రాజ్యాంగం ఆధారంగా చేసిన చట్టపరమైన సవాలు, అణచివేత చర్యలను మరింతగా పురికొల్పేలా చేసినట్లు అన్పించింది. ఆపరేషన్ హోప్ అని పిలువబడిన సైనిక చర్యల సంబంధ శైలిలోని ఒక పథకం ప్రకారం, నేర పరిశోధనా విభాగానికి చెందిన రహస్య సంస్థల శాఖలోని రహస్య అధికారులు స్వంత ఇండ్లలో జరుపుకునే క్రైస్తవ కూటాల చిన్న చిన్న గుంపులపైన హఠాత్తుగా విరుచుకుపడ్డారు. దాదాపు 70 మంది అధికారులూ, సహాయక సిబ్బందీ కలిసి కమాండో తరహా దాడులు చేశారు. తత్ఫలితంగా 69 మందిని అరెస్టు చేయడం జరిగింది. అందరూ ఇంటరాగేషన్ కేంద్రాలకు తరలించబడ్డారు, కొంతమందిని రాత్రంతా ప్రశ్నలడిగారు, యెహోవాసాక్షుల కూటాలకు హజరౌతున్నారనీ, బైబిలు ప్రచురణలు కలిగివున్నారనీ అందరిపైనా అభియోగం మోపబడింది. కొంతమంది దాదాపు 18 గంటలు ఎవరితోనూ సంబంధం లేకుండా నిర్బంధించబడ్డారు, చివరికి తమ కుటుంబాలకు ఫోను చేయడం కూడా వారికి సాధ్యంకాలేదు.
విదేశీయులకు వ్యతిరేకంగా చేయబడిన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు. కానీ 64 మంది సింగపూర్ పౌరులు 1995 చివరిభాగంలోనూ 1996 తొలిభాగంలోనూ కోర్టులో విచారణ చేయబడ్డారు. 64 మందీ దోషులని నిర్ధారించబడ్డారు. వారిలో 16 నుండి 72 ఏండ్ల మధ్యనున్న నలభై ఏడుగురు వేలాది డాలర్ల జరిమానాను కట్టకుండా జైల్లో ఒకటి నుండి నాలుగు వారాలు గడిపారు.
జైలుగదులకు పంపబడేముందు స్త్రీ పురుషులను నగ్నంగా చేసి అనేకమంది ప్రజల ముందు సోదా చేశారు. కొంతమంది స్త్రీలను తమ చేతులు చాచమని, ఐదు సార్లు క్రింద కూర్చుని పైకిలెమ్మనీ, తమ నోళ్లు తెరిచి తమ నాలుకల్ని పైకి లేపమనీ ఆజ్ఞాపించారు. కనీసం ఒక్క స్త్రీనైనా తన గుదభాగాన్ని తెరవడానికి తన వ్రేళ్లను ఉపయోగించమని ఆజ్ఞాపించారు. జైల్లో, కొంతమంది పురుషులు మరుగుదొడ్లలో వచ్చే నీటిని త్రాగవలసి వచ్చింది. కొంతమంది యౌవనస్త్రీలు ప్రమాదకరమైన నేరస్థుల్లా వ్యవహరించబడ్డారు, తమ శిక్షా కాలమంతా ఒంటరి కారాగారవాసంలో నిర్బంధించబడ్డారు, వారికి ఆహార కోటా సగం మాత్రమే ఇవ్వబడింది. కొంతమంది జైలు వార్డెన్‌లు సాక్షులకు వాళ్ల బైబిళ్లను ఇవ్వడానికి కూడా నిరాకరించారు.
అయితే జైల్లో వేయబడిన కొంతమంది స్త్రీలు చేసిన కొన్ని వ్యాఖ్యానాల్ని మనం చూద్దాం. వారి ప్రత్యక్ష నివేదికలు వెల్లడించిన విషయాలు ఈ ఆధునిక నగర బూటకపు రూపానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
“జైలుగది దుమ్ముతో నిండివుంది. వాష్‌బేసినూ, మరుగుదొడ్డీ చాలా ఘోరమైన స్థితిలోవున్నాయి. అవి జిగటగానూ, మురికిగానూ ఉన్నాయి. నేను కూర్చున్న బెంచి క్రింద సాలీడు గూళ్లున్నాయి, అంతా మురికిగా ఉంది.”
“నన్ను బట్టలూడదీసి నగ్నంగా తయారుకామన్నారు, నాకు జైలు బట్టలూ, ఒక సబ్బు పాత్ర (అందులో సబ్బు లేదు), ఒక టూత్‌బ్రష్ ఇచ్చారు. అల్పకాలిక ఖైదీలకు టూత్‌పేస్టుగానీ, టాయ్‌లెట్ పేపరుగానీ ఇవ్వరని నా గదిలోని ఇతర ఖైదీలు చెప్పారు.”
“ఒక్క గదిలో మేము 20 మందిమున్నాము. మరుగుదొడ్డి గొంతుకూర్చునేటువంటిది, గోడ నా ఛాతీక్రింది వరకే ఉంది. స్నానాలగదిలో ఒక షవర్, ఒక వాష్‌బేసినూ దానికి ఒక నల్లా ఉంది. మేము ఆరుగురిమి కలిసి గుంపులుగా స్నానాలు చేయాల్సివచ్చేది—గదిలోనున్న వారందరం కలిసి ఉదయాన అరగంటలోపలే స్నానం చేయాల్సివచ్చేది.”
జైల్లో దుర్భరమైన పరిస్థితులున్నప్పటికీ—ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితులున్నా—దేవున్ని సేవించడం ఒక ఆధిక్యతగా అందరూ పరిగణించారు. ఈ క్రింద ఇవ్వబడిన ఒక టీనేజ్ అమ్మాయి వ్యాఖ్యానాన్ని గమనించండి:
“నేను జైల్లోకి అడుగుపెట్టిన క్షణంనుండీ, నేనక్కడ ఎందునిమిత్తం ఉండవల్సివచ్చిందో నాకు నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. ప్రతిదినం నా ప్రార్థనను వినాలనీ, నన్ను విడనాడవద్దనీ నేను యెహోవాకు ప్రార్థన చేశాను. ఆయన నా ప్రార్థనకు జవాబిచ్చాడని నేను భావించాను, ఎందుకంటే నేను ఓర్చుకునేందుకు సహాయం చేసింది ఆయన పరిశుద్ధాత్మే. అప్పుడు మాత్రమే నేను ఆయనతో నాకున్న సన్నిహితత్వాన్ని గ్రహించాను. మరి ఆయన మాపై కాపుదలను ఉంచాడని తెలుసుకుని నేనెంతో బలపర్చబడ్డాను. ఆయన నామం నిమిత్తం నేను ఈ పరీక్షను తట్టుకోవడం ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను.”
ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు ఈ సంఘటనను గురించి వెంటనే తెల్సుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, యూరప్, హాంగ్ కాంగ్‌లలోని, మరితర ప్రాంతాల్లోని పత్రికలు ఈ సంఘటనలను ప్రతిధ్వనింపజేశాయి. కెనడాలోని టొరాంటో స్టార్ ఆ సమయంలోని ఆ దౌర్జన్యాన్ని గురించి ప్రధాన శీర్షికలో సంగ్రహంగా ఇలా తెలియజేసింది, “బైబిలును కలిగివున్నందుకు అమ్మమ్మపై దోషనిర్ధారణ.” ఒప్పుకోవల్సిందేమంటే, ఎంతోమంది ప్రజలు ఇమిడివున్న ఎన్నో గంభీరమైన సమస్యలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఈ కేసులో అన్నిచోట్లా ప్రజలు సంభ్రమంతో అడిగే ప్రశ్న ఒకటే. “సింగపూర్‌లోనా?”
భూగోళమంతటా 200 దేశాల్లో చట్టం అందించే పూర్తి సంరక్షణ క్రింద బహిరంగంగా పనిచేసే ఒక మతం సింగపూర్‌లో హింసకు ఎందుకు గురిచేయబడుతుందన్నది అర్థంచేసుకోవడం కష్టం. సింగపూర్‌లోని ఏ ఇతర మతంపట్లా అంత అన్యాయంగా, నిరంకుశంగా వ్యవహరించలేదన్నదాన్ని మనం పరిగణనలోనికి తీసుకున్నప్పుడు ఇది అర్థం చేసుకోవడం మరింత కష్టంగా తయారౌతుంది.
నిజానికి, ఒక మత కూటానికి భంగం కల్గించమని తనకూ తన అధికారులకూ ఆజ్ఞాపించబడింది ఈ ఒక్కసారి మాత్రమేనని యెహోవాసాక్షులపై దాడిచేసిన ఒక గుంపుకు నాయకత్వం వహించిన సహాయక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టులో ఒప్పుకున్నాడు. ఈ క్రింది మాటలు సాక్ష్యాధార వ్రాతప్రతిలోనుండి తీసుకోబడ్డాయి:
ప్ర: (సాక్షితో) మీకు తెలిసినంతమట్టుకు రహస్య సంస్థల శాఖ యెహోవాసాక్షులను తప్పించి ఎప్పుడైనా ఏదైనా రిజిస్ట్రేషను లేని మత గుంపులను పరిశోధించడం గానీ, వాటిపై అభియోగం మోపడం గానీ చేసిందా?
జ: నాకు తెల్సినంత వరకూ లేదు.
తర్వాత ప్రశ్నించడం కొనసాగింది.
ప్ర: (సాక్షితో) సొసైటీస్ ఆక్ట్ క్రింద రిజిష్టరు కానటువంటి ఏదైనా చిన్న మత గుంపు ఒక గృహంలో కూడుకుంటున్నప్పుడు మీరెప్పుడైనా వ్యక్తిగతంగా అటువంటి దాడిని నిర్వహించారా?
జ: లేదు, నేను చేయలేదు.
చర్యగైకొనడానికి పిలుపు
ఆమ్నెస్టీ ఇంటర్నాషనల్, ఇంటర్నాషనల్ బార్ అసోసియేషన్ ఈ రెండూ విచారణల యథార్థతను గమనించడానికిగాను తమ తమ స్వంత ప్రత్యేక పరిశీలకుల్ని పంపించింది. ఆమ్నెస్టీ ఇంటర్నాషనల్‌కు చెందిన నిష్పాక్షిక పరిశీలకుడైన ఆండ్రూ రాఫెల్ ఒక హాంగ్ కాంగ్ బారిష్టరు, ఆయనిలా అన్నాడు: “అదంతా బూటకపు విచారణలా కన్పించిందని నేను నా రిపోర్టులో పేర్కొన్నాను.” ఆయనింకా వివరిస్తూ, సాక్షులుగా హాజరుకామని ఆదేశించబడిన ప్రభుత్వ అధికారులు, యెహోవాసాక్షుల సాహిత్యం అవాంఛనీయమైనదని ఎందుకు పరిగణించబడ్తుందో కోర్టుకు వివరించలేకపోయారని చెప్పాడు. నిషేధించబడిన బైబిలు ప్రచురణల్లో కొన్నింటి పట్టికను రాఫెల్ తయారు చేశాడు. వాటిలో సంతోషం—దాన్నెలా కనుగొనవచ్చు, మీ యౌవనం—దాన్నుండి శ్రేష్ఠమైనదాన్ని పొందుట (ఆంగ్లం) వంటివి కూడా ఉన్నాయి. ఏరకంగా చూసినా వాటిని అవాంఛనీయమైనవిగా పరిగణించలేమని ఆయన జతచేశాడు.
ఇంటర్నాషనల్ బార్ అసోసియేషన్ నుండి వచ్చిన పరిశీలకుడైన సెసిల్ రాజేంద్ర ఇలా పేర్కొన్నాడు:
“విచారణ అంతా కేవలం . . . ఒక బూటకం తప్పించి మరేమీ కాదని మొట్టమొదట నుండీ ఈ పరిశీలకునికి స్పష్టమైంది. సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఇంకా అవలంబించబడ్తుందని ప్రపంచానికి ఆడంబరంగా చూపించడానికే ఆ విచారణను నిర్వహించారు.
“దాని పరిణామం అనివార్యమైనది, విచారణ జరగడానికి ముందుగానీ, జరుగుతున్న సమయంలోగానీ లేక ముగింపులోగానీ, నేరారోపణ చేయబడినట్లుగానే నిందితులందరూ దోషులుగా నిర్ధారించబడతారన్న విషయంలో ఎన్నడూ అసలు సందేహానికి ఏమాత్రం తావులేకుండా ఉంది.
“విచారణ ఒక సబార్డినేట్ కోర్టులో నిర్వహించబడినప్పటికీ, నేరారోపణలు నిజానికి సొసైటీస్ ఆక్ట్‌యొక్క చిన్న చిన్న అతిక్రమణలే అయినప్పటికీ కోర్టు చుట్టూరా వాతావరణం చాలా గంభీరంగానూ, భయపెట్టేదిగానూ ఉంది.
“ఈ వాతావరణంలోని గాంభీర్యం ఏమాత్రం తక్కువగా లేదు, ఎందుకంటే యూనిఫారమ్‌లో ఉన్న పదికంటే ఎక్కువమంది పోలీసులు అక్కడ నిలబడ్డారు (ఆరుగురు కోర్టులోపలా, నలుగురు బయటా), అనేకమంది ప్రత్యేక బ్రాంచి మనుషులు సాధారణ బట్టల్లో గ్యాలరీలో కూర్చున్నారు.”
విచారణ జరిగిన పద్ధతిపైనే వ్యాఖ్యానిస్తూ రాజేంద్ర ఇలా కొనసాగాడు:
“మునుపు పేర్కొనబడిన జడ్జి ప్రవర్తన పరిశీలనా సమయంలో (అంతేగాక వ్రాతప్రతుల్లోని సాక్ష్యాధారంగా, విచారణ జరుగుతున్నంతసేపూ కూడా) ఎంతో లోపభూయిష్టంగా ఉంది. . . . న్యాయమైన విచారణా ప్రమాణాలకు విరుద్ధంగా, జడ్జి మళ్లీ మళ్లీ ప్రాసిక్యూషన్ తరపున కలుగజేసుకున్నాడు, ప్రదర్శన వస్తువులపై, ఉదాహరణకు, ప్రతివాది బైబిలు యొక్క కింగ్ జేమ్స్ వర్షన్‌పై సాక్షులను క్రాస్-ఎగ్జామినేషన్ చేయడాన్ని నివారిస్తూ ఆయన్ని మళ్లీ మళ్లీ నిరాశకు గురిచేస్తూవచ్చాడు!”
మానవ హక్కులను సింగపూర్ అణచివేయడంనుండి ఉత్పన్నమైన అంతర్జాతీయమైన ఆతురత ఎంత మోతాదులో ఉందంటే, బెల్జియం కేంద్ర స్థానంగా ఉన్న హద్దుల్లేని మానవ హక్కులు (ఆంగ్లం) అనే ఒక పత్రిక యెహోవాసాక్షులపై సింగపూర్ ప్రభుత్వం చేసిన దాడి గురించే పూర్తిగా వ్యవహరించిన 18 పేజీల రిపోర్టును ప్రచురించింది. ఆ పత్రిక చీఫ్ ఎడిటరైన విల్లీ ఫాట్రే సంపాదకీయం వ్రాస్తూ, ఏ దేశంలోనైనా మానవ స్వాతంత్ర్యం యొక్క సరైన మోతాదును అత్యంత సంగ్రహంగా వర్ణించాడు:
“ఏదేని సమాజంలో మానవ స్వాతంత్ర్యం యొక్క సాధారణ స్థితిని సూచించేవాటిలో మత స్వేచ్ఛ శ్రేష్ఠమైన వాటిలో ఒకటైనప్పటికీ, మతం ఆధారంగానో లేక నమ్మకాల ఆధారంగానో ఆయా రకాల విచక్షణలనూ, అసహనాలనూ నిర్మూలించడానికైన ప్రక్రియలో మానవ హక్కుల లౌకిక సంస్థలు ఎక్కువ భాగం వహించలేదు. మత స్వాతంత్ర్యాన్ని సంరక్షించి, దాన్ని అభివృద్ధి చేయడానికి కార్యాచరణా విధానాలను రూపొందించడంలోనూ అవి ఎక్కువేమీ చేయలేకపోయాయి.”
హద్దుల్లేని మానవ హక్కులు తన నివేదికలోని వెనుక అట్టపైన తన సిఫారసుల పట్టికను ముద్ద అక్షరాల్లో ప్రచురించింది.
యెహోవాసాక్షులు సింగపూర్‌కు ప్రయోజనకారులు. వారు తమ పొరుగువారి హక్కులను గౌరవిస్తారు, వారికి విరుద్ధంగా ఎటువంటి నేరాలూ చేయరు. సింగపూర్‌లోని ఏ పౌరుడు కూడా ఎవరైనా యెహోవాసాక్షి తన ఇల్లు దోచుకుంటాడనో లేక తనపై దాడిచేస్తాడనో, తనను కొడతాడనో, లేక రేప్ చేస్తాడనో చింతించాల్సిన అవసరం లేదు.
వారి స్వచ్ఛంద బహిరంగ పరిచర్య కుటుంబ జీవితాన్ని బలపర్చి, మెరుగుపరుస్తుంది, మంచి పౌరులుగా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. బైబిలులోని నిర్మాణాత్మకమైన సూత్రాలను నేర్చుకోవాలనీ, వాటిని తన జీవితంలో అన్వయించుకోవడాన్ని నేర్చుకోవాలనీ అనుకునే ఎవరితోనైనా వారు ఉచితంగా బైబిలు పఠనాలను నిర్వహిస్తారు. బైబిలు పఠనమూ, ప్రార్థనల కొరకైన వారి కూటాలు వారి క్రైస్తవ విద్యా కార్యక్రమంలో ఒక భాగం. ఇదే వారిని చక్కని పౌరులుగా అయ్యేలా చేసింది.
తమ సర్వస్వతంత్ర ప్రజారాజ్యాన్ని గౌరవిస్తూ, దాని భవిష్యత్తు కొరకు తమకు చేతనైంది చేయాలనుకునే సింగపూర్ పౌరులు సింగపూర్ సమాజంలో యెహోవాసాక్షుల సరైన స్థానం విషయమై మళ్లీ పరిశీలనలోనికి తీసుకోవాలని తమ ప్రభుత్వాన్ని కోరాలి. వారికి విరుద్ధంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికీ, ప్రతి పౌరుని హక్కూ అయిన ఆరాధనా స్వాతంత్ర్యాన్ని తిరిగి స్థాపించడానికీ ఇదే సమయం.
[24వ పేజీలోని బాక్సు]
లోకం గమనిస్తోంది
1. “గత ఫిబ్రవరిలో సింగపూర్ పోలీసులు సైనిక చర్యల సంబంధ శైలిలో ఐదు ఇండ్లపై హఠాత్తుగా విరుచుకుపడి దాడిచేసినప్పుడు, 69 మంది స్త్రీపురుషులూ, యౌవనులూ అరెస్టు చేయబడి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకుపోబడ్డారు. అయితే బైబిలు పఠన కూటాలు ముగియవల్సిన పద్ధతి అది కాదు.”—ది అట్టావా సిటిజన్, కెనడా, డిశంబరు 28, 1995, పేజీ A10.
2. “ఈ నిష్కపటులైన, నిరపాయకరమైన ప్రజల విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని వారి విశ్వాసాన్ని నిర్భయంగానూ లేక ఏ ఆటంకమూ లేకుండానూ అవలంబించడానికీ, దాన్ని ప్రచారం చేసుకోవడానికీ అనుమతించడం మత స్వేచ్ఛా, మనస్సాక్షికున్న హక్కులూ వంటివాటిపట్ల పట్టింపు ఉన్నవారందరికీ నిజమైన సంతృప్తికి మూలంగా ఉంటుంది.”—ప్రొఫెసర్ బ్రయన్ ఆర్. విల్సన్, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఇంగ్లాండ్.
3. “విచారణా పరంపరలో సింగపూర్ కోర్టులు గత నవంబరునుండి 63 మంది యెహోవాసాక్షులపై దోషనిర్ధారణ చేశాయి, ఈ విచారణలు అంతర్జాతీయ పౌర హక్కుల గ్రూపుల్లో అసమ్మతిని రేకెత్తించాయి.”—ఆసాహి ఈవినింగ్ న్యూస్, జపాన్, జనవరి 19, 1996, పేజీ 3.
4. “యెహోవాసాక్షులు అరెస్టు చేయబడతామన్న భయమూ లేక ఖైదు చేయబడతామన్న భయమూ లేకుండా శాంతియుతంగా కూటాలు జరుపుకోవడానికీ, తమ మతాన్ని అవలంబించడానికి అనుమతించబడాలి. మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు, దీన్ని సింగపూర్ రాజ్యాంగం హామీగా ఇస్తుంది.”—ఆమ్నెస్టీ ఇంటర్నాషనల్, నవంబరు 22, 1995.
5. “ప్రధాన మంత్రి కార్యాలయంలోని సీనియర్ మినిస్టర్ అయిన లీ కువాన్ యూకి, జస్టిస్ అండ్ పీస్ కమిషన్ ఆఫ్ ది హాంగ్ కాంగ్ కాథోలిక్ డయోసిస్ యొక్క చైర్‌పర్సన్ అయిన ఛన్ సియూ-చింగ్ 1995, జూన్ 1న వ్రాసిన ఒక ఉత్తరంలో ఇలా పేర్కొంది: “ప్రధాన వివాదాంశం ఏమంటే, సైనిక సేవను తిరస్కరించేవారు చట్టాన్ని అతిక్రమిస్తున్నారనీ వారిపై నేరారోపణ చేయాలనీ సింగపూర్ ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ, కేవలం ఆరాధన నిమిత్తం మత సమావేశాల్లో పాల్గొనే ఇతర సభ్యులను అది బాధించకూడదు . . .
“అందుకని మేము మీ ప్రభుత్వాన్ని ఈ విధంగా అభ్యర్థించడానికి వ్రాస్తున్నాము:
1. యెహోవాసాక్షులను నిషేధించకూడదు, తద్వారా వారు ఆరాధనా స్వాతంత్ర్యాన్నీ, మనస్సాక్షి స్వాతంత్ర్యాన్నీ అనుభవించగలరు;
2. కేవలం మత సంబంధ ఉద్దేశం నిమిత్తం కూటాలకు హాజరయ్యే యెహోవాసాక్షుల సభ్యులపై నేరారోపణ చేయడాన్ని ఆపివేయాలి.
3. కేవలం మత కార్యకలాపాల నిమిత్తం హజరైనందుకు ఇటీవలనే అరెస్టు చేయబడిన యెహోవాసాక్షుల సభ్యులను విడుదల చేయాలి.”
[21వ పేజీలోని చిత్రం]
నేం1రోపణలు చేయబడిన తర్వాత కోర్టు వద్ద యెహోవాసాక్షులు
[21వ పేజీలోని చిత్రం]
71 ఏండ్ల ఈ సాక్షి జడ్జితో, “నేను ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమాదకారిని కాను” అని అంది. అయినా ఆమెను జైల్లో పెట్టారు