కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 6/8 పేజీలు 18-21
  • టాస్మేనియా చిన్న ద్వీపము, అపూర్వ గాథ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • టాస్మేనియా చిన్న ద్వీపము, అపూర్వ గాథ
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • టాస్మేనియా ఓ “సామ్రాజ్య చెరసాలగా” మారుతుంది
  • ఒక జాతి అదృశ్యమౌతుంది
  • టాస్మేనియా యొక్క స్పష్టమైన తేడాలు
  • ద్వీపం యొక్క మరింత ప్రశాంతమైన రూపం
  • హింసా దేశం నుండి ఆత్మీయ పరదైసుకు
  • మీరు తిలసిన్‌ను చూశారా?
    తేజరిల్లు!—1995
  • విషాదభరితమైన యువత మరణాలు
    తేజరిల్లు!—1998
  • ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాల్లో యోగ్యులను వెదకడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • పుడమిపై నాకున్న ప్రేమ సదా తృప్తి చెందుతుంది
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 6/8 పేజీలు 18-21

టాస్మేనియా చిన్న ద్వీపము, అపూర్వ గాథ

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

“ఈ స్థలం మేము దక్షిణ సముద్రంలో కనుగొన్న మొదటిది. ఈ స్థలం ఏ ఐరోపా దేశానికి తెలిసినది కాదు. కాబట్టి మేము దానికి గౌరవనీయులైన [మా] గవర్నర్‌-జనరల్‌ గౌరవార్థం ఆంటోని వాన్‌ దిమెన్‌స్లాండ్‌ అనే పేరు పెట్టాము.” హాలండ్‌ నివాసియైన ఆబెల్‌ టాస్మాన్‌ ఆస్ట్రేలియాలోని రెండవ ప్రాచీన రాష్ట్రమైన, టాస్మేనియాa ద్వీపాన్ని చూసిన మరుసటి రోజు, అంటే 1642 నవంబరు 25న ఈ పై మాటల్ని చెప్పాడు. టాస్మాన్‌ అక్కడ ప్రజలను చూడలేదు కానీ దూరానున్న మంటల నుండి వచ్చే పొగనూ, సమీపానున్న చెట్ల పైన 1.5 మీటర్ల ఎడంతో గంట్లు చేయబడి ఉండడాన్నీ చూశాడు. ఆ గంట్లు చేసింది ఎవరైనప్పటికీ, వారికి అసాధారణమైన ఎక్కే పద్ధతి ఉండివుండాలి లేక వాళ్లు దానవులైనా అయ్యుండాలని ఆయన రాశాడు. వాస్తవానికి, ఆ గంట్లు ఎక్కడానికి తోడ్పడేందుకు చేయబడ్డాయి.

అటుతర్వాత, వాన్‌ దిమెన్‌స్లాండ్‌ను ఫ్రాన్స్‌ దేశస్థుడైన మార్యొ దు ఫ్రెస్నె మరియు ఆంగ్లేయుడైన టెబాయిస్‌ ఫెర్నో సందర్శించేంత వరకూ, అది సముద్ర అన్వేషకుల ప్రయాణ మార్గం నుండి 130 సంవత్సరాలవరకు కనుమరుగయ్యింది. క్యాప్‌టన్‌ జేమ్స్‌ కుక్క్‌ 1777లో అక్కడికి చేరుకుని, దు ఫ్రెస్నెలానే ఆ ద్వీపమందలి విశేషమైన ప్రజలైన ఆదివాసులను కలిశాడు. అయితే ఆయన సందర్శనం ఓ విషాదానికి ఆరంభమయ్యింది: “కొన్ని దేశాలు [కుక్క్‌ను] నాగరికతకు మరియు మతానికి మార్గాన్ని తెరిచినవానిగా దృష్టించాయి, [అయితే] ఈ జాతికి [ఆదివాసులకు] అయన మరణ సూచకుడయ్యాడు” అని ది హిస్టరి ఆఫ్‌ టాసమేనియాలో జాన్‌ వెస్ట్‌ తెలిపాడు. అలాంటి విషాదకరమైన పర్యవసానానికి కారణమైనదేమిటి?

టాస్మేనియా ఓ “సామ్రాజ్య చెరసాలగా” మారుతుంది

దేశాంతరవాస శిక్ష లేక ద్వీపాంతరవాస శిక్ష బ్రిటిష్‌ శిక్షాదండనగా ఉండింది, టాస్మేనియా బ్రిటన్‌ యొక్క నేరస్థుల బస్తీగా మారింది. ప్రార్థనా గ్రంథాలను దొంగిలించడం నుండి మానభంగం వరకు, ఇలాంటి నేరాలను చేసినందుకు 1803 నుండి 1852 వరకు సుమారు 67,500 మంది పురుషులు, స్త్రీలు, బాలలు సైతం—కొద్దిమంది ఏడేళ్ల వయస్కులు—ఇంగ్లాండు నుండి టాస్మేనియాకు వెళ్లగొట్టబడ్డారు. అయితే, చాలామంది నేరస్థులు వలసవచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారి దగ్గర లేక ప్రభుత్వ ప్రోజెక్టులపై పనిచేసేవారు. “10 కన్నా తక్కువ శాతం మంది . . . ఎన్నడూ నేరస్థుల బస్తీకి పంపబడనేలేదు, అలా పంపబడినవారిలో అనేకులు కేవలం కొద్దికాలం వరకే అక్కడున్నారు” అని ది ఆస్ట్రేలియన్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. టాస్మాన్‌ ద్వీపకల్పం మీదున్న ఆర్తూర్‌ ఓడ రేవు ముఖ్య నేరస్థుల బస్తీ. ఘోరమైన నేరాలు చేసినవారు “హింస కొరకు సమర్పించబడిన స్థలంగా” స్థాపించబడిన ఆ బస్తీకి పంపబడేవారు. అది మక్వారి ఓడరేవు దగ్గరుంది. ఆ ఇరుకైన ఓడరేవు ద్వారం నరక ద్వారమనే బెదిరింపుతోకూడిన పేరును పొందింది.

దిస్‌ ఈజ్‌ ఆస్ట్రేలియా అనే పుస్తకంలో డా. రుడోల్ఫ్‌ బ్రాశ్‌ ఆరంభదశలో ఉన్న ఈ కాలనీ యొక్క ఆత్మీయతకు సంబంధించిన లేక ఆత్మీయతా కొరతకు సంబంధించిన మరో ప్రాముఖ్యమైన అంశాన్ని వివరిస్తున్నాడు. “మొదటినుండి, ఆస్ట్రేలియాలో [నిశ్చయంగా, టాస్మేనియాలో సహితం] అధికార వర్గం మతాన్ని నిర్లక్ష్యం చేసింది, తిరస్కరించింది, అంతేగాక తన స్వలాభం కోసం ఉపయోగించుకుంది, దుర్వినియోగం చేసింది. ఆ కాలనీ ఓ ప్రార్థనలేకుండా స్థాపించబడింది, ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మొదటి మతసంబంధ సేవాకార్యక్రమం ఆ తర్వాత కలిగిన తలంపులా కనబడుతుంది.” ఉత్తర అమెరికా యాత్రికులు చర్చీలను నిర్మిస్తే, “దక్షిణ ప్రపంచ తొలి పౌరులు, చర్చికి హాజరవ్వడం వల్ల కలిగే విసుగును తప్పించుకోవడానికి తమ మొదటి చర్చిని తగలబెట్టారు” అని ది హిస్టరి ఆఫ్‌ టాస్మేనియా చెబుతుంది.

అప్పటికే వ్యాధిగ్రస్తమైవున్న నైతికత రమ్‌ పుష్కలంగా లభ్యమౌతుండడం మూలంగా ఇంకా ఎక్కువగా కలుషితమయ్యింది. పౌరులకూ సైనికులకూ రమ్‌ ఒకేలా “సంపదకు కచ్చితమైన మార్గంగా” ఉండిందని చరిత్రకారుడు జాన్‌ వేస్ట్‌ చెబుతున్నాడు.

అయితే, కొన్ని సమయాల్లో ఆహార కొరత ఉండేది. ఈ సమయాల్లో, ఒక జంతువును ఆదివాసులు బల్లెములతో వెంటాడుతుండగా అదే జంతువును స్వతంత్రులైన నేరస్థులు మరియు వలసవచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారు వేటాడేందుకు తుపాకులను వాడేవారు. అర్థం చేసుకొనదగినట్లుగానే, ఉద్రిక్తతలు పెరిగేవి. ఇప్పుడు శ్వేతజాతీయుల అహంకారం, సమృద్ధిగా రమ్‌ లభించడం, బద్ధవ్యతిరేకంగావున్న సంస్కృతులు అగ్నికి ఆజ్యం పోశాయి. యూరోపియన్లు సరిహద్దు రేఖలనేర్పర్చి, కంచెలు నిర్మించేవారు; ఆదివాసులు వేటాడి సంచారరీతిలో సమకూర్చుకునేవారు. హింస చెలరేగడానికి ఓ చిన్న సంఘటన చాలు.

ఒక జాతి అదృశ్యమౌతుంది

1804 మేలో ఒక సంఘటన జరిగింది. ల్యూటెనాన్‌ మూర్‌ నాయకత్వంలో ఒక గుంపు వేటాడుతున్న ఒక పెద్ద గుంపుపై అన్యాయంగా కాల్పులు జరిపి, ఆదివాసుల పురుషులను స్త్రీలను పిల్లలను చంపి అనేకులను గాయపర్చింది. బల్లెములూ రాళ్లకు వ్యతిరేకంగా తుపాకి గుండ్లతో “నల్లజాతి యుద్ధం” ఆరంభమయ్యింది.

ఆదివాసుల వధనుబట్టి యూరోపియన్లనేకులు కలత చెందారు. గవర్నర్‌ సర్‌ జార్జ్‌ ఆర్తర్‌ ఎంతో కలతచెంది, ‘ఆదివాసులపై ప్రభుత్వం ఉద్దేశరహితంగా చేసిన గాయాలకు పరిహారం చేసేందుకు’ దాదాపు ఏం చేయడానికైనా సిద్ధమేనని తన సుముఖతను వ్యక్తపర్చాడు. అందుకే, ఆయన వారిని “సమకూర్చి” వారిని “నాగరికుల్ని” చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. “నల్లజాతి సరిహద్దు” అని పిలువబడే ఒక ఉద్యమంలో, ఆదివాసులను పట్టుకుని వారిని సురక్షిత స్థలానికి చేర్చాలనే ప్రయత్నంలో సుమారు 2,000 మంది సైనికులూ వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారూ ఖైదీలూ అడవిలోగుండా ప్రయాణించారు. కాని ఆ కార్యం ఒక అవమానకరమైన వైఫల్యమయ్యింది; వాళ్లు ఒక స్త్రీనీ, ఒక బాలున్ని పట్టుకున్నారు. అప్పుడు, వెస్లీయన్‌ చర్చి ప్రముఖుడైన జార్జ్‌ ఎ. రాబిన్‌సన్‌ మరింత సమాధానకరమైన పద్ధతిని అవలంభించాడు, అది సఫలమయ్యింది. ఆదివాసులు ఆయనను నమ్మి, టాస్మేనియాకు ఉత్తరానున్న ఫ్లిండర్స్‌ ద్వీపంపై పునరావాసం ఏర్పరచుకోమని ఆయన చేసిన ప్రతిపాదనను అంగీకరించారు.

మార్జేరి బర్నార్డ్‌ ఎ హిస్టరి ఆఫ్‌ ఆస్ట్రేలియా అనే తన పుస్తకంలో రాబిన్‌సన్‌ సాధించిన దాని గూర్చి ఇలా చెబుతోంది: “వాస్తవానికి, తన సంధి మోసపూరిత ప్రభావాన్ని కల్గివుందన్న విషయం బహుశా అతనికి తెలిసి ఉండకపోవచ్చు. నిర్భాగ్యులైన ఆ స్థానికులు బాస్‌ స్ట్రేయిట్‌లోని ఫ్లిండర్స్‌ ద్వీపంపై దూరంగా ఉంచబడ్డారు. రాబిన్‌సన్‌ వారి సంరక్షకునిగా ఉన్నాడు. వాళ్లు కృశించిపోయి, మరణించారు.” జీవనశైలిలోనూ ఆహార విధానంలోనూ బలవంతంగా చేయబడిన మార్పులు వాళ్ల ప్రాణాలను బలి గొన్నాయి. “టాస్మేనియాకు చెందిన చివరి స్వచ్ఛమైన ఆదివాసి ఫానీ కాఖ్రేన్‌ స్మిత్‌, ఆమె 1905లో హోబర్ట్‌నందు చనిపోయిందని” ఒక గ్రంథం తెలియజేస్తోంది. ఈ విషయంలో అధికారులకు వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది 1876లో హోబర్ట్‌నందు చనిపోయిన స్త్రీయైన ట్రూగానిన్‌ అంటారు, ఇంకా కొంతమంది 1888లో కంగారూ ద్వీపమందు చనిపోయిన స్త్రీ అని అంటారు. టాస్మేనియాకు చెందిన ఆదివాసుల మిశ్రిత జాతి వంశస్థులు ఈనాడు క్షేమంగా సజీవంగా ఉన్నారు. మానవజాతి చేసిన దుర్వినియోగాల అంతంలేని పట్టికకు ఇంకా జతచేస్తూ, ఈ ఘోరకార్యం, “రాష్ట్రం యొక్క అత్యంత దుఃఖకరమైన” సంఘటనయని సరిగానే పిలువబడింది. అంతేగాక, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని బైబిలు చెప్పిన సత్యాన్ని ఇది నొక్కివక్కాణిస్తోంది.—ప్రసంగి 8:9.

టాస్మేనియా యొక్క స్పష్టమైన తేడాలు

నేడు మీరు వస్తుప్రదర్శనశాలల్నీ, గ్రంథాలయాల్నీ, లేక చెరసాల శిథిలాలను సందర్శించకపోతే, ఈ సుందరమైన ద్వీపం యొక్క వేదనాభరితమైన తొలి అనుభవం గురించి తెలుసుకోలేరు. ఉత్తర భూమధ్యరేఖకు రోమ్‌, సప్పొరో, భాస్టన్లకు మధ్య ఎంత దూరం ఉందో టాస్మేనియాకు దక్షిణ భూమధ్యరేఖకూ మధ్య దాదాపు అంతే దూరం ఉంటుంది. ద్వీపంపైనున్న స్థలం ఏదీ సముద్రమట్టం నుండి 115 కిలోమీటర్లకన్నా ఎక్కువ ఎత్తుగా లేకపోయినప్పటికీ, దాని చరిత్రలో ఉన్నట్లుగానే దాని భౌగోళిక లక్షణాల్లో కూడా సుస్పష్టమైన తేడాలున్నాయి.

టాస్మేనియా భూస్థలమంతటిలో 44 శాతం అడవిప్రదేశం 21 శాతం జాతీయోద్యాన ప్రదేశమై ఉంది. ఇవి అరుదైన నిష్పత్తులు! ది లిటిల్‌ టాసీ ఫ్యాక్ట్‌ బుక్‌ ప్రకారంగా, “పశ్చిమ టాస్మేనియాలోని సహజసంపదా ప్రాంతం ప్రపంచమందలి అడవి ప్రాంతాల్లో నాశనం చేయబడకుండావున్న గొప్ప సమశీతోష్ణ ప్రాంతాల్లోని చివరివాటిలో ఒకటై ఉంది.” చేపలతో నిండివున్న వర్షపాత మరియు హిమపాత సరస్సులు, నదులు, జలపాతాలు పెన్సిల్‌ పైన్‌ వృక్షాలకు, యూకలిఫ్టస్‌ వృక్షాలకు, మైర్ట్‌ల్‌ వృక్షాలకు, బ్లాక్‌వుడ్‌ వృక్షాలకు, సాసఫ్రాస్‌ వృక్షాలకు, లెదర్‌వుడ్‌ వృక్షాలకు, సెలెరి-టాప్ప్‌డ్‌ పైన్‌ వృక్షాలకు, హోన్‌ పైన్‌ వృక్షాలకు పోషణనిస్తున్నాయి. పేర్కొనడానికి ఇవి కేవలం కొన్ని మాత్రమే. మధ్య-పశ్చిమ పీఠభూమి యొక్క ఉన్నత మైదానాల్లోనూ, మంచుతో కప్పబడిన దాని శిఖరాల్లోను కనబడే అందమైన దృశ్యాలు తరచూ ప్రకృతి ప్రియులను పదే పదే ఆకర్షిస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు.

కాని “సహజసంపదా ప్రాంత” పరిరక్షణ కూడా వ్యతిరేకతను ఎదుర్కొంది. గని తవ్వకం, కాగితం తయారీ, జలవిద్యుచ్ఛక్తి విషయాల్లో ఆసక్తిగల బృందాలకు వ్యతిరేకంగా పర్యావరణాసక్తిగల ప్రజలు ఇప్పటికీ కుతకుతలాడుతున్నారు. గని తవ్వకం జరిగే పట్టణమైన క్వీన్స్‌టౌన్‌ యొక్క చంద్రమండలంలాంటి భూతల దృశ్యం, వనరులను అనాలోచితంగా దుర్వినియోగం చేయడం వలన కలిగే పరిణామాల కఠిన జ్ఞాపికగా ఉంది.

స్థానిక జంతువులు కూడా బాధించబడ్డాయి—ప్రాముఖ్యంగా కపిల వర్ణంలో కుక్కలా ఉండే క్షీరదజాతి జంతువైన టాస్మేనియా తోడేలు లేక టాస్మేనియా పులి బాధించబడింది. దాని వెనుక మరియు తోక భాగాల మీద అడ్డంగా ముదురు రంగులోవుండే చారలు దానికి పులి అనే పేరును తెచ్చాయి. దుఃఖకరంగా, సన్నగా ఉండి, జంకే ఈ మాంస-భక్షక జంతువు పెంపుడు పక్షులను, గొర్రెలను వేటాడేది. దానిని హతమార్చడానికి ప్రకటించబడిన బహుమానం మూలంగా అది 1936 నాటికి పూర్తిగా ఉనికిలో లేకుండాపోయింది.

మరొక అపూర్వమైన టాస్మేనియా క్షీరదజాతి జంతువైన టాస్మేనియా డెవిల్‌ ఎంత మాత్రం నిర్మూలించబడడం లేదు. ఇది తన శక్తివంతమైన దవడలను దంతాలను ఉపయోగించే, కుళ్లిన మాంసం తినే, ఆరు నుండి ఎనిమిది కిలోల బరువుండే, కండగల జంతువు. ఇది మరణించిన కంగారూను దాని తలతో సహా మొత్తం శరీరాన్ని తినివేయగలదు.

పొట్టి-తోకగల సముద్రపక్షి లేక ముటన్‌బర్డ్‌ను బట్టి కూడా టాస్మేనియా ప్రఖ్యాతిగాంచింది. అది టాస్మేనియా సముద్రం నుండి మొదలుపెట్టి వాస్తవంగా పసిఫిక్‌ సముద్రం చుట్టూ వరకూ తిరిగి ప్రతి సంవత్సరం ఒకే ఇసుక బొరియను చేరుకుంటుంది—ఈ కృత్యం నిజంగా దాని నిర్మాణకునికి, సృష్టికర్తకు ఘనతను తెస్తుంది.

పొట్టి-తోకగల సముద్రపక్షి రాత్రుల్లో నివసించే స్థలం సమీపంలోనే మరొక పక్షి నివసిస్తుంది, ఇది నీటిక్రింద “ఎగురుతుంది”—ఒక కిలో బరువుండి, చిన్న ముక్కూ దట్టంగా బొచ్చూ ఉండే స్నేహపాత్రమైన ఈ పక్షి ఫెయిరీ పెంగ్విన్‌ అని పిలువబడ్తోంది. పెంగ్విన్లలోకెల్లా అతి చిన్నదైన ఈ పక్షి ఎక్కువగా అరుస్తుంది! కొన్నిసార్లు దాని స్వరం మరియు శరీర కదలికలు తీవ్రస్థాయికి చేరుతుండగా, దాని విన్యాసాల తీవ్రతలో తేడాలు ఉంటాయి. ఒక జంట రోమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు తమ మధ్యనున్న సన్నిహితత్వాన్ని చూపించడానికి యుగళగీతాన్ని పాడుతుండవచ్చు. అయితే విషాదకరంగా, చాలమట్టుకు జాలర్ల వలల మూలంగానూ, చమురు పదార్థాల మూలంగానూ, ప్లాస్టిక్‌ వస్తువులను పొరపాటుగా ఆహారమని భావించడం మూలంగానూ, లేక కుక్కలు మరియు అడవి పిల్లుల మూలంగానూ చంపబడుతున్నాయి.

ద్వీపం యొక్క మరింత ప్రశాంతమైన రూపం

మధ్య పీఠభూమి అంచునుండి ఉత్తరం వైపు చూసినా లేక తూర్పు వైపు చూసినా, దాని సాగుచేయబడిన, గోధుమ వర్ణంలోని పొలాలతో, మిళితమౌతున్న నదులతో ఉపనదులతో, ఇరువైపులా చెట్లున్న విశాలమైన మార్గాలతో, అక్కడక్కడా గొర్రెలూ పశువులూ మేస్తున్న పచ్చని పచ్చిక బయళ్లతో ఉన్న టాస్మేనియా యొక్క అతి ఆహ్లాదకరమైన రూపాన్ని మీరు చూస్తారు. ఉత్తర పట్టణమైన లిల్లీడాల్‌ సమీపంలో, జనవరి నెలలో, పువ్వులతో నిండివుండే లావెండర్‌ మొక్కలు ఈ గ్రామీణ వర్ణచిత్రానికి మరులుగొల్పే సువాసనతోపాటు లేత వంగపండు వర్ణాన్ని అద్దుతాయి.

టాస్మేనియాకు రాజధానియైన హోబర్ట్‌ టాస్మేనియాకు ఆపిల్‌ ద్వీపం అనే పేరును తెచ్చిపెట్టిన ఆపిల్‌పళ్ల తోటల సమీపంలోవున్న డర్వెంట్‌ నదికిరువైపులా నిర్మించబడింది. దాని జనసంఖ్య సుమారు 1,82,000. అక్కడే 1,270 మీటర్ల ఎత్తున్న ముదురు రంగులోని వెల్లింగ్టన్‌ పర్వతాల పెద్ద సముదాయం ఉంది. నిర్మలంగా ఉన్న రోజున, తరచూ మంచుతో కప్పబడివుండే ఈ పర్వతం పైనుండి చూస్తే దిగువనున్న నగరం స్పష్టంగా కనిపిస్తుంది. లెఫ్టెనెంట్‌ జాన్‌ బోవెన్‌ 35 మంది నేరస్తులతో సహా 49 మందిగల తన గుంపుతో రిస్డోన్‌ కోవ్‌లో మొదటిసారి అడుగు పెట్టినప్పటి నుండీ, అంటే 1803 నుండి హోబర్ట్‌ ఎంతో అభివృద్ధి చెందింది. నిజమే, కిత్తనారబట్టతో చేసిన తెరచాపలనూ కీచుమని శబ్దంచేసే కలపనూ ఇప్పుడు ఉపయోగించడం లేదు, కానీ సంవత్సరానికొకసారి సిడ్ని నుండి హోబర్ట్‌ వరకు జరిగే యాచ్‌ పోటీ ఆ పాత రోజులను గుర్తు చేస్తుంది. అయితే ఈ రోజుల్లో రంగురంగుల తెరచాపలూ ఆధునిక పడవలూ ఉత్సాహంతో హర్షధ్వానాలు చేస్తున్న ప్రజల ముందు నుండి నేరుగా హోబర్ట్‌ పట్టణం లోపలికి దూసుకుపోతాయి.

హింసా దేశం నుండి ఆత్మీయ పరదైసుకు

1994లో లాన్‌సెస్టన్‌లో జరిగిన “దైవిక భయము” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరైన 2,447 మంది ప్రతినిధుల్లో ఒకరైన జెఫ్రీ బెటెర్వార్త్‌ ఇలా అభిప్రాయపడ్డాడు: “టాస్మేనియా అంతటిలో దాదాపు 40 మంది సాక్షులు మాత్రమే ఉండడం నాకు జ్ఞాపకముంది.” ఇప్పుడక్కడ సుమారు 26 సంఘాలూ 23 రాజ్యమందిరాలూ ఉన్నాయి.

జెఫ్‌ ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు, “కాని పరిస్థితులు ఎల్లప్పుడూ అనుకూలంగా లేవు. ఉదాహరణకు, పూర్వం 1938లో టామ్‌ కిట్టో, రాడ్‌ మాక్వీల్లి, నేను సాండ్‌విచ్‌ బోర్డులు ధరించి, ‘వాస్తవాలను ఎదుర్కొనండి’ అనే బహిరంగ బైబిలు ప్రసంగం గురించి ప్రచారం చేసేవాళ్లము. అది, రేడియో నెట్‌వర్క్‌ ద్వారా లండన్‌ నుండి ప్రసారం చేయబడవలసి ఉండింది. అది అబద్ధ మతాన్ని నొప్పి పుట్టించే రీతిలో బహిర్గతం చేసింది. నేను నా అనుచరుల దగ్గరికి వచ్చేసరికి యౌవనస్థుల గుంపొకటి వాళ్లను అవమానిస్తోంది. అక్కడున్న పోలీసులు ఊరకే చూస్తూ నిలబడ్డారు! నేను సహాయం చేయడానికి పరుగుతీసి, వెంటనే దెబ్బలు తిన్నాను. కాని ఒక వ్యక్తి వెనకనుండి నా షర్ట్‌ పట్టుకుని నన్ను ఈడ్చుకెళ్లాడు. ఆయన నన్ను కొట్టడానికి బదులు ఇలా బిగ్గరగా అరిచాడు: ‘వాళ్లను వదిలేయండి!’ ఆ తర్వాత ఆయన, ‘స్నేహితుడా, నేను ఐరీష్‌ దేశస్థుడను, హింసించబడడమంటే ఏమిటో నాకూ తెలుసు’ అని నాతో నెమ్మదిగా అన్నాడు.”

యెహోవా ఆ తొలి పయినీర్లను ఆశీర్వదించాడు, అందుకే 4,52,000 మంది ప్రజలున్న ఈ ద్వీపంలోని అన్నిప్రాంతాలకు నేడు దేవుని రాజ్యసువార్త చేరింది. ఆ క్రూరమైన తొలి రోజుల్లో అన్యాయంగా మరణించిన తొలి ఖైదీలను మరియు ఆదివాసులను—నల్లజాతీయులను, శ్వేతజాతీయులను—అందరినీ శుభ్రపర్చబడిన భూమిపైకి తిరిగి ఆహ్వానించడానికి వాళ్ల వంశస్థులనేకులు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” బైబిలు వాగ్దానం చేస్తోంది. (అపొస్తలుల కార్యములు 24:15) ఈ పరిస్థితి ఎంత సంపూర్ణంగా సరిచేయబడుతుందంటే, “మునుపటివి [ఇక] మరువబడును.”—యెషయా 65:17.

[అధస్సూచీలు]

a టాస్మేనియా అనే పేరు 1855 నవంబరు 26న ఆధికారికంగా స్వీకరించబడింది. న్యూ సౌత్‌ వేల్స్‌ అత్యంత ప్రాచీన రాష్ట్రము.

[19వ పేజీలోని బాక్సు/చిత్రం]

పైన: క్రెడెల్‌ పర్వతం మరియు డోవ్‌ సరస్సు

పైన కుడివైపు: టాస్మేనియా డెవిల్‌

క్రింద కుడివైపు: టాస్మేనియాకు నైరుతివైపునున్న వర్షారణ్యం

టాస్మేనియా

ఆస్ట్రేలియా

[క్రెడిట్‌ లైను]

టాస్మేనియా డెవిల్‌ మరియు టాస్మేనియా పటం: Department of Tourism, Sport and Recreation — Tasmania; ఆస్ట్రేలియా పటం: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి